అమెరికా దుందుడుకుతనం | Sakshi
Sakshi News home page

అమెరికా దుందుడుకుతనం

Published Tue, Jan 29 2019 1:15 AM

Donald Trump Involvement In venezuela - Sakshi

అధ్యక్ష ఎన్నికల్లో రష్యాతో చేతులు కలిపి అడ్డదారులు తొక్కారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా అధినేత డోనాల్డ్‌ ట్రంప్‌ దాన్నుంచి దేశ ప్రజల దృష్టి మళ్లించడానికి వెనిజులాలో చిచ్చు రగిలిస్తున్నారు. నిరుడు మే నెలలో అక్కడ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిపాలైన విపక్షాన్ని ప్రోత్స హించి ఉద్యమాలతో ఆ దేశంలో అశాంతి సృష్టిస్తున్నారు. గత కొన్నిరోజులుగా వెనిజులా నిరసన లతో, సమ్మెలతో అట్టుడుకుతోంది. ప్రస్తుత దేశాధ్యక్షుడు నికోలస్‌ మదురోను ఎలాగైనా గద్దె దించా లన్నది అమెరికా లక్ష్యం. దీనికి యూరప్‌ యూనియన్‌(ఈయూ)లోని ప్రధాన దేశాలైన బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లు వత్తాసు పలుకుతున్నాయి. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న జువాన్‌ గైదో తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకోగా, ఆయన్ను గుర్తిస్తున్నట్టు ట్రంప్‌ ఆదరా బాదరాగా ప్రకటించారు. పైగా సైనిక దాడులకు దిగుతామని బెదిరిస్తున్నారు. అయితే ఈయూ దేశాలు మాత్రం తాము అమెరికా తోక పట్టుకుని పోవడం లేదని చెప్పడానికన్నట్టు వేరే పల్లవి అందుకున్నాయి.

ఎనిమిది రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని మదురోకు షరతు విధిం చాయి. అందుకు సిద్ధపడకపోతే గైదోను దేశాధ్యక్షుడిగా తాము కూడా గుర్తిస్తామని హెచ్చరిం చాయి. అసలు వేరే దేశంలో ఎవరు అధ్యక్షుడిగా ఉండాలో, ఎవరు ఉండకూడదో చెప్పడానికి వీరె వరు? వెనిజులా ప్రజలు తమను ఎవరు పాలించాలో తేల్చుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారా? అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందా? తాజా సంక్షోభంలో తాము మదురోకు అండగా నిలు స్తామని రష్యా, చైనా ప్రకటించాయి. మన దేశం కూడా వెనిజులా సమస్యల్ని అక్కడి ప్రజలే పరిష్క రించుకోవాలని సూచించింది. గైదోను గుర్తించేందుకు నిరాకరించింది.
 
వెనిజులాపై అమెరికా, పాశ్చాత్య దేశాల కడుపు మంట ఈనాటిది కాదు. అక్కడ అపారమైన చమురు, సహజవాయు నిక్షేపాలన్నాయి. అక్కడి భూగర్భంలో పసిడి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. అపురూపమైన వజ్రాలకు అది పెట్టింది పేరు. ఇంత సంపద ఉన్నప్పుడు ఎవరికైనా కన్నుకుట్టడం సహజం. పైగా ఆ దేశంలో వరసగా వచ్చిన ప్రభుత్వాలను గుప్పెట్లో పెట్టుకుని, అక్కడి సంపదను కొల్లగొట్టడం అలవాటు చేసుకున్న అగ్రరాజ్యాలకు 1999లో మొదటిసారి హ్యూగో చావెజ్‌ రూపంలో పెను సవాలు ఎదురైంది. ఆ దేశంలో రెండు ప్రధాన పార్టీలు ఎప్పుడూ ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటూ... ఒకరి తర్వాత మరొకరు పీఠం ఎక్కుతూ సహజ వనరులను బహుళజాతి సంస్థలకు దోచిపెడుతున్న తరుణంలో చావెజ్‌ ఆ రెండు పార్టీలకూ వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించాడు.

19వ శతాబ్దిలో స్పెయిన్‌ వలస దేశాలను ఏకం చేసిన వెని జులా జాతీయ యోధుడు సైమన్‌ బొలివర్‌ను ఆదర్శంగా తీసుకుని కుమ్మక్కు రాజకీయాలపై కత్తి దూశాడు. 1999 అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించి మొదలుకొని 2013లో మరణించేవ రకూ అధికారంలో కొనసాగారు. కేన్సర్‌ వ్యాధితో అంతిమ దశలో ఉండగా తన వారసుడిగా మదు రోను ప్రకటించారు. అదే ఆయనకు బలంగా మారింది. పాలనా సామర్థ్యంలో చావెజ్‌తో సరి తూగ కపోయినా... అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గాక ఇబ్బందులు తలెత్తినా ఉన్నం తలో మదురో మెరుగైన పాలనే అందించారు. అందుకే 2015లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సైతం ఆయనే విజయం సాధించారు. వాస్తవానికి తదుపరి ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగాల్సి ఉంది. కానీ విపక్షాల డిమాండ్‌కు తలొగ్గి నిరుడు మే నెలలో... అంటే 19 నెలల ముందు అధ్యక్ష ఎన్నికలు జరి పారు. ఆ ఎన్నికల్లో 67.84 శాతం ఓట్లు సాధించారు. అవి స్వేచ్ఛగా, పారదర్శకంగా జరిగాయని వివిధ దేశాల నుంచి పరిశీలకులుగా వచ్చిన 150మంది సంతృప్తి వ్యక్తం చేశారు. అందులో 8 దేశా లకు చెందిన 14మంది ఎన్నికల అధికారులు, సాంకేతిక సిబ్బంది ఉన్నారు.

 పైగా వెనిజులా ఎన్ని కల ప్రక్రియ అత్యంత పకడ్బందీగా ఉంటుంది. ఎన్నికలకు ముందు... అవి కొనసాగుతుండగా... పూర్తయ్యాక– ఇలా మూడు దఫాలుగా 18సార్లు ఈవీఎంలను తనిఖీ చేసే ప్రక్రియ తప్పనిసరి. ఇందులో యాదృచ్ఛికంగా ఎంపిక చేసే 53శాతం ఈవీఎంలను పరీక్షిస్తారు. ఈ ప్రక్రియనంతటినీ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. దొంగ ఓట్లకు అక్కడ ఆస్కారం ఉండదు. ఓటరు వేలిముద్రే అతడి/ఆమె గుర్తింపు కార్డు. అన్నిటికన్నా ముఖ్యమేమంటే... మదురో ప్రత్యర్థులెవరూ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించలేదు. 2015 పార్లమెంటరీ ఎన్నికల్లో మదురో పార్టీ కాకుండా, విపక్షాలే అత్యధిక స్థానాలు చేజిక్కించుకున్నాయి. నిజంగా అక్రమాలకు ఆస్కారం ఉంటే అది అసాధ్యమయ్యేది. వెనిజులా ఒడిదుడుకుల్లో ఉన్నమాట వాస్తవమే. కానీ ఆ ఒడిదుడుకులన్నీ అమెరికా ప్రాప కంతో సాగుతున్న దిగ్బంధం పర్యవసానంగా, చమురు ధరల కుంగుబాటు కారణంగా ఏర్పడ్డాయి. ఒబామా హయాంలో మొదలైన ఆంక్షలు ట్రంప్‌ వచ్చాక మరింత పెరిగాయి. వీటి విలువ దాదాపు 600 కోట్ల డాలర్లు. ఇవిగాక వెనిజులాకు దక్కాల్సిన చమురు సంస్థ లాభాలు 100 కోట్లను బదిలీ కాకుండా అమెరికా అడ్డగించింది. బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌లో వెనిజులాకు ఉన్న 120 కోట్ల డాలర్ల బంగారం నిల్వలు స్తంభింపజేసింది.

దేశంలో నిత్యావసరాల కొరత, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్బణం సరేసరి. నిజంగా వెనిజులా ప్రజల శ్రేయస్సుపై ఏ కాస్త ఆందోళన ఉన్నా అమెరికా ఇలాంటి దుర్మార్గ చర్యలకు పాల్పడదు. వారిని కష్టాలపాటు చేయదు. తాము సృష్టించి, పెంచుతున్న సంక్షో భానికి మదురోను బాధ్యుడిగా చేసి, ఆయన తప్పుకోవాలనటం అమెరికా వక్రబుద్ధికి తార్కాణం. ప్రజామోదంతో ఎన్నికైన ఒక దేశాధ్యక్షుణ్ణి బెదిరించడం, సైనికచర్యకు దిగుతాననడం దురహం కారం తప్ప మరేం కాదు. ఈ దురహంకారానికి ఇప్పటికే పలు దేశాలు బలయ్యాయి. వెనిజులాలో నెత్తురు పారకుండా, అరాచకం తాండవించకుండా, అస్థిరత దాన్ని చుట్టుముట్టకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచ పౌరులందరిదీ. ఈ విషయంలో మన దేశం వైఖరి హర్షించదగ్గది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement