న్యూస్ మేకర్
‘ముళ్ల కిరీటం’ అనే మాట వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ విషయంలో అక్షరాలా సరిపోతుంది. ఒకవైపు అగ్రరాజ్యం అమెరికా కన్నెర్ర చేస్తోంది. ‘ఇలా చేయాలి...ఇలా మాత్రమే చేయాలి’ అంటూ శాసనాలు చేసే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు తన దేశ సార్వభౌమాధికారాన్ని, తమ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి ఏటికి ఎదురీదే ప్రయత్నం చేస్తున్నారు డెల్సీ రోడ్రిగ్స్...
నార్కో–టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి... మొదలైన ఆరోపణలతో వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో, ఆయన భార్య సిలియాను అమెరికన్ సైన్యం నిర్బంధించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ తాత్కాలిక అధ్యక్షురాలిగా, ఉపాధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించడంతో ‘ఎవరీ డెల్సీ రోడ్రిగ్స్?’ అనే ఆసక్తి మొదలైంది.
→ బాల్యం నుంచే పోరాట పాఠాలు
తండ్రి ఒడిలో చిన్నప్పటి నుంచి పోరాట పాఠాలు వింటూనే పెరిగిన డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా సుప్రసిద్ధ జన నాయకురాలిగా ఎదిగారు. తండ్రి జార్జ్ ఆంటోనియో వెనెజువెలాలోని ప్రసిద్ధ లెఫ్ట్–వింగ్ గెరిల్లా ఫైటర్. 1976లో ఆయన హత్యకు గురయ్యాడు.
→ చరిత్ర సృష్టించి...
సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా(యుసీవి) నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందిన డెల్సీ స్టూడెంట్ లీడర్‌గా చురుగ్గా ఉండేవారు. ఆ తరువాత కాలంలో ‘సెంట్రల్ యూనివర్శిటీ ఆఫ్ వెనెజువెలా’లో ప్రొఫెసర్‌గా, ‘వెనెజువెలా అసోసియేషన్ ఆఫ్ లేబర్ లాయర్స్ ప్రెసిడెంట్’గా పనిచేశారు. 2002లో జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఒక్కోమెట్టు ఎక్కుతూ మంత్రి స్థాయికి ఎదిగారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో డెల్సీని 2014లో ‘పాపులర్ పవర్ ఫర్ ఫారిన్ రిలేషన్స్’ మంత్రిగా నియమించారు. వెనెజువెలా చరిత్రలో ఆ పదవి చేపట్టిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు డెల్సీ.
→ ఉపాధ్యక్షురాలిగా...
వెనెజువెలా ఉపాధ్యక్షురాలిగా 2018లో నియామకం అయ్యారు డెల్సీ. వెనెజువెలా నిఘా సంస్థ బొలివేరియన్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌కి హెడ్ అఫీషియల్‌గా కూడా కీలక బాధ్యతలు నిర్వహించారు. 2020లో ‘పాపులర్ పవర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ వెనెజువెలా’ మంత్రిగా పనిచేశారు. చమురు, ఆర్థిక శాఖల మంత్రిగా దేశాన్ని ద్రవ్బోల్బణం బారిన పడకుండా చూశారు.
దేశాన్ని రక్షించుకుందాం...
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా నియామకం అయిన డెల్సీ రోడ్రిగ్స్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన హెచ్చరికలతో, తమ చెప్పుచేతల్లో ఉండాలని చెప్పకనే చె΄్పాడు. అయితే ట్రంప్ హెచ్చరికలను 56 ఏళ్ల డెల్సీ ఆట్టే ఖాతరు చేయలేదు. నికొలస్ మదురో, అతడి భార్యను నిర్బంధించడాన్ని ఆమె ఖండించారు. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘మదురోను కిడ్నాప్ చేశారు’ అని ఆరోపిస్తున్న డెల్సీ రోడ్రిగ్స్ ‘వెనెజువెలాని రక్షించుకోవడానికి, దేశంలో శాంతిభద్రతలు కాపాడుకోవడానికి ఐక్యంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. దేశ వనరులను కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేశారు.
గ్రేట్ ఫైటర్
నికోలస్ మదురోకు డెల్సీ రోడ్రిగ్స్ ప్రతిభాపాటవాలన్నా, నాయకత్వ సామర్థ్యమన్నా ఇష్టం. ఒకానొక సందర్భంలో ఆమెను ‘టైగర్’ అని అభివర్ణించారు. డెల్సీ ఉపా«ధ్యక్షురాలిగా నియమితురాలైన సందర్భంలో నికోలస్ మదురో ఆమెను...‘ధైర్యం మూర్తీభవించిన మహిళ. రాజకీయాల్లో తలపండిన అనుభవజ్ఞురాలు. అమరవీరుడి కుమార్తె. వెయ్యి యుద్ధాలతో పరీక్షించబడిన విప్లవకారిణి’ అని ఆకాశానికి కెత్తారు. డెల్సీని ‘టైగర్’ విత్ డిజైనర్ ఫ్యాషన్ టేస్ట్స్ అంటుంటారు. కమ్యూనికేషన్ అండ్ ఇన్‌ఫర్‌మేషన్ మినిస్టర్‌గా పనిచేసిన డెల్సీకి ఫ్యాషన్ డిజైనింగ్‌పై మంచి అవగాహన ఉంది.
ఏక్ లవ్‌స్టోరీ!
గతంలో డెల్సీ రోడ్రిగ్స్, నటుడు ఫెర్నాండో కారిల్లో ప్రేమికులు. ఈ జంట 2007 వరకు కలిసే ఉంది. టీవీ సోప్ ఒపేర స్టార్‌గా ఫెర్నాండో సుపరిచితుడు. ‘నేను ఆమెను ఏదో ఒకరోజు వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. అత్యంత తెలివైన మహిళలలో ఆమె ఒకరు’ అని డెల్సీ గురించి చెబుతుండే వాడు ఫెర్నాండో కారిల్లో. వినోదం, రాజకీయం అనే భిన్న ప్రపంచాలు ఒకే ప్రపంచం కావడానికి ఏర్పడిన వైరుధ్యాలో? ఇతరత్రా కారణాలో... తెలియదుగానీ వారు ఎక్కువ కాలం కలిసి ఉండలేక΄ోయారు. తాజా విషయానికి వస్తే... డెల్సీ రోడ్రిగ్స్ వెనెజువెలా అధ్యక్షురాలిగా నియామకం అయిన నేపథ్యంలో, ఆ రోజుల్లో డెల్సీపై ఫెర్నాండో కారిల్లో తన ప్రేమను ప్రకటించిన రోజును గుర్తు చేసుకుంటున్నారు నెటిజనులు.


