కరాకస్: అత్యంత సాదాసీదా నేపథ్యం. పుట్టింది ఓ సామాన్య కార్మికుని కుటుంబంలో పనిచేసింది బస్సు డ్రైవర్‌గా. అలాంటి స్థాయి నుంచి ఏకంగా దేశాధ్యక్ష పీఠం దాకా! చివరికి నియంతగా అప్రతిష్ట మూటగట్టుకుని ఏ పెద్ద దేశం అధ్యక్షునికీ జరగని రీతిలో పరాయి దేశ బందీగా మారిన దైన్యం. వెనెజువెలా తాజా మాజీ అధ్యక్షుడు నికొలస్ మదురో ప్రస్థానం ఆద్యంతం ఆసక్తికరం
నికొలస్ మదురో 1962లో వెనెజువెలా రాజధాని కరాకాస్‌లో అతి సామాన్య కుటుంబంలో పుట్టారు. ఆయన బాల్యం సాధారణంగానే గడిచింది. చదువు హైసూ్కలు స్థాయి దాటలేదు. క్యూబాలో ఏడాది పాటు వామపక్ష సిద్ధాంతాల్లో శిక్షణ పొంది వచ్చారు. కార్మిక సంఘం నేత అయిన తండ్రి నుంచి నాయకత్వ వాసనలను మదురో బాగా వంటబట్టించుకున్నారు. 1992లో మాజీ అధ్యక్షుడు హ్యూగో చావెజ్ అధికార కైవసానికి విఫలయత్నం చేసిన రోజుల్లో ఆయన బస్సు డ్రైవర్‌గా పని చేస్తున్నారు. జైలుపాలైన చావెజ్ విడుదల కోసం జరిగిన ఉద్యమంలో ముందుండి నడిచారు.
మదురో జీవితంలో అదే కీలక మలుపు. చూస్తుండగానే చావెజ్ వామపక్ష ఎజెండాకు గట్టి మద్దతుదారుగా మారారు. ఆ క్రమంలో తండ్రిలా తానూ కార్మిక సంఘ నేత అయ్యారు. అనంతరం చావెజ్ సారథ్యంలోని యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనెజువెలాలో చేరి చకచకా కీలక స్థానానికి ఎదిగారు.
సత్యసాయి బాబా భక్తుడు
మదురోకు భారత్‌తో ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన పుట్టపర్తి సత్యసాయి బాబా భక్తుడు. సత్యసాయి బాబా బోధనలు, ఆధ్యాత్మికత ఆయనపై ప్రభావం చూపాయి. మదురో తరచుగా బాబా ఆశ్రమాన్ని సందర్శించేవారని, ఆయన బోధనలను తన జీవితంలో అనుసరించేవారని చెబుతారు.


