వెనెజువెలాను మేమేం పాలించబోం | Trump Govt U turn on Venezuela Rule Delcy Rodriguez New Prez Details | Sakshi
Sakshi News home page

వెనెజువెలాను మేమేం పాలించబోం

Jan 5 2026 7:08 AM | Updated on Jan 5 2026 1:49 PM

Trump Govt U turn on Venezuela Rule Delcy Rodriguez New Prez Details

వెనెజువెలా విషయంలో అమెరికా యూటర్న్‌ తీసుకుంది. సురక్షితంగా అధికారాల బదిలీ జరిగేదాకా వెనెజువెలాను తామే నడిపిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.  అయితే.. ఇప్పుడు ఆ విషయంలో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. వెనెజువెలాను తాము పాలించబోమని.. తమ ఉద్దేశాలు వేరని స్పష్టం చేసింది. 

వెనెజువెలాను మేమే నడిపిస్తాం.. తర్వాత సురక్షితమైన అధికార బదిలీ చేస్తాం అంటూ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్పందించారు. "నడిపించడం" అంటే నేరుగా పాలన చేపట్టడం కాదు. వెనిజులా చమురు పరిశ్రమపై అమెరికా విధించిన ఆయిల్ బ్లాకేడ్ (oil blockade) ద్వారా ఒత్తిడి తెచ్చి మార్పులు సాధించడం అని  అన్నారు. 

‘దేశం సురక్షితమని భావించే వరకూ, సరైన, న్యాయమైన అధికారాల బదిలీ జరిగే వరకూ మా పాలనే ఉంటుంది. అమెరికా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేవారికి, అమెరికా ప్రజల జీవితాలను ప్రమాదంలో పడేసే వారికి ఇదో హెచ్చరిక. అత్యంత విజయవంతమైన ఆపరేషన్‌ను నిర్వహించాం’ అని ట్రంప్‌ ప్రకటించడం తెలిసిందే. అయితే ఆ ఉద్దేశం వేరని రూబియో అన్నారు.  

‘‘అమెరికా ఇప్పటికే వెనెజువెలా చమురు ట్యాంకర్లపై ఆంక్షలు విధించింది. వాటిని కొనసాగిస్తూ.. డ్రగ్ ట్రాఫికింగ్ ఆపడం, ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా చమురు పరిశ్రమను నడపడం మాత్రమే అమెరికా ముందు ఉన్న లక్ష్యం’ అని రూబియో తెలిపారు. వెనెజువెలాలో చమురు వ్యాపారం అస్తవ్యస్తంగా ఉందని, అమెరికాలోని పెద్ద కంపెనీలు అక్కడికి వెళ్లి మౌలిక వసతులను కల్పించి దేశం కోసం ఆదాయాన్ని సంపాదిస్తాయి అని ట్రంప్‌ చెప్పిన విషయాన్ని రూబియో ప్రదానంగా ప్రస్తావించారు.  అలాగే.. అమెరికా ప్రస్తుతం ఉన్న సైనిక శక్తి డ్రగ్ బోట్లు, ఆంక్షల ట్యాంకర్లను అడ్డుకోవడానికి సరిపోతుందని.. అవసరమైతే సైనిక ఉనికిని పెంచవచ్చని రూబియో తెలియజేశారు.

ట్రంప్‌ మరో వార్నింగ్‌.. 
ఒకవైపు రూబియో ప్రకటన వెలువడిన గంటల వ్యవదిలోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి వెనెజువెలాను రెండో సైనిక దాడి హెచ్చరికలు జారీ చేశారు. వెనెజువెలా తాత్కాలిక నాయకత్వం గనుక తమ ఆదేశాలను పాటించకపోతే మరోసారి దాడి జరగవచ్చని స్పష్టం చేశారాయన. ‘‘నికోలాస్ మదురోను అధికారంలో నుండి తొలగించిన తర్వాత వెనెజువెలా అమెరికా పర్యవేక్షణలోనే ఉంది. ఆ దేశాన్ని సరిచేయడం మా లక్ష్యం. అవసరమైతే మళ్లీ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నా’’ అని అన్నారాయన. 

‘‘వాషింగ్టన్ ఇప్పుడు ఆ నేలపై పరిస్థితిని పూర్తిగా నియం‍త్రిస్తోంది. అయితే ఎవరు బాధ్యత వహిస్తున్నారు? అని మాత్రం అడగకండి. ఎందుకంటే నేను చెప్పే సమాధానం చాలా వివాదాస్పదంగా ఉంటుంది’’  ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. 

ఇదిలా ఉంటే.. మదురోకు నమ్మకస్తురాలిగా పేరున్న డెల్సీ రోడ్రిగ్జ్‌ వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆ దేశ ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సుప్రీం కోర్టు సూచన, ఆర్మీ విజ్ఞప్తి, మరోవైపు వెనెజువెలా చట్టాల ప్రకారం ఆమె అధికార బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. 90 రోజులపాటు ఆమె అధికారంలో ఉంటారని రక్షణ మంత్రి పాడ్రినో పేరిట అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. అయితే అధికారికంగా ఎక్కడా దీనిపై ప్రకటన వెలువడలేదు. అయితే.. అమెరికాతోనూ ఆమెకు మంచి సంబంధాలు ఉన్నట్లు కొన్ని విశ్లేషణాత్మక కథనాలు వెలువడుతుండడం గమనార్హం.

ఇక అమెరికా చేస్తున్న ప్రకటనలను వెనెజువెలా ఒక్కొక్కటిగా ఖండిస్తూ వస్తోంది. తమ అధ్యక్షుడిని పట్టుకెళ్లడాన్ని అక్కడి ప్రభుత్వం "ఇంపీరియలిస్టు చర్య"గా అభివర్ణిస్తోంది. ప్రస్తుతం న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ జైల్లో మదురో, ఆయన సతీమణిని అమెరికా ఉంచింది. అక్కడి నుంచే ఆయన్ని డ్రగ్స్‌ ట్రాఫికింగ్‌ అభియోగాలపై విచారణ జరపనుంది ఫెడరల్‌ కోర్టు.

నేడు భద్రతా మండలి భేటీ
అమెరికా దాడులపై చర్చించేందుకు సోమవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశం కానుంది. రష్యా, చైనాల మద్దతుతో.. అత్యవసరంగా సమావేశం కావాలని కొలంబియా చేసిన విజ్ఞప్తితో ఈ సమావేశం ఏర్పాటైంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement