లిమా: ప్రపంచ రాజకీయాలపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం మరోసారి చర్చనీయాంశమైంది. బల్గేరియాకు చెందిన వంగాబాబా గతంలో యుద్ధాలు, విపత్తులు, నాయకుల పతనాలను ముందుగానే చెప్పి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు అదే తరహా జోస్యాలతో పెరూ శామన్లు రంగంలోకి వచ్చారు. కొత్త సంవత్సరం ముందు వారు వెనెజువెలా అధ్యక్షుడు నికోలాస్ మదురో త్వరలో అధికారాన్ని కోల్పోతారని ప్రకటించగా.. ఐదు రోజుల్లోనే అమెరికా ప్రత్యేక దళాలు ఆయనను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది
ఆధ్యాత్మిక జ్యోతిష్యం అనేది ప్రపంచ రాజకీయాలు, నాయకుల భవిష్యత్తు, దేశాల మార్పులు వంటి అంశాలను ఆధ్యాత్మిక దృష్టితో విశ్లేషించే ప్రత్యేక పద్ధతి. పెరూ దేశంలోని శామన్లు (ఆధ్యాత్మిక జ్యోతిష్కులు) ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరానికి ముందు ఇలాంటి జోస్యాలు చెబుతారు. ఆశ్చర్యకరంగా.. మదురోపై ఆధ్యాత్మిక జ్యోతిష్యం వెలుగులోకి వచ్చిన ఐదు రోజులకే అమెరికా వెనెజువెలాలో గోప్యంగా ఆపరేషన్ నిర్వహించింది.
ఈ చర్యలో మదురోను, ఆయన భార్యను అదుపులోకి తీసుకోవడం అంతర్జాతీయంగా పెద్ద చర్చాంశమైంది. సుదీర్ఘకాలంగా అమెరికా, పాశ్చాత్య దేశాలకు మదురోకు మధ్య వైరం కొనసాగుతోంది. దీనికి తోడు ఆయన పాలనపై అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలు, ఆర్థిక సంక్షోభం వంటి ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రత్యేక దళాలు మదురోను అదుపులోకి తీసుకున్నాయి.
పెరూ శామన్ల జోస్యం చెప్పిన కొద్ది రోజుల్లోనే మదురోను అమెరికా ప్రత్యేక దళాలు పట్టుకోవడం వెనెజువెలాలో రాజకీయ పరిస్థితులను పూర్తిగా మార్చేసింది. లాటిన్ అమెరికా దేశాలు ఈ సంఘటనపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కొందరు మదురో పతనాన్ని ప్రజాస్వామ్య విజయంగా భావిస్తుండగా, మరికొందరు అమెరికా జోక్యాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇలాంటి ఆధ్యాత్మిక జోస్యాలు గతంలో కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. బల్గేరియాకు చెందిన వంగాబాబా ‘బాల్కన్ నోస్ట్రడామస్’గా ప్రసిద్ధి పొందారు. ఆమె చేసిన అనేక జోస్యాలు.. ప్రపంచ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు, ఆర్థిక సంక్షోభాలు నిజమయ్యాయని అనేక మంది విశ్వసిస్తారు. వంగాబాబా జోస్యాలు ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినట్లే, ఇప్పుడు పెరూ శామన్ల జోస్యాలు అంతర్జాతీయ చర్చనీయాంశమవుతున్నాయి.


