2026 టి20 ప్రపంచకప్ టోర్నీ షెడ్యూల్ విడుదల
తొలి మ్యాచ్‌లో అమెరికాతో ఆడనున్న టీమిండియా
మార్చి 8న ఫైనల్
ముంబై: భారత్, పాకిస్తాన్ మధ్య మరోసారి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టోర్నీలో పోరుకు రంగం సిద్ధమైంది. 2026 టి20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో టీమిండియా తలపడుతుంది. మార్చి 8న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌తో వరల్డ్ కప్ ముగుస్తుంది.
ఈ మెగా టోర్నీ పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ చైర్మన్ జై షా విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్, ఆతిథ్య జట్టు హోదాలో భారత్ ఫిబ్రవరి 7న ముంబైలో జరిగే టోర్నీ తొలి పోరులో అమెరికాతో తలపడుతుంది. అనంతరం ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో... ఫిబ్రవరి 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ లీగ్ దశను ముగిస్తుంది.
గత టోర్నీ తరహాలోనే మొత్తం 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘ఎ’లో భారత్, పాకిస్తాన్, అమెరికాతో పాటు నెదర్లాండ్స్, నమీబియా ఉన్నాయి. లీగ్ దశ తర్వాత తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు తర్వాతి దశ ‘సూపర్–8’కు అర్హత సాధిస్తాయి.
‘సూపర్–8’కు చేరిన 8 జట్లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో 4 జట్లు ఉంటాయి. ‘సూపర్–8’ మ్యాచ్‌ల తర్వాత రెండు గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. మార్చి 3న తొలి సెమీఫైనల్... మార్చి 5న రెండో సెమీఫైనల్ జరుగుతుంది. మార్చి 8న జరిగే ఫైనల్‌తో టోర్నీ ముగుస్తుంది.
ఎనిమిది వేదికలు ఖరారు...
టి20 వరల్డ్ కప్‌లో భాగంగా మొత్తం 55 మ్యాచ్‌లు జరుగుతాయి. మొత్తం 8 వేదికల్లో మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్‌లో అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నైలలో మ్యాచ్‌లు నిర్వహించనుండగా... శ్రీలంకలో కొలంబో (ప్రేమదాస), కొలంబో (ఎస్‌ఎస్‌సీ), పల్లెకెలెలను వేదికలుగా నిర్ణయించారు.
గతంలోనే ఐసీసీ స్పష్టం చేసినట్లుగా పాక్ జట్టు తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. సెమీఫైనల్ మ్యాచ్‌లకు కోల్‌కతా, ముంబై వేదికలు కాగా... ఒకవేళ పాక్ సెమీస్ చేరితే ఆ జట్టు తమ సెమీఫైనల్‌ను కోల్‌కతాలో కాకుండా కొలంబోలోనే ఆడుతుంది. పాక్ ఫైనల్ చేరినా ఇదే వర్తిస్తుంది. భారత్, పాక్ ఏ దశలో తలపడినా...ఆ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే నిర్వహిస్తారు.
బ్రాండ్ అంబాసిడర్‌గా రోహిత్ శర్మ...
భారత మాజీ కెప్టెన్, 2 టి20 ప్రపంచకప్‌ల విజేత రోహిత్ శర్మను ఐసీసీ 2026 టి20 వరల్డ్ కప్ ప్రచారకర్తగా నియమించింది. తన కొత్త పాత్ర పట్ల రోహిత్ సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఆటగాడిగా కొనసాగుతున్న సమయంలో ఇలా ఎవరినీ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించలేదని తెలిసింది. నాకు దక్కిన ఈ గౌరవం పట్ల ఆనందంగా ఉన్నా.
9 వరల్డ్ కప్‌లు ఆడిన తర్వాత ఆటగాడిగా మైదానంలో కాకుండా ప్రేక్షకుడిగా భారత్ ఆడే టి20 మ్యాచ్‌లను చూడటం కొత్తగా అనిపించడం ఖాయం’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఈ కార్యక్రమంలో బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, కార్యదర్శి దేవజిత్ సైకియా, ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా, భారత టి20 జట్టు కెపె్టన్ సూర్యకుమార్ యాదవ్, భారత మహిళల జట్టు కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పాల్గొన్నారు.
గ్రూప్‌ల వివరాలు
గ్రూప్ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా.
గ్రూప్ ‘బి’: ఆ్రస్టేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్, ఒమన్.
గ్రూప్ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్, ఇటలీ.
గ్రూప్ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ.


