ఇవాళ జరిగిన డబ్ల్యూపీఎల్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ బోణి కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన ముంబయి ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ముంబయి నిర్దేశించిన భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 19 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబయి ఇండియన్స్ 50 పరుగుల తేడాతో నెగ్గింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో చినెల్లీ హెన్రీ(33 బంతుల్లో 56) పరుగులతో మాత్రమే రాణించింది. మిగిలిన బ్యాటర్లు అంతా విఫలం కావడంతో లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
కాగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్ అద్భుతమైన హాఫ్ సెంచరీలతో చెలరేగారు. 42 బంతులు ఎదుర్కొన్న హర్మన్ 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా.. స్కీవర్ 46 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 70 పరుగులు చేసింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక ఢిల్లీ బౌలర్లలో అరంగేట్ర పేసర్ నందిని శర్మ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఆమె 3 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టింది. శ్రీచరణి ఒక వికెట్ తీసినప్పటికి తన 4 ఓవర్ల కోటాలో 45 పరుగులు సమర్పించుకుంది.


