న్యూస్‌మేకర్
కూతురు అంధురాలుగా పుడితే వదిలి వెళ్లిపోయే తండ్రి ఉండొచ్చుగాని తల్లి ఉండదు. అస్సాం అంధ క్రికెటర్ సిము దాస్‌ని తల్లి అంజు దాస్ ఒక్కతే ఎన్నో కష్టాలతో పెంచింది. ఫలితంగా ఇవాళ కూతురు భారత జట్టు తరఫున ప్రపంచ కప్పు సాధించిన విజేతగా నిలిచింది. ఆమెకు అస్సాం ప్రభుత్వం 10 లక్షల నగదు బహుమతి,
ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. ఇదంతా ఆ తల్లి ఓర్పుకు దొరికిన ప్రతిఫలం.
నవంబర్ 23, ఆదివారం రోజు అంజు దాస్ ఎప్పట్లాగే పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. ఆమె అస్సాంలోని నగావ్ జిల్లా కొతియటోలి అనే పల్లెలో వంట మనిషిగా, పని మనిషిగా జీవిస్తోంది. ఇల్లు మరికాస్త దూరంలో ఉందనగా ఊళ్లో ఉన్న కుర్రాళ్లంతా చప్పట్లతో, కేరింతలతో ఆమెకు ఎదురు వచ్చారు. ‘అక్కా. నీ కూతురు సాధించింది. మనం వరల్డ్ కప్ గెలిచాం’ అని మెచ్చుకోలుగా వాళ్లు మాట్లాడుతుంటే అంజుదాస్ కళ్ల నుంచి ధారాపాతంగా ఆనందబాష్పాలు రాలిపడ్డాయి.
→ ఆమె కూతురు విజేత
అంధ మహిళా క్రికెటర్లను ప్రోత్సహించడానికి మొట్ట మొదటిసారి ‘టి 20 వరల్డ్ కప్ ఫర్ బ్లైండ్ విమెన్’ను కొలంబోలో నవంబర్ 11 నుంచి 23 తేదీల మధ్య నిర్వహించారు. అమెరికా, ఆస్ట్రేలియా సహా మన పొరుగున ఉన్న దేశాలతో కలిపి మొత్తం ఆరు దేశాలు పాల్గొన్న ఈ పోటీలో ఇండియా జట్టు అప్రతిహతంగా సాగి ఫైనల్స్‌లో నేపాల్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. ఈ జట్టులో అంజుదాస్ కూతురు సిము దాస్ ఉంది. ఇండియా గెలవడానికి టోర్నమెంట్‌లో మొత్తం 68 విలువైన పరుగులు చేసింది. అస్సాం మారుమూల పల్లెలో నిలువ నీడ లేని కుటుంబం నుంచి కేవలం తల్లి అందించిన ప్రోత్సాహంతో సిము దాస్ ఈ అద్భుతం సాధించింది. ఆ ప్రయాణం అంతా గుర్తుకొచ్చి అంజుదాస్ కళ్లు వర్షించాయి.
→ ప్రధానే స్పందించారు
అంధ మహిళల జట్టు సభ్యులు వరల్డ్ కప్‌తో ఢిల్లీలో ప్రధానిని కలిశారు. ఆ తర్వాత అస్సాంకు సిము దాస్ చేరుకుంటే ఆమెకు ఘన స్వాగతం లభించింది. అయితే ఆ వెంటనే ఒక తెల్లవారు జామున ప్రధాని నుంచి అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మకు ఫోన్ వచ్చింది. ‘నువ్వు సిము దాస్‌ను కలిశావా’ అని ప్రధాని అడిగారు. ‘వెంటనే కలిసి ఆమెకు కావాల్సిన సాయం చేయి’ అన్నారు. అప్పటికి బిశ్వ శర్మకు సిము దాస్ గురించి తెలియదు. ఆగమేఘాల మీద తెలుసుకుని ఆమెకు పది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించారు. ఉద్యోగం కూడా ఇస్తామని చెప్పారు. అస్సాం గవర్నర్ ఆమెను తన నివాసానికి ఆహ్వానించి మరో లక్ష రూపాయల నజరానా ఇచ్చారు. ఇన్ని ప్రశంసలు సిము దాస్ గెలుపుకు. కాదు కాదు ఆమె తల్లి గెలుపునకు.
→ తండ్రి పారిపోతే...
అంజుదాస్‌కు వివాహం అయ్యాక మొదట కొడుకు పుట్టాడు. ఆ కొడుకు అంధుడే కాదు బధిరుడు కూడా. రెండవసారి కుమార్తె పూర్తి అంధత్వంతో పుట్టింది. కూతురు అంధత్వ వార్త విన్న వెంటనే భర్త మొత్తం కుటుంబాన్ని వదిలేసి పారిపోయాడు. వాళ్లకు ఇల్లు కూడా లేదు. ఊరిపెద్ద తన పొలంలో చిన్న గుడిసె వేసుకోమన్నాడు. ఆరోజు నుంచి నేటి వరకూ వాళ్లు ఆ గుడిసెలోనే ఉన్నారు. ఊరి ఉపాధ్యాయుడు సిమును చదివించమని సూచించడంతో తల్లి ధైర్యం చేసి గువహతిలో అంధ బాలికల స్కూల్లో చేర్చించింది. అక్కణ్ణుంచి సిము ఢిల్లీ వరకూ వెళ్లి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. 2022లో క్రికెట్‌లో ప్రవేశించిన వెంటనే ప్రతిభ చూపుతూ జాతీయ జట్టుకు ఎంపికై ట్వంటీ ట్వంటీ కప్ గెలుపులో కీలకపాత్ర పోషించింది.
→ అమ్మ లేకపోతే...
‘అమ్మ లేకపోతే నేను లేను. ఆమె తన జీవితం మొత్తం పోరాడుతూనే ఉంది. నేటికీ మా అన్నయ్యకు ఆమె సేవలు చేస్తోంది. మా కోసమే ఆమె బతికింది. నేను ఆమె కోసమే గెలిచాను. ఇంకా ఆడతాను. మా అమ్మను సంతోషంగా ఉంచాలనేదే నా కోరిక’ అంది సిము దాస్.


