breaking news
nicolas maduro
-
Venezuela: డెన్సీ రోడ్రిగ్జ్ వీడియో టేపుల కలకలం
కారకస్: ‘మేం చెప్పినట్లు వింటారా? లేదంటే మరో 15 నిమిషాల్లో మీ ప్రాణాలు తీయమంటారా?’ అంటూ తమని బెదిరించారంటూ అమెరికాపై వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ చేసిన కామెంట్స్ తాలుకూ వీడియో టేపులు కలకలం సృష్టిస్తున్నాయి. జనవరి 3న వెనెజువెలా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో దంపతులను అమెరికా నిర్బంధించి పదవీచ్యుతున్ని చేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక దళాలు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’(Operation Absolute Resolve) పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టాయి. ఈ మిలటరీ ఆపరేషన్‌లో డెల్టా ఫోర్స్ సైనికులు హెలికాప్టర్ల ద్వారా వెనెజువెలా రాజధాని కారాకస్‌లోని ఫోర్ట్ టియునా సైనిక స్థావరంలోకి ప్రవేశించి మదురో దంపతుల్ని అదుపులోకి తీసుకున్నారు.అయితే, మదురో దంపతుల్ని నిర్భందించిన 15 నిమిషాల తర్వాత పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మాదురోను అమెరికా దళాలు పట్టుకున్న తర్వాత.. తమ డిమాండ్లను అంగీకరించాలని తమ మంత్రివర్గ సభ్యులకు బెదిరింపులను అమెరికా బెదిరించినట్లు తాత్కాలిక అధ్యక్షురాలు డెన్సీ రోడ్రిగ్జ్ అంతర్గత సమావేశంలో మాట్లాడిన వీడియో టేపులు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు వినకపోతే 15 నిమిషాల్లో మంత్రి వర్గ సభ్యుల ప్రాణాలు తీస్తామని అమెరికా దళాలు బెదిరించాయని డెల్సీ రోడ్రిగ్స్ మాట్లాడిన మాటలు ఆ వీడియోలో ఉన్నట్లు సమాచారం. -
ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగేది ఇదే?
డొనాల్డ్ ట్రంప్ పేరు ఇప్పుడు వరల్డ్‌వైడ్‌గా చర్చనీయాంశమయ్యింది. వెనిజువెలా అధ్యక్షున్ని వారి దేశంలోనే బంధించి అమెరికాకు లాక్కెళ్లి ట్రంప్ తన రౌడీయిజం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించాడు. అయితే ఈ నేపథ్యంలో ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇరానే అని బలంగా చర్చ నడుస్తోంది. అక్కడ జరుగుతున్న నిరసనలు ఈ వాదనకు కొంత మేర బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ట్రంప్ ఇరాన్ సుప్రీంని బంధిస్తే జరిగే పరిణామాలు తెలుసుకోవానుందా? అయితే ఈ కథనం చదవండి.ప్రస్తుతం ఇరాన్లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా మారాయి. అక్కడ ద్రవ్యోల్బణం, పేదరికం, అవినీతి కారణంగా విసిగిపోయిన ప్రజలు ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. ఖమేని పాలన అంతం అవ్వాలని నినాదాలు ఇస్తున్నారు. అక్కడి మహిళలు సైతం ఇస్లాం సంప్రదాయం ప్రకారం ధరించే హిజాబ్‌లను తొలగించి వాటిని తగలబెడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం నిరసనకారులపై జరిపిన దాడుల్లో పదుల సంఖ్యలో ప్రజలు మృతిచెందారు. దీంతో ట్రంప్ రంగంలోకి దిగారు. నిరసనకారులపై దాడులు చేస్తే అమెరికా రంగంలోకి దిగుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇరాన్‌పై దాడికి దిగి ఆదేశ సుప్రీం ఖమేనీని బంధిస్తారా? అనే ఊహాగానాలు మెుదలయ్యాయి.ఇరాన్ సైనిక శక్తివెనిజువెలాతో పోలిస్తే ఇరాన్ సైనిక పరంగా ఎంతో బలమైంది. దాదాపుగా ఆరు లక్షలకు పైగా ఆర్మీ ఆ దేశ సొంతం. అంతేకాకుండా 15 బిలియన్ల డాలర్లకు పైగా ఆర్మీ బడ్జెట్ కలిగి ఉంది. 10 వేలకు పైగా యుద్ధ ట్యాంకులు, మూడు వందలకు పైగా యుద్ధ విమానాలు, జలాంతర్గాములు పటిష్ఠమైన నేవీ విభాగం ఇరాన్ సొంతం. అన్నిటి కంటే ప్రధానంగా ఇరాన్ వద్ద అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ మిస్సైల్స్ దాదాపు 2000 కిలోమీటర్ల రేంజ్ కవర్ చేసేవి ఉన్నాయి. వీటితో ఇరాన్ బలమైన ప్రాంతీయ శక్తిగా అవతరించింది. అంతేకాకుండా అణుబాంబు తయారికి ఇరాన్ ప్రయత్నాలు జరుపుతుందని వాదనలు ఉన్నాయి.ఆర్మీ పరంగా ఇంత బలంగా ఉన్నప్పటికీ వరల్డ్ సూపర్ పవర్‌గా ఉన్న అమెరికాను ఎదిరించడం ఇరాన్‌కు కష్టమే.. అయితే వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా ఖమేనీని అదుపులోకి తీసుకోలేరనేది కాదనలేని వాస్తవం. ఒకవేళ ఖమేనీని ట్రంప్ కిడ్నాప్ చేస్తే ఇరాన్ పూర్తి స్థాయి యుద్దానికి దిగే అవకాశం ఉంది. దీంతో ఇరు వైపులా భారీ నష్టంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడే అవకాశాలున్నాయి.ఇస్లాం దేశాల మద్ధతుఇరాన్కు ఇస్లాం దేశాల పూర్తి మద్దతు లభించడం కష్టం ఎందుకంటే ఇరాన్ ప్రజలు షియా మతాన్ని అవలంభిస్తారు. ప్రపంచంలో షియామతం పాటించే దేశాలు ఇరాన్, ఇరాక్, లెబనాన్, సిరియా, బహ్రెయిన్ యెమెన్ దేశాల సహాకారం లభించే అవకాశం ఉంది. అదే సున్నీ మతం పాటించే సౌదీ అరేబియా, టర్కీ, కువైట్, యెమన్ తదితర దేశాలు చాలా వరకూ ఇరాన్‌కు సపోర్టుగా నిలువవు. అయితే మిలటరీ పవర్స్ అయినా రష్యా, చైనా దేశాలతో ఇరాన్‌కు మంచి సంబంధాలున్నాయి. అయితే ఆ సపోర్ట్ అమెరికాకు ఎదురు నిలిచి నేరుగా యుద్ధంలో పాల్గొనేంతగా ఉంటుందా అంటే కాదనే సమాధానమే వస్తోంది.మూడో ప్రపంచ యుద్ధంఅయితే ప్రస్తుతం ట్రంప్ మామ మంచి జోరుమీదున్నారు. వెనిజువెలా అధ్యక్షున్ని బంధించిన తనను ఎవరూ ప్రశ్నించలేదు అని ఫీలవుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఇరాన్లో పరిస్తితులు ఏమాత్రం బాగాలేవు. దేశంలో తీవ్ర సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. సుప్రీం లీడర్ ఖమేనీపై అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఖమేనీని బంధిస్తే పెద్ద వ్యతిరేకత ఎదురుకాకపోవచ్చు. అంతే కాకుండా మూడోప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలు దాదాపు లేవనే చెప్పవచ్చు. అయితే ఈ కిడ్నాప్ వెనిజువెలా అధ్యక్షున్ని బంధించినంత తేలికగా మాత్రం ఉండదు అనేది కాదనలేని సత్యం. -
ఆపరేషన్ మదురో: అంత ఈజీగా ఎలా పట్టుకెళ్లారంటే..
వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా అంత ఈజీగా ఎలా బంధించిందబ్బా?.. వారం గడిచినా కూడా ఈ ప్రశ్న ప్రపంచాన్ని వేధిస్తూ ఉండొచ్చు. అయితే ఇందుకు అమెరికా సైన్యం ఉపయోగించిన ట్రిక్ ఏమిటో ఇప్పుడు బయటకు వచ్చింది!. ముందుగా సైబర్ ఎటాక్ చేసి.. ఆ తర్వాత భౌతిక దాడులకు దిగిందట. అయితే అదేం ఆషామాషీగా జరగలేదు. అందుకోసం తెర వెనుక పెద్ద తతంగమే నడిచింది. అదెంటో చూసేద్దాం మరి.. వెనెజువెలాకు ఉన్న రష్యా తయారీ ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు, క్షిపణి విధ్వంసక వ్యస్థలను అమెరికా అసలు అంత తేలికగా ఎలా చేధించగలిగింది?. సైబర్ దాడితో అమెరికా నిర్వీర్యం చేసిందా? రాడార్లను స్పూఫింగ్ చేసి మరీ కారకాస్‌లోకి చొచ్చుకుపోయాయా?..ఈ ప్రశ్నలకు అమెరికా సైబర్ నిపుణులు అవుననే సమాధానమిస్తున్నారు. అమెరికా సైనిక చర్య మొదలు కావడానికి.. అరగంట ముందు సైబర్ ఎటాక్‌తో అసలు తతంగం నడిచినట్లు వివరిస్తున్నారు.నెలల తరబడి నిఘా!అమెరికా సేనలు నెలల తరబడి వెనెజువెలా అధ్యక్షుడు మదురో నివాసంపై నిఘా పెట్టాయి. ఏ సమయంలో అతను ఏ గదిలో ఉంటాడు? పడక గదికి చేరుకునే మార్గాలేమిటి? రాత్రిళ్లు ఎంతమంది అంగరక్షకులుంటారు? నిఘా ఏ విధంగా ఉంటుంది? పనివాళ్లు, వంటవాళ్ల వివరాలు.. ఇలా అన్ని అంశాలపై సమాచారాన్ని సేకరించించాయి. నిజానికి వెనెజువెలాపై అమెరికా ఈ నెల 3న దాడులు జరిపినా.. కొన్ని నెలల ముందే క్షేత్రస్థాయిలో 90శాతానికి పైగా ఆపరేషన్ పూర్తి చేసిందట. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఆ వివరాలు కూడా అందాయని తెలుస్తోంది. అందులో దాడి మొదలు పెడితే.. ఎంత సమయంలో టాస్క్ పూర్తవుతుందో వివరించారట. అన్నీ ఓకే అనుకున్నాక ట్రంప్ పచ్చజెండా ఊపగానే.. అమెరికా సేనలు రంగంలోకి దిగాయి.అమెరికా సైబర్ కమాండ్ ద్వారా..సైబర్ ప్రపంచంలో అమెరికా తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ.. డొమైన్ సుప్రమసీగా కొనసాగుతోందని తెలిసిందే. వెనెజువెలాపై ఆపరేషన్‌లో భాగంగా.. కారకస్‌లోని మదురో నివాసంపై దాడికి అరగంట ముందే.. అమెరికా సైబర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం యాక్టివేట్ అయ్యింది. సైబర్ కమాండ్ సిబ్బంది తొలుత వెనెజువెలా రాజధాని కారకస్‌కు విద్యుత్తు సరఫరా చేసే వ్యవస్థ (SCADA – Supervisory Control and Data Acquisition)పై సైబర్ ఎటాక్ చేశారు. దాంతో.. ఆ నగరం అంధకారంలో మునిగిపోయింది. ఆలస్యం చేయకుండా.. ఆ వెంటనే రక్షణ వ్యవస్థను టార్గెట్ చేశారు. రాడార్ స్పూఫింగ్ జరగడంతో.. అమెరికా సేనలు 150 యుద్ధ విమానాల్లో వెనెజువెలా సరిహద్దుల్లోకి ప్రవేశించినా ఒక్కటంటే ఒక్క రాడార్ కూడా పసిగట్టలేకపోయింది. దాంతో.. రష్యా సరఫరా అయిన ఎస్-300 గగనతల రక్షణ వ్యవస్థలు నిర్వీర్యంగా మారిపోయాయి. ఈ ఆపరేషన్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ‘‘మా ప్రత్యేక నైపుణ్యం కారణంగా.. కారకస్‌లో విద్యుత్తు నిలిచిపోయేలా చేశాం’’ అంటూ పోస్ట్ చేయడం తెలిసిందే. అంతేకాదు.. ఈ దాడి తర్వాత వెనెజువెలా కూడా తమ జాతీయ పవర్‌గ్రిడ్ (గురి డ్యామ్ నెట్వర్క్)ను అమెరికా టార్గెట్‌గా చేసుకుందని ప్రకటించింది. విద్యుత్తు నిలిచిపోవడం వల్ల వెనెజువెలా సైన్యం కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా పనిచేయలేదని తెలుస్తోంది.సైబర్ ఎటాక్ ఎలా చేశారంటే.. అమెరికా సైబర్ కమాండ్ ఈ దాడిలో విజయం సాధించడం ఒక్కరోజుతో జరిగిన పని కాదు. వెనెజువెలా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌పై నిఘా ఏళ్ల తరబడిగా కొనసాగుతోందని ఇప్పుడు వెల్లడైంది. తొలుత.. కంప్యూటర్లు, విద్యుత్తు సరఫరా వ్యవస్థల్లో మాల్వేర్ను చొప్పించారు. ఈ మాల్వేర్ ద్వారా అమెరికా సైబర్ కమాండ్ విద్యుత్తు వ్యవస్థ కంట్రోలర్లలోకి చొరబడి.. ‘పింగ్’ చేశారు. అంతే.. యావత్ విద్యుత్తు వ్యవస్థ ఢమాల్ అయిపోయింది. మొత్తం కారకస్ నగరానికి విద్యుత్తు నిలిచిపోయింది. అయితే.. ఈ ఆపరేషన్‌కు అమెరికా తన సొంత మాల్వేర్ ‘నైట్రోజ్యూస్’, రష్యా తయారీ అయిన ‘ఇండస్ట్రియర్’ ఈ రెండు మాల్వేర్లను ఒకదాన్ని వాడినట్లు తెలుస్తోంది.అత్యంత చాకచక్యంగా..నిజానికి అమెరికా సేనలు పెద్ద ప్రమాదాలను దాటుకుంటూనే వెనెజువెలా గగనతలంలోకి ప్రవేశించాయి. ఎస్-300 గగనతల వ్యవస్థలు విద్యుత్తు నిలిచిపోగానే ఆగిపోయినట్లు సమాచారం. నిజానికి ఈ వ్యవస్థలు ఉన్న ప్రాంతాల్లో నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉంటుంది. ఒకవేళ విద్యుత్తు సరఫరా జరగకపోతే.. డీజిల్ జనరేటర్లతో బ్యాకప్ చేస్తారు. అయితే..ఇందుకు ఐదు నిమిషాల దాకా సమయం పడుతుంది. అంటే.. ఈ ఐదు నిమిషాల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు సరిహద్దులను దాటి.. కారకస్‌కు రావాల్సి ఉంటుంది. సైబర్ కమాండ్ అధికారులు తమ పనిని పూర్తిచేయగానే.. అమెరికా విమానాలు వెనువెంటనే రంగంలోకి దిగాయి. అత్యంత చాకచక్యంగా జరిగిన ఈ రాడార్ల విషయంలో జరిగిన ఆపరేషన్ విషయాల్ని అమెరికా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కెయిన్ కూడా ధృవీకరించడం గమనార్హం..!కలిసొచ్చిన సూటర్సాధారణంగా క్షిపణి వ్యవస్థలు సాఫ్ట్‌వేర్‌తో పనిచేస్తాయి. ఇక్కడే అమెరికా సూటర్ అనే టెక్నాలజీని వాడింది. ఒక్కసారి రాడార్ వ్యవస్థలకు విద్యుత్తు నిలిచిపోగానే.. అమెరికా సైబర్ కమాండ్ సూటర్ టెక్నాలజీ ద్వారా రాడార్ స్పూఫింగ్‌కు పాల్పడింది. అంటే.. రాడార్ సిగ్నళ్లను జామ్ చేసింది. ఫలితంగా సూటర్ రాడార్ నెట్వర్క్ యాక్టివేట్ అయ్యింది. దాంతో.. డీజిల్ జనరేటర్ల ద్వారా ఎస్-300 రక్షణ వ్యవస్థలను తిరిగి యాక్టివేట్ చేసినా.. అవి స్పూఫింగ్ ప్రభావంతో స్తబ్ధుగా ఉండిపోయాయి.భారత్ ఎంత వరకు సురక్షితం?వెనెజువెలా ఉదంతం తర్వాత.. ప్రపంచదేశాలు సందిగ్ధంలో పడ్డాయి. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో.. రష్యా అధినేత పుతిన్‌ను ఇలాగే కిడ్నాప్ చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు విన్నపాలు వస్తున్నాయి. ఇజ్రాయెల్ అధినేత బెంజమిన్ నెతన్యాహును నిర్బంధించాలంటూ అమెరికా మిత్రదేశం పాకిస్థాన్ బహిరంగంగా కోరింది. అలాగే రష్యాతో చమురు వాణిజ్యం.. టారిఫ్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ విషయంలోనూ ట్రంప్ అసంతృప్తిగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. ఒకవేళ ఇలాంటి దాడులే ఒకవేళ భారత్‌పై జరిగితే ఎలా ఉంటుంది?.. ఐదేళ్ల క్రితం చైనా మాల్వేర్ కారణంగా మహారాష్ట్రలో గ్రిడ్ వైఫల్యం చెందిన విషయం తెలిసిందే..!. మనదేశంలో విద్యుత్తు వ్యవస్థలో చైనాకు చెందిన పరికరాలు, హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్‌ను వాడుతున్న దాఖలాలున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా వాడినటువంటి మాల్వేర్ను జిత్తుల మారి చైనా కూడా జొప్పించి ఉంటుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి 2021లో మనదేశంలో పవర్ గ్రిడ్లలో మాల్వేర్పై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. లోపాలను ఇప్పటికే సరిచేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆపరేషన్ సిందూర్ సమయంలోనే.. మన గగనతల రక్షణ వ్యవస్థలు ఎంతో ముందంజలో ఉన్నట్లు తేలింది. అంతెందుకు.. అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ కోచి తీరంలో తచ్చాడితే.. మన వైమానికదళం వెంటనే గుర్తించి హెచ్చరికలు పంపింది. అత్యంత అధునాతన స్టెల్త్ విమానంగా అమెరికా తన ఎఫ్-35కు పట్టం కట్టింది. అలాంటి విమానాన్ని కూడా భారత్ గుర్తించడంతో.. సాంకేతికలోపాల పేరుతో తిరువనంతపురంలో నెలరోజులపాటు ఆ విమానాన్ని ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే..! ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ అటు అఫెన్స్ లోనూ.. ఇటు డిఫెన్స్ లోనూ 99% కచ్చితత్వాన్ని కలిగి ఉందని, అమెరికా, రష్యా, ఇజ్రాయెల్‌కు కూడా ఇంతటి రికార్డు లేదని తేలింది. సైబర్ అలర్ట్ లో మన సెర్ట్ ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో వెనెజువెలా తరహా దాడుల విషయంలో భారత్ అత్యంత సురక్షితంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.:: హెచ్.కమలాపతిరావు -
మదురో మాదిరే పుతిన్‌ను బంధించి పట్టుకొస్తారా?
ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. వెనెజువెలాపై సైనిక చర్యను చేపట్టిన ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను నిర్బంధించి తమ దేశానికి తీసుకొచ్చింది అమెరికా. ఈ ఘటనను పలు దేశాలు ఖండించగా.. ఇది తమ దేశ భద్రతకు సంబంధించిన అంశం మాత్రమే కాదని, వెనెజువెలా మంచి కోసం కూడా చేశామంటూ డొనాల్డ్ ట్రంప్ తన చర్యను సమర్థించుకున్నారు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విషయంలోనూ ఇలా చేస్తారా? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధంలో కాల్పుల విరమణ, శాంతి ప్రణాళిక ఒప్పందం కోసం ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. తొలినాళ్లలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ మీద మండిపడ్డ అగ్రరాజ్యం అధ్యక్షుడు.. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మీద సాఫ్ట్ టోన్ ప్రదర్శిస్తూ వచ్చారు. అయితే గత కొంతకాలంగా ఆ పరిస్థితి మారింది. పైగా వెనెజువెలా చమురు విషయంలో రష్యాకు సంబంధించిన షాడో ఫ్లీట్ సీజ్ నేపథ్యంలో.. అమెరికా-రష్యాల మధ్య వార్నింగ్ ఇచ్చుకునే స్థాయిలో పరిస్థితి చేరుకుంది. ఈ తరుణంలో.. వెనెజువెలా రాజధాని కారకస్‌పై జనవరి 3వ తేదీన అమెరికా వైమానిక దళాలతో మెరుపు దాడులు చేసి మదురోను బంధించిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ నేరాల అభియోగాలతో ఆయన్ని అమెరికా ఫెడరల్ కోర్టులు విచారణ చేస్తున్నాయి. ఈ పరిణామంపై అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. కొలంబియా అధ్యక్షుడా?, ఇరాన్ సుప్రీం లీడరా?అమెరికా అధ్యక్షుడి నెక్ట్స్ టార్గెట్ ఎవరై ఉంటారా? అనే చర్చా జోరందుకుంది. అమెరికా చమురు–గ్యాస్ కంపెనీల అధిపతులతో సమావేశంలో.. పుతిన్‌ను అలా బంధిస్తారా? అని మీడియా వేసిన ప్రశ్నకుగానూ ట్రంప్ సమాధానం ఇచ్చారు. పుతిన్‌ను పట్టుకోవడం అవసరం లేదు, కానీ నేను ఆయన విషయంలో చాలా నిరాశలో ఉన్నాను అని అన్నారు. ఇప్పటిదాకా తాను ఎనిమిది యుద్ధాలను ముగించానని, కానీ ఉక్రెయిన్ సంక్షోభాన్ని మాత్రం త్వరగా ఆపలేకపోయానని విచారం వ్యక్తం చేశారు. మరోవైపు... ఇదే అంశంపై పరోక్షంగా జెలెన్స్కీ కూడా స్పందించారు. మదురో అరెస్టు తర్వాత పుతిన్‌పై కూడా అమెరికా ఇలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదంటూ వ్యాఖ్యానించారు. ఒక నియంతను(పుతిన్‌ను ఉద్దేశిస్తూ..) ఇలా ఎదుర్కోవాలంటే.. తర్వాత ఏం చేయాలో అమెరికాకు తెలుసు’’ అని వ్యాఖ్యానించారు.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 2022 ఫిబ్రవరి 24న మొదలైంది. అయితే యుద్ధ నేరాల ఆరోపణలతో ది హేగ్‌లోని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు వ్లాదిమిర్ పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అయితే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశాధినేతగా పుతిన్కంటూ ఓ పేరుంది. అలాంటిది ఆయన్ని అంత తేలికగా నిర్బంధించడం అమెరికాకు కలలో కూడా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం అంతర్జాతీయ విశ్లేషకుల నుంచి ఎదురవుతోంది. -
నిష్పూచీ నిష్క్రమణలు
‘అంతర్జాతీయ న్యాయం నాకు అవసరం లేదు. అధ్యక్షుడిగా నా అధికారానికి పరిమితులు విధించేదీ, దాన్ని నిరోధించేదీ నా నైతికత మాత్రమే’ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అపహరించాక ప్రకటించారు. ఇప్పటికే ఆయన నైతికత ఎలాంటిదో రుజువైంది గనుక భిన్నరంగాల్లో విశేషంగా కృషి చేస్తున్న అంతర్జాతీయ సంస్థల నుంచి వైదొలగుతున్నామని తాజాగా ఆయన చెప్పటం ఎవరినీ ఆశ్చర్యపరచలేదు. ఈ నిర్ణయం కారణంగా మొత్తం 66 సంస్థల నుంచి అమెరికా తప్పుకుంటుంది. ఇందులో ఐక్యరాజ్యసమితికి చెందినవి 31 కాగా, ఇతర సంస్థలు 35. భావోద్వేగాలకు లోనుకావటం వల్లనో, ప్రలోభాలకు ఆశపడటంవల్లనో అనర్హుల్ని అందలం ఎక్కించిన దేశం కష్టాల్లో పడుతుంది.కానీ అమెరికా ప్రజలు చేసే తప్పు ప్రపంచాన్ని కకావికలు చేస్తుందని ఏడాది కాలంగా అందరికీ అర్థమవుతోంది. తనకు తోచిందే న్యాయం, తాను చెప్పిందే ధర్మంగా ఇంటా బయటా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని సరే... అమెరికాను కూడా ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. అంతర్జాతీయ సంస్థల నుంచి బయటకు రావటానికి ఆయన చెబుతున్న కారణాలు చిత్రమైనవి. ఆ సంస్థలు అమెరికా ప్రయోజనాలను నెరవేర్చటం లేదట! నిరుడు అధికారంలోకొచ్చిన వెంటనే 2015 నాటి పారిస్ ఒప్పందం నుంచి వైదొలగారు. ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి బయటికొచ్చారు. నిబంధనల ప్రకారం ఈనెల 20 నుంచి అది అమలవుతుంది. తాజా నిర్ణయం వల్ల అధికంగా సమస్యలెదుర్కొనే సంస్థలు వాతావరణ పరిశోధనలకు సంబంధించినవి. వాతావరణం గురించి, అది క్షీణిస్తున్న తీరు గురించి ఎవరైనా మాట్లాడినప్పుడల్లా అమెరికాకు చిర్రెత్తుకొస్తుంటుంది. ఇది ట్రంప్‌తోనే మొదలు కాలేదు. వాతావరణ మార్పుపై ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1997లో కుదిరిన క్యోటో ప్రోటోకాల్‌కు అమెరికా దూరంగా ఉండిపోయింది. ఎందుకంటే ఆ ప్రోటోకాల్ ప్రకారం ప్రతి దేశమూ ఉద్గారాల తగ్గింపునకు లక్ష్య నిర్దేశం చేసుకోవాలి. దాన్ని సాధించటానికి ప్రయత్నించినట్టు చూపాలి. ప్రపంచాన్ని కాలుష్యభరితం చేయటంలో ముందువరసలో ఉండే అమెరికాకు ఇలాంటి ఆంక్షలు నచ్చుతాయా? కనుకనే దాన్ని పూర్తిగా బేఖాతరు చేస్తూ ఆ ప్రోటోకాల్ వెలుపలే ఉండిపోయింది.నిజానికి క్యోటో ప్రోటోకాల్‌ను నీరుగార్చటానికీ, తాను చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పుకోవటానికీ 2015లో అందరినీ మభ్యపెట్టి ప్యారిస్ ఒడంబడికకు దోహదపడింది. కానీ ఆ మరుక్షణం నుంచీ అటకెక్కించింది. ఎంతో వెనకబడిన దేశాలనుకున్నవి సైతం తమ శక్తి మేరకు ఆ ఒప్పందం అమలుకు చర్యలు తీసుకోగా, అమెరికా చేసింది దాదాపు శూన్యం. ఉద్గారాలను పరిమితం చేయగల హరిత సాంకేతిక తపై విస్తృతమైన పరిశోధనలు జరుగుతున్నా, వాటి పర్యవసానంగా ప్రభావ వంతమైన ఆవిష్కరణలు సాధ్యమైనా సక్రమంగా ఆచరణలో పెట్టింది లేదు. పోనీ దాన్ని బడుగు దేశాలకు చవగ్గా అందించాలని కోరినా ఉలుకూ పలుకూ లేదు. పాలకుడెవరైనాఅమెరికా తీరు ఇంతే! కాకపోతే ట్రంప్ వారిని మించిన ఘనుడు. అసలు వాతావరణ మార్పు అనేదే బూటకమని ఆయన వాదన. భూగోళం మరింత వేడెక్కకుండా ఉండాలంటే 2030 నాటికి అన్ని దేశాలూ 2005 నాటి కర్బన ఉద్గారాల పరిమాణంలో 33 నుంచి 35 శాతం మేర తగ్గించాలని ప్యారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్ణయించింది. కానీ ట్రంప్ మూర్ఖత్వం కారణంగా ఆ లక్ష్యసాధన ఇక అసాధ్యం. ఆయన హరిత ఇంధన సాంకేతికతల్ని పూర్తిగా పక్కకు పెట్టడమే కాదు... చమురు వాడకాన్ని మరింత పెంచే చర్యలు తీసుకుంటున్నారు.ట్రంప్ తాజా నిర్ణయం వల్ల ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఇతర ముఖ్య సంస్థలు సైతం నిధుల కొరతతో నీరసిస్తాయి. ఘర్షణాత్మక ప్రాంతాల్లో పిల్లల బాగోగుల కోసం పని చేయటం, అటువంటి ప్రాంతాల్లో చోటుచేసుకునే లైంగిక నేరాల్ని అరికట్టడం వంటి అంశాల్లో పనిచేసే ప్రతినిధుల్ని అమెరికా ఉపసంహరించుకుంటుంది. భారత్, ఫ్రాన్స్‌ల చొరవతో ఏర్పాటైన అంతర్జాతీయ సౌర కూటమి(ఐఎస్ఏ) కూడా ఈ జాబితాలో ఉంది. ప్రపంచానికి తన వంతుగా లేశమాత్రమైనా మంచిచేసేది లేదని ట్రంప్ చాటుతున్నారు. కనుక ఇకపై ఈ ధూర్తదేశంతో ఎలా వ్యవహరించాలో ప్రపంచ దేశాలు నేర్చు కోక తప్పదు. -
దాపరికం లేని సామ్రాజ్యవాదం
ఇందులో కొత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలేమీ లేవు. వెనిజులాపై సైనిక దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణలో ఉన్నది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే వివరించి చెప్పారు. అదీగాక, లాటిన్ అమెరికాతో కూడిన పశ్చిమార్ధ భూగోళం 1823 నాటి ‘మన్రో డాక్ట్రిన్’ నిర్దేశించినట్లు ఎప్పటికీ తమదిగానే ఉంటుందనీ, అందుకు అదనంగా ఇపుడు ‘ట్రంప్ డాక్ట్రిన్’ ప్రకారం అందుకోసం సైనిక బలాన్ని వినియోగించగలమనీ బాహాటంగా ప్రకటించారు. వెనిజులా ఆపరేషన్ తర్వాత ‘అందుకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యం ఇక ఎవరికీ ఉండద’ని హెచ్చరించారు. నిజానికి ఈ ఆపరేషన్‌కు ముందు నవంబర్‌లో విడుదల చేసిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో ఉన్నది కూడా ఇదే!ఏ చట్టాలూ పాటించరా?వెనిజులాలో అమెరికాది అతి నగ్నమైన సామ్రాజ్యవాద చర్యను ఇంత సూటిగా, అన్ని కోణాల నుంచి ట్రంప్ వివరించినట్లు ఆయన విమర్శకులు కూడా చెప్పలేరేమో! అమెరికా అధ్యక్షునిది అన్ని విషయాలలోనూ దాపరికం లేనితనమే. అందుకు ఆయనను అభినందించవచ్చు కూడా! ఒక్క విషయంలో మాత్రం మదురోపై అసత్య ప్రచారాలు చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి, అందుకోసం స్వయంగా ఒక కంపెనీని నడుపుతూ, అమెరికాకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని! ఇవి తప్పుడు ఆరోపణలని అమెరికన్ మీడియాయే పలుమార్లు రాసినందున ఆ విషయమై చర్చించటం వృథా. పైగా, డ్రగ్స్ రవాణా కేసులలో శిక్షలు సైతం పడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తదితరులకు క్షమాభిక్ష ప్రకటించి జైలు నుంచి విడుదల చేసిన ట్రంప్, మాదక ద్రవ్యాల కారణంగా మదురోపై చర్య తీసుకుంటున్నట్లు వాదించటం హాస్యాస్పదమని అమెరికన్ మీడియా కొట్టివేస్తున్నది. మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నదంటూ ఇటీవలి వారాలలో సుమారు 30 వెనిజులా పడవలపై బాంబింగ్ చేసి, 100 మందికి పైగా ప్రాణాలు తీసినదంతా ఎటువంటి ఆధారాలు చూపకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని అదే మీడియా గుర్తు చేస్తున్నది. అమెరికా ప్రజాప్రతినిధులు, నిపుణులు పలువురు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. వారిలో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్లు సైతం ఉన్నారు. చర్చలకు సిద్ధమని మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చర్య జరగటం గమనించదగ్గది.ఈ విధమైన దాడి చేయవలసిన అగత్యం ఇపు డేమి ఏర్పడింది? చమురు నిల్వల స్వాధీనం మాత్ర మేనా, మరేమైనా ఉందా? మదురోను పదవీచ్యుతు డిని చేయటంతో వెనిజులా తమ అధీనంలోకి వచ్చి నట్లేనా? మదురో స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షు రాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాము కోరుకున్నట్లు పాలించ గలరన్న సూచన జరిగేదేనా? అంతిమంగా అధికారం ‘భద్రంగా, సవ్యంగా, న్యాయబద్ధంగా’ మరొకరికి బదిలీ కావటం అంటే ఏమిటి? అంతవరకు వెని జులాను ‘తామే పాలించగల’మన్న ట్రంప్ ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యకుగానీ, ఆయన చేసిన ప్రకటనలకు గానీ అర్థం, అమెరికా తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ,అంతర్జాతీయ చట్టాలకు గానీ ఎంతమాత్రం కట్టుబడి ఉండబోదని స్పష్టంగా ప్రకటించటమేనా?మేమే బాస్!దాడికి కారణం చమురు నిల్వలన్నది విస్తారంగా వినవస్తున్న మాట. కానీ అది ఒక కోణం. ‘మన్రో డాక్ట్రిన్’ ప్రకారం తమ ఇలాకాగా పరిగణించే లాటిన్ అమెరికాలో తమను ధిక్కరించే ప్రభుత్వాలు గానీ, వామపక్ష ప్రభుత్వాలు గానీ ఏర్పడితే కూలదోయటం గత 70 ఏళ్లలో కనీసం 15 సార్లు జరిగింది. వెనిజులా ప్రభుత్వం కూల్చివేతకు హ్యూగో ఛావేజ్ కాలం నుంచి 20 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది నేపథ్యం కాగా, వెనిజులా సహా పలు లాటిన్ అమెరికన్ దేశాలలో కొంత కాలంగా రష్యా, చైనాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం ట్రంప్‌కు అన్నింటికీ మించిన ఆందో ళనగా మారింది. ప్రస్తుత దాడి సందర్భంగా ఆయన మన్రో డాక్ట్రిన్, ట్రంప్ డాక్ట్రిన్ ప్రస్తావనలు, పశ్చిమార్ధ గోళం వైపు ఇక ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరన్న హెచ్చరికలు, తమ సైనిక బలం గురించిన మాటలు, ఇవన్నీ అటువంటి ఆందోళన నుంచి వచ్చినవే. చమురు ఆ తర్వాతి సంగతి. అమెరికా ప్రాబల్యం ఇతరత్రా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా బలహీనపడుతున్నందున, పశ్చిమార్ధ గోళంలో, దానితో పాటు పశ్చిమాసియాలో తమ బలాన్ని ఏ విధంగానైనా నిలుపుకొని తీరాలన్నది ట్రంప్ పట్టుదల. వెనిజులాపై దాడి, అదే పని చేయగలమంటూ ఇరాన్‌కు హెచ్చరికలు, ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా ఆక్రమణ వంటి చర్యల ద్వారా ఆ లక్ష్యం దీర్ఘకాలంలో ఎంతవరకు నెరవేరగలదన్నది వేచి చూడాల్సిన విషయం.పోతే, వెనిజులాలో ఉపాధ్యక్షురాలి నాయకత్వాన కొనసాగుతున్న ప్రభుత్వం, సైన్యం కూడా ట్రంప్ దాడిని ఖండిస్తూ, ‘తమ దేశం ఎప్పటికీ అమెరికన్ వలస కాబోద’ని స్పష్టం చేశాయి. అటువంటి స్థితిలో అధి కారం ‘భద్రంగా న్యాయబద్ధంగా’ బదిలీ కావటం ఏ విధంగా ఆచరణ సాధ్యం? బలమైన సోషలిస్టు శక్తులు, ఆ ప్రాంతమంతటా గెరిల్లా గ్రూపులు, అదే మూడ్‌లో ఉన్న వెనిజులా సైన్యం దృష్ట్యా పరిణామాలు ఏవిధంగా ఉండవచ్చు? కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక జోక్యాలు, ఎన్నికైన ప్రభుత్వాలను ‘నియంతృత్వ’మనే ప్రచారాలతో పడగొట్టడాలతో లాటిన్ అమెరికా అంతటా ప్రజాభిప్రాయం చాలావరకు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాపై విమర్శలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ప్రపంచం దృష్టి నుంచి అంతిమంగా తేలే ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉదారవాద వ్యవస్థలు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పరస్పర సంబంధాలు, దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం వంటివి బలహీనపడుతున్నా ఇంకా నిలిచి ఉంటాయా, లేక అమెరికా సామ్రాజ్యవాదానికి మరింత బలవుతాయా అన్నది. బలి చేయటమేనన్నది నిర్ణయమైతే ట్రంప్ గురి క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, ఎస్సీఓ, డీ–డాలరైజేషన్ ప్రయత్నాల వైపు మళ్లుతుంది. టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్‌ను రెచ్చగొడుతున్న మరో దేశాధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉద్దేశించి కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను తీసుకెళ్లినట్లుగానే తనను ఎత్తుకెళ్లాలని, ఆ క్షణం కోసం తాను ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు వెటకారంగా సవాల్ విసిరారాయన.వెనెజువెలా దాడి తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. కొలంబియాను డ్రగ్స్ విక్రయించే వ్యక్తి పాలిస్తున్నాడని సంచలన ఆరోపణలు చేశారు. ‘‘కొలంబియా బాగా నష్టపోయింది. ఓ చెడ్డోడు ఆ దేశాన్ని పాలిస్తున్నాడు’’ అని కామెంట్ చేశాడు. పైగా కొలంబియాపై ఆపరేషన్ ప్రారంభించడం తనకు మంచిగా అనిపిస్తుందంటూ వ్యాఖ్యానించారు. ఇది సహజంగానే అవతలి వాళ్లను కోపం తెప్పించింది.ట్రంప్ బెదిరింపులను కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో తీవ్రంగా ఖండించారు. ‘‘నేను ఇక్కడే మీ కోసం ఎదురు చూస్తుంటా. దమ్ముంటే వచ్చి మదురోను పట్టుకున్నట్లు నన్ను పట్టుకోండి. అది అంత సులువు అనుకుంటే వాళ్లు పొరబడినట్లే. ఒకవేళ కొలంబియాపై అమెరికా గనుక దాడులు చేస్తే.. ఇక్కడి పర్వతాల్లో ఉండే రైతులు ఆయుధాలు పడతారు. తాము గౌరవించే అధ్యక్షుడ్ని బంధిస్తే ఈ దేశ ప్రజలు చిరుతల్లా ముందుకు దూకుతారు’’ అంటూ ప్రకటించారు. నేను మళ్లీ ఆయుధం ముట్టుకోనని గతంలో ప్రమాణం చేశాను. కానీ నా మాతృభూమి కోసం అవసరమైతే నేను మళ్లీ ఆయుధం చేపడతా అంటూ భావోద్వేగంగా మాట్లాడారాయన.గుస్తావో ఫ్రాన్సిస్కో పెట్రో ఉర్రెగో (Gustavo Petro) ఒకప్పుడు M-19 గెరిల్లా ఉద్యమంలో సభ్యుడుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయుధాలు వదిలి రాజకీయాల్లోకి వచ్చి, బొగోటా మేయర్, సెనేటర్‌గా పనిచేశారు. 2022లో ఆయన కొలంబియాకు తొలి వామపక్ష అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు. 1990లలో నిరాయుధీకరణ సమయంలో ఆయన మళ్లీ ఆయుధం ముట్టనంటూ ప్రతినబూనారు.గత శనివారం(జనవరి 3న) వెనెజువెలాపై అమెరికా వైమానిక దాడులు నిర్వహించి.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను అమెరికాకు బందీలుగా పట్టుకెళ్లారు. వీరిద్దరిపై నార్కో టెర్రరిజం, అక్రమ ఆయుధాల కేసుల్ని మోపింది. డ్రగ్స్ ముఠాకు మదురో నాయకుడని.. యూఎస్‌లోకి పెద్ద ఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడని ట్రంప్ ఆరోపించారు. అయితే.. వెనెజువెలాలో ఉండే చమురు, అదరుదైన ఖనిజాల కోసంమే ట్రంప్ ఈ కుట్రకు తెరదీశాడని మరికొందరు ఆరోపిస్తున్నారు.అయితే.. అమెరికా సైనిక చర్య కంటే ముందు ఒక కార్యక్రమంలో మదురో మాట్లాడుతూ.. ‘‘దమ్ముంటే, నన్ను పట్టుకెళ్లండి’’ అంటూ ట్రంప్‌కు సవాల్ చేశారు. ఆ తర్వాతే అమెరికా వెనిజులా రాజధాని కారకస్‌పై దాడులు చేసి మదురోను బంధించింది. ఈ నేపథ్యంలో.. కొలంబియా అధ్యక్షుడి సవాల్‌కు ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి. -
నేను ఏ తప్పూ చేయలేదు.. న్యూయార్క్ కోర్టులో మదురో
-
నేను వెనెజువెలా అధ్యక్షుడిని..
న్యూయార్క్: వెనెజువెలా పదవీచ్యుత అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా గడ్డపై బందీగా ఉన్నా ఏమాత్రం జంక లేదు. ‘నేను వెనెజువెలా అధ్యక్షుడిని. కారకాస్‌లోని నా ఇంట్లో ఉండగా బంధించి తీసుకువచ్చారు. నేనెలాంటి తప్పూ చేయలేదు. అమాయకుడిని. మర్యాదస్తుడిని’ అని సోమవారం మన్‌హట్టన్ కోర్టులో చెప్పుకున్నారు. వ్యాపార లావాదేవీలను తప్పుగా చూపారంటూ నమోదైన కేసులో 2024లో డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే కోర్టు బోనులో నిలుచోవడం విశేషం. మదురో కేసులో క్లింటన్ హయాంలో నియమితులైన 92 ఏళ్ల అల్విన్ హెల్లెర్స్టీన్ వాదనలు విన్నారు. సరిగ్గా 12 గంటల సమయంలో కాళ్లకు మాత్రమే గొలుసులుండగా చేతులు వెనక్కి పెట్టుకుని భద్రతా సిబ్బంది వెంటరాగా మదురో కోర్టు హాల్లోకి ప్రవేశించారు.ౖ మదురో, సిలియాలు హెడ్ఫోన్లు పెట్టుకుని ఇంగ్లిష్ నుంచి స్పానిష్లోకి కోర్టు ప్రొసీడింగ్ అనువాదాలను వింటూ ఉన్నారు. జడ్జి అల్విన్ హెల్లెర్స్టీన్ పరిచయం అనంతరం మదురో.. వెనెజువెలా అధ్యక్షుడినంటూ జడ్జికి స్పానిష్ భాషలో పరిచయం చేసుకున్నారు. తానెలాంటి తప్పు చేయలేదని పేర్కొన్నారు. తనను బందీగా మార్చారంటూ స్పానిష్‌లో మదురో చెప్పారు. ఆయన మాటలను కోర్టు రూం రిపోర్టర్ అనువాదం చేసి జడ్జికి తెలిపారు. మదురో భార్య సిలియా ఫ్లోరెస్ కూడా తాను వెనెజువెలా ప్రథమ మహిళనంటూ చెప్పుకున్నారు. ఎలాంటి తప్పూ చేయలేదని స్పానిష్‌లో తెలిపారు. వీరిద్దరూ జైలు నుంచి విడుదలను గానీ, బెయిల్‌ను గానీ కోరడం లేదని లాయర్లు తెలిపారు. జడ్జి ఆదేశాల మేరకు అభియోగాలకు సంబంధించిన పత్రాలను అధికారులు ఇద్దరికీ అందించారు. అనంతరం, తదుపరి విచారణ మార్చి 17న ఉదయం 11 గంటలకు ఉంటుందని జడ్జి ప్రకటించారు. మదురోపై విచారణ చేపట్టిన కోర్టు సముదాయం వెలుపల పెద్ద సంఖ్యలో జనం గుమికూడారు. మదురోను విడుదల చేయాలని కొందరు, ట్రంప్ కింగ్.. అంటూ మరికొందరు నినాదాలు చేశారు. అంతకుముందు, బ్రూక్లిన్ జైలు నుంచి సోమవారం ఉదయం 7.15 గంటల సమయంలో మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను జైలు నుంచి అత్యంత భారీ భద్రతతో కూడిన వాహన శ్రేణిలో దగ్గర్లోని అథ్లెటిక్ ఫీల్డ్‌కు తీసుకెళ్లారు. హెలికాప్టర్ లోకి వారిని ఎక్కించారు. ఆ హెలికాప్టర్ మన్హ ట్టన్ హెలిపోర్టులో ల్యాండయ్యింది. హెలికాప్టర్ నుంచి దించి సాయుధ వాహనంలో వారిని కూర్చో బెట్టుకుని కోర్టుహౌస్ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లారు. శనివారం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో కారకాస్ లోని మిలటరీ బేస్‌లోని నివాసం నుంచి మదురో, సిలియాలను అమెరికా బలగాలు న్యూయార్క్‌కు తీసుకురావడం తెల్సిందే. మాదక ద్రవ్యాలతో పాటు ఆయుధాల అక్రమ రవాణా ఆరోపణలను వారిద్దరిపైనా మోపారు. కాగా, మదురో భార్య సిలియా డ్రగ్స్ అక్రమ రవాణాదారుల నుంచి 2007లో భారీగా ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎవరీ పొలాక్..?మదురో తరఫున వాషింగ్టన్కు చెందిన ప్రముఖ లాయర్ బ్యారీ పొలాక్ వాదనలు వినిపించారు. వికీలీక్స్ ఫౌండర్ జూలియన్ అసాంజే తరఫున దీర్ఘకాలం ప్రాతినిథ్యం వహించింది ఈయనే. అమెరికా గూఢచర్య చట్టం కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న అసాంజేను జైలు నుంచి విడుదల చేయించి, సొంతదేశం ఆస్ట్రేలియాకు పంపించడంలో కీలకంగా ఉన్నారు. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయగలరని ఈయనకు పేరుంది. -
ఆ డ్యాన్సులే కొంప ముంచాయా?
వాషింగ్టన్: డ్యాన్సు స్టెప్పులు వేసి మరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను అనవసరంగా రెచ్చగొట్టడమే వెనెజువెలా నియంత నికోలస్ మదురో కొంప ముంచిందా? అవుననే అంటోంది న్యూయార్క్ టైమ్స్ వార్తా పత్రిక. నృత్యాలతో తమను ఎద్దేవా చేయడమే గాక ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఆయన బాహాటంగా సవాలు విసిరినట్టు కూడా ట్రంప్ యంత్రాంగం భావించిందట. గత నవంబర్‌లో మదురో పలుమార్లు టీవీల్లో కనిపించారు. ‘యుద్ధం వద్దు, శాంతే కావాలి’ అంటూ తాను చేసిన ప్రసంగం తాలూకు మ్యూజికల్ రీమిక్స్‌కు సరదాగా స్టెప్పులు వేశారు. ‘మతిలేని యుద్ధం వద్దే వద్దు (నో క్రేజీ వార్)’ అనే లైన్లకు కూడా అలాగే పాదాలు కదిపారు. అమెరికాను, ట్రంప్‌ను, ప్రత్యక్ష దాడి తప్పదన్న ఆయన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటున్నాననే అర్థం వచ్చేలా ఆ సందర్భంగా పదే పదే నవ్వుతూ కన్పించారు. ఇదంతా ట్రంప్‌కు తీవ్ర ఆగ్రహం కలిగించిందని వైట్‌హౌస్ అధికారులను ఉటంకిస్తూ న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ‘‘నిజానికి మదురో అధికారిక నివాసంపై నేరుగా దాడి చేసి ఆయనను ఎత్తుకొచ్చేందుకు అప్పటికి కొద్ది నెలలుగా అమెరికా సైన్యం తాలూకు స్పెషల్ ఫోర్సెస్ రిహార్సల్స్‌లో మునిగి తేలుతూనే ఉన్నాయి. కాకపోతే నిజంగా అలాంటి ప్రత్యక్ష చర్యకు దిగే విషయంలో మాత్రం అప్పటిదాకా ట్రంప్ కాస్త సంశయంలోనే ఉన్నారు. కానీ మదురో డ్యాన్సింగ్ సవాళ్లు చూసి ఆయనకు చిర్రెత్తుకొచ్చింది’’అని తెలిపింది. దాంతో, ‘‘మదురో స్టెప్పులు మరీ శ్రుతి మించాయి. ఇక గుణపాఠం నేర్పి తీరాల్సిందే’అని ట్రంప్‌తో పాటు ఆయన యంత్రాంగంలోని ఉన్నతాధికారులు కూడా నిర్ణయానికి వచ్చారట. అలా ట్రంప్‌ను అనవసరంగా పరిధి దాటి రెచ్చగొట్టి, ఆ ఫలితాన్ని మదురో ఇలా అనుభవిస్తున్నారన్నది న్యూయార్క్ టైమ్స్ కథనం! గత శనివారం అర్ధరాత్రి అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మెరుపు ఆపరేషన్ చేపట్టి మదురోను ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌తో పాటు బెడ్రూంలో నుంచి లాక్కొచ్చి మరీ న్యూయార్క్‌కు తరలించడం తెలిసిందే. ఇప్పుడాయన విచారణ కోసం ఎదురుచూస్తూ న్యూయార్క్ జైల్లో కాలం గడుపుతున్నారు. మదురో దంపతులతో పాటు వారి కుమారునిపై కూడా అమెరికా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పలు అభియోగాలు మోపింది. సైనిక చర్యకు ముందు పలుమార్లు మదురోకు దేశం వీడి ఏ తుర్కియేలోనో ఆశ్రయం పొందాల్సిందిగా ట్రంప్ ఆఫర్ ఇచ్చారు. వాటిని మదురో నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తూ వచ్చారు. -
వెనెజువెలా నూతన సారథి..పులిబిడ్డ
‘ముళ్ల కిరీటం’ అనే మాట వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ విషయంలో అక్షరాలా సరిపోతుంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ‘ఇలా చేయాలి...ఇలా మాత్రమే చేయాలి’ అంటూ శాసనాలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తన దేశ సార్వభౌమాధికారాన్ని, తమ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏటికి ఎదురీదే ప్రయత్నం చేస్తున్నారు డెల్సీ రోడ్రిగ్స్...నార్కో–టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి... మొదలైన ఆరోపణలతో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియాను అమెరికన్ సైన్యం నిర్బంధించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించడంతో ‘ఎవరీ డెల్సీ రోడ్రిగ్స్?’ అనే ఆసక్తి మొదలైంది.→ బాల్యం నుంచే పోరాట పాఠాలుతండ్రి ఒడిలో చిన్నప్పటి నుంచి పోరాట పాఠాలు వింటూనే పెరిగిన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా సుప్రసిద్ధ జన నాయకురాలిగా ఎదిగారు. తండ్రి జార్జ్ ఆంటోనియో వెనెజువెలాలోని ప్రసిద్ధ లెఫ్ట్–వింగ్ గెరిల్లా ఫైటర్. 1976లో ఆయన హత్యకు గురయ్యాడు.→ చరిత్ర సృష్టించి...సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా(యుసీవి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన డెల్సీ స్టూడెంట్ లీడర్‌గా చురుగ్గా ఉండేవారు. ఆ తరువాత కాలంలో ‘సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా’లో ప్రొఫెసర్‌గా, ‘వెనెజువెలా అసోసియేషన్ ఆఫ్ లేబర్ లాయర్స్ ప్రెసిడెంట్’గా పనిచేశారు. 2002లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ మంత్రి స్థాయికి ఎదిగారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో డెల్సీని 2014లో ‘పాపులర్ పవర్ ఫర్ ఫారిన్ రిలేషన్స్’ మంత్రిగా నియమించారు. వెనెజువెలా చరిత్రలో ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు డెల్సీ.→ ఉపాధ్యక్షురాలిగా...వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా 2018లో నియామకం అయ్యారు డెల్సీ. వెనెజువెలా నిఘా సంస్థ బొలివేరియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కి హెడ్ అఫీషియల్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020లో ‘పాపులర్ పవర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ వెనెజువెలా’ మంత్రిగా పనిచేశారు. చమురు, ఆర్థిక శాఖల మంత్రిగా దేశాన్ని ద్రవ్బోల్బణం బారిన పడకుండా చూశారు.దేశాన్ని రక్షించుకుందాం...వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం అయిన డెల్సీ రోడ్రిగ్స్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన హెచ్చరికలతో, తమ చెప్పుచేతల్లో ఉండాలని చెప్పకనే చె΄్పాడు. అయితే ట్రంప్ హెచ్చరికలను 56 ఏళ్ల డెల్సీ ఆట్టే ఖాతరు చేయలేదు. నికొలస్ మదురో, అతడి భార్యను నిర్బంధించడాన్ని ఆమె ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మదురోను కిడ్నాప్ చేశారు’ అని ఆరోపిస్తున్న డెల్సీ రోడ్రిగ్స్ ‘వెనెజువెలాని రక్షించుకోవడానికి, దేశంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. దేశ వనరులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. గ్రేట్ ఫైటర్నికోలస్ మదురోకు డెల్సీ రోడ్రిగ్స్ ప్రతిభాపాటవాలన్నా, నాయకత్వ సామర్థ్యమన్నా ఇష్టం. ఒకానొక సందర్భంలో ఆమెను ‘టైగర్’ అని అభివర్ణించారు. డెల్సీ ఉపా«ధ్యక్షురాలిగా నియమితురాలైన సందర్భంలో నికోలస్ మదురో ఆమెను...‘ధైర్యం మూర్తీభవించిన మహిళ. రాజకీయాల్లో తలపండిన అనుభవజ్ఞురాలు. అమరవీరుడి కుమార్తె. వెయ్యి యుద్ధాలతో పరీక్షించబడిన విప్లవకారిణి’ అని ఆకాశానికి కెత్తారు. డెల్సీని ‘టైగర్’ విత్ డిజైనర్ ఫ్యాషన్ టేస్ట్స్ అంటుంటారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్‌గా పనిచేసిన డెల్సీకి ఫ్యాషన్ డిజైనింగ్‌పై మంచి అవగాహన ఉంది.ఏక్ లవ్‌స్టోరీ!గతంలో డెల్సీ రోడ్రిగ్స్, నటుడు ఫెర్నాండో కారిల్లో ప్రేమికులు. ఈ జంట 2007 వరకు కలిసే ఉంది. టీవీ సోప్ ఒపేర స్టార్‌గా ఫెర్నాండో సుపరిచితుడు. ‘నేను ఆమెను ఏదో ఒకరోజు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అత్యంత తెలివైన మహిళలలో ఆమె ఒకరు’ అని డెల్సీ గురించి చెబుతుండే వాడు ఫెర్నాండో కారిల్లో. వినోదం, రాజకీయం అనే భిన్న ప్రపంచాలు ఒకే ప్రపంచం కావడానికి ఏర్పడిన వైరుధ్యాలో? ఇతరత్రా కారణాలో... తెలియదుగానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేక΄ోయారు. తాజా విషయానికి వస్తే... డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా అధ్యక్షురాలిగా నియామకం అయిన నేపథ్యంలో, ఆ రోజుల్లో డెల్సీపై ఫెర్నాండో కారిల్లో తన ప్రేమను ప్రకటించిన రోజును గుర్తు చేసుకుంటున్నారు నెటిజనులు. -
సామ్రాజ్యవాద దురహంకారం
తన దుందుడుకు చర్యతో, దుష్ట పోకడతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచాన్ని సంక్షోభం ఊబిలోకి నెట్టేశారు. వెనిజులా రాజధాని కారకాస్‌తో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి అమెరికా సైన్యం భీకర దాడులకు దిగి అధ్యక్షుడు నికోలస్ మదురోనూ, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌నూ కళ్లకు గంతలు కట్టి, బేడీలు వేసి అపహరించుకుపోయింది. ఆయన ‘మాదకద్రవ్య ఉగ్రవాదానికి’ పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు చేసి న్యూయార్క్‌లో బంధించింది. అమెరికా సామ్రాజ్యవాద దురహంకారం ప్రపంచానికి కొత్తగాదు. ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా ఖండ దేశాలు అనేకం దాని వాతబడ్డాయి. కుట్రలు చేసి దేశాధినేతల్ని హతమార్చటం, ప్రజాస్వామ్యం డ్రామాలు నడిపి వ్యవస్థల్ని కూల్చేయటం దానికి మంచినీళ్ల ప్రాయం. నాలుగు దశాబ్దాల నాడు తానే అధికారంలో ప్రతిష్ఠించిన పనామా అధ్యక్షుడు ఆంటోనియో నొరీగాను ఇదేవిధంగా దాడిచేసి అరెస్టు చేసింది. కానీ నొరీగా దాని కీలుబొమ్మ. అమెరికా చర్యల పర్యవసానంగా ఇటీవలి దశాబ్దాల్లో ఇరాక్, లిబియా, అఫ్గానిస్తాన్ నెత్తుటి ముద్దలయ్యాయి. ట్రంప్ తాజా చర్య వాటన్నిటినీ తలదన్నింది.వందలాది మంది సీఐఏ ఏజెంట్ల ద్వారా అధ్యక్షుడి భద్రతను చూస్తున్న దళాలను లోబరు చుకుని, అధ్యక్షుణ్ణి భార్యాసమేతంగా అపహరించటం నికృష్టం. ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన డెల్సీ రోడ్రెజ్‌ను ‘మదురోను మించిన ప్రారబ్ధం చవిచూడాల్సి వస్తుంద’ని హెచ్చరించటం, ఆమె ఈ అవమానాన్ని దిగమింగు కుని ‘కలిసి పనిచేద్దామ’ని స్నేహహస్తం చాచడం ఈ విషాదానికి కొనసాగింపు.దేశాల మధ్య సమస్యలొస్తే శాంతియుతంగా పరిష్కరించుకోవటానికి సిద్ధపడకుండా ఏకపక్షంగా దాడులకు పాల్పడటం, దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించి అధినేతను అపహరించటం ఉగ్రవాదం. అలాంటి చర్యలు ప్రపంచ శాంతిని భగ్నం చేస్తాయి. కానీ పాశ్చాత్య దేశాలూ, అమెరికా ప్రధాన స్రవంతి మీడియా ఈ పరిణామాలను సాధారణ విషయంగా చూపే ప్రయత్నం చేస్తున్నాయి. మదురో పెద్ద నియంతంటూ ప్రచారం లంకించుకున్నాయి. ట్రంప్ దరిదాపుల్లోకి రాగల నియంత ప్రపంచంలో ఉంటాడా? చావెజ్ వారసుడిగా 2013లో అధికారంలోకొచ్చిన మదురో నియంత అనటం పచ్చి బూటకం. 2019 ఏప్రిల్‌లో ‘తిరుగుబాటు’ చేసి అధికారంలోకొచ్చానని ప్రకటించుకున్న గెయిడో సాయుధ బృందం రక్షణలో రాజధాని కారకాస్ వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నా జనం నవ్వుకున్నారు. పోలీసులూ, సైనికులూ అతగాణ్ణి ఏమీ అనలేదు. చివరకు మదురో స్వయంగా పిలిచి నవ్వుతూ తలమీద ఒక్కటిచ్చి పొమ్మన్నారు. వేరే దేశంలో ఎక్కడైనా అది ఉరికంబం ఎక్కేంత తీవ్ర నేరం. కనీసం యావజ్జీవం జైల్లో మగ్గేంత అపరాధం.వెనిజులా ప్రజలు 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకొచ్చాక దశాబ్దాల దారిద్య్రం నుంచి విముక్తులయ్యారు. ఆయన హయాంలో దారిద్య్రం ఒక్కసారిగా 70 శాతానికిపైగా తగ్గింది. నిరుద్యోగం సగానికి సగం పడిపోయింది. పెన్షన్లు నాలుగు రెట్లు పెరిగాయి. అక్షరాస్యత వంద శాతానికి చేరుకుంది. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఆహారభద్రత అక్కడ ప్రాథమిక హక్కులు. దాదాపు వందేళ్లపాటు దేశ సంపదనంతా తరలించుకుపోయిన అమెరికా చమురు కంపెనీలను చావెజ్ స్వాధీనం చేసుకోవటంవల్లే ఇదంతా సాధ్యమైంది. అప్పటినుంచి అమెరికా కడుపుమంట మొదలైంది. అమెరికా ఆంక్షల వల్ల వెనిజులా దీర్ఘకాలంగా సమస్యలకు ఎదురీదుతోంది. ప్రాణావసర మందులు కరువై లక్షమంది ప్రజలు మరణించారు. దారిద్య్రాన్ని తట్టుకోలేక 80 లక్షల మంది దేశం వదిలిపోయారు. ఇటీవల మదురో చర్యలు వ్యాపార వర్గాల ప్రయోజనాలకు తోడ్పడుతున్నాయన్న విమర్శలున్నాయి. అయితే మదురో చైనా కరెన్సీ యువాన్లలో వాణిజ్యం నెరపడం, చైనా, రష్యా, ఇరాన్‌లతో జతకట్టడం, బ్రిక్స్‌లో చేరేందుకు సంసిద్ధం కావటం అమెరికాను కలవరపరిచాయి. అత్యధిక చమురున్న దేశం ఎదిగేలా కనబడటంతో డాలర్‌ను కాపాడుకోవటానికి అమెరికా ఈ తప్పుడు చర్యకు దిగింది. ఇవాళ వెనిజులా వంతు. రేపు మెక్సికో, క్యూబా, గ్రీన్‌ల్యాండ్... ఏదైనా కావొచ్చు. అందుకే అమెరికా చర్యను ప్రపంచం ముక్తకంఠంతో ఖండించాలి. ఆధునిక కాలంలో అనాగరిక పోకడలు చెల్లబోవని చాటాలి. -
మదురో బయటపడేందుకు ఏకైక మార్గం ఇదేనా!
ప్రపంచానికి తానే పోలీసోడినని.. జడ్జినని ట్రంప్ నేతృత్వంలోని అమెరికా అనుకుంటోందా?. అందుకే వేరే దేశాల్లోకి చొరబడి మరీ అధినేతలను ఎత్తుకొస్తోందా?. నిన్న వెనెజువెలా?.. రేపు మరో దేశానికి ఈ పరిస్థితి రాకుండా ఉంటుందా?.. ఇలాంటి ప్రశ్నలతో కూడిన చర్చ నడుస్తోంది ఇప్పుడు. మొన్నటిదాకా అధ్యక్ష హోదాలో గౌరవం అందుకున్న నికొలస్ మదురో.. ఇప్పుడు ఈ భూమ్మీద నరకంగా పేరున్న న్యూయార్క్ బ్రూక్లిన్ జైల్లో ఖైదీగా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి బయటపడే మార్గం ఉందా?.. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్‌పై ‘నార్కో-టెర్రరిజం’ కేసు నమోదు చేసింది అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి, మెషీన్ గన్స్, విధ్వంసకర ఆయుధాలను కలిగి ఉండటం వంటి అభియోగాలను మోపారు. డ్రగ్స్ రవాణా కోసం కిడ్నాప్‌లు, వాళ్లపై దాడులు చేయడంవంటి కేసులనూ పెట్టారు. వారు డబ్బులు ఇవ్వకపోవడంతో వారిని హింసించేవారని అదనపు అభియోగాలు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఆయన బయటపడే మార్గాలు చాలా పరిమితంగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. మదురో ముందున్న అమెరికా కోర్టులో తాను నిర్దోషినని నిరూపించుకోవడం.. ఇది అత్యంత కఠినమైన మార్గం. ఎందుకంటే అది అమెరికా ఫెడరల్ కోర్టు. పైగా ట్రంప్ ప్రభుత్వం ఎలాగైనా సరే బలమైన సాక్ష్యాలు సమర్పించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో.. ఆయన నేరం ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా శిక్ష తప్పించుకోవడం చాలా కష్టమే. అయితే మరణశిక్ష పడకపోవచ్చని.. అమెరికా చట్టాల ప్రకారం జీవితఖైదే పడొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండోది.. కుదిరితే రాజకీయ ఒత్తిళ్లు కుదరకుంటే దౌత్య చర్చలు. వెనెజువెలా తాత్కాలిక ప్రభుత్వం లేదంటే దాని మిత్రదేశాలు అమెరికాపై ఒత్తిడి తెచ్చి మదురో విడుదల కోసం ప్రయత్నించవచ్చు. మూడోది ప్రత్యేక ఒప్పందం (deal). అమెరికా-వెనెజువెలా మధ్య ఏదైనా రాజకీయ లేదంటే వ్యూహాత్మక ఒప్పందం కుదరడం. అప్పుడు ఆయన విడుదలకు అవకాశం ఉంటుంది. మూడు ఆప్షన్లలో మూడో దానికే ఎక్కువ ఆస్కారం ఉండొచ్చని విశ్లేషకులూ చెబుతున్నారు. మదురోకు అత్యంత విశ్వసనీయురాలైన డెల్సీ రోడ్రిగ్జ్ ప్రస్తుతానికి వెనెజువెలా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆమెకు అమెరికా చమురు పరిశ్రమలోని రిపబ్లికన్లతో, అలాగే వాల్స్ట్రీట్తోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె తల్చుకుంటే డీల్ కుదిరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ముమ్మాటికీ అక్రమ అరెస్టే!ఎక్స్ట్రాడిషన్ అనేది ఒక దేశం నుండి మరొక దేశానికి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని అప్పగించే చట్టపరమైన ప్రక్రియ. ఒక దేశాధినేతను మరొక దేశం సైనిక చర్య ద్వారా పట్టుకోవడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అయితే అమెరికా దృష్టిలో ఇది తమ దేశానికి సంబంధించిన భద్రతా చర్య. ఇదే విషయంపై ఫెడరల్ కోర్టుల్లో ట్రంప్ సర్కార్ వాదనలు వినిపించొచ్చు. కానీ, అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇది ఆ దేశ సార్వభౌమాధికార ఉల్లంఘన.. అక్రమ అరెస్టే అవుతుందని నిపుణులు చెబుతున్నారు . మదురో అక్రమ అరెస్ట్‌కు మద్దతు కంటే ఆందోళనే ఎక్కువగా వ్యక్తం అవుతోంది. అమెరికా చర్యను యూరోపియన్ యూనియన్ ఖండించింది. ఛాథమ్ హౌస్ (UK Think Tank).. ఇలాంటి చర్యలకు అంతర్జాతీయ చట్టంలో ఎలాంటి న్యాయబద్ధత లేదని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి అమెరికా సైనిక చర్య అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన కిందకే వస్తుంది. అయితే.. యూఎన్ చార్టర్ ప్రకారం ఒక దేశం మరొక దేశంపై సైనిక చర్య తీసుకోవడానికి భద్రతా మండలి అనుమతి అవసరం. కానీ, ట్రంప్ అలాంటి అనుమతులు తీసుకోకుండానే వెనెజువెలా అధ్యక్షుడిని బంధించారు. దీనిపై ఆయన ఎలాంటి వివరణ ఇచ్చుకుంటారో చూడాలి. అదే సమయంలో.. ఇవాళ జరగబోయే అత్యవసర సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అమెరికా చట్టసభలోనూ..అటు అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్‌లోనూ).. ఈ అక్రమ అరెస్ట్ చట్టబద్ధతపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా పడవలపై దాడులు చేయడాన్ని డెమొక్రట్లతో పాటు ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్లూ ఖండించారు. ఇప్పుడు వాళ్లకు తెలియకుండా ఆ దేశంపై విరుచుకుపడటం, అధ్యక్షుడిని తీసుకురావడంపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా చేపట్టిన ఈ ఆపరేషన్‌ను కోర్టుల్లోనూ తేల్చుకునే అవకాశం లేకపోలేదు.ఐసీజేలో..అంతర్జాతీయ న్యాయస్థానం సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో తనంతట తానుగా జోక్యం చేసుకోదు. వెనెజువెలాగానీ ఏదైనా ఇతర దేశాలుగానీ అమెరికా చర్యపై అధికారికంగా కేసు వేస్తే విచారణ చేపట్టే అవకాశం ఉంటుంది. అదే జరిగితే.. మదురో అరెస్ట్ అమెరికాతో పాటు అంతర్జాతీయ భద్రత కోసం అవసరం అని వాదించే అవకాశం లేకపోలేదు. -
న్యూయార్క్ జైలుకు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో
-
వెనెజువెలాను మేమేం పాలించబోం
వెనెజువెలా విషయంలో అమెరికా యూటర్న్ తీసుకుంది. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనెజువెలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. వెనెజువెలాను తాము పాలించబోమని.. తమ ఉద్దేశాలు వేరని స్పష్టం చేసింది. వెనెజువెలాను మేమే నడిపిస్తాం.. తర్వాత సురక్షితమైన అధికార బదిలీ చేస్తాం అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. "నడిపించడం" అంటే నేరుగా పాలన చేపట్టడం కాదు. వెనిజులా చమురు పరిశ్రమపై అమెరికా విధించిన ఆయిల్ బ్లాకేడ్ (oil blockade) ద్వారా ఒత్తిడి తెచ్చి మార్పులు సాధించడం అని అన్నారు. ‘దేశం సురక్షితమని భావించే వరకూ, సరైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించాం’ అని ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ ఉద్దేశం వేరని రూబియో అన్నారు. ‘‘అమెరికా ఇప్పటికే వెనెజువెలా చమురు ట్యాంకర్లపై ఆంక్షలు విధించింది. వాటిని కొనసాగిస్తూ.. డ్రగ్ ట్రాఫికింగ్ ఆపడం, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా చమురు పరిశ్రమను నడపడం మాత్రమే అమెరికా ముందు ఉన్న లక్ష్యం’ అని రూబియో తెలిపారు. వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయి అని ట్రంప్ చెప్పిన విషయాన్ని రూబియో ప్రదానంగా ప్రస్తావించారు. అలాగే.. అమెరికా ప్రస్తుతం ఉన్న సైనిక శక్తి డ్రగ్ బోట్లు, ఆంక్షల ట్యాంకర్లను అడ్డుకోవడానికి సరిపోతుందని.. అవసరమైతే సైనిక ఉనికిని పెంచవచ్చని రూబియో తెలియజేశారు.ట్రంప్ మరో వార్నింగ్.. ఒకవైపు రూబియో ప్రకటన వెలువడిన గంటల వ్యవదిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి వెనెజువెలాను రెండో సైనిక దాడి హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా తాత్కాలిక నాయకత్వం గనుక తమ ఆదేశాలను పాటించకపోతే మరోసారి దాడి జరగవచ్చని స్పష్టం చేశారాయన. ‘‘నికోలాస్ మదురోను అధికారంలో నుండి తొలగించిన తర్వాత వెనెజువెలా అమెరికా పర్యవేక్షణలోనే ఉంది. ఆ దేశాన్ని సరిచేయడం మా లక్ష్యం. అవసరమైతే మళ్లీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నా’’ అని అన్నారాయన. ‘‘వాషింగ్టన్ ఇప్పుడు ఆ నేలపై పరిస్థితిని పూర్తిగా నియంత్రిస్తోంది. అయితే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? అని మాత్రం అడగకండి. ఎందుకంటే నేను చెప్పే సమాధానం చాలా వివాదాస్పదంగా ఉంటుంది’’ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. ఇదిలా ఉంటే.. మదురోకు నమ్మకస్తురాలిగా పేరున్న డెల్సీ రోడ్రిగ్జ్ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆ దేశ ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు సూచన, ఆర్మీ విజ్ఞప్తి, మరోవైపు వెనెజువెలా చట్టాల ప్రకారం ఆమె అధికార బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో పేరిట అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. అయితే.. అమెరికాతోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు కొన్ని విశ్లేషణాత్మక కథనాలు వెలువడుతుండడం గమనార్హం.ఇక అమెరికా చేస్తున్న ప్రకటనలను వెనెజువెలా ఒక్కొక్కటిగా ఖండిస్తూ వస్తోంది. తమ అధ్యక్షుడిని పట్టుకెళ్లడాన్ని అక్కడి ప్రభుత్వం "ఇంపీరియలిస్టు చర్య"గా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ జైల్లో మదురో, ఆయన సతీమణిని అమెరికా ఉంచింది. అక్కడి నుంచే ఆయన్ని డ్రగ్స్ ట్రాఫికింగ్ అభియోగాలపై విచారణ జరపనుంది ఫెడరల్ కోర్టు.నేడు భద్రతా మండలి భేటీఅమెరికా దాడులపై చర్చించేందుకు సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కానుంది. రష్యా, చైనాల మద్దతుతో.. అత్యవసరంగా సమావేశం కావాలని కొలంబియా చేసిన విజ్ఞప్తితో ఈ సమావేశం ఏర్పాటైంది. -
చమురు అంత ఈజీ కాదు
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అనూహ్య దాడితో బంధించి పట్టితీసుకొచ్చాక ఆ దేశంలోని చమురు నిల్వలపై అమెరికా దిగ్గజ కంపెనీలన్నింటికీ అజమాయిషీ లభించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వెనెజువెలా చమురు పరిశ్రమ కొన్నేళ్లుగా దాదాపుగా పడకేసింది. మదురో హయాంలో చమురు వెలికితీత వ్యవస్థల్లో చాలావరకు పదేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయాయి. దాంతో అవేవీ ఇప్పటికిప్పుడు చమురు వెలికితీత పనుల్లోకి దిగే పరిస్థితుల్లో లేవు. వాటిని తిరిగి ఓ రూపానికి తెచ్చి సిద్ధం చేసేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితికి ఒకరకంగా అమెరికాయే కారణం కావడం విశేషం. ఈ దేశంపై అమెరికా విధించిన తీవ్ర ఆంక్షల వల్లే చాలా దేశాలకు వెనెజువెలా చమురును విక్రయించలేకపోయింది. చైనా, భారత్ తదితర కొద్ది దేశాలు మాత్రమే వెనిజువెలా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలకు జడిసి చాలా దేశాలు వెనెజువెలా చమురును కొనేందుకు సాహసించలేదు. కొనేందుకు ఎవరూ రాక, గిరాకీ లేక చమురు వెలికితీతను వెనిజువెలా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది. అలా ప్రస్తుతం కేవలం రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు వెలికితీస్తోంది. అదే ఆంక్షల ఊసు లేని రోజుల్లో అంటే 1999 ఏడాదిదాకా రోజుకు ఏకంగా 40 లక్షల బ్యారెళ్ల దాకా ముడిచమురును వెలికితీసేది. వెనెజువెలా చమురు క్షేత్రాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, పదేళ్ల శ్రమ అవసరం అవుతాయని అమెరికాలోని ‘రైస్ యూనివర్సిటీ’లో లాటిన్ అమెరికా ప్రాంత ఇంధన విభాగ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో మొనాల్డీ అంచనావేశారు.కంపెనీలు ముందుకొచ్చేనా?వెనిజువెలాలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. కనీసం 303 బిలియన్ బ్యారెళ్ల మేరకు చమురు ఉందని ఒక అంచనా. యావత్ ప్రపంచ చమురు నిల్వల్లో ఇది ఏకంగా 17 శాతానికి సమానం. ఇంతటి అపార చమురు నిల్వలపై అజమాయిషీ, పూర్తిస్థాయి గుత్తాధిపత్యం సాధించేలా అన్ని చర్యలూ తీసుకునేందుకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. అయితే నాయకత్వ సంక్షోభం తలెత్తితే మాత్రం ట్రంప్ ఎంత నచ్చజెప్పినా అమెరికా చమురు దిగ్గజాలు అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయన్నది అనుమానమే. రాజకీయ అనిశ్చితి కొనసాగే పరిస్థితుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి రిస్కు తీసుకునేందుకు అవి వెనకాడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో అత్యంత సందిగ్ధ పరిస్థితే నెలకొని ఉంది. దీనికి ట్రంప్ ఎలాంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తికరం. ఒకవేళ అమెరికా కంపెనీలు రంగంలోకి దిగి చమురు క్షేత్రాల పునరుద్ధరణపై భారీ మొత్తాలే వెచ్చించినా అవన్నీ సిద్ధమయ్యేందుకు చాలాకా లమే పడుతుందని ఇంధనధరల సరళిపై అధ్యయ నం చేసే గ్యాస్బడ్డీ సంస్థలో ప్రధాన పెట్రోలియం విభాగ నిపుణుడు ప్యాట్రిక్ డీ హాన్ వ్యాఖ్యానించారు. ‘‘చమురు వెలికితీత వ్యవస్థల పునరుద్ధణ ఒక అంశమైతే, రాజకీయ సుస్థిరత అత్యంత కీలకమైన మరో అంశం. తమ పెట్టుడులకు భరోసా కల్పించే సుస్థిరమైన ప్రభుత్వం ఉందని విశ్వసిస్తేనే బడా కంపెనీలు వెనిజువెలాలో అడుగుపెడతాయి. ఆ నమ్మకం లేనంతకాలం పెట్టుబడుల వరద పారడం చాలా కష్టం’’ అని మొనాల్డీ విశ్లేషించారు. బహుశా ఈ పరిస్థితులను ఊహించే మదురోను నిర్బంధించే క్రమంలో అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. శనివారం నాటి క్షిపణి, బాంబు దాడుల్లో వెనిజువెలా కీలక చమురు క్షేత్రాల్లో కనీసం ఒక్కటి కూడా దెబ్బ తినకుండా జాగ్రత్త పడింది. వెనెజులా నుంచి ముడిచమురు వెలికితీతను అనూహ్యవేగంగా మొదలెడితే చమురురంగంలో గల్ఫ్ దేశాలను తోసిరాజని అమెరికాయే కింగ్‌మేకర్‌గా మారడం ఖాయంగా కన్పిస్తోంది. భారీ పరిమాణంలో చమురు అందుబాటులోకి వస్తుంది గనుక ఇప్పటికే నేలచూపులు చూస్తున్న చమురు ధరలు కనీసం మరికొన్నేళ్లపాటు చౌకగానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.నాణ్యమైన చమురువెనెజువెలాలో దొరికేది హెవీ క్రూడ్‌గా పేర్కొ నే అత్యంత నాణ్యమైన చమురు. దాని నుంచి డీజిల్‌తో పాటు భారీ పరికరాల కోసం వాడే అస్ఫాల్ట్ తదితర ఇంధనాలు తయా రవుతాయి. అందుకే అక్కడి చమురుపై భారీ ఇంధన కంపెనీలన్నింటికీ మొదటినుంచీ ఆసక్తి. ఒకప్పట్లా మళ్లీ భారీ పరిమాణంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిందంటే ప్రధానంగా నష్టపోయేది రష్యానే. అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా తట్టుకుని నిలుస్తోందంటే చమురు విక్రయాల పుణ్యమే. చట్టపరమైన చిక్కులువెనిజువెలా చమురును అమెరికా చేజిక్కించుకోవడం అంత సులువేమీ కాదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ‘‘ట్రంప్ చర్యను వెనిజువెలా కచ్చితంగా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థల ముందు సవాలు చేయవచ్చు. చమురు ఉత్పత్తి పెరుగుదలతో ప్రధానంగా నష్టపోయే రష్యానో, లేదంటే ఏ ఇతర దేశమో కూడా మదురో నిర్బంధాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆస్కారం లేకపోలేదు. -
న్యూయార్క్ జైలుకు మదురో
కరాకస్: ఏళ్ల తరబడి వెనెజువెలాను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ చిట్టచివరకు అమెరికా జైలులో విచారణ ఖైదీలుగా మారిపోయారు. అమెరికాలోకి మాదక ద్రవ్యాలను పోటెత్తిస్తున్నారన్న ప్రధాన ఆరోపణలతో అపహరించి బందీలుగా పట్టుకొచ్చిన ట్రంప్ ప్రభుత్వం వీళ్లిద్దరినీ న్యూయార్క్‌లోని బ్లూక్లిన్ ప్రాంతంలోని మెట్రోపాలిటన్ నిర్బంధ కేంద్రంలో ఉంచింది. శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కారకాస్‌పై అమెరికా సైన్యం మెరుపు దాడులు చేసి మదురో దంపతులు బంధించి రాత్రి కల్లా విమానంలో న్యూయార్క్ శివారు ఎయిర్‌పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి హెలికాప్టర్ మన్హట్టన్కు తీసుకెళ్లారు. తర్వాత డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్(డీఈఏ) ఆఫీసుకు చేర్చారు. అక్కడ కొద్దిసేపు ఆయనను ప్రశ్నించారు. ఇద్దరు డీఈఏ ఏజెంట్లు మదురో చేతులు పట్టుకొని తీసుకెళ్తున్న వీడియోను వైట్‌హౌస్ విడుదల చేసింది. ఇందులో మదురో నవ్వుతూ కనిపిస్తున్నారు. డ్రగ్స్ టెర్రరిజం కేసులో సోమవారం ఆయనను మన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో హాజరుపర్చబోతున్నారు. వెనెజువెలాపై దాడి చట్టవిరుద్ధం అమెరికాలోకి మాదక ద్రవ్యాలను చేరవేసినందుకు తమ దేశ చట్టాల ప్రకారమే మదురోను విచారించి, శిక్షిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. మదురో దంపతులపై త్వరలో విచారణ ప్రారంభించనున్నారు. ట్రంప్‌పై అమెరికాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలా అధ్యక్షుడిని నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ వైట్‌హౌస్ బయట నిరసనకు దిగారు. తాత్కాలిక అధ్యక్షురాలిగా రోడ్రిగ్స్ ప్రమాణం వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఆదివారం తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణంచేశారు. అధ్యక్షురాలిగా ఆమెతో సుప్రీంకోర్టు ప్రమాణ స్వీకారం చేయించింది. అమెరికాను తామే పాలిస్తామంటూ ట్రంప్ ప్రకటించినప్పటికీ కొత్త అధ్యక్షురాలు ప్రమాణం చేయడం గమనార్హం. మరో దేశానికి తమ దేశం ఒక వలసకాలనీగా ఉండబోదని ఆమె కరాఖండీగా తేల్చి చెప్పారు. అమెరికా దాడిలో తమ పౌరులు, సైనికులు మరణించారని రోడ్రిగ్స్ ఆగ్రహంగా మాట్లాడారు. ఎంతమంది అనేది ఇప్పుడే చెప్పలేమని అన్నారు. అమెరికా ఆధిపత్యం తమపై చెల్లదని వెనెజువెలా రక్షణ మంత్రి జనరల్ వ్లాదిమిర్ పాడ్రినో స్పష్టంచేశారు. దేశ సార్వ¿ౌమత్వాన్ని కచ్చితంగా కాపాడుకుంటామని వ్లాదిమిర్ చెప్పారు. సమష్టిగా పాలన: ట్రంప్ మదురోను అదుపులోకి తీసుకొని, పదవి నుంచి దించేయడం ద్వారా ప్రమాదకరమైన డ్రగ్స్ రవాణాను కట్టడి చేసే విషయంలో ముందడుగు వేశామని ట్రంప్ చెప్పారు. ‘‘వెనెజువెలా ప్రభుత్వ పగ్గాలను మరొకరికి భద్రంగా అప్పగించేదాకా సమష్టిగా ఆ దేశాన్ని పరిపాలిస్తాం. ఇందుకు మదురో సన్నిహితుల సాయం కూడా తీసుకుంటాం. పాలనలో వారి భాగస్వామ్యం ఉంటుంది’’ అని అన్నారు. వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన రోడ్రిగ్స్‌కు ట్రంప్ అభినందనలు తెలియజేయడం విశేషం. ముప్పుగా మారిన వారిని శిక్షించక తప్పదు ఇతర దేశాలకు పెద్ద ఎత్తున చమురు సరఫరా చేయబోతున్నామని ట్రంప్ ప్రకటించారు. వెనెజువెలాలోని అపారమైన చమురు నిల్వలపై పెత్తనం చెలాయించబోతున్నట్లు సంకేతాలిచ్చారు. వెనెజువెలా ఇప్పటికే తమ అ«దీనంలో ఉందని వెల్లడించారు. అమెరికా సార్వ¿ౌమత్వానికి, ప్రజల జీవితాలకు ముప్పుగా మారిన వారిని శిక్షించి తీరుతామని తేల్చిచెప్పారు. అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేస్తున్న లాటిన్ అమెరికా దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ ఫ్లోరిడాలో మిన్నంటిన సంబరాలు మదురోను బంధించిన వార్త తెలిసి అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో స్థానికులు ఆనందంలో మునిగిపోయారు. వీరంతా ఒకప్పుడు వెనెజువెలా నుంచి వలసవచ్చిన వాళ్లే. వెనెజువెలా జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించారు. హింసకు తాళలేక స్వదేశం వీడామని, ఇకపై నిర్భయంగా స్వదేశం చేరుకుని బంధువులను కలుస్తామని వాళ్లు ఆనందంతో చెప్పారు. మదురో పతనాన్ని కళ్లారా చూడాలని ఎప్పటినుంచో నిరీక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పుడ తమ కల నేరవేరిందన్నారు. తన పాలనను వ్యతిరేకించేవారిపై మదురో ఉక్కుపాదం మోపారు. దాంతో చాలామంది ప్రాణభయంతో విదేశాలకు వెళ్లిపోయారు. భయంకరమైన కారాగారం మదురోను నిర్బంధించిన మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌కు భయంకరమైన కారాగారంగా పేరుంది. కరడుగట్టిన నేరగాళ్లు ఇక్కడ శిక్ష అనుభవ్చిస్తుంటారు. ప్రస్తుతం 1,336 మంది ఖైదీలు ఉన్నారు. వీరందరి మధ్యనే మదురో కాలం గడపాల్సి ఉంది. ఈ జైలులో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. శుభ్రత, మౌలిక సదుపాయాలు అంతంత మాత్రమే. ఖైదీల పట్ల సిబ్బంది రాక్షసంగా ప్రవర్తిస్తుంటారు. ఖైదీల మధ్య ఘర్షణలు జరగడం సర్వసాధారణం. హంతకులు, రేపిస్టులు, డ్రగ్స్ స్మగ్లర్లను ఈ జైలులో నిర్బంధిస్తుంటారు. వెనెజువెలాలో ఎగసిన జ్వాలలు శత్రుదేశ సైన్యం అమాంతం అధ్యక్షభవనంపై దాడి చేసి మదురోను ఎత్తుకెళ్లడంతో వెనెజువెలా వాసుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అమెరికా దమనకాండను నిరసిస్తూ వేలాది మంది స్థానికులు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఆందోళనలు చేపట్టారు. నిరసన ర్యాలీలు ఆదివారం పెద్ద ఎత్తున కొనసాగాయి. మదురోను పదవీచ్యుతుడిని చేయడంపై ఆయన మద్దతుదారులు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా నినదించారు. మదురోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అయితే మదురోను అమెరికా నిర్బంధించడం పట్ల కొందరు సంతోషం వ్యక్తంచేయడం గమనార్హం. కొందరు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నియంతృత్వపాలన ముగిసిపోయిందని ఆనందం వ్యక్తంచేశారు. వెనెజువెలాలో అమెరికా చర్యలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సోమవారం చర్చ జరుగనున్నట్లు తెలిసింది. యూఎస్ మీడియాకు ముందే తెలుసు!వాషింగ్టన్: వెనెజువెలా రాజధాని కరాకస్‌పై ట్రంప్ ప్రభుత్వం సైన్యంతో చేయించిన రహస్య మెరుపు దాడి విషయం అమెరికా మీడియాకు ముఖ్యంగా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థలకు ముందే తెలుసని వార్తలొచ్చాయి. తమకు ముందే తెల్సిపోయిందన్న అత్యుత్సాహంలో విషయాన్ని లీక్‌చేసి కథనాలు ప్రచురించి అందరికీ బహిరంగపరిస్తే ఆ రహస్య ఆపరేషన్‌లో పాల్గొనే అమెరికా సైనికుల భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని గ్రహించాయి. అందుకే మీడియా సంస్థలు ఈ విషయంలో గోప్యత పాటించినట్టు సమాచారం. అమెరికా అధ్యక్షభవనం వర్గాలకు, మీడియా సంస్థలకు ముందే తెలుసు అని అమెరికా న్యూస్ వెబ్సైట్ ‘సెమఫర్’ ఘటన తర్వాత ఒక కథనంలో పేర్కొంది. ఈ విషయాన్ని బయట పెట్టడమా, లేదా అనే విషయంలో రెండు వార్తా సంస్థల్లో సీనియర్ ఎడిటర్ల స్థాయిలో గట్టి చర్చలే జరిగాయట. చివరికి గుట్టుగానే ఉంచాలని నిర్ణయం తీసుకున్నట్టు సెమఫర్ చెప్పుకొచ్చింది. జాతీయ భద్రతకు సంబంధించిన అంశాల్లో అమెరికా మీడియా సాంప్రదాయికంగా ఈ వైఖరినే పాటిస్తూ వస్తోందని సెమఫర్ గుర్తు చేసింది. ట్రంప్‌కు, ప్రధాన మీడియా సంస్థలకు నడుమ పచ్చగడ్డి వేసినా భగ్గుమంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ ‘ఆపరేషన్ రిజాల్వ్’ విషయంలో సంయమనం పాటించడం గొప్ప విషయమేనని ఇతర మీడియా సంస్థలు వ్యాఖ్యానించాయి.సవాలు విసిరి దొరికిపోయాడు‘దమ్ముంటే పట్టుకో’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా సవాలు విసిరిన నికోలస్ మదురో అదే అమెరికా సేనలకు దొరికిపోయాడు. ఆయన గత ఏడాది ఆగస్టులో తన అధికారిక నివాసంలో ట్రంప్‌ను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘రా.. నిజంగా దమ్ముంటే వచ్చి నన్ను అరెస్టు చేసుకో. నీకు కోసం ఇక్కడ ఎదురు చూస్తున్నా. ఇంకా ఆలస్యం చేయకు.. పిరికిపంద’ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడారు. దాంతో ట్రంప్ సైన్యం అనుకున్నంత పని చేసి చూపించింది. శనివారం మదురోను, ఆయన భార్యను వారి నివాసంలోనే అరెస్టు చేసి, న్యూయార్క్‌కు తరలించింది. మదురోపై అమెరికాలో సెటైర్లు పేలుతున్నాయి. మదురోపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ వైట్‌హౌస్ ఆదివారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్టుచేసింది. ట్రంప్‌కు మదురో విసిరిన చాలెంజ్తోపాటు అమెరికా సైనిక ఆపరేషన్, ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ దృశ్యం ఇందులో ఉంది. ‘చివరకు ఏం జరిగిందో చూశారుగా, అరెస్టయ్యే అవకాశం మదురోకు దక్కింది’ అంటూ వైట్‌హౌస్ ముక్తాయింపునిచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హ్యాపీ న్యూ ఇయర్ యూఎస్ అధికారులకు మదురో విషెస్ ‘హ్యాపీ న్యూ ఇయర్’! అమెరికా నిర్బంధంలో ఉన్న కొలంబియా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో అమెరికా అధికారులతో పలికిన మాటలివి. శనివారం రాత్రి పొద్దుపోయాక యూఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆయనను న్యూయార్క్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా వారికి మదురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలిపారు. తన జైలు గదికి చేరుకున్నాక వారికి గుడ్‌నైట్ సైతం చెప్పారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అందులో మదురో నలుపు రంగు హుడీ షర్టు వేసుకుని చేతులకు బేడీలతో ఓ హాల్ గుండా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో కలిసి నడుస్తూ కన్పిస్తున్నారు. -
జ్యోతిష్య శాస్త్రం ముందే చెప్పింది.. మదురో పతనం తప్పదని!
లిమా: ప్రపంచ రాజకీయాలపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం మరోసారి చర్చనీయాంశమైంది. బల్గేరియాకు చెందిన వంగాబాబా గతంలో యుద్ధాలు, విపత్తులు, నాయకుల పతనాలను ముందుగానే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే తరహా జోస్యాలతో పెరూ శామన్లు రంగంలోకి వచ్చారు. కొత్త సంవత్సరం ముందు వారు వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో త్వరలో అధికారాన్ని కోల్పోతారని ప్రకటించగా.. ఐదు రోజుల్లోనే అమెరికా ప్రత్యేక దళాలు ఆయనను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిందిఆధ్యాత్మిక జ్యోతిష్యం అనేది ప్రపంచ రాజకీయాలు, నాయకుల భవిష్యత్తు, దేశాల మార్పులు వంటి అంశాలను ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషించే ప్రత్యేక పద్ధతి. పెరూ దేశంలోని శామన్లు (ఆధ్యాత్మిక జ్యోతిష్కులు) ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి ముందు ఇలాంటి జోస్యాలు చెబుతారు. ఆశ్చర్యకరంగా.. మదురోపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం వెలుగులోకి వచ్చిన ఐదు రోజులకే అమెరికా వెనెజువెలాలో గోప్యంగా ఆపరేషన్ నిర్వహించింది.ఈ చర్యలో మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెద్ద చర్చాంశమైంది. సుదీర్ఘకాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు మదురోకు మధ్య వైరం కొనసాగుతోంది. దీనికి తోడు ఆయన పాలనపై అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక సంక్షోభం వంటి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రత్యేక దళాలు మదురోను అదుపులోకి తీసుకున్నాయి.పెరూ శామన్ల జోస్యం చెప్పిన కొద్ది రోజుల్లోనే మదురోను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకోవడం వెనెజువెలాలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. లాటిన్ అమెరికా దేశాలు ఈ సంఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు మదురో పతనాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తుండగా, మరికొందరు అమెరికా జోక్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.ఇలాంటి ఆధ్యాత్మిక జోస్యాలు గతంలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బల్గేరియాకు చెందిన వంగాబాబా ‘బాల్కన్ నోస్ట్రడామస్’గా ప్రసిద్ధి పొందారు. ఆమె చేసిన అనేక జోస్యాలు.. ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు నిజమయ్యాయని అనేక మంది విశ్వసిస్తారు. వంగాబాబా జోస్యాలు ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినట్లే, ఇప్పుడు పెరూ శామన్ల జోస్యాలు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నాయి. -
నికోలస్ మదురో సత్యసాయి భక్తుడు
కరాకస్: అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్‌గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరంనికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్‌లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు.మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు.సత్యసాయి బాబా భక్తుడుమదురోకు భారత్‌తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు. సత్యసాయి బాబా బోధనలు, ఆధ్యాత్మికత ఆయనపై ప్రభావం చూపాయి. మదురో తరచుగా బాబా ఆశ్రమాన్ని సందర్శించేవారని, ఆయన బోధనలను తన జీవితంలో అనుసరించేవారని చెబుతారు. -
‘దమ్ముంటే పట్టుకోమన్న మదురో… పడకగదిలోనే పట్టుకున్న ట్రంప్’
వాషింగ్టన్: ‘.. ప్లేసు నువ్వు చెప్పినా సరే, టైమ్ నువ్వు చెప్పినా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే… దమ్ముంటే నన్ను పట్టుకో’అంటూ సినిమా స్టైల్లో సవాలు విసిరిన వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేశారు. తమ నివాసంలో నిద్రిస్తున్న మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను అమెరికా సైన్యం ఎత్తుకొచ్చింది. ఆ తర్వాత ప్రెస్‌మీట్ పెట్టి మరి మదరు ఛాలెంజ్‌ను గుర్తు చేసింది. వెనెజువెలా అప్పటికే తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. అవినీతి, కరువు, చమురు అమ్మకాలపై ఆధారపడే ఆర్థిక వ్యవస్థ ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ పరిస్థితుల్లో అమెరికా ఆంక్షలు విధించడం దేశాన్ని మరింత కుదేలు చేసింది. గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం, అంతర్జాతీయ వాణిజ్యాన్ని అడ్డుకోవడం వెనెజువెలా ప్రజలకు మరింత భారంగా మారింది.రివార్డు ప్రకటన, సవాలుఆ తర్వాత మదురోను పట్టుకునేందుకు వీలుగా సమాచారం అందిస్తే భారత కరెన్సీలో రూ.400 కోట్లు రివార్డు ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ ప్రకటనతో మదురో మరింత రెచ్చిపోయారు. డొనాల్డ్ ట్రంప్‌కు బహిరంగంగా సవాలు విసిరారు. ‘పిరికోడా.. నేనిక్కడే మిరాఫ్లోర్స్ (వెనెజువెలా) అధ్యక్ష భవనంలో ఉంటా. ఆలస్యం చేయొద్దు, వచ్చి పట్టుకోండి’అంటూ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.Nicolas Maduro had his chance — until he didn’t.The Trump Admin will always defend American citizens against all threats, foreign and domestic. 🇺🇸🦅 pic.twitter.com/eov3GbBXf4— The White House (@WhiteHouse) January 4, 2026 ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్మదురోను పట్టుకునేందుకు అమెరికా ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిసాల్వ్’ పేరుతో సైనిక చర్యకు దిగింది. శనివారం తెల్లవారు జామున (స్థానిక సమయం) వెనెజువెలా రాజధాని కరాకస్ నడిబొడ్డున అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో, మందమైన స్టీల్డోర్లు, కిటికీలతో కూడిన కోటలాంటి ప్యాలెస్‌లో ఉన్నారు. తనను ఎవరూ ఏమీ చేయలేరని అనుకున్నారు. కానీ మా స్పెషల్ ఫోర్సెస్ పెద్ద ఎత్తున విమానాలు,ఫైటర్ జెట్లు హెలికాప్టర్లతో దాడులు చేశాయి. మెరుపు వేగంతో టియునా మిలిటరీ కాంపౌండ్ ప్యాలెస్‌లో పడక గదిలో నిద్రిస్తుండగా మదురో దంపతులను ఎత్తుకొచ్చాయి. చివరికి అమెరికా సైన్యం మదురోను, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. ఈ సంఘటనను ట్రంప్ ప్రెస్మీట్లో ప్రకటించారు. మదురో చేసిన వ్యాఖ్యల వీడియోలను ప్రదర్శించి..‘సవాలు చేసిన వారిని మేం పట్టుకున్నాం’ అంటూ జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డాన్ కెయిన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యాయి.భార్యపై కేసులువారిపై నార్కో-టెర్రరిజం యునైటెడ్ స్టేట్స్లోకి టన్నుల కొద్దీ కొకైన్ దిగుమతి, అక్రమ ఆయుధాలు కలిగి ఉండటం వంటి అభియోగాలు మోపబడ్డాయి. ప్రస్తుతం మదురో దంపతులు బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. వారిని విచారిస్తున్నారు. మదురో చేసిన హాస్య వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.‘నన్ను పట్టుకోగలిగితే పట్టుకో’ అన్న సవాలు చివరికి ఆయనను అమెరికా జైలులోకి నెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Operation Absolute Resolve. pic.twitter.com/KOtW0C0V1O— The White House (@WhiteHouse) January 3, 2026 -
చేతులకు సంకెళ్లు.. చుట్టూ పోలీసులు..! వెనిజులా అధ్యక్షుడి సంచలన వీడియో
-
వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగొచ్చింది: మచాడో
నికొలస్ మదురోను అమెరికా నిర్బంధించిన తర్వాత వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరినా మచాడో తొలిసారిగా స్పందించారు. అమెరికా హామీని నిలబెట్టుకుందన్న మచాడో.. ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్యను అమెరికా సైన్యం బందీగా తీసుకెళ్లడంతో వెనెజువెలాకు స్వేచ్ఛ తిరిగి వచ్చిందంటూ ప్రకటించారు.వెనెజువెలా ప్రజలను ఉద్దేశిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టిన మచాడో.. వెనెజువెలా ప్రజలు, ఇతర దేశాల పౌరులపై జరిగిన దారుణమైన నేరాలకు నికొలస్ మదురో ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్నారు. ‘‘మదురోపై మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నార్కో-టెర్రరిజం ఆరోపణలు ఉన్నాయి. చర్చలతో సమస్య పరిష్కారానికి ఆయన నిరాకరించాడు. దీంతో అమెరికా తన హామీని నిలబెట్టుకుంది’ అని మచాడో ట్వీట్ చేశారు.ప్రజాస్వామ్యం కోసం కొన్నేళ్లుగా తాను చేసిన పోరాటం ఫలించిందన్న మచాడో.. శాంతియుతంగా, ప్రజస్వామ్యబద్ధంగా అధికార మార్పిడికి ప్రజలు సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. కాగా, వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ను వెనెజులా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు. నెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు. అయినా ఆమె చాలా మంచి మనిషి’’ అని పేర్కొన్నారు. ‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా.. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. -
ఎవరీ నికోలస్? అమెరికాతో శత్రుత్వం ఎందుకు?
-
వెనుజువెలాలో అప్పటి దాకా మా పాలనే.. ట్రంప్ ప్రకటన
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బందీగా పట్టుకెళ్లాక ఆ దేశ పరిపాలనా బాధ్యతలను తామే చూసుకుంటామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. దాడుల తర్వాత శనివారం మీడియాతో ట్రంప్ మాట్లాడారు. ‘‘అధ్యక్షుడిని ఇప్పటికే బంధించాం. ఇక పరిపాలనా బాధ్యతలను మేమే చూసుకుంటాం. మా కనుసన్నల్లో ఎవరి చేతుల మీదుగా పరిపాలన జరగబోతోందనేది త్వరలోనే ప్రకటిస్తాం. నూతన ప్రభుత్వం ఏర్పడి భద్రంగా, సవ్యంగా, పారదర్శకంగా అధికార బదిలీ జరిగేదాకా పరిపాలన బాధ్యత మాదే. పరిపాలన సవ్యంగా సాగేలా చూసుకుంటాం’’ అని ట్రంప్ అన్నారు. విపక్ష నేత మరియా కొరీనా మచాడోకు పాలనా బాధ్యతలు అప్పగిస్తారా? అని మీడియా ప్రశ్నించింది.‘‘ఆమె సారథ్యంలో పాలన కష్టమేమో. ఆమెకు వెనెజువెలా ఇంటా, బయటా పూర్తిస్థాయి మద్దతు లేదు.అయినా ఆమె చాలా మంచి మనిషి’’అని అన్నారు. ‘‘వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్తో మాట్లాడా. అమెరికా ఏమి అడిగినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు’’అని ట్రంప్ వెల్లడించారు. ‘‘గగనతల, భూతల, సముద్రమార్గాల్లో వెనెజువెలాపై అమెరికా తన అమేయ సాయుధశక్తి, యుక్తులను అసాధారణ స్థాయిలో ఉపయోగించింది. వెనెజువెలా సైనికకోట అయిన కరాకస్‌లో శత్రు దుర్భేద్యమైన సైనికస్థావరం నుంచి విజయవంతంగా మదురోను బంధించి తీసుకొచ్చి అమెరికా న్యాయదేవత ఎదుట నిలబెట్టాం. అమెరికా చేసిన ఘనకార్యాన్ని ప్రపంచంలో గతంలో ఏ దేశమూ చేయలేకపోయింది. మా ధాటికి వెనెజువెలా సైనికశక్తి నిర్వీర్యమైంది. నిజానికి మేం రెండో దఫా దాడి చేయాలనుకున్నాం.కానీ తొలిదెబ్బకే వెనెజువెలా బలగాలు గుడ్లు తేలేశాయి. దీంతో మా రెండో దఫా దాడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాం. మదురో దంపతులను సదరన్ డి్రస్టిక్ట్ ఆఫ్ న్యూయార్క్ కోర్టులో విచారిస్తాం. సముద్రమార్గంలో అమెరికాలోకి వచ్చే మాదకద్రవ్యాల్లో 97 శాతాన్ని అడ్డుకున్నాం. ఒక్కో పడవలో వచ్చే డ్రగ్స్ కారణంగా సగటున 25,000 మంది అమెరికన్లు చనిపోతున్నారు. వెనెజువెలాలోని ముడిచమురు కుంభస్థలాన్ని అమెరికా కొట్టబోతోంది. అమెరికా కంపెనీలు అక్కడికెళ్లి వ్యాపారం మొదలెట్టి చమురు తవ్వకం, అమ్మకాలతో వెనెజువెలా ‘చమురు మౌలికవసతి’ని పునరుద్ధరిస్తాయి. చమురు అమ్మకాలతో వచ్చిన సంపదతో వెనెజువెలాను బాగుచేస్తాయి. అమెరికా భాగస్వామ్యంతో వెనెజువెలా వాసులు ఇకపై ధనవంతులుగా, స్వతంత్రంగా, సురక్షితంగా జీవిస్తారు. అమెరికా పాలనలో వెనెజువెలా ఎంతో సంతోషంగా ఉండబోతోంది. వాళ్ల కష్టాలన్నీ తొలగిపోనున్నాయి. అమెరికాలోకి ప్రమాదకర డ్రగ్స్‌ను సరఫరాచేసే మదురో నిజానికి ఒక నియంత. డీ లోస్ సోలెస్ డ్రగ్స్ ముఠాకు మదురోనే పెద్ద. మదురోను బంధించాక వెనెజువెలా ప్రజలు స్వేచ్ఛాజీవులయ్యారు. మా చట్టాల ప్రకారం శిక్షిస్తాం..మదురోను తమ అదుపులోకి తీసుకున్నాక అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘డ్రగ్స్ మాఫియాతో మదురో దంపతులకూ సంబంధం ఉంది. అందుకే వాళ్లను బంధించి తీసుకొచ్చాం. న్యూయార్క్ చట్టాల ప్రకారం అమెరికా చట్ట నిబంధనల మేరకే అమెరికా గడ్డపై మదురో దంపతులకు శిక్ష పడేలా చేస్తాం’’ అని పామ్ అన్నారు. ఈ మేరకు అమెరికా న్యాయ విభాగం శనివారం మదురో దంపతులపై నేరారోపణలు చేసింది. ‘‘అవినీతి సర్కార్ దశాబ్దాల తరబడి అధికార దుర్వినియోగానికి పాల్పడింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో మునిగిపోయింది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర మాదకద్రవ్యాల రవాణా ముఠాలతో స్వయంగా దేశ ప్రభుత్వం చేతులు కలిపింది’’ అని యూఎస్ జస్టిస్ డిపార్ట్మెంట్ పేర్కొంది. మరోవైపు సముద్రమార్గంలో అమెరికాలోకి మాదకద్రవ్యాలను తరలిస్తున్న నౌకలపై దాడులు పెంచామని శుక్రవారం నాటికి మొత్తంగా 35 నౌకలను నాశనం చేశామని.. సిబ్బంది సహా అందులోని సాయుధులను మొత్తంగా 115 మందిని అంతమొందించామని అమెరికా శనివారం ప్రకటించింది. కరాకస్‌లో మొదలైన ఆందోళనలు దేశాధ్యక్షుడిని బందీగా అమెరికా పట్టుకెళ్లడంపై కరాకస్ సిటీలో పౌరులు ఆందోళనకు దిగారు. అధికార పార్టీకి పట్టున్న ప్రాంతాల్లో కార్యకర్తలు రోడ్లపైకి చేరుకొని నిరసన మొదలెట్టారు. వెనెజువెలాపై దాడి నేపథ్యంలో సమీప దేశమైన కొలంబియా అప్రమత్తమైంది. తమ దేశంలోకి వచ్చి పడే వెనెజువెలావాసులను అడ్డుకునేందుకు సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేస్తోంది. ఈ మేరకు కొలంబియా అధ్యక్షుడు గస్తోవ్ పెట్రో జాతీయ భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు. తరచూ అమెరికాపై, ట్రంప్‌పై విమర్శలు గుప్పించే గస్తోవ్ తమ దేశం మీదా దాడి జరగొచ్చన్న అంచనాతో సైన్యాన్ని అప్రమత్తం చేశారు. అమెరికా సైతం వెనెజువెలాలో ఉన్న తమ పౌరుల రక్షణ కోసం ఒక అడ్వైజరీని జారీ చేసింది. ‘‘అమెరికన్లు ఎవరైనా వెనెజువెలాలో ఉంటే తక్షణం వెనక్కి వచ్చేయాలి. ఆ దేశం వైపు ఎవరూ వెళ్లొద్దు’’ అని పేర్కొంది. -
వెనెజువెలాపై దాడి.. ట్రంప్‌కు చైనా హెచ్చరిక
బీజింగ్: వెనెజువెలాపై అమెరికా దాడులను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘అమెరికా దుస్సాహసానికి తెగబడింది. సార్వభౌమ దేశమైన వెనెజువెలాపై సైనికశక్తిని దుర్వినియోగం చేయడం నేరం. ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది.అలాగే, అమెరికా పాల్పడే ఇలాంటి చర్యలు లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు గొడ్డలిపెట్టుగా తయారవుతున్నాయి. మేం ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ నిబంధనలను అమెరికా తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఐరాస నిబంధనలు, చట్టాలు, చార్టర్‌కు విలువ ఇచ్చి తదనుగుణంగా నడుచుకోవాల్సిందే. తమతో విబేధించే దేశాల సార్వభౌమత్వం, భద్రతను ముప్పువాటిల్లేలా ప్రవర్తించే పెడపోకడలకు అమెరికా స్వస్తిపలకాలి’’ అని చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలను ప్రపంచదేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. సార్వభౌమదేశంపై ఏకపక్షంగా దాడులు చేసే అధికారం అమెరికాకు ఎవరిచ్చారని నిలదీశాయి. దాడులపై ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఇదిలా ఉండగా.. మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్‌కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది. -
మదురో దంపతుల.. యుద్ధనౌకలో న్యూయార్క్‌కు తరలింపు
కరాకస్: ఎన్నో యుద్ధాలను ఆపానంటూ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడనని జబ్బలు చరుచుకునే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు పూర్తి భిన్నంగా సమీప దేశంపై ఏకపక్షంగా దాడి చేసి ఏకంగా దేశాధినేతను బందీగా పట్టుకొని ప్రపంచ దేశాలను విస్మయపరిచారు. అమెరికాలోకి మాదకద్రవ్యాల సరఫరాను హోరెత్తించి పరోక్షంగా హింసను ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో నివాసంపై శుక్రవారం అర్ధరాత్రి దాటాక అమెరికా సైన్యం మెరుపుదాడులు చేసింది. మదురోతోపాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌నూ బందీలుగా పట్టుకుంది. కరాకస్ సిటీలోని ఫోర్ట్ టియూనా సైనిక స్థావరంలోని సొంతింట్లో ఉన్న మదురో దంపతులను అమెరికా సైన్యం బందీలుగా పట్టుకున్నట్లు వెనెజువెలా అధికార పార్టీ నేత నహూమ్ ఫెర్నాండెజ్ వెల్లడించారు. అంతకుముందు కరాకస్ సిటీపై అమెరికా యుద్ధవిమానాలు బాంబుల వర్షం కురిపించాయి. భారీ స్థాయిలో క్షిపణులు, రాకెట్లను ప్రయోగించి వెనెజువెలా సైనిక స్థావరాలు, జనావాసాలను భూస్థాపితం చేశాయి. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోయారని, పెద్ద సంఖ్యలో జనం గాయాలపాలయ్యారని వార్తలొచ్చాయి. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న కరాకస్వాసులు పేలుళ్ల కారణంగా నిద్రలోనే కన్నుమూశారు. ఒక్కసారిగా బాంబులు పేలుతున్న శబ్దాలు, నేలమట్టమవుతున్న భవనాలతో జనం ప్రాణభయంతో పరుగులుతీశారు. సైనిక స్థావరాలు, పలు భవనాలు అగ్నికి ఆహుతవుతున్న, దట్టంగా పొగలు వెలువుడుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడుల ధాటికి ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి గాఢాందకారం అలుముకుంది. ‘‘అర్ధరాత్రి పుట్టినరోజు పార్టీకి వెళ్లి తిరిగొస్తూ బంధువులతో కలిసి రోడ్డుపై నడుస్తుంటే హఠాత్తుగా బాంబుల వర్షం కురిసింది. అవి పేలిన ధాటికి భూమి కూడా కంపించింది. ప్రతి ఒక్క వస్తువు కదిలిపోయింది. మిస్సైళ్లు, మంటలు, విమాన శబ్దాలతో మా ప్రాంతం ఒక్కసారిగా యుద్దభూమిగా మారిపోయింది’’అని 21 ఏళ్ల కార్మీకురాలు కార్మెన్ హిదాల్గో ఏడుస్తూ చెప్పారు. మాదకద్రవ్యాల రవాణా కట్టడికి, ద్వైపాక్షిక చర్చలుజరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని మదురో ప్రభుత్వం ప్రకటించిన కొద్ది గంటలకే అమెరికా దాడులు చేయడం గమనార్హం. సైనిక ఆపరేషన్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అమెరికా నుంచి వీక్షిస్తున్న ట్రంప్ యుద్ధనౌకలో తరలిస్తున్నాం: వెనెజువెలాపై సైనిక దాడి విష యాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా తన సొంత సా మాజిక మాధ్యమం ‘ట్రూత్ సోషల్’లో ప్రకటించారు. ‘‘వెనెజువెలాపై అమెరికా అతిపెద్ద దాడిని విజయవంతంగా పూర్తిచేసింది. వాళ్ల అధ్యక్షుడు మదురో, ఆయన సతీమణిని బంధించి వెనెజులా నుంచి దూరంగా వేరే దేశానికి మా ‘అయోమా జిమా’ యుద్ధ నౌకలో తరలిస్తున్నాం. నౌక న్యూయార్క్‌కు చేరుకోబోతోంది. వాళ్లను న్యూయార్క్ చట్టాల ప్రకారం శిక్షిస్తాం. దాడి సందర్భంగా అమెరికా సైనికులు సైతం గాయపడ్డారు. కానీ ఎవరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఒక హెలికాప్టర్ బాగా దెబ్బతింది. అయినాసరే మా సైనికులు అందరూ క్షేమంగా తిరిగొచ్చారు. దాడులు చేయక తప్పలేదు. ఎందుకంటే ఇది యుద్ధం’’ అని ట్రంప్ పెట్టిన పోస్ట్‌ను అమెరికా శ్వేతసౌధం తన ‘ఎక్స్’ ఖాతాలో జతచేసింది. ‘‘మదురోను అదుపులోకి తీసుకున్నాక వెనెజువెలాను అలా వదిలేయలేం. మదురో మాకు ముఖ్యం కాదు. ఆ దేశం నుంచి డ్రగ్స్ ఆగడమే మాకు కావాలి. డ్రగ్స్ ముఠాలను కట్టడిచేసే దమ్మున్న ప్రభుత్వం అక్కడ నెలకొనాలి. ఇంకెవరో అనామకుడు పరిపాలిస్తామంటూ ఊరుకునేది లేదు. అక్కడ ఎవరు పరిపాలించాలనేదే మేం నిర్ణయిస్తాం. దాడులపై అమెరికా కాంగ్రెస్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదన్న డెమొక్రాట్ల వాదనలో పసలేదు. డెమొక్రాట్లు అసమర్థులు, తెలివితక్కువ వాళ్లు. నిజానికి గొప్ప పని చేశావని నన్ను పొగడాలి. కానీ చట్టవ్యతిరేకమని తిడుతున్నారు. ఏళ్ల తరబడి ఇవే మాటలు వినీవినీ చెవుడు వచ్చేస్తోంది’’ అని తర్వాత ఫాక్స్‌న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఎగతాళిగా మాట్లాడారు. ఒక పరాయిదేశంపై దాడి చేసి ఏకంగా అగ్రనేతను అపహరిచడం అమెరికా చరిత్రలో గత 4 దశాబ్దాల్లో ఇదే తొలిసారి. చివరిసారిగా 36 ఏళ్ల క్రితం పనామా దేశ నాటి సైనిక పాలకుడు ఆంటోనియో నోరిగాను అమెరికా సైన్యం దాడిచేసి పట్టుకొచ్చింది. ‘‘మెక్సికో సైతం డ్రగ్స్ భరతం పడితే మంచిది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్బమ్ చేతులు ముడుచుకుని కూర్చుంటే మెక్సికో మీద సైనిక చర్యకు అమెరికా రంగంలోకి దిగక తప్పదేమో’’అని ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. మదురో దంపతుల జాడ తెలీదు..: అమెరికా వైమానిక దాడుల తర్వాత మదురో దంపతుల జాడ తెలియకుండా పోయిందని వెనెజువెలా ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్ శనివారం ఉదయం ప్రకటించారు. ‘‘శత్రుదేశం దాడుల తర్వాత మదురో, ఫ్లోరెస్ల జాడ తెలియడం లేదు. వాళ్ల క్షేమ సమాచారం అందుబాటులో లేదు. వాళ్ల యోగక్షేమాల వివరాలను అమెరికా తక్షణం బయటపెట్టాలి. దేశంపై దాడుల నేపథ్యంలో సాయుధ బలగాలన్నింటినీ రంగంలోకి దింపుతున్నాం. సైనిక చర్యకు దీటుగా స్పందిస్తాం. ప్రజలు సైతం దేశాధ్యక్షుడి కిడ్నాప్‌ను నిరసిస్తూ వీధుల్లోకి వచ్చి నిరసన తెలపాలి’’ అని రోడ్రెజ్ పిలుపునిచ్చారు. అత్యయిక విదేశీ విధ్వంసక స్థితిని రోడ్రెజ్ ప్రకటించారు.పడక గది నుంచి బరబరా లాక్కెళ్లి..వాషింగ్టన్: కరాకస్‌లోని కట్టుదిట్టమైన భద్రత ఉన్న సైనికస్థావరంలోని ఇంట్లో అర్ధరాత్రి పడగదిలో నిద్రిస్తున్న మదురో దంపతులను అమెరికా సైనికులు మెరుపువేగంతో బంధించి హెలికాప్టర్లోకి ఎక్కించి అక్కడి నుంచి యుద్ధనౌకలోకి తరలించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ వీకెండ్ కార్యక్రమంలో ట్రంప్ ఈ వివరాలను వెల్లడించారు. ‘‘ అమెరికా సైన్యంలోని డెల్టా ఫోర్స్ విభాగం నేతృత్వంలో ఈ ఆపరేషన్ మొత్తం జరిగింది. అధ్యక్ష ప్రాసాదాన్ని సైనికబలగాలతో శత్రుదుర్బేధ్య కోటలా మార్చేశారు. అలాంటి చోట కూడా మా బలగాలు అద్భుతంగా అరగంటలో పని ముగించాయి’’ అని అన్నారు. ఆపరేషన్ పూర్తి వివరాలనుఅమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డ్యాన్ కెయిన్ వెల్లడించారు. ‘‘ ఈ ఆపరేషన్‌కు అబ్సల్యూట్ రిసాల్వ్ అని పేరుపెట్టాం. ఏదైనా తేడా జరిగి భారీ ప్రతిదాడి చేయాల్సి వస్తే స్పందించేందుకు వీలుగా పశ్చిమార్థగోళంలో ఎఫ్–18, ఎఫ్–22, ఎఫ్–35 యుద్ధ విమానాలు సహా బీ–1 బాంబర్లు, డ్రోన్లను మొహరించాం. ట్రంప్ ఆదేశించగానే శుక్రవారం రాత్రి 10.46 గంటలకు ఆపరేషన్ మొదలెట్టాం. అర్ధరాత్రి దాటాక సరిగ్గా 1.01 గంటలకు మదురో ఉంటున్న అధికారభవనం ప్రాంగణంలోకి అమెరికా డెల్టా ఫోర్స్ సైనికులు అడుగుపెట్టారు. మెరికల్లాంటి సైనికులు ఇందులో పాల్గొన్నారు. సరైన సమయం కోసం వేచి ఉండి తర్వాత మదురో ఇంట్లోకి చొరబడి బెడ్రూమ్లో ఉన్న దంపతులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈలోపే వెనెజులా సైనికులు మాపైదాడి చేశారు. మా హెలికాప్టర్ ఒకటి దారుణంగా దెబ్బతింది. అయినాసరే వేగంగా స్పందించి వాళ్ల సైనికులను నిలువరించాం. 3.29 గంటలకు మా హెలికాప్టర్లోకి మదురో దంపతులను ఎక్కించాం. వెంటనే హెలికాప్టర్ యుద్దనౌక వైపు మెరుపువేగంతో వెళ్లిపోయింది. అంతా అనుకున్నట్లే జరిగింది. చాలాకాలం క్రితమే ఇందుకు ప్లాన్ చేశాం. మళ్లీ మళ్లీ రిహార్సల్స్ చేశాం. చివరకు విజయం సాధించాం’’ అని ఆయన అన్నారు. ఆలోపే పట్టేసుకున్నాం: ‘‘మదురో అధికార భవనంలో ఒక సురక్షిత గదిని ఏర్పాటు చేసుకున్నారు. అందులోకి వెళ్తే పట్టుకోవడం అసాధ్యం. అది అత్యంత కఠినమైన ఉక్కు గోడలతో తయారుచేసి ఉంటుంది. అందులోకి ఆయన వెళ్లేలోపే పట్టేసుకున్నాం. అతను రోజూ ఏం చేస్తాడు? ఎన్ని గంటలకు నిద్రపోతాడు? ఏం తింటారు? ఆయనకు పెంపుడు జంతువులు ఏమేం ఉన్నాయి? ఆయన ఎలాంటి బట్టలేసుకుంటాడు? ఇలా ప్రతీది మాకు తెలుసు’’అని ట్రంప్ చెప్పారు. -
నొరిగా.. సద్దాం.. ఇప్పుడు మదురో
నచ్చని దేశాలను నయానో భయానో లొంగదీసుకోవడం, మాట వినకపోతే ఆయా దేశాల అధినేతలను శిక్షించడం అమెరికాకు పరిపాటిగా మారింది. పనామా సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగా, ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్‌ను శిక్షించింది. ఇప్పుడు వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను లక్ష్యంగా చేసుకుంది. ఆయన భవిష్యత్తు ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. 1989లో అమెరికా సైన్యం టాటిన్ అమెరికా దేశమైన పనామాపై దండయాత్ర సాగించింది. అప్పటి సైనిక పాలకుడు మాన్యేల్ నొరిగాను గద్దె దించింది. అవినీతి, మాదక ద్రవ్యాలు, ప్రజాస్వామిక విధానాల నుంచి పనామాలోని తమ పౌరులను రక్షించడానికే ఈ చర్య తీసుకున్నామని అమెరికా సమర్థించుకుంది. 1988లో మియామీలో నొరిగా డ్రగ్స్ స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించింది. మరోవైపు పనామాలో అమెరికా వ్యతిరేక ఉద్యమాలకు నొరిగా మద్దతిచ్చారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఆయనపై నేరారోపణలు నమోదు చేసింది. అరెస్టు చేసి, జైలులో నిర్బంధించింది. 2010 దాకా నొరిగా జైలులోనే ఉన్నారు. మరో కేసులో విచారణ కోసం ఫ్రాన్స్‌కు తరలించింది. ఏడాది తర్వాత మళ్లీ పనామాకు తీసుకొచ్చింది. నొరీగా తన నేరాలకు శిక్ష అనుభవిస్తూ 2017లో జైలులోనే మరణించారని అమెరికా ప్రకటించింది. మరోవైపు అమెరికా కుట్రకు ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ ప్రాణాలు బలి కావాల్సి వచ్చింది. ఇరాన్ వద్ద సామూహిక జన హనన ఆయుధాలున్నాయంటూ అమెరికా సర్కారు కన్నెర్ర చేసింది. 2003లో ఇరాక్‌పై యుద్ధం ఆరంభించింది. అదే సంవత్సరం డిసెంబర్ 13న అమెరికా సేనలు సద్దాం హుస్సేన్‌ను బంధించాయి. నిజానికి ఇరాక్‌లో ఎలాంటి సామూహిక జన హనన ఆయుధాలు లభించలేదు. అయినప్పటికీ సద్దాం హుస్సేన్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇరాక్ కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. 2006 డిసెంబర్ 30న సద్దాం హుస్సేన్‌కు ఉరిశిక్ష అమలు చేశారు. గిట్టని వారిని గద్దె దించి, శిక్షించడం అమెరికాకు కుట్రల్లో ఒక భాగంగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నికోలస్ మదురోకు జైలుశిక్ష విధిస్తారా? లేక మరణశిక్ష విధిస్తారా? ఆయన గతి ఏమిటన్నది వేచి చూడాల్సిందే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డ్రైవర్ నుంచి అధ్యక్ష పీఠం దాకా
అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్‌గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం... నికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్‌లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు. మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు. 1998లో చావెజ్‌తో పాటు తానూ జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తర్వాత అసెంబ్లీ అధ్యక్షుడయ్యారు. చావెజ్ అధ్యక్షుడయ్యాక ఆయన కేబినెట్లో విదేశాంగ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రపంచమంతా కలియదిరిగి అంతర్జాతీయంగా వెనెజువెలాకు మద్దతు పెంచడంలో మదురో కీలకపాత్ర పోషించారు. అమెరికా కర్రపెత్తనాన్ని, ఆంక్షలను ఎదుర్కొనేందుకు లాటిన్ అమెరికా–కరీబియన్ కూటమి ఏర్పాటు చేశారు. ఈ దశలోనే చావెజ్‌కు అత్యంత నమ్మకస్తునిగా మారారు. ఫలితంగా 2012లో వెనెజువెలా ఉపాధ్యక్షుడయ్యారు. మదురోను తన రాజకీయ వారసునిగా చావెజ్ ప్రకటించారు. 2013లో అనారోగ్యంతో చావెజ్ మరణించడంతో మదురో తొలుత తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో గెలుపొంది అధ్యక్ష పీఠాన్ని పదిలపరుచుకున్నారు. నాటినుంచి పాలకునిగా కొనసాగుతూనే ఉన్నారు. అయితే ఆ క్రమంలో ప్రతి ఎన్నికల్లోనూ విపరీతమైన అక్రమాలకు పాల్పడ్డారన్న అపకీర్తి మూటగట్టుకున్నారు. 2013 నాటి తొలి ఎన్నికల నుంచే ఆయనపై ఈ ఆరోపణలున్నాయి. చివరకు ఇలా నేలకు! చావెజ్ మరణానంతరం అధ్యక్షుడు కాగలిగినా పరిస్థితులన్నీ క్రమంగా మదురోకు ప్రతికూలించసాగాయి. అసలు ఆయన అధ్యక్ష జీవితమంతా వివాదాలు, సమస్యలమయంగానే సాగింది. ముఖ్యంగా వెనెజువెలా ఆర్థిక పతనం ఆయనకు పెద్ద సవాలుగా మారింది. అమెరికా ఆంక్షలకు తోడు అంతర్జాతీయ చమురు ధరలు పతనం కావడంతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడింది. ఆర్థిక సంస్కరణలు, భారీగా నోట్ల ప్రింటింగ్ వంటివి మరిన్ని సమస్యలకే దారితీశాయి. ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. తిండి గింజలు కూడా లేక జనం అలమటించారు. దాంతో లక్షలాదిగా పొట్ట చేతపట్టుకుని పొరుగు లాటిన్ అమెరికా దేశాలకు వలసపోయారు. ఈ క్రమంలో 2014, 2017ల్లో వెనెజువెలా చరిత్రలోనే అతి పెద్ద ఆందోళనలు, నిరసనలు, ప్రదర్శనలు జరిగాయి. వాటన్నింటినీ ఉక్కుపాదంతో అణచేసి మదురో మరింత అప్రతిష్ట మూటగట్టుకున్నారు. నిరసనలన్న మాటే విని్పంచకుండా లక్షలాది మందిని జైళ్లలో కుక్కేశారు. రాజకీయ ప్రత్యర్థులను తీవ్రాతి తీవ్రంగా హింసించారు. మానవ హక్కుల హననానికి దేశాన్ని మారుపేరుగా మార్చేశారు. ఇవన్నీ చాలవన్నట్టు 2020లో అమెరికా మదురోను అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి్చంది. ఇన్ని ప్రతికూలతల మధ్యే 2024 ఎన్నికల్లో కిందామీదా పడి వరుసగా మూడోసారి అధ్యక్షునిగా ఎన్నికయ్యారాయన. కానీ ఆ క్రమంలో కనీవినీ ఎరగని అక్రమాలకు పాల్పడి అభాసుపాలయ్యారు. ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు చాలాచోట్ల ఏకంగా 85 శాతం కంటే ఎక్కువ ఓట్లు పోలైనట్టు తేలినా మదురో మాత్రం తానే గెలిచానని ప్రకటించుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేటాడే ప్రయత్నం చేశారు. దాంతో గొంజాలెజ్‌తో పాటు జనాదరణ ఉన్న విపక్ష నేత మరియా కొరీనా మచాడో వంటివారు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. 2018లో సైనిక పరేడ్‌లో ప్రసంగిస్తుండగా డ్రోన్ల సాయంతో జరిగిన హత్యాయత్నం నుంచి త్రుటిలో బయటపడ్డారు. చివరికి ఓ పెద్ద దేశాధ్యక్షుడెవరూ ఇప్పటిదాకా ఎదుర్కోని దయనీయ పరిస్థితుల్లో అమెరికా సైన్యానికి భార్యాసమేతంగా పట్టుబడి నిస్సహాయునిగా దేశం వీడారు.భర్తకు చేదోడువాదోడుగా... రాజకీయాల్లో ఫ్లోరెస్ ఉత్థాన పతనాలు కరాకస్: సిలియా ఫ్లోరెస్. అప్రతిష్టాకర రీతిలో అమెరికాకు పట్టుబడ్డ వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో భార్య. రాజకీయాల్లో భర్త అడుగుజాడల్లోనే నడిచారామె. మదురో మాదిరిగానే ఆమెదీ అతి సాధారణ నేపథ్యమే. వాయవ్య వెనెజువెలాలో టినాక్విలో అనే చిన్న పట్టణంలో 1956లో ఒక పేద కుటుంబంలో పుట్టారు ఫ్లోరెస్. జరుగుబాటు కోసం ఆమె కుటుంబం కరాకస్‌కు మారింది. అక్కడే ఆమె న్యాయ పట్టా పుచ్చుకున్నారు. పోలీస్ స్టేషన్లో పార్ట్‌టైం జాబ్ చేసే క్రమంలో ఓ డిటెక్టివ్‌ను పెళ్లాడి ముగ్గురు పిల్లల్ని కన్నారు. మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ వ్యక్తిగత లాయర్‌గా మారడం ఆమె జీవితంలో కీలక మలుపు. అక్కడినుంచీ రాజకీయంగా క్రమంగా ఒక్కో మెట్టూ ఎక్కారు. 2000లో తొలిసారి నేషనల్ అసెంబ్లీకి ఎన్నికైన ఫ్లోరెస్, 2007కల్లా దాని ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారు. ఆ క్రమంలో మదురోతో జరిగిన పరిచయం కాస్తా ప్రణయంగా మారింది. రెండు దశాబ్దాల సన్నిహిత జీవితం అనంతరం 2013లో ఇద్దరూ తమ జీవిత భాగస్వాములకు విడాకులిచ్చి ఒకటయ్యారు. మదురో అధ్యక్షుడయ్యాక ఆయన నిర్ణయాలన్నింట్లోనూ ఫ్లోరెస్ కీలకపాత్ర పోషిస్తూ వస్తున్నారు. నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ చీఫ్‌గా బలమైన అధికార కేంద్రంగా వ్యవహరించారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
పంతం నెగ్గించుకున్న ట్రంప్
ఒక అగ్రరాజ్యపు దురాశ. సొంత పాలకుల నియంతృత్వ, పెడపోకడలు. ఫలితంగా దశాబ్దాలుగా నలిగిపోతూ సాగుతున్న వెనెజువెలా ప్రస్థానం కాస్తా, ఏకంగా అధ్యక్షుడు మదురోను అమెరికా అదుపులోకి తీసుకోవడంతో తాజాగా మరో మలుపు తిరిగింది. అత్యాశ, అధికార లాలస నడుమ జరిగిన ఆరాట పోరాటాల్లో అక్కడి ప్రజల స్వేచ్ఛాకాంక్షలు మరోసారి సమాధయ్యాయి. ట్రంప్ విపరీత మనస్తత్వం దృష్ట్యా ఇకపై వెనెజువెలా భవితవ్యం ఎలా ఉండనుందన్నది ఎవరి అంచనాలకూ అందని పరిస్థితి... ఆది నుంచీ అంతంతే... అమెరికాతో వెనెజువెలా సంబంధాలు ముందునుంచీ ఉప్పూ నిప్పుగానే సాగుతూ వస్తున్నాయి. వెనెజువెలాలోని అపార చమురు నిల్వలపై అమెరికాకు తొలి నుంచీ కన్నుంది. అగ్రరాజ్యపు చమురు దోపిడీని 1999లో వెనెజువెలా అధ్యక్షుడైన హ్యూగో చావెజ్ అడ్డుకోవడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బీటలువారాయి. నాటినుంచీ పరిస్థితి క్రమంగా దిగజారుతూనే వస్తోంది. వెనెజువెలాపై అమెరికా ఎడాపెడా ఆంక్షలు విధిస్తూ, వాటిని నానాటికీ పెంచేస్తూ వస్తోంది. తొలుత చావెజ్, ఆ తర్వాత తాజాగా పదవీచ్యుతుడైన నికొలస్ మదురో ఇద్దరూ నియంతృత్వ పోకడలతోనే పాలించారు. దాంతో పాతికేళ్లకు పైగా దేశం తిరోగమన బాటలోనే సాగుతూ వస్తోంది. అమెరికాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న డ్రగ్ కార్టెల్స్ మూలాలన్నీ వెనెజువెలాలోనే ఉన్నాయన్నది ట్రంప్ ఆరోపణ. ఇది చాలదన్నట్టు వెనెజువెలా నుంచి తమ దేశంలోకి జనం విపరీతంగా వలస వచ్చిపడుతున్నారంటూ కొంతకాలంగా ఆయన మండిపడుతున్నారు. డ్రగ్స్ మోసుకెళ్తున్నాయనే సాకుతో కొన్నాళ్లుగా వెనెజువెలా చమురు నౌకలను అడ్డుకుంటూ, పేల్చేస్తూ వస్తున్న అమెరికా చివరికి తాజాగా అధ్యక్షుడే లక్ష్యంగా సైనిక చర్యకే దిగి భార్యాసమేతంగా నిర్బంధంలోకి తీసుకుంది. వ్యతిరేకులతో దోస్తీ! వెనెజువెలా విషయంలో అమెరికా దూకుడును అడ్డుకోవడానికి ఆ దేశాధ్యక్షులు అన్నిరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు. చావెజ్ తన హయాంలో యూఎస్ వ్యతిరేక శక్తులైన రష్యా, ఇరాన్, క్యూబా వంటి దేశాలతో చెలిమి చేశారు. మిగతా విషయాలు ఎలా ఉన్నా దేశ ఆర్థిక పరిస్థితి మాత్రం దిగజారకుండా చూసుకోగలిగారు. అలా తనపై జనాగ్రహం ప్రబలకుండా జాగ్రత్త పడ్డారు. చమురు విక్రయాలతో వచ్చే మొత్తాలతో దేశంలో పేదరికాన్ని చాలావరకు తగ్గించారు. కానీ మదురోలో ఆ ముందుచూపు లోపించిందంటారు పరిశీలకులు. ఆయన హయాంలో దేశంలో అన్ని రంగాల్లోనూ పరిస్థితి క్రమంగా దిగజారుతూ వచ్చింది. ఇటు ద్రవ్యోల్బణం చుక్కలనంటింది. అటు ట్రంప్ రాకతో అమెరికా దూకుడు పెరిగింది. దాంతో రాజకీయంగానే గాక ఆర్థికంగానూ వెనెజువెలా పరిస్థితి దయనీయంగా మారింది. ఒక దశలో దేశంలో ఆహార నిల్వలు దాదాపుగా నిండుకున్నాయి. దాంతో బతుకుదెరువు కోసం జనం భారీగా దేశం వీడటం పరిపాటిగా మారింది. గత పదేళ్లలో కోటిమందికి పైగా విదేశాల బాట పట్టినట్టు అంచనా. విచ్చలవిడిగా పెరిగిపోయిన అధికారుల అవినీతిని అదుపు చేయడం మదురో తరం కాలేదు. దీనికితోడు వెనెజువెలా చమురు అమ్మకాలన్నింటినీ అమెరికా దాదాపుగా అడ్డుకుంది. దాంతో ప్రధాన ఆదాయ వనరు మూసుకుపోయి మదురో సమస్యలు రెట్టింపయ్యాయి. కొంతకాలంగా చైనా వంటి దేశాలకు కారుచౌకగా చమురు విక్రయించుకుంటూ నెట్టుకొస్తున్న పరిస్థితి. అంతర్గత సమస్యలు ఇలా చేయి దాటుతుండగానే ట్రంప్ ఒక్కసారిగా రూటు మార్చి వెనెజువెలాపై గత సెప్టెంబర్ నుంచే సైనిక చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనెజువెలా గగనతలాన్ని మూసేస్తున్నట్టు గత నవంబర్‌లో ప్రకటించారు. వెనెజువెలా చుట్టూ సైన్యం మోహరింపులను పెంచేశారు. చివరికి మదురోను క్రిమినల్‌గా పేర్కొనడమే గాక, ఆయన్ను పట్టిస్తే ఏకంగా 5 కోట్ల డాలర్ల నజరానా ప్రకటించారు. మచాడో ఫ్యాక్టర్! మదురో దంపతులను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకుందన్న వార్తలపై వెనెజువెలాలో ఆగ్రహావేశాలు దేవుడెరుగు, పెద్దగా వ్యతిరేకత కూడా వ్యక్తం కావడం లేదు. ఇది మదురో స్వయంకృతమే అయినా, ఆయన పట్ల జనంలో నెలకొన్న వ్యతిరేకతను ఆగ్రహావేశాలుగా మార్చడంలో వెనెజువెలా విపక్ష నేత మరియా కొరినా మచాడో పాత్ర కీలకమే. మదురో హయాంలో దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన కనీవినీ ఎరగని రీతిలో జరిగింది. దీనిపై అంతర్జాతీయ సంస్థలన్నీ గగ్గోలు పెట్టే పరిస్థితి. మదురోకు వ్యతిరేకంగా గళమెత్తిన వారంతా రాత్రికి రాత్రే మాయం కావడం, తీవ్ర నిర్బంధానికి గురవడం షరామామూలుగా మారింది. అలాంటి సమయంలో తెరపైకి వచ్చిన మచాడో ప్రజా గళంగా మారారు. మదురో నియంతృత్వ పోకడలపై ఏళ్లుగా మడమ తిప్పని పోరాటం చేస్తున్నారు. ప్రజల సొత్తయిన అపార వనరులన్నింటినీ మదురో, ఆయన అనుయాయులు అయినకాడికి దోచుకుంటున్నారంటూ ఆమె చేసిన ఉద్రేకపూరిత ప్రసంగాలకు ప్రజల్లో గొప్ప స్పందన వచ్చింది. చూస్తుండగానే మచాడోకు ఆదరణ విపరీతంగా పెరిగిపోయింది. 2024లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఆమె విజయం ఖాయమనే దాకా వెళ్లింది. ఈ ముప్పును ముందే పసిగట్టిన మదురో, మచాడోపై హాస్యాస్పదమైన అవినీతి, దాంతోపాటు దేశద్రోహం తదితర ఆరోపణలు మోపారు. చివరికి ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా అనర్హత వేటు వేయించారు. ఎన్నికల్లో భారీ రిగ్గింగ్ తదితరాల సాయంతో తిరిగి ఎన్నికయ్యారు. అవి అత్యంత ఏకపక్ష ఎన్నికలంటూ అంతర్జాతీయంగా విమర్శలు రేగినా పట్టించుకోలేదు. మచాడోపై పలుమార్లు హత్యాయత్నాలూ జరిగాయి. దాంతో ప్రాణరక్షణ కోసం ఆమె అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ ఏడాది తనకు ప్రకటించిన నోబెల్ శాంతి బహుమానం అందుకునేందుకు మారువేషంలో నార్వే వెళ్లే ప్రయత్నంలో మచాడో పడవ ప్రమాదానికి గురై గాయపడ్డారు. అమెరికా దన్ను మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్‌కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వెనెజువెలా అధ్యక్షుడిని నిర్ణయించేది మేమే: ట్రంప్
కరాకస్: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి పేరిట అమెరికా వెనెజువెలాపై వైమానిక దాడులతో విరుచుకు పడింది. వెనెజువెలా రాజధాని కరాకస్‌తో సహా నాలుగు నగరాలను అమెరికా శనివారం రాత్రి లక్ష్యంగా చేసుకుంది. వీటిలో కరాకస్‌తో పాటు మిరాండా, అరగ్వా,లా గ్వైరా రాష్ట్రాల్లోని సైనిక స్థావరాలపై అమెరికా ఏడు వైమానిక దాడులు చేసింది. ఫలితంగా వెనెజువెలాలో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ట్రంప్ ఆదేశాల మేరకు దాడులు చేస్తున్నట్లు అమెరికా సైన్యం అధికారిక ప్రకటన చేసింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొలి దాడి జరిగింది. అమెరికా మీడియా సీబీఎస్ న్యూస్ ప్రకారం, వెనెజువెలా లోపల సైనిక స్థావరాలు, అనేక నిర్దిష్ట ప్రదేశాలపై దాడికి ట్రంప్ ఆదేశించారు. ఈ దాడికి సంబంధించిన వైరల్ వీడియోలో సుమారు పదుల సంఖ్యలో హెలికాప్టర్లు చక్కెర్లు కొట్టాయి. -
వెనెజులా చమురు ట్యాంకర్‌ను అడ్డుకున్న అమెరికా
వాషింగ్టన్: వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మడురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిని మరింతగా పెంచుతున్నారు. వెనెజులాకు చెందిన చమురు ట్యాంకర్‌ను శనివారం ఆ దేశ తీరానికి సమీపంలోనే అమెరికా బలగాలు అడ్డుకున్నాయి. రెండు వారాల వ్యవధిలో ఇలా అడ్డగించడం ఇది రెండోసారి. ఆంక్షలు విధించిన ఆయిల్ ట్యాంకర్లను దిగ్బంధిస్తామంటూ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఈ నెల 10న అమెరికా బలగాలు మొదటిసారిగా ఓ ట్యాంకర్‌ను నిలువరించాయి. తాజా చర్యను హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్ ధ్రువీకరించారు. సెంచరీస్ అనే పేరున్న ట్యాంకర్‌పైకి అమెరికా బలగాలు హెలికాప్టర్ ద్వారా దిగుతున్న వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నార్కో టెర్రరిజానికి ఊతమిచ్చే ఆయిల్ రవాణాను అమెరికా అడ్డుకుంటుందని ఆమె తెలిపారు. పనామాకు చెందిన ముడిచమురు ట్యాంకర్ సెంచరీస్ ఇటీవల వెనెజులా తీరంలో కనిపించినట్లు మెరైన్ ట్రాఫిక్ అనే సంస్థ తెలిపింది. అయితే, సెంచరీస్ ట్యాంకర్ అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్నదీ లేనిదీ వెల్లడించలేదు. ఈ పరిణామంపై రక్షణ శాఖ గానీ, వైట్‌హౌస్ అధికారులు గానీ స్పందించలేదు. అయితే, అమెరికా చర్యలను నేరపూరితంగా వెనెజులా అభివర్ణించింది. ‘ఈ అంశాన్ని భద్రతా మండలి దృష్టికి తీసుకెళతాం. అమెరికాను వదిలేది లేదు, చట్టపరంగా ఎదుర్కొంటాం’అని స్పష్టం చేసింది. -
గగనతలం మూసివేత.. అసలు ఆ హక్కు ఎవరిది?
వెనిజులా అమెరికా మధ్య ఉద్రిక్తతల్లో కీలక పరిణామం ఒకటి చోటు చేసుకుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోతో ఫోన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడాడని.. అది హాట్‌హాట్‌గా సాగిందని.. పరిస్థితి మరింత తీవ్రతరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఈ తరుణంలో.. గగనతలం మూసివేత అనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది.. వెనిజులా గగనతలం మూసివేయమని ట్రంప్ ప్రకటించారు. అయితే దీనిని వెనిజులా తీవ్రంగా ఖండించింది. ఇది చెల్లదని.. ట్రంప్ ప్రకటన తమ దేశ సార్వభౌమాధికారంపై దాడేనని అభివర్ణించింది. అసలు గగనతలంపై నిషేధం విధించే అధికారం ఎవరికి ఉంటుంది?.. ఎవరు ఎవరిపై విధిస్తారు? దానికంటూ ఏమైనా ప్రత్యేక మార్గదర్శకాలు ఉన్నాయా? .. ఈ నిర్ణయంతో కలిగే నష్టాలేంటి?.. పరిశీలిస్తే.. గగనతలం మూసివేత అంటే.. ఒక దేశం తన భూభాగం పై ఉన్న ఆకాశాన్ని (airspace) ఇతర దేశాల విమానాలకు పూర్తిగా లేదంటే కొంతవరకు నిషేధించడం. అది పరిస్థితులను బట్టి ఆ దేశం తీసుకుంటుంది. ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, రాజకీయ నిరసనల కారణంగా గగనతలాన్ని మూసేసుకోవచ్చు. అప్పుడు ఆ దేశం మీదుగా ఇతర దేశాలకు సంబంధించిన విమానాలేవీ ప్రయాణించకూడదు. కానీ, ట్రంప్ అందుకు భిన్నంగా ఇతర దేశాన్ని(వెనిజులా) ఎయిర్‌స్పేస్‌ని మూసేయాలని ఆదేశించారు. ఒక దేశం మరొక దేశం గగనతలాన్ని మూసివేయమని చెప్పే హక్కు లేదు. దీంతో ఇది చెల్లదని.. కేవలం రాజకీయ ఉద్రిక్తతల్లో భాగమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ ఎందుకు ప్రకటించారుట్రంప్ గగనతలం మూసివేతకు చూపిస్తున్న కారణాలు అనేకం ఉన్నాయి. వెనిజులా గగనతలం ద్వారా నార్కో-టెర్రరిస్ట్ గ్రూపులు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారాయన. డ్రగ్ ట్రాఫికింగ్‌తో పాటు మానవ అక్రమ రవాణా అరికట్టడం కోసమేనని చెబుతున్నారు. వెనిజులా గగనతలాన్ని పూర్తిగా మూసివేయాలని ఎయిరలైన్స్, పైలట్స్, డ్రగ్ డీలర్స్, హ్యూమన్ ట్రాఫికర్స్కు హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా కరేబియన్ ప్రాంతంలో భారీ సైనిక దళాలను (ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ సహా) మోహరింపజేశారు.రూల్స్ ఇవిగో.. ప్రతి దేశానికి తన ఆకాశంపై సార్వభౌమాధికార హక్కు ఉంటుంది. చికాగో కన్వెన్షన్ (1944) అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ICAO) ఆధారంగా రూపొందిన ఒప్పందం ఈ విషయంలో ప్రస్తుతానికి అమల్లో ఉంటోంది. ఇందులో భాగంగా.. ఆర్టికల్ 1: ప్రతి దేశానికి తన భూభాగం పై గగనతలంపై పూర్తి సార్వభౌమాధికార హక్కు ఉంటుంది.ఆర్టికల్ 9: ఒక దేశం భద్రతా కారణాలు, యుద్ధ పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు ఉన్నప్పుడు గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేయవచ్చు.ఆర్టికల్ 89: యుద్ధం లేదా జాతీయ అత్యవసర పరిస్థితుల్లో, దేశాలు ICAO నిబంధనలను పక్కన పెట్టి తమ గగనతలాన్ని నియంత్రించవచ్చు.గతంలో.. తమ జాతీయ భద్రతా కారణాల వల్ల గగనతలాన్ని మూసివేయడం సమర్థిస్తాయి. పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో తరచూ ఇది చూసిందే. అలాగే.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ సమయంలో యూరప్ దేశాలు రష్యా విమానాలకు గగనతలాన్ని మూసివేశాయి. మొన్నీమద్యే ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్-పాక్ నడుమ కూడా ఎయిరోస్పేస్ మూసివేత కనిపించింది. అయితే.. గగనతలం మూసివేతను తాత్కాలిక, అవసరమైన చర్యగా మాత్రమే ఐక్యరాజ్య సమితి లాంటి అంతర్జాతీయ సంస్థలు సమర్థిస్తాయి. విమర్శకులు మాత్రం దీన్ని రాజకీయ ఒత్తిడి సాధనంగా ఉపయోగించడం అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని అంటుంటారు.ప్రభావం.. తమ గగన తలం నుంచి విమానాలు ప్రయాణించకూడదని ఒక దేశం ఆంక్షలు విధించడం లాంటిదే ఈ నిర్ణయం. దీంతో అంతర్జాతీయ విమానాలు ఆ దేశం మీదుగా ప్రయాణించడానికి వీలుండదు. అవి మార్గం మార్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణాలకు సమయం.. ఇంధన ఖర్చు పెరుగుతాయి. ఫ్లైట్ షెడ్యూల్స్ ఆలస్యం అవుతాయి. అంతర్జాతీయ కనెక్టివిటీలో అంతరాయంతో ప్రయాణికులు ఇబ్బంది పడొచ్చు. అలాగే.. ఆర్థిక నష్టాలకూ అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వాణిజ్యం, పర్యాటకం దెబ్బతింటాయి.ఎయిర్‌లైన్స్ ఆదాయం తగ్గుతుంది. కొన్నిసార్లు ఇది యుద్ధ ముప్పుగా కూడా మారొచ్చు. గగనతలం మూసివేత అనేది ఒక దేశం తన సార్వభౌమాధికారాన్ని వినియోగించే చర్య. ఇందుకు చికాగో కన్వెన్షన్ రూల్స్ ఉన్నాయి. కానీ అమెరికా–వెనిజులా ఉద్రిక్తతల్లో ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధం. అధికారిక ICAO రూల్స్ ప్రకారం చెల్లుబాటు కాదు. దీని వల్ల విమానయాన రంగం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితం అన్నీ ప్రభావితం అవుతాయనే అందోళన వ్యక్తమవుతోంది. -
పడవలో తెగిపడిన తలలు యుద్ధం ఆరంభం
-
‘మదురో అరెస్టు’ బహుమతి రెట్టింపు
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.438 కోట్లు బహుమానంగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. మదురోను ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్‌గా అభివర్ణించింది. గతంలో రూ.250 కోట్లుగా ఉన్న బహుమతిని మళ్లీ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రకటించారు. మదురోకి డ్రగ్స్ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు. మదురో, అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్‌ను డ్రగ్ ఎన్పోర్స్మెంట్ అడ్మిని్రస్టేషన్ (డీఈఏ) స్వా«దీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవని అన్నారు. ఈ ఆరోపణలను వెనిజులా విదేశంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా అభివరి్ణంచారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎపిస్టీన్ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే బోండీ ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు. మొదటి పదవీకాలం నుంచే.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మదురోపై చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. తన తొలి పదవీకాలంలోనే మదురో, పలువురు ఉన్నతాధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ‘ఫార్క్’తో కలిసి కొకైన్‌ను అమెరికాకు పంపేందుకు ప్రయతి్నంచారని ఆరోపించారు. ఆ సమయంలో మదురో అరెస్టుకు రూ.150 కోట్ల బహుమతిని ప్రకటించారు. బైడెన్ పాలనలో ఆ మొత్తాన్ని 250 కోట్లకు పెంచింది. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌పై విజయం సాధించారు. మూడోసారి అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు. బస్సు డ్రైవర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో వివాదాస్పదంగా నిలిచారు. హ్యూగో చావెజ్ మరణం తరువాత 2013లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా వెనిజులాపై ఆంక్షలు విధించింది. మదురోను అధ్యక్షుడిగా తిరస్కరించింది. అమెరికాతోపాటు యురోపియన్ యూనియన్, యూకే కూడా వెనిజులా చర్యలను ఖండించాయి. తమ దేశంలో తవ్వకాలు జరిపేందుకు అమెరికా చమురు దిగ్గజం చెవ్రాన్ను అనుమతించడంతో వెనిజులాపై కొన్ని ఆంక్షలను సడలించింది. -
ఆయన అరెస్టుకు ఆధారాలిస్తే రూ.215 కోట్ల రివార్డు!
వెనిజులా అధ్యక్షునిగా నికోలస్ మదురో మూడవసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే వెనిజులా ఎన్నికల్లో ఆయన ఓడిపోయారనడానికి స్పష్టమైన ఆధారాలు లభించాయి. ఈ నేపధ్యంలో మదురోను అరెస్టు చేసేందుకు తగిన అధారాలు అందించినవారికి ఇచ్చే బహుమతి మొత్తాన్ని 25 మిలియన్ డాలర్లకు(సుమారు 215 కోట్ల రూపాయలు) పెంచినట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది.మదురోను వెనిజులాకు అధ్యక్షునిగా అమెరికా గుర్తించలేదు. 2024, జూలై జరిగిన ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో(Nicolás Maduro) ఎటువంటి ఆధారాలను సమర్పించలేదు. అయితే అతని ప్రత్యర్థి ఎడ్ముండో గొంజాలెజ్ అందుబాటులోవున్న ఓట్ల లెక్కింపు ఆధారాలను సమర్పించారు. ఇవి అతను అత్యధిక ఓట్లు గెలుచుకున్నారని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో గొంజాలెజ్.. వెనిజులా అధ్యక్షునిగా ఎన్నికయ్యారని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అలాగే మదురోను పదవి నుంచి తప్పుకోవాలని కోరింది.కాగా తాత్కాలిక రక్షిత హోదాతో యునైటెడ్ స్టేట్స్లో నివసిస్తున్న దాదాపు 600,000 మంది వెనిజులా వలసదారులకు మరింత రక్షణ కల్పిస్తున్నట్లు బైడెన్ పరిపాలనా విభాగం ప్రకటించింది. ఈ వలసదారులు అదనంగా మరో 18 నెలలు ఉండడానికి బైడెన్ హామీనిచ్చారు. జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ(John Kirby) మీడియాతో మాట్లాడుతూ మదురో అరెస్టుకు ఆధారాలు సమర్పించినవారికి బహుమతిని పెంచే నిర్ణయం వెనుక వెనిజులా ప్రజలకు సంఘీభావం అందించడమే ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ బహుమతిని పెంచడం ద్వారా మదురోతో పాటు అతని ప్రతినిధులపై ఒత్తిడిని కొనసాగించడానికి అంతర్జాతీయ ప్రయత్నాలను మరింత పెంచామన్నారు.కాగా వెనిజులా వలసదారులకు తాత్కాలిక రక్షిత హోదా పొడిగింపును వారికి మద్దతు ఇచ్చే ప్రయత్నంగా బైడెన్(Biden) పరిపాలన ప్రతినిధి అభివర్ణించారు. 2020లో మదురోపై అమెరికాలో పలు కేసులు నమోదయ్యాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న నార్కో-టెర్రరిజం, అంతర్జాతీయ కొకైన్ అక్రమ రవాణా కుట్రలో మదురో నిందితుడు. మదురో తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది నిమిషాలకే, అమెరికా ట్రెజరీ డిపార్ట్మెంట్ ఎనిమిది మంది వెనిజులా అధికారులపై పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించింది.ఇది కూడా చదవండి: అయోధ్యలో ఘనంగా ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు -
మదురో హత్యకు సీఐఏ కుట్ర!
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో హత్యకు అమెరికా నిఘా సంస్థ సీఐఏ కుట్ర పన్నిందా? అవునని వెనిజులా అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ఆరోపించారు. తమ దేశాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఒక యూఎస్ నేవీ సీల్ ఆఫీసర్‌తో సహా ఆరుగురు విదేశీయులను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. వారిలో అమెరికన్లు ఇద్దరు స్పెయిన్, ఒక చెక్ పౌరుడు ఉన్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా 400 అమెరికా రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఈ కుట్రలో సీఐఏతో పాటు స్పెయిన్ జాతీయ నిఘా విభాగం కూడా పాలుపంచుకుందని కాబెల్లో ఆరోపించారు. వీటిని అమెరికా విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. మదురోను గద్దె దించే కుట్రలో తమ ప్రమేయముందన్న వాదనలు పూర్తిగా అవాస్తవమని వైట్‌హౌస్ అధికార ప్రతినిధి ఒకరన్నారు. వెనిజులా రాజకీయ సంక్షోభానికి ప్రజాస్వామ్య పరిష్కారం కోసం అమెరికా మద్దతిస్తూనే ఉంటుందన్నారు. దీనిపై అదనపు సమాచారం కోరుతున్నట్లు తెలిపారు. తాము కూడా దీనిపై వెనిజులాను సమాచారం అడుగుతున్నట్లు స్పెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది. మదురో ఇటీవలే అధ్యక్ష ఎన్నికల్లో వివాదాస్పద రీతిలో గెలవడం తెలిసిందే. ఆ విజయాన్ని గుర్తించడానికి వెనిజులా ప్రతిపక్షంతో పాటు అమెరికా కూడా నిరాకరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. – కారాకస్ -
స్పెయిన్‌కు పరారైన... వెనిజులా విపక్ష నేత
వెనిజులాలో నికొలస్ మదురో నియంత పాలనకు ముగింపు ఖాయమని ఆశించిన ఆ దేశ ప్రజలకు మరింత నిరాశ కలిగించే పరిణామమిది. అధ్యక్ష ఎన్నికల్లో విపక్షాల సంయుక్త అభ్యరి్థగా మదురోతో తలపడ్డ ఎడ్మండో గొంజాలెజ్ తాజాగా దేశం వీడి స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. జూలైలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వాస్తవ విజేత గొంజాలెజేనని విపక్షాలతోపాటు పలు విదేశీ ప్రభుత్వాలు కూడా పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. గొంజాలెజ్‌కు ఆశ్రయం కలి్పంచేందుకు స్పెయిన్ అంగీకరించిందని వెనిజులా ఉపాధ్యక్షుడు డెల్సీ రొడ్రిగెజ్ ప్రకటించారు. దీనిపై గొంజాలెజ్ గానీ ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో గానీ స్పందించలేదు. ఎన్నికల్లో పోటీ చేయకుండా మచాడోపై మదురో ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో ఆఖరి దశలో గొంజాలెజ్ రంగంలోకి దిగడం తెలిసిందే. అయితే, వెనిజులా వీడాలన్నది గొంజాలెజ్ నిర్ణయం మాత్రమేనని, తాము పంపిన ఎయిర్‌ఫోర్స్ విమానంలో తమ దేశం చేరుకున్నారని స్పెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఆయన వినతి మేరకే ఆశ్రయం కలి్పంచామని స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయెల్ అల్బారెస్ చెప్పారు. ‘వెనిజులా ప్రజల హక్కుల కాపాడటానికి కట్టుబడి ఉన్నాం. గొంజాలెజ్ వెనిజులా హీరో. ఆయన భద్రత బాధ్యతను స్పెయిన్ తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. వెనిజులాకు రావడానికి కొద్ది రోజుల ముందే రాజధాని కారకాస్‌లోని తమ రాయబార కార్యాలయంలో గొంజాలెజ్ తలదాచుకున్నారని వెల్లడించారు. ఓటరు జాబితాను ఫోర్జరీ చేశారంటూ వచి్చన ఆరోపణలపై విచారణకు రావాలంటూ మూడు పర్యాయాలు సమన్లు పంపినా హాజరు కాలేదని దేశ అటార్నీ జనరల్ గొంజాలెజ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. దీంతో, ఆయన స్పెయిన్ రాయబార కార్యాలయంలో తలదాచుకోవాల్సి వచి్చంది. మడురో నిరంకుశ విధానాలతో ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలు స్పెయిన్‌లో ఆశ్రయం పొందారు. ఈ ఏడాదిలో మొదటి ఆరు నెలల్లోనే దాదాపు 45 వేల మంది వెనిజులా నుంచి స్పెయిన్‌కు వలస వెళ్లారు. 2022 గణాంకాల ప్రకారం వెనిజులా వాసులు కనీసం 2.12 లక్షల మంది స్పెయిన్‌లో ఉంటున్నారు. – కారకాస్ -
మదురో విమానం సీజ్
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో విమానాన్ని అమెరికా సీజ్ చేసింది. వెనిజులాపై అమెరికా విధించిన ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఈ విమానాన్ని సమకూర్చుకున్నారని, ఇతర క్రిమినల్ అభియోగాలతో మదురో విమానాన్ని డొమినికన్ రిపబ్లిక్లో అమెరికా స్వా«దీనం చేసుకుంది. దాన్ని సోమవారం ఫ్లోరిడాకు తరలించింది. వెనిజులా– అమెరికాల మధ్య చాలాఏళ్లుగా సంబంధాలు బెడిసికొట్టాయి. వెనిజులాపై ఆర్థిక ఆంక్షలే కాకుండా పలుఇతర ఆంక్షలను కూడా అమెరికా విధించింది. వెనిజులాలో బతుకు దుర్భరమై లక్షల మంది మెక్సికో– అమెరికా సరిహద్దు ద్వారా అగ్రరాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు. ఇటీవలి వివాదాస్పద అధ్యక్ష ఎన్నికల్లో మదురో విజయానికి సంబంధించి సందేహాలను వ్యక్తం చేస్తూ అమెరికా వెనిజులా నుంచి నిర్దిష్ట పోల్ డేటాను కోరింది. వెనిజులాకు చెందిన ఈ డసాల్డ్ ఫాల్కన్ 900 విమానం ఖరీదు రూ.109 కోట్లు. కొద్దినెలలుగా ఇది డొమినికన్ రిపబ్లిక్లో ఉందనే సమాచారంతో రంగంలోకి దిగిన అమెరికాకు చెందిన వివిధ ప్రభుత్వ ఏజెన్సీలు మదురో విమానాన్ని స్వా«దీనం చేసుకొని ఫ్లోరిడాకు తరలించాయి. అమెరికా దీన్ని జప్తు చేసుకొనేందుకు చర్యలు చేపట్టింది. -
Venezuela presidential election: వెనిజులాలో... మళ్లీ పాత కథే!
కారకాస్: వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో అంతా ఊహించిందే జరిగింది. అధ్యక్షుడు నికొలస్ మదురో వరుసగా మూడోసారి విజయం సాధించినట్టు ఆ దేశ ఎన్నికల సంఘం (సీఎన్ఈ) ప్రకటించింది. ఆదివారం జరిగిన దేశవ్యాప్త పోలింగ్ అనంతరం రాత్రి ఓట్ల లెక్కింపు చేపట్టారు. 80 శాతం ఓట్లను లెక్కించేసరికి మదురోకు విజయానికి అవసరమైన 51 శాతం ఓట్లు లభించినట్టు సీఎన్ఈ చీఫ్ ఎల్విస్ అమోరోసో అర్ధరాత్రి అనంతరం ప్రకటన విడుదల చేశారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌కు 44 శాతం ఓట్లొచ్చినట్టు వెల్లడించారు. దీనిపై విపక్షాలన్నీ తీవ్రంగా మండిపడ్డాయి. ఓట్ల లెక్కింపును ప్రహసనప్రాయంగా మార్చేసి ప్రజాస్వామ్యాన్ని మరోసారి మంటగలిపారని విపక్ష నేత మరియా కొరీనా మచాడో దుమ్మెత్తిపోశారు. ‘‘మదురోను ఓడించేందుకు జనమంతా వెల్లువలా కదిలొచ్చి గొంజాలెజ్‌కు ఓటేశారు. ఆయన కనీసం మూడింట రెండొంతుల ఓట్లతో ఘనవిజయం సాధించారు. మా బూత్‌లవారీ విశ్లేషణలో కూడా అదే తేలింది. ఓటింగ్ సరళిని చూసిన మీదట ఓటమి ఖాయమని మదురోకు అర్థమైపోయింది. ఫలితాలను తారుమారు చేసేందుకు పథకం ప్రకారం విపక్ష కూటమి పర్యవేక్షకులను పోలింగ్ బూత్‌ల నుంచి తరిమేశారు. అనంతరం మదురో చేతిలో కీలుబొమ్మ అయిన సీఎన్ఈ చీఫ్ ఫలితాలను ఆయనకు అనుకూలంగా వక్రీకరించారు’’ అంటూ ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తక్షణం దేశవ్యాప్తంగా మొత్తం 30 వేల పోలింగ్ బూత్‌లవారీగా పోలైన ఓట్ల వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. సీఎన్ఈ మాత్రం అందుకు సుముఖంగా లేదు. దీనికితోడు పోలింగ్ ముగిశాక ఫలితాల వెల్లడిని నిర్ధారిత సమయం కంటే ఏకంగా ఆరు గంటలపాటు ఆలస్యం చేశారు. ఫలితాలను మదురోకు అనుకూలంగా మార్చేందుకే ఇలా చేశారని విపక్ష కూటమి దుయ్యబట్టింది. ఫలితాలను చట్టపరంగా సవాలు చేస్తామని ప్రకటించింది. మదురో మాత్రం విదేశీ శక్తులతో కలిసి కొందరు కుట్ర పన్ని ఈవీఎంలను హాక్ చేసేందుకు ప్రయతి్నంచారంటూ విపక్షాలపై ప్రత్యారోపణలకు దిగారు. శాంతిభద్రతలకు భంగం కలిగించజూస్తే ఏం చేయాలో పోలీసులు, సైన్యం చూసుకుంటాయని హెచ్చరించారు. వెనిజులాలో పాతికేళ్లుగా యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ పాలనకు తెర దిచేందుకు విపక్షాలన్నీ మచాడో సారథ్యంలో ఒక్కతాటిపైకి వచ్చి పోటీ చేశాయి.ఫలితాలపై దేశాల పెదవి విరుపు వెనిజులా ఎన్నికల ఫలితాలు అస్సలు నమ్మశక్యంగా లేవని అమెరికా, చిలీ,ఉరుగ్వేతో పాటు చాలా దేశాలు పేర్కొన్నాయి. అవి ప్రజల మనోగతాన్ని, ఓటింగ్ సరళిని ప్రతిఫలించడం లేదని స్పష్టం చేశాయి. చిలీ అధ్యక్షుడు గేబ్రియెల్ బోరిక్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో పాటు బ్రిటన్ కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. -
Venezuela presidential election: సామ్యవాద కోటలో నారీ భేరి
వెనిజులా. ప్రపంచంలోనే అత్యధిక చమురు నిక్షేపాలున్న లాటిన్ అమెరికా దేశం. అయినా అత్యంత నిరుపేద దేశాల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. పాతికేళ్లుగా సాగుతున్న స్వయం ప్రకటిత సామ్యవాద కూటమి నియంతృత్వ పాలనే అందుకు ప్రధాన కారణం. నిరసనలపై ఉక్కుపాదం, హక్కుల అణచివేత, విపక్ష నేతలకు సంకెళ్లు తదితరాలతో వెనిజులా యువత విసిగిపోయింది. దీనికి తోడు అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలి ఉపాధి అవకాశాలూ లేకపోవడంతో కట్టకట్టుకుని దేశం వీడుతోంది. నిండా 3 కోట్ల జనాభా కూడా లేని దేశంలో గత పదేళ్లలో ఏకంగా 80 లక్షల మంది విదేశీ బాట పట్టారు! సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి కీలక వ్యవస్థలన్నింటినీ ప్రభుత్వమే గుప్పెట్లో పెట్టుకోవడంతో పాతికేళ్లుగా వెనిజులాలో అధ్యక్ష ఎన్నికలు కూడా ఏకపక్షమే. 2018 ఎన్నికల్లోనైతే విపక్షాలన్నీ కట్టకట్టుకుని ఎన్నికలనే బహిష్కరించేంతగా ప్రభుత్వ అధికార దురి్వనియోగం శ్రుతి మించిపోయింది. దాంతో ప్రహసనప్రాయంగా సాగిన ఆ ఎన్నికల్లో అధ్యక్షుడు నికొలస్ మదురో తిరుగులేని మెజారిటీ సాధించి అధికారాన్ని నిలబెట్టుకున్నారు. అలాంటి వెనిజులాలో ఆరేళ్ల అనంతరం ఆదివారం మళ్లీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కానీ పరిస్థితులు మాత్రం ఎప్పట్లా లేవు! విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి మదురోపై ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాయి. విపక్షాల ప్రచార సభలకు జనం విరగబడుతున్నారు. ఎన్నికల ప్రక్రియపై ఎప్పుడూ లేనంత ఆసక్తి, ఉత్సుకత వారిలో కనిపిస్తున్నాయి. దాంతో అంతర్జాతీయ సమాజం కూడా ఈసారి ఎన్నికలను అత్యంత ఆసక్తితో వీక్షిస్తోంది. ఇన్ని మార్పులకు కారణం ఒక్క మహిళ. ఒకే ఒక్క మహిళ. మదురోకు ముచ్చెమటలు పోయిస్తున్న ఆమే...విపక్ష నేత మరియా కొరీనా మచాడో. అనర్హత వేటేసినా... వెనిజులా అధ్యక్ష ఎన్నికల బరిలో 10 మంది ఉన్నారు. ప్రధాన పోటీ 61 ఏళ్ల మదురో, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్ రూపంలో ఇద్దరి మధ్య కేంద్రీకృతమైంది. కానీ అసలు పోటీలోనే లేని 56 ఏళ్ల మచాడో పేరు మాత్రమే దేశమంతటా మారుమోగిపోతోంది! ఎన్నికల ప్రచారం పొడవునా ఆమే సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అటు అధికార యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజులా, ఇటు విపక్ష ‘యూనిటరీ ప్లాట్‌ఫాం’ కూటమి ప్రచారమంతా ఆమెనే కేంద్రంగా చేసుకుని సాగడం విశేషం. ముఖ్యంగా మదురో ప్రసంగాలన్నీ ఆద్యంతం మచాడోను విమర్శిస్తూనే సాగాయి. ఆమె ఎన్నికల పోటీకి దూరమైన వైనమూ ఆసక్తికరమే. విపక్ష అభ్యర్థిని తేల్చేందుకు గతేడాది జరిగిన ప్రైమరీలో దేశవ్యాప్తంగా జనం వెల్లువలా వచ్చి మచాడోకు ఓటేశారు. దాంతో ఆమె రికార్డు స్థాయిలో ఏకంగా 93 శాతం ఓట్లు సాధించారు. ఆ వెంటనే ప్రభుత్వం ఆమెపై అవినీతి ఆరోపణలు మోపి ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా ప్రకటించింది. విపక్ష ప్రైమరీనే చట్టవిరుద్ధంగా ప్రకటించింది. మచాడో మద్దతుదారులైన నాయకులు, జర్నలిస్టులు, హక్కుల నేతలు తదితరులందరినీ జైలుపాలు చేసింది. ప్రభుత్వ గుప్పెట్లో ఉన్న సుప్రీంకోర్టు కూడా వేటునే సమరి్థంచింది. అయినా మచాడో వెనక్కు తగ్గకుండా పెద్ద జనాకర్షణ శక్తి లేని మాజీ దౌత్యవేత్త గొంజాలెజ్‌ను తనకు బదులుగా రేసులో దించారు. తనపై వేటునే అతి పెద్ద ప్రచారాస్త్రంగా మలచుకుని సుడిగాలి ప్రచారంతో హోరెత్తించారు. మదురో ప్రభుత్వ అవినీతి, అస్తవ్యస్త పాలనపై ఆమె విమర్శలకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన లభించింది. దాంతో అందరి దృష్టీ ఆదివారం జరిగే పోలింగ్ మీదే కేంద్రీకృతమైంది. 40 లక్షల మంది ఓటర్లపై ‘వేటు’ వెనిజులా మొత్తం ఓటర్లే 2.1 కోట్లు. వారిలో 40 లక్షల మందికి పైగా విదేశాల్లో ఉన్నారు. మదురో పాలనపై వారిలో తీవ్ర అసంతృప్తి నెలకొన్న నేపథ్యంలో వారెవరూ ఓటేసే వీల్లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. లెక్కలేనన్ని కొత్త నిబంధనలు తేవడంతో ప్రవాసుల్లో 69 వేల మంది మాత్రమే ఓటింగ్‌కు అర్హత పొందారు! బస్సు డ్రైవర్ నుంచి అధికార పీఠం దాకా... నికొలస్ మదురో మోరోస్. ఒకప్పుడు సాదాసీదా బస్సు డ్రైవర్. అనంతరం కార్మిక సంఘాల నేతగా మారారు. మెల్లిగా రాజకీయంగా ఒక్కో మెట్టే ఎక్కుతూ అధ్యక్ష పీఠం దాకా ఎదిగారు. 2000లో నేషనల్ అసెంబ్లీకి ఎన్నికవడం మదురో కెరీర్లో కీలక మలుపు. వెనిజులా చరిత్రలో అత్యంత జనాకర్షక నేతగా పేరొందిన హ్యూగో చావెజ్ అభిమానం చూరగొనడంతో ఆయన దశ తిరిగింది. చావెజ్ హయాంలో నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌గా, విదేశాంగ మంత్రిగా చేసి 2012లో దేశ ఉపాధ్యక్షుడయ్యారు. ఏడాదికే చావెజ్ క్యాన్సర్ బారిన పడ్డారు. 2013లో మదురోను తన తాత్కాలిక వారసునిగా ప్రకటించి మరణించారు. మదురో గద్దెనెక్కుతూనే అధ్యక్ష పదవికి తూతూ మంత్రంగా ప్రత్యేక ఎన్నికలు జరిపించి తనకు 50 శాతానికి పైగా ఓట్లొచ్చాయని ప్రకటించుకున్నారు. నాటినుంచి నేటిదాకా అధికారంలో కొనసాగుతున్నారు. ఆయన 11 ఏళ్ల పాలనలో దేశం అన్ని రంగాల్లోనూ కుప్పకూలిందంటూ జనం ఆగ్రహంగా ఉన్నారు. కొన్నేళ్లుగా మదురోపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత తీవ్రతరమవుతోంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
దక్షిణ అమెరికాలోనూ యుద్ధ మేఘాలు!
అటు రష్యా–ఉక్రెయిన్. ఇటు ఇజ్రాయెల్–పాలస్తీనా. ఇలా ఇప్పటికే రెండు యుద్ధాలతో దాదాపు రెండేళ్లుగా ప్రపంచం అల్లకల్లోలమవుతోంది. ఇవి చాలవన్నట్టు దక్షిణ అమెరికా ఖండంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వాతావరణం అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. బుల్లి దేశమైన గయానా అదీనంలో ఉన్న ఎసెక్విబో ప్రాంతంలోని అపార చమురు నిల్వలపై పొరుగు దేశం వెనెజులా కన్నేసింది. ఈ వివాదాస్పద ప్రాంతాన్ని పూర్తిగా కబళించే దిశగా పావులు కదుపుతోంది. ఈ పరిణామం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. గయానాకు అమెరికా దన్నుగా నిలుస్తుండటంతో పరిస్థితులు క్రమంగా ముదురు పాకాన పడుతున్నాయి... దక్షిణ అమెరికాలోని ఎసెక్విబో ప్రాంతం రెండు శతాబ్దాలుగా వెనెజులా, గయానా మధ్య వివాదాలకు కారణంగా ఉంటూ వస్తోంది. ఇది తమదంటే తమదని రెండు దేశాలూ వాదిస్తున్నాయి. కాకపోతే దాదాపు గత వందేళ్లుగా ఈ ప్రాంతం గయానా అ«దీనంలోనే ఉంది. దీని విషయమై కొద్ది దశాబ్దాలుగా ఇరు దేశాల నడుమ అడపాదడపా కీచులాటలు సాగుతూనే వస్తున్నాయి. ఈ వివాదానికి ఫుల్స్టాప్ పెడుతున్నట్టు 2004లో అప్పటి వెనెజులా అధ్యక్షుడు హ్యూగో చావెజ్ ప్రకటనతో పదేళ్లపాటు ఉద్రిక్తతలు చల్లారాయి. కానీ ఎసెక్విబోను ఆనుకుని ఉన్న అట్లాంటిక్ సముద్ర జలాల్లో ఏకంగా 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలున్నట్టు 2015లో బయట పడటంతో పరిస్థితి మళ్లీ మొదటికొచి్చంది. ఆ నిల్వలపై కన్నేసిన వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఎసెక్విబో నిజానికి తమదేనన్న వాదనను తిరగదోడారు. దీన్ని ఇంటా బయటా పదేపదే ప్రస్తావిస్తూ వచ్చారు. ఎసెక్విబోను వెనెజులాలో కలిపేసుకుంటామని ప్రకటించి తాజాగా ఉద్రిక్తతలకు తారస్థాయికి తీసుకెళ్లారు. విలీనంపై వెనెజులాలో రిఫరెండం నిర్వహిస్తామని ప్రకటించడంతో గయానా అంతర్జాతీయ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. ఎలాంటి దుందుడుకు చర్యలూ చేపట్టొద్దన్న కోర్టు ఆదేశించిన రెండు రోజులకే వాటిని బేఖాతరు చేస్తూ మదురో డిసెంబర్ 3న వెనెజులావ్యాప్తంగా రిఫరెండం జరిపారు. ఏకంగా 95 శాతం మంది ఎసెక్విబో విలీనానికి జై కొట్టినట్టు ప్రకటించారు. వెంటనే ఆ ప్రాంతాన్ని గయానా ఎసెక్విబా పేరిట వెనెజులాలో నూతన రాష్ట్రంగా చూపు తున్న కొత్త మ్యాపులను మదురో విడుదల చేసేశారు! రంగంలోకి అమెరికా గయానాపై వెనెజులా సైనిక చర్యకు దిగవచ్చన్న వార్తలు కొద్ది రోజులుగా జోరందుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా హుటాహుటిన రంగంలోకి దిగింది. గయానాకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని ప్రకటించింది. డిసెంబర్ 7 నుంచి ఆ దేశంలో సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేస్తూ వెనెజులాకు హెచ్చరికలు పంపుతోంది. దీని వెనక అమెరికా స్వీయ చమురు ప్రయోజనాలు దాగున్నాయి. ఎసెక్వెబోలో చమురు నిల్వలను గుర్తించిన ఎక్సాన్‌మొబిల్ అమెరికా చమురు దిగ్గజమే. ఒక్క 2022లోనే చమురు వెలికితీత ద్వారా ఆ కంపెనీకి ఏకంగా 600 కోట్ల డాలర్ల ఆదాయం సమకూరింది! వాటిని వదులుకోవడం అగ్ర రాజ్యానికి సుతరామూ ఇష్టం లేదు. దట్టమైన అడవులతో కూడిన ఎసెక్విబోపై దాడి చేయాలంటే సముద్ర మార్గమే వెనెజులాకు శరణ్యం. లేదంటే ఇరు దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న బ్రెజిల్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బ్రెజిల్ కూడా వెనెజులాతో తమ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. శాంతియుతంగా తేల్చుకోవాలని బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా మదురోకు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 14న ఆయన సమక్షంలో సమావేశమై వివాదంపై చర్చించుకునేందుకు మదురో, గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ అంగీకరించినట్టు చెబుతున్నారు. శతాబ్దాల వివాదం... వెనెజులా, గయానా మధ్య ఎసెక్విబో వివాదం ఈనాటిది కాదు. వెనెజులా అప్పట్లో స్పెయిన్ వలస రాజ్యంగా ఉన్న రోజుల్లో ఈ ప్రాంతం వెనెజులా అ«దీనంలోనే ఉండేది. 1899 దాకా అలాగే కొనసాగింది. 1899లో జరిగిన అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం గయానాకు దఖలు పడింది. కానీ అది మోసపూరిత ఒప్పందని వెనెజులా ఆరోపిస్తూ వస్తోంది. తమ ప్రాతినిధ్యం లేకుండా తమ తరఫున అమెరికా, బ్రిటన్ దీనికి తలూపాయని చెబుతోంది. రాజకీయ ఎత్తుగడే! నిజంగా గయానాపై దండెత్తడం మదురో ఉద్దేశం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. 2013 నుంచీ అధికారంలో ఉన్న మదురోపై వెనెజులాలో తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉంది. ఆయన పదేళ్ల పై చిలుకు పాలనలో దేశం పేదరికం కోరల్లో చిక్కిందన్న అభిప్రాయముంది. ఈ నేపథ్యంలో యుద్ధం పేరిట భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించి, అధ్యక్ష ఎన్నికలను వీలైనంత కాలం వాయిదా వేసేందుకే ఆయన ఈ ఎత్తు వేశారని చెబుతున్నారు. సహజ వనరుల గని ► ఎసెక్విబో ప్రాంతం అపార సహజ వనరులకు ఆలవాలం ► దీని విస్తీర్ణం దాదాపు 1.59 లక్షల చదరపు కిలోమీటర్లు ► గయానా మొత్తం భూభాగంలో మూడింట రెండొంతులు ఈ ప్రాంతమే విస్తరించి ఉంది ► కానీ గయానా మొత్తం జనాభా దాదాపు 8 లక్షలైతే అందులో ఎసెక్విబోలో ఉన్నది 1.2 లక్షల మందే ► ఈ ప్రాంతం నిండా దట్టమైన అమెజాన్ వర్షారణ్యాలే విస్తరించి ఉన్నాయి ► భారీ పరిమాణంలో బంగారం, రాగి తదితర ఖనిజ నిల్వలు కూడా ఉన్నాయి – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరో దేశాధ్యక్షుడి ఫేస్బుక్ ఖాతా నిలిపివేత..!
కారకస్: తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఫేస్బుక్ తగు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఫేక్ న్యూస్, తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై ఫేస్బుక్ ఉక్కుపాదం మోపుతోంది. అందులో భాగంగా తప్పుడు సమాచారాన్ని ఫేస్బుక్లో షేర్ చేసినందుకు గాను వెనుజులా అధ్యక్షుడి ఖాతాను ఫేస్బుక్ నిలిపివేసింది. వెనుజులా అధ్యక్షుడు నికోలస్ మడురో , ఏలాంటి ఆధారం లేకుండా కోవిడ్-19ను నివారించే రెమిడీ గురించి షేర్ చేసినందుకు గాను ఫేస్బుక్ ఆయన ఖాతాను నిలిపివేసింది. నికోలస్ తన అధికారిక ఫేస్బుక్ ఖాతా నుంచి కోవిడ్-19కు సదరు మెడిసిన్ నయం చేస్తోందని పోస్ట్ చేశారు. కాగా జనవరి నెలలో ‘కార్వాటివిర్’ అనే మెడిసిన్‌తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కరోనా వైరస్‌ను తగ్గించవచ్చునని మడురో పేర్కొన్నారు. ఈ మెడిసిన్ పనిచేస్తోందని వైద్యులు, శాస్త్రవేత్తలు ఎక్కడా నిర్ధారించలేదు.ఫేస్బుక్ పాలసీలకు వ్యతిరేకంగా ఉన్నందున నికోలస్ మడురో షేర్ చేసిన వీడియోను తొలగించింది. వీడియోలో ఉన్న సమాచారానికి ఎలాంటి నిర్ధారణ లేకపోవడంతో పోస్ట్ ను తీసివేశామని ఫేస్బుక్ తెలిపింది. మరోవైపు ఫేస్బుక్ తన ఖాతాను నిలిపివేయడాన్ని నికోలస్ మడురో ఖండించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన ఆదేశాల ప్రకారం కోవిడ్-19పై తప్పుడు సమాచారం ఇచ్చే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. ప్రైవసీ పాలసీలకు వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వారికి ముందుగా సమాచారం ఇస్తామని పేర్కొన్నారు. తర్వాత వారిపై తగు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం వెనుజులాలో శుక్రవారం నాటికి మొత్తం 1,54,905 కరోనా కేసులు నమోదవ్వగా, మృతుల సంఖ్య 1,543గా ఉంది. తక్కువ సంఖ్యలో కోవిడ్ టెస్ట్‌లను చేస్తోన్నందున కేసుల సంఖ్య తక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. చదవండి: ఫేస్బుక్లో ఆ రికమెన్‌డేషన్‌లుండవు...! -
వెనెజులాలో తిరుగుబాటు యత్నం
కారకాస్: వెనెజులా రాజధాని కారకాస్‌లో మంగళవారం ఘర్షణలు చెలరేగాయి. తనకు తానే అధ్యక్షునిగా ప్రకటించుకున్న జువాన్ గయిడో నేతృత్వంలో కొందరు సైనికులు, ఆందోళనకారులు రాజధాని సమీపంలోని వైమానిక స్థావరాన్ని, ప్రధాన రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించగా ప్రభుత్వ సైనికులు వారిని చెదరగొట్టారు. తన ప్రభుత్వానికే సైన్యం మద్దతు ఉందంటూ అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రకటించుకున్నారు. తిరుగుబాటు యత్నాలను సైన్యం తిప్పికొడుతోందన్నారు. కాగా, గయిడో ప్రభుత్వాన్ని రష్యా, చైనా మినహా 50 వరకు దేశాలు గుర్తించాయి. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వెనెజులాలో ఆందోళనలు నిత్యకృత్యంగా మారాయి. మదురోను గద్దె దించేవరకు తమ ఆందోళన కొనసాగుతుందని, వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని గయిడో ప్రకటించారు. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పలువురు గాయపడ్డారు. ఆగ్రహించిన ఆందోళనకారులను బస్సుకు నిప్పుపెట్టి జాతీయ రహదారిని దిగ్బంధించారు. సంయమనం పాటించాలని వెనిజులా అధికార, ప్రతిపక్షాలను ఐక్యరాజ్యసమితి కోరింది. -
వెనిజులాలో అగ్రరాజ్యాల ఆధిపత్యం!
మాస్కో: ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న వెనిజులాలో రష్యా సైన్యం అడుగుపెట్టింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోకు మద్దతుగా తమ సైన్యం ఆ దేశానికి చేరుకున్నట్లు రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మారియా తెలిపారు. ఇరుదేశాల మధ్య కుదిరిన సైనిక సహకార ఒప్పందం మేరకే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. వెనిజులాలో ఉండే ప్రతీ హక్కు రష్యా సైన్యానికి ఉందని తేల్చిచెప్పారు. అయితే వెనిజులాకు ఎంతమంది రష్యా సైనికులు చేరుకున్నారన్న విషయమై మారియా స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న అమెరికా–రష్యా సంబంధాలు మరింత దిగజారనున్నాయి. -
అమెరికా దుందుడుకుతనం
అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో చేతులు కలిపి అడ్డదారులు తొక్కారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధినేత డోనాల్డ్ ట్రంప్ దాన్నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించడానికి వెనిజులాలో చిచ్చు రగిలిస్తున్నారు. నిరుడు మే నెలలో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన విపక్షాన్ని ప్రోత్స హించి ఉద్యమాలతో ఆ దేశంలో అశాంతి సృష్టిస్తున్నారు. గత కొన్నిరోజులుగా వెనిజులా నిరసన లతో, సమ్మెలతో అట్టుడుకుతోంది. ప్రస్తుత దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను ఎలాగైనా గద్దె దించా లన్నది అమెరికా లక్ష్యం. దీనికి యూరప్ యూనియన్(ఈయూ)లోని ప్రధాన దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్లు వత్తాసు పలుకుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జువాన్ గైదో తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకోగా, ఆయన్ను గుర్తిస్తున్నట్టు ట్రంప్ ఆదరా బాదరాగా ప్రకటించారు. పైగా సైనిక దాడులకు దిగుతామని బెదిరిస్తున్నారు. అయితే ఈయూ దేశాలు మాత్రం తాము అమెరికా తోక పట్టుకుని పోవడం లేదని చెప్పడానికన్నట్టు వేరే పల్లవి అందుకున్నాయి. ఎనిమిది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మదురోకు షరతు విధిం చాయి. అందుకు సిద్ధపడకపోతే గైదోను దేశాధ్యక్షుడిగా తాము కూడా గుర్తిస్తామని హెచ్చరిం చాయి. అసలు వేరే దేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పడానికి వీరె వరు? వెనిజులా ప్రజలు తమను ఎవరు పాలించాలో తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందా? తాజా సంక్షోభంలో తాము మదురోకు అండగా నిలు స్తామని రష్యా, చైనా ప్రకటించాయి. మన దేశం కూడా వెనిజులా సమస్యల్ని అక్కడి ప్రజలే పరిష్క రించుకోవాలని సూచించింది. గైదోను గుర్తించేందుకు నిరాకరించింది. వెనిజులాపై అమెరికా, పాశ్చాత్య దేశాల కడుపు మంట ఈనాటిది కాదు. అక్కడ అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలన్నాయి. అక్కడి భూగర్భంలో పసిడి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అపురూపమైన వజ్రాలకు అది పెట్టింది పేరు. ఇంత సంపద ఉన్నప్పుడు ఎవరికైనా కన్నుకుట్టడం సహజం. పైగా ఆ దేశంలో వరసగా వచ్చిన ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకుని, అక్కడి సంపదను కొల్లగొట్టడం అలవాటు చేసుకున్న అగ్రరాజ్యాలకు 1999లో మొదటిసారి హ్యూగో చావెజ్ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఆ దేశంలో రెండు ప్రధాన పార్టీలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ... ఒకరి తర్వాత మరొకరు పీఠం ఎక్కుతూ సహజ వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెడుతున్న తరుణంలో చావెజ్ ఆ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాడు. 19వ శతాబ్దిలో స్పెయిన్ వలస దేశాలను ఏకం చేసిన వెని జులా జాతీయ యోధుడు సైమన్ బొలివర్‌ను ఆదర్శంగా తీసుకుని కుమ్మక్కు రాజకీయాలపై కత్తి దూశాడు. 1999 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదలుకొని 2013లో మరణించేవ రకూ అధికారంలో కొనసాగారు. కేన్సర్ వ్యాధితో అంతిమ దశలో ఉండగా తన వారసుడిగా మదు రోను ప్రకటించారు. అదే ఆయనకు బలంగా మారింది. పాలనా సామర్థ్యంలో చావెజ్‌తో సరి తూగ కపోయినా... అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తగ్గాక ఇబ్బందులు తలెత్తినా ఉన్నం తలో మదురో మెరుగైన పాలనే అందించారు. అందుకే 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఆయనే విజయం సాధించారు. వాస్తవానికి తదుపరి ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది. కానీ విపక్షాల డిమాండ్‌కు తలొగ్గి నిరుడు మే నెలలో... అంటే 19 నెలల ముందు అధ్యక్ష ఎన్నికలు జరి పారు. ఆ ఎన్నికల్లో 67.84 శాతం ఓట్లు సాధించారు. అవి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని వివిధ దేశాల నుంచి పరిశీలకులుగా వచ్చిన 150మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో 8 దేశా లకు చెందిన 14మంది ఎన్నికల అధికారులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు. పైగా వెనిజులా ఎన్ని కల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా ఉంటుంది. ఎన్నికలకు ముందు... అవి కొనసాగుతుండగా... పూర్తయ్యాక– ఇలా మూడు దఫాలుగా 18సార్లు ఈవీఎంలను తనిఖీ చేసే ప్రక్రియ తప్పనిసరి. ఇందులో యాదృచ్ఛికంగా ఎంపిక చేసే 53శాతం ఈవీఎంలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దొంగ ఓట్లకు అక్కడ ఆస్కారం ఉండదు. ఓటరు వేలిముద్రే అతడి/ఆమె గుర్తింపు కార్డు. అన్నిటికన్నా ముఖ్యమేమంటే... మదురో ప్రత్యర్థులెవరూ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించలేదు. 2015 పార్లమెంటరీ ఎన్నికల్లో మదురో పార్టీ కాకుండా, విపక్షాలే అత్యధిక స్థానాలు చేజిక్కించుకున్నాయి. నిజంగా అక్రమాలకు ఆస్కారం ఉంటే అది అసాధ్యమయ్యేది. వెనిజులా ఒడిదుడుకుల్లో ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ ఒడిదుడుకులన్నీ అమెరికా ప్రాప కంతో సాగుతున్న దిగ్బంధం పర్యవసానంగా, చమురు ధరల కుంగుబాటు కారణంగా ఏర్పడ్డాయి. ఒబామా హయాంలో మొదలైన ఆంక్షలు ట్రంప్ వచ్చాక మరింత పెరిగాయి. వీటి విలువ దాదాపు 600 కోట్ల డాలర్లు. ఇవిగాక వెనిజులాకు దక్కాల్సిన చమురు సంస్థ లాభాలు 100 కోట్లను బదిలీ కాకుండా అమెరికా అడ్డగించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లో వెనిజులాకు ఉన్న 120 కోట్ల డాలర్ల బంగారం నిల్వలు స్తంభింపజేసింది. దేశంలో నిత్యావసరాల కొరత, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం సరేసరి. నిజంగా వెనిజులా ప్రజల శ్రేయస్సుపై ఏ కాస్త ఆందోళన ఉన్నా అమెరికా ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడదు. వారిని కష్టాలపాటు చేయదు. తాము సృష్టించి, పెంచుతున్న సంక్షో భానికి మదురోను బాధ్యుడిగా చేసి, ఆయన తప్పుకోవాలనటం అమెరికా వక్రబుద్ధికి తార్కాణం. ప్రజామోదంతో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుణ్ణి బెదిరించడం, సైనికచర్యకు దిగుతాననడం దురహం కారం తప్ప మరేం కాదు. ఈ దురహంకారానికి ఇప్పటికే పలు దేశాలు బలయ్యాయి. వెనిజులాలో నెత్తురు పారకుండా, అరాచకం తాండవించకుండా, అస్థిరత దాన్ని చుట్టుముట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ పౌరులందరిదీ. ఈ విషయంలో మన దేశం వైఖరి హర్షించదగ్గది. -
వెనెజులాలో రాజకీయ సంక్షోభం
కారకస్: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజులాలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. తనను తాను తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రకటించుకున్న విపక్ష నేత జువాన్ గుయాడో ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉండగా, అధ్యక్షుడు నికోలస్ మదురోకు సైన్యం తోడ్పాటు లభించింది. అమెరికాతోపాటు అనేక వెనెజులా పొరుగుదేశాలు గుయాడోకు మద్దతు తెలిపి ఆయనను తాత్కాలిక అధ్యక్షుడిగా గుర్తించగా, రష్యా, చైనా సహా పలు దేశాలు మదురోకు మద్దతుగా నిలిచాయి. ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోవడంతోపాటు ప్రజలకు నిత్యావసరాలు కూడా సరిగ్గా దొరకక తిండి కోసం నానా తిప్పలు పడుతున్నారు. -
అమెరికాతో తెగదెంపులు!
కారకస్ : ప్రతిపక్ష నేత జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా.. అమెరికా గుర్తించడం పట్ల ఆ దేశ ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో ఘాటుగా స్పందించారు. అగ్రరాజ్యం అమెరికాతో దౌత్య పరమైన సంబంధాలన్నీ తెంచుకుంటున్నామని పేర్కొన్నారు. 72 గంటల్లోగా అమెరికన్ ప్రతినిధులంతా తమ దేశాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ ఆయన హెచ్చరించారు. వెనిజులా అధ్యక్షుడిగా మదురో గతేడాది మేలో రెండోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే మదురో పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనమైందని, శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన్న కారణంగా ఆయనను అధ్యక్షుడిగా గుర్తించడానికి అమెరికా నిరాకరించింది. అంతేకాకుండా ప్రతిపక్ష నేత జువాన్ గైడోను అసలైన అధ్యక్షుడిగా గుర్తిస్తున్నామంటూ పేర్కొంది. ఈ మేరకు.. ‘ వెనిజులా ప్రజలు మదురో పాలనలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జువాన్ గైడోను వెనిజులా అధ్యక్షుడిగా నేను ఈ రోజు అధికారికంగా గుర్తిస్తున్నాను’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మదురో బుధవారం తన మద్దతుదారులతో కలిసి అధ్యక్ష భవనంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా... ‘ రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడిగా.. అమెరికాతో దౌత్యపరమైన, రాజకీయ ఇలా అన్ని రకాల సంబంధాలను తెంచుకోవాలని నిర్ణయించాను. దేశ ప్రజల ముందు, ప్రపంచంలోని అన్ని దేశాలకు ఈ విషయం తెలియజేస్తున్నాను. గెట్ అవుట్.. వెనిజులాను వదిలి వెళ్లండి. మాకు ఆత్మగౌరవం ఉంది.. డ్యామిట్’ అని మదురో వ్యాఖ్యానించారు. వెనిజులాను తోలు బొమ్మను చేసి అమెరికా అధికారం చెలాయించాలని చూస్తోందని ఘాటుగా విమర్శించారు. కాగా దక్షిణ అమెరికా దేశం వెనిజులాలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో మళ్లీ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలంటూ నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. ఇక ప్రతిపక్ష నేత జువాన్‌ను అధ్యక్షుడిగా అమెరికా గుర్తించడాన్ని కొలంబియా కూడా సమర్థించింది. The citizens of Venezuela have suffered for too long at the hands of the illegitimate Maduro regime. Today, I have officially recognized the President of the Venezuelan National Assembly, Juan Guaido, as the Interim President of Venezuela. https://t.co/WItWPiG9jK — Donald J. Trump (@realDonaldTrump) January 23, 2019 -
వెనెజులా అధ్యక్షుడిగా మళ్లీ మదురో
కారకస్: వెనెజులా అధ్యక్షుడిగా నికోలస్ మదురో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. దేశంలో పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థ, క్షీణిస్తున్న శాంతిభద్రతల నేపథ్యంలో అధికారం నుంచి దిగిపోవాలని అంతర్జాతీయ సమాజం సూచించినా పదవి చేపట్టడానికే ఆయన మొగ్గు చూపారు. రాజధాని కారకస్‌లో జరిగిన మదురో ప్రమాణస్వీకార కార్యక్రమానికి 94 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. మదురో బాధ్యతలు చేపట్టడాన్ని అమెరికా, కెనడా సహా డజను లాటిన్ అమెరికా దేశాలు వ్యతిరేకించాయి. ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ఎన్నికల్లో నిషేధానికి గురవడం, కొన్ని పార్టీలు పోటీకి దూరం కావడంతో అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినట్లు మదురో మేలో ప్రకటించారు. -
వెనిజువెలా అధ్యక్షుడిపై హత్యాయత్నం!
కరాకస్: వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోపై ఆదివారం ఉదయం (భారతకాలమానం ప్రకారం) హత్యాయత్నం జరిగింది. భారీ పేలుడు పదార్థాలున్న డ్రోన్ ఆయన ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో పేలింది. ఈ ప్రమాదంలో ఆయన క్షేమంగానే బయటబడినా.. ఏడుగురు సైనికులకు గాయాలయ్యాయి. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా కరాకస్‌లో మిలటరీ పరేడ్‌నుద్దేశించి మడురో ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడికి కొలంబియానే కారణమని మొదట పేర్కొన్న మడురో అనంతరం.. అనుమానాస్పద రెబల్ గ్రూప్ హత్యాయత్నం చేసి ఉండొచ్చన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మిలటరీ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ‘నేను బాగున్నాను. బతికే ఉన్నాను. ఈ దాడి తర్వాత మరింత విప్లవాత్మకంగా పనిచేయాలని నిశ్చయించుకున్నాను. ఈ ఘటనకు బాధ్యులకు తీవ్రమైన శిక్షలు తప్పవు. ఎవరినీ క్షమించబోం’ అని దాడి అనంతరం జాతినుద్దేశించి మాట్లాడుతూ మడురో హెచ్చరించారు. ‘నన్ను చంపేందుకు పన్నిన కుట్ర ఇది. నేడు నన్ను అంతమొందించేందుకు ప్రయత్నించారు. ఓ ఎగురుతున్న వస్తువు హఠాత్తుగా నా ముందు పేలింది’ అని ఆయన అన్నారు. ఇప్పటికే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు చేస్తున్న ఆందోళనలను అణచివేస్తున్న మడురో.. 248 మందిని రాజకీయ ఖైదీలుగా జైల్లో పెట్టారు. ఈ ఘటనకు బాధ్యులపై కనికరం చూపించబోమని అటార్నీ జనరల్ తారెక్ విలియమ్ సాబ్ హెచ్చరించారు. కాగా, ఈ దాడికి తమదే బాధ్యతని వెనిజువెలా మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది. పేలింది డ్రోనా? సిలిండరా? వెనిజువెలా అధికార చానెల్లో చూపించిన దృశ్యాల్లో.. సైనికుల మధ్యలో మడురో నిలబడి ప్రసంగిస్తుండగా ఓ భారీ శబ్దం వినిపించింది. దీంతో పరేడ్‌లో ఉన్న జాతీయ గార్డులు దూరంగా జరిగిపోయారు. పేలుడు జరగగానే గార్డులు అధ్యక్షుడికి రక్షణ కల్పిస్తూ ఆయన చుట్టూ వలయంలా మారిన దృశ్యాలు కూడా కనిపించాయి. ఆ వెంటనే లైవ్ కట్ అయింది. అధ్యక్షుడు ప్రసంగిస్తున్న వేదికకు సమీపంలో ఈ డ్రోన్ పేలిందని వెనిజువెలా సమాచార మంత్రి జార్జ్ రోడ్రిగ్జ్ తెలిపారు. సంప్రదాయవాదులే (విపక్షం) ఈ పనిచేసి ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కరాకస్ మిలటరీ క్షేత్రానికి సమీపంలోని భవనం వద్దనుంచే ఈ డ్రోన్‌ను ఆపరేట్ చేసినట్లు స్థానిక పోలీసులు భావిస్తున్నారు. అయితే.. సమీపంలోని భవనంలో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే భారీగా శబ్దం వచ్చిందని, హత్యాయత్నం జరగలేదని పలు అంతర్జాతీయ వార్తాసంస్థలు పేర్కొన్నా యి. మడురో మిత్రులైన క్యూబా, బొలీవియా దేశాలు ఈ హత్యాయత్నాన్ని ఖండించాయి. మాకేం సంబంధం లేదు: అమెరికా వెనిజువెలా ఘటనను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ దాడి వెనక తమ ప్రమేయం లేదని స్పష్టం చేసింది. ‘అమెరికా ప్రమేయం లేదు. ఆ దేశంలో జరిగే మార్పులతో మాకు సంబంధం లేదు’ అని అమెరికా భద్రతా సలహాదారు. జాన్ బోల్టన్ తెలిపారు. కొలంబియా ప్రభుత్వం కూడా మడురో ఆరోపణలను ఖండించింది. ‘మడురో ఆరోపణలు అర్థరహితం. ఎలాంటి ఆధారాల్లేకుండా మాట్లాడొద్దు’ అని హెచ్చరించింది. బాధ్యత మాదే! ఈ దాడికి తామే బాధ్యులమని మిలటరీ రెబల్ గ్రూప్ ‘నేషనల్ మూమెంట్ ఆఫ్ సోల్జర్స్ ఇన్ టీషర్ట్స్’ (ఎన్‌ఎంఎస్‌టీ) ప్రకటించుకుంది. ‘రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన వారు, అధికారాన్ని స్వార్థప్రయోజనాలకు వాడుకునే వారికి మిలటరీ ఇస్తున్న అసలు సిసలు గౌరవం’ అని ఓ ప్రకటనలో తెలిపింది. ‘దేశ ప్రజలు సంతోషంగా ఉండేలా చూడటం ప్రభుత్వం బాధ్యత. కానీ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోలేని ప్రభుత్వాన్ని మేం సహించబోం. కరెన్సీకి విలువ లేదు. వ్యాధులకు మందుల్లేవు. విద్యావ్యవస్థ దారుణంగా ఉంది. కమ్యూనిజాన్ని మాత్రమే ప్రభుత్వం బోధిస్తోంది’ అని ఎన్‌ఎంఎస్‌టీ పేర్కొంది. దేశంలో రాజ్యాంగ సంక్షోభం భారీ చమురు నిక్షేపాలున్నప్పటికీ.. వెనిజువెలా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. దేశంలో కొంతకాలంగా రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. మడురో సన్నిహితులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అంతర్జాతీయంగా ఏకాకి అయింది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థితికి చేరుకుంది. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సంప్రదాయవాదులను (విపక్షాలు) మడురో జైల్లో పెట్టిస్తున్నారు. వీరికి అమెరికా సాయం చేస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరగగా.. మడురో ఏకపక్ష నిర్ణయాలతో విపక్షం ఎన్నికలను బహిష్కరించింది. దీంతో మరో ఆరేళ్లపాటు ఈయనే అధికారంలో ఉండనున్నారు. డ్రైవర్ నుంచి అధ్యక్షుడి దాకా.. 1962లో పుట్టిన నికోలస్ మడురో తండ్రి వెనిజువెలాలో ప్రముఖ కార్మిక నేత. చిన్నప్పటినుంచే కమ్యూనిజం, కార్మిక చట్టాలను మడురో ఒంటబట్టించుకున్నారు. విద్యార్థి సంఘం నేతగా ఎదిగిన మడురో గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేయలేదు. అనంతరం కరాకస్ మెట్రో కంపెనీలో బస్ డ్రైవర్‌గా కూడా పనిచేశారు. 1993లో అప్పటి వెనిజువెలా అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను కలుసుకున్న మడురో.. ఆ తర్వాత బొలివియన్ ఉద్యమంతో కీలకనేతగా ఎదిగారు. ఈ ఉద్యమం ద్వారానే 1998లో చావెజ్ అధ్యక్ష పీఠాన్ని మళ్లీ అధిరోహించారు. అప్పుడే మడురో ఎంపీగా గెలిచారు. 1999లో నేషనల్ అసెంబ్లీలో డిప్యూటీ నేతగా ఎంపికయ్యారు. చావెజ్ 2006లో మడురోను విదేశాంగ మంత్రిగా నియమించారు. 2013లో చావెజ్ మరణంతో ఆపద్ధర్మ నేతగా, ఆతర్వాత జరిగిన ఎన్నికల్లో చాలా తక్కువ మెజారిటీతో నెగ్గి అధ్యక్షుడయ్యారు. -
వెనెజులా అధ్యక్షుడిపై హత్యాయత్నం
కరాకస్, వెనెజులా : వెనెజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై డ్రోన్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి హాని కలుగలేదు. దేశ రాజధాని కరాకస్‌లో వేల మంది సైనికులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తుండగా ఆయుధ సామర్ధ్యం కలిగిన డ్రోన్లు పేల్చివేశారు. ఈ మేరకు వెనెజులా ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. నేషనల్ గార్డ్స్ 81వ వార్షికోత్సవం సందర్భంగా సైనికులను ఉద్దేశించి మదురో ప్రసంగిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. విచారణలో డ్రోన్ల ద్వారా బాంబు పేల్చినట్లు తేలింది. పేలుడు తర్వాత హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను ఆర్పివేశాయి. అయితే, ఇది నిజంగా డ్రోన్ దాడి కాదని, దగ్గరలోని అపార్ట్మెంటులో గ్యాస్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. -
వెనిజువెలా ఎన్నికల్లో మదురో ఘనవిజయం
కారకస్: వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్ నేత నికోలస్ మదురో(55) ఘనవిజయం సాధించారు. జాతీయ ఎన్నికల కౌన్సిల్ ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజువెలాకు చెందిన మదురో 68 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మదురోకు 58 లక్షల ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు మదురో వెనిజువెలాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇది చరిత్రాత్మక విజయం. ఈ ఎన్నికల్లో వెనిజువెలా గెలిచింది. శాంతి గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. వెనిజువెలాలో అతిపెద్ద, శక్తిమంతమైన రాజకీయ శక్తిగా మనం చాలాకాలం ఉంటాం. వాళ్లు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. నేను నియంతనని ప్రతిపక్షాల చేసే విమర్శలు నన్ను బాధపెట్టవు. వెనిజువెలా ఆర్థికవ్యవస్థను అమెరికా, కొలంబియా దేశాల మద్దతు ఉన్న మాఫియాలు తీవ్రంగా దెబ్బతీశాయి. రాబోయే రెండేళ్లలో ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారిస్తాం’ అని పేర్కొన్నారు. వెనిజువెలాతో అనుసరిస్తున్న యుద్ధవైఖరిని అమెరికా పునఃసమీక్షించాలని మదురో విజ్ఞప్తి చేశారు. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మదురో ప్రభుత్వం ఎన్నికలకు ముందు, పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలకు, ఉల్లంఘనలకు పాల్పడిందని రెండో స్థానంలో నిలిచిన హెన్రీ ఫాల్కన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌కేంద్రాల సమీపంలో ‘రెడ్ టెంట్ల’ను ఏర్పాటుచేశారనీ, సంక్షేమ పథకాలకు అవసరమైన ‘ఫాదర్ల్యాండ్ కార్డు’లను మదురో మద్దతుదారులు అక్కడ స్కాన్ చేశారని వెల్లడించారు. కాగా, మదురో విజయంపై మయామీ, మ్యాడ్రిడ్‌లో వలసదారులు నిరసన తెలిపారు. వెనిజువెలాలో ఎన్నికలు జరిగిన తీరు సిగ్గుచేటనీ, ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు తేల్చిచెప్పాయి. తాజాగా మదురో విజయం నేపథ్యంలో వెనిజువెలా జీడీపీలో 25 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న చమురురంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
వెనిజులా ప్రధానిగా నికోలస్ మడురో
కారకస్ : నికోలస్ మడురో రెండవ సారి కూడా వెనిజులా ప్రధానిగా ఎన్నికయ్యారు. మరో ఆరు సంవత్సరాల పాటు ఆయన వెనిజులా ప్రధానిగా కొనసాగనున్నారు. మొత్తం 90 శాతం ఓట్లు పోల్ కాగా ఇందులో మడురోకు 68 శాతం, ఆయన ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 21శాతం ఓట్లు లభించాయి. ఆదివారం ఎన్నికల అధికారులు మడురోను విజేతగా ప్రకటించారు. కాగా మడురో ఎన్నికలలో రిగ్గింగ్‌కు పాల్పడి నెగ్గినట్లు ఫాల్కన్ ఆరోపిస్తున్నారు. 2018 డిసెంబర్ నెలలో జరగాల్సిన ఎన్నికలను మడురోకు అనుకూలంగా ఉండేలా కొద్ది నెలల ముందుగానే నిర్వహించారని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ ఎన్నికలు చెల్లవని, వచ్చే ఏడాది కొత్తగా ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేస్తోంది. దేశంలో వచ్చిన ఆర్థిక సంక్షోభం కారణంగా కేవలం 46శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినిమోగించుకున్నారని ప్రతిపక్షం తెలిపింది. -
ద.అమెరికా లో హింస, 78 మంది మృతి
కారకాస్(వెనిజువెలా): దక్షిణ అమెరికా, వెనిజువెలాలో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల సందర్భంగా చెలరేగిన హింసాకాండలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా జరిగిన గొడవల్లో మొత్తం మృతుల సంఖ్య 78కి చేరుకుందని అధికార యంత్రాంగం తెలిపింది. అధ్యక్షుడు నికొలస్ మడురో ప్రభుత్వం ప్రభుత్వంపై విసుగెత్తిన ప్రజలు, ప్రతిపక్షాలు ఆయన గద్దెదిగాలని కోరుతూ గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. మూడు నెలలు కొనసాగుతున్న అశాంతితో సంబంధం ఉందనే అనుమానంతో పోలీసులు ఇప్పటి వరకు 1500 మందిని పౌరులను అదుపులోకి తీసుకున్నారు. అధికారంలో మరింత కాలం కొనసాగేందుకు అధ్యక్షుడు మడురో అక్రమాలకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
మోదీ బాటలోనే వెనిజులా.. పెద్ద నోట్ల రద్దు
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాటలోనే వెనిజులా అధ్యక్షుడు నికొలస్ మదురో కూడా పయనించారు. తమ దేశంలో అతిపెద్ద కరెన్సీ అయిన 100 బొలివర్ నోటును రద్దుచేస్తున్నట్లు అత్యవసర డిక్రీ జారీచేశారు. కొలంబియాలో భారీ ఎత్తున మాఫియా వర్గాలు ఈ నోట్లను నిల్వ చేశాయని, ఆ మాఫియాను అరికట్టడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని మదురో ప్రకటించారు. ప్రపంచంలోనే ద్రవ్యోల్బణం అత్యంత ఎక్కువగా ఉన్న ఈ దేశంలో ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. ప్రస్తుతం మార్కెట్లో చలామణిలో ఉన్న పెద్ద నోట్ల విలువకు దాదాపు 200 రెట్ల ఎక్కువ విలువైన కొత్త నోట్లు, నాణేలను విడుదల చేసేందుకు వెనిజులా సిద్ధం అవుతోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో 100 బొలివర్ నోటుకు మూడు సెంట్ల కంటే తక్కువ విలువ ఉంది. ఒక హాంబర్గర్ కొనాలంటే 100 బొలివర్ నోట్లు 50 కావాల్సి ఉంటుంది. అంతలా దాని విలువ ఇటీవలి కాలంలో పడిపోయింది. తనకున్న రాజ్యాంగ అధికారాలతో, ప్రస్తుత ఆర్థిక అత్యవసర పరిస్థితిలో 100 బొలివర్ బిల్‌ను చలామణిలోంచి తప్పించాలని నిర్ణయించినట్లు మదురో ప్రకటించారు. రాబోయే 72 గంటల పాటు మాత్రమే ఇవి చెల్లుబాటు అవుతాయని 'కాంటాక్ట్ విత్ మదురో' అనే తన టీవీ షోలో ఆయన తెలిపారు. వందలకోట్ల కొద్దీ నోట్లను అంతర్జాతీయ మాఫియా ప్రధానంగా కొలంబియా నగరాలతో పాటు బ్రెజిల్లో కూడా దాచిపెట్టిందని, కొన్ని జాతీయ బ్యాంకులకు కూడా ఈ కుట్రలో భాగం ఉందని వెనిజులా అధ్యక్షుడు మదురో చెప్పారు. ఆర్థిక వ్యవస్థను అస్థిరత పాలు చేయడానికి వీళ్లంతా ప్రయత్నిస్తున్నారన్నారు. దేశంలోకి వచ్చే అన్ని భూ, విమాన, సముద్ర మార్గాలను మూసేస్తున్నామని.. ఆ నోట్లను వాళ్లు మళ్లీ ఇక్కడకు తేకుండా ఉండటానికే ఇలా చేస్తున్నామని అన్నారు. ఇంత తక్కువ సమయంలో ఈ నోట్లను రద్దుచేయడం సరికాదని, రిజర్వు బ్యాంకుకు మరింత పెద్దనోట్లు ముద్రించేందుకు తగినంత సమయం ఇచ్చి ఉండాల్సిందని వెనిజులా రిజర్వు బ్యాంకు మాజీ డైరెక్టర్, ప్రస్తుత విపక్ష సభ్యుడు జోస్ గువెరా అన్నారు. చమురు ఎగుమతులు కూడా పడిపోవడం వల్ల దేశంలో విదేశీ మారక ద్రవ్యం నిండుకుంటోంది. దీంతో ఆహారం, మందులు, ఇతర అత్యవసర వస్తువుల దిగుమతి కష్టం అవుతోంది. ఈ సంవత్సరాంతానికి అక్కడ ద్రవ్యోల్బణం 475 శాతం పెరుగుతుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది. -
అధ్యక్షుడు దిగిపోవాలంటూ ఫుడ్ ఎమర్జెన్సీ !
కారాకాస్ (వెనిజులా): వెనిజులాలోని రెండో అతిపెద్ద రాష్ట్రమైన మిరాండా పాఠశాలల్లో ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించారు. కేంద్రంలోని సోషలిస్టు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్ష పార్టీల సమ్మేళనం ‘డెమొక్రాటిక్ యూనిటీ రౌండ్ టేబుల్’కు చెందిన హెన్రిక్ కాప్రిల్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మిరాండా రాష్ట్ర గవర్నర్‌గా ఉన్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు నికోలస్ మదురో పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితికి వామపక్ష సోషలిస్టు ప్రభుత్వమే కారణమని, నికోలస్‌ను గద్దె దింపాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రజానీకానికి సరిపడా ఆహారం దేశంలో లేదంటూ కాప్రిల్స్ వ్యాఖ్యానించారు. ఈయన 2013 అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ చేతిలో ఓటమి పాలైన విషయం తెలిసిందే. చమురు నిక్షేపాల దేశంగా పేరొందిన వెనిజులా ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోవడంతో గత రెండేళ్లుగా గడ్డు పరిస్థితులు ఎదుర్కుంటోంది. ఫలితంగా దేశంలో ఆర్థిక పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి. ప్రభుత్వం గద్దె దిగాలంటూ పలుచోట్ల నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నారు.


