ఆపరేషన్‌ మదురో: అంత ఈజీగా ఎలా పట్టుకెళ్లారంటే.. | The Secret Cyber War That Led to US Operation on Venezuela Maduro | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ మదురో: అంత ఈజీగా ఎలా పట్టుకెళ్లారంటే..

Jan 10 2026 5:14 PM | Updated on Jan 11 2026 2:10 AM

The Secret Cyber War That Led to US Operation on Venezuela Maduro

సైబర్ దాడితో సులభంగా మదురో పట్టివేత?

ఎస్-300 రాడార్లను స్పూఫ్ చేసిన అమెరికా

దాడికి అరగంట ముందే సైబర్ ఎటాక్??

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అంత ఈజీగా ఎలా బంధించిందబ్బా?.. వారం గడిచినా కూడా ఈ ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తూ ఉండొచ్చు. అయితే ఇందుకు అమెరికా సైన్యం ఉపయోగించిన ట్రిక్ ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది!. ముందుగా సైబర్ ఎటాక్ చేసి.. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందట. అయితే అదేం ఆషామాషీగా జరగలేదు. అందుకోసం తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదెంటో చూసేద్దాం మరి.. 

వెనెజువెలాకు ఉన్న రష్యా తయారీ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యస్థలను అమెరికా అసలు అంత తేలికగా ఎలా చేధించగలిగింది?. సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ కారకాస్‌లోకి చొచ్చుకుపోయాయా?..ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా సైనిక చర్య మొదలు కావడానికి.. అరగంట ముందు సైబర్ ఎటాక్‌తో అసలు తతంగం నడిచినట్లు వివరిస్తున్నారు.

నెలల తరబడి నిఘా!
అమెరికా సేనలు నెలల తరబడి వెనెజువెలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు? పడక గదికి చేరుకునే మార్గాలేమిటి? రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులుంటారు? నిఘా ఏ విధంగా ఉంటుంది? పనివాళ్లు, వంటవాళ్ల వివరాలు.. ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించించాయి. 

నిజానికి వెనెజువెలాపై అమెరికా ఈ నెల 3న దాడులు జరిపినా.. కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90శాతానికి పైగా ఆపరేషన్‌ పూర్తి చేసిందట. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ వివరాలు కూడా అందాయని తెలుస్తోంది. అందులో దాడి మొదలు పెడితే.. ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించారట. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే.. అమెరికా సేనలు రంగంలోకి దిగాయి.

అమెరికా సైబర్ కమాండ్ ద్వారా..
సైబర్ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ.. డొమైన్‌ సుప్రమసీగా కొనసాగుతోందని తెలిసిందే. వెనెజువెలాపై ఆపరేషన్‌లో భాగంగా.. కారకస్‌లోని మదురో నివాసంపై దాడికి అరగంట ముందే.. అమెరికా సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయ్యింది.  సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనెజువెలా రాజధాని కారకస్‌కు విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ (SCADA – Supervisory Control and Data Acquisition)పై సైబర్ ఎటాక్ చేశారు. దాంతో.. ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆలస్యం చేయకుండా.. ఆ వెంటనే రక్షణ వ్యవస్థను టార్గెట్‌ చేశారు. 

రాడార్ స్పూఫింగ్ జరగడంతో.. అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనెజువెలా సరిహద్దుల్లోకి ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో.. రష్యా సరఫరా అయిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ‘‘మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా.. కారకస్‌లో విద్యుత్తు నిలిచిపోయేలా చేశాం’’ అంటూ పోస్ట్ చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఈ దాడి తర్వాత వెనెజువెలా కూడా తమ జాతీయ పవర్‌గ్రిడ్ (గురి డ్యామ్ నెట్‌వర్క్)ను అమెరికా టార్గెట్‌గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్తు నిలిచిపోవడం వల్ల వెనెజువెలా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది.

సైబర్‌ ఎటాక్‌ ఎలా చేశారంటే.. 
అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. వెనెజువెలా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌పై నిఘా ఏళ్ల తరబడిగా కొనసాగుతోందని ఇప్పుడు వెల్లడైంది. తొలుత.. కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థల్లో మాల్‌వేర్‌ను చొప్పించారు. ఈ మాల్‌వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్తు వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి.. ‘పింగ్’ చేశారు. అంతే.. యావత్ విద్యుత్తు వ్యవస్థ ఢమాల్ అయిపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్తు నిలిచిపోయింది. అయితే.. ఈ ఆపరేషన్‌కు అమెరికా తన సొంత మాల్‌వేర్ ‘నైట్రోజ్యూస్’, రష్యా తయారీ అయిన ‘ఇండస్ట్రియర్’ ఈ రెండు మాల్‌వేర్లను ఒకదాన్ని వాడినట్లు తెలుస్తోంది.

అత్యంత చాకచక్యంగా..
నిజానికి అమెరికా సేనలు పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. ఎస్-300 గగనతల వ్యవస్థలు విద్యుత్తు నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా జరగకపోతే.. డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే..ఇందుకు ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి.. కారకస్‌కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తిచేయగానే.. అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ రాడార్ల విషయంలో జరిగిన ఆపరేషన్‌ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా ధృవీకరించడం గమనార్హం..!

కలిసొచ్చిన సూటర్
సాధారణంగా క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్తు నిలిచిపోగానే.. అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్‌కు పాల్పడింది. అంటే.. రాడార్ సిగ్నళ్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్‌వర్క్ యాక్టివేట్ అయ్యింది. దాంతో.. డీజిల్ జనరేటర్ల ద్వారా ఎస్-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా.. అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్ధుగా ఉండిపోయాయి.

భారత్ ఎంత వరకు సురక్షితం?
వెనెజువెలా ఉదంతం తర్వాత.. ప్రపంచదేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో.. రష్యా అధినేత పుతిన్‌ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విన్నపాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్‌ నెతన్యాహును నిర్బంధించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్థాన్ బహిరంగంగా కోరింది. అలాగే రష్యాతో చమురు వాణిజ్యం.. టారిఫ్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ విషయంలోనూ ట్రంప్‌ అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఇలాంటి దాడులే ఒకవేళ భారత్‌పై జరిగితే ఎలా ఉంటుంది?.. 

ఐదేళ్ల క్రితం చైనా మాల్‌వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే..!. మనదేశంలో విద్యుత్తు వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్‌ వేర్, సాఫ్ట్ వేర్‌ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్‌వేర్‌ను జిత్తుల మారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మనదేశంలో పవర్ గ్రిడ్‌లలో మాల్‌వేర్‌పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలోనే.. మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు.. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కోచి తీరంలో తచ్చాడితే.. మన వైమానికదళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన ఎఫ్-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో.. సాంకేతికలోపాల పేరుతో తిరువనంతపురంలో నెలరోజులపాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ 99% కచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్‌ లో మన సెర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

:: హెచ్.కమలాపతిరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement