వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించి తీసుకెళ్తున్న అమెరికా సైన్యం
సందర్భం
ఇందులో కొత్తగా అర్థం చేసుకోవలసిన విషయాలేమీ లేవు. వెనిజులాపై సైనిక దాడి, అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణలో ఉన్నది తమ సామ్రాజ్యవాద ప్రయోజనాలేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తానే వివరించి చెప్పారు. అదీగాక, లాటిన్ అమెరికాతో కూడిన పశ్చిమార్ధ భూగోళం 1823 నాటి ‘మన్రో డాక్ట్రిన్’ నిర్దేశించినట్లు ఎప్పటికీ తమదిగానే ఉంటుందనీ, అందుకు అదనంగా ఇపుడు ‘ట్రంప్ డాక్ట్రిన్’ ప్రకారం అందుకోసం సైనిక బలాన్ని వినియోగించగలమనీ బాహాటంగా ప్రకటించారు. వెనిజులా ఆపరేషన్ తర్వాత ‘అందుకు విరుద్ధంగా మాట్లాడే ధైర్యం ఇక ఎవరికీ ఉండద’ని హెచ్చరించారు. నిజానికి ఈ ఆపరేషన్‌కు ముందు నవంబర్‌లో విడుదల చేసిన ‘జాతీయ భద్రతా వ్యూహ పత్రం’లో ఉన్నది కూడా ఇదే!
ఏ చట్టాలూ పాటించరా?
వెనిజులాలో అమెరికాది అతి నగ్నమైన సామ్రాజ్యవాద చర్యను ఇంత సూటిగా, అన్ని కోణాల నుంచి ట్రంప్ వివరించినట్లు ఆయన విమర్శకులు కూడా చెప్పలేరేమో! అమెరికా అధ్యక్షునిది అన్ని విషయాలలోనూ దాపరికం లేనితనమే. అందుకు ఆయనను అభినందించవచ్చు కూడా! ఒక్క విషయంలో మాత్రం మదురోపై అసత్య ప్రచారాలు చేశారు. ఆయన మాదక ద్రవ్యాలు ఉత్పత్తి చేసి, అందుకోసం స్వయంగా ఒక కంపెనీని నడుపుతూ, అమెరికాకు పెద్ద ఎత్తున రవాణా చేస్తున్నారని! ఇవి తప్పుడు ఆరోపణలని అమెరికన్ మీడియాయే పలుమార్లు రాసినందున ఆ విషయమై చర్చించటం వృథా.
పైగా, డ్రగ్స్ రవాణా కేసులలో శిక్షలు సైతం పడిన హోండురాస్ మాజీ అధ్యక్షుడు జువాన్ ఓర్లాండో తదితరులకు క్షమాభిక్ష ప్రకటించి జైలు నుంచి విడుదల చేసిన ట్రంప్, మాదక ద్రవ్యాల కారణంగా మదురోపై చర్య తీసుకుంటున్నట్లు వాదించటం హాస్యాస్పదమని అమెరికన్ మీడియా కొట్టివేస్తున్నది. మాదకద్రవ్యాల రవాణా జరుగుతున్నదంటూ ఇటీవలి వారాలలో సుమారు 30 వెనిజులా పడవలపై బాంబింగ్ చేసి, 100 మందికి పైగా ప్రాణాలు తీసినదంతా ఎటువంటి ఆధారాలు చూపకుండా, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా జరిగిన విషయాన్ని అదే మీడియా గుర్తు చేస్తున్నది. అమెరికా ప్రజాప్రతినిధులు, నిపుణులు పలువురు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. వారిలో ట్రంప్‌కు చెందిన రిపబ్లికన్లు సైతం ఉన్నారు. చర్చలకు సిద్ధమని మదురో ప్రకటించిన కొద్ది రోజులకే ఈ చర్య జరగటం గమనించదగ్గది.
ఈ విధమైన దాడి చేయవలసిన అగత్యం ఇపు డేమి ఏర్పడింది? చమురు నిల్వల స్వాధీనం మాత్ర మేనా, మరేమైనా ఉందా? మదురోను పదవీచ్యుతు డిని చేయటంతో వెనిజులా తమ అధీనంలోకి వచ్చి నట్లేనా? మదురో స్థానంలోకి వచ్చిన ఉపాధ్యక్షు రాలు డెల్సీ రోడ్రిగ్జ్ తాము కోరుకున్నట్లు పాలించ గలరన్న సూచన జరిగేదేనా? అంతిమంగా అధికారం ‘భద్రంగా, సవ్యంగా, న్యాయబద్ధంగా’ మరొకరికి బదిలీ కావటం అంటే ఏమిటి? అంతవరకు వెని జులాను ‘తామే పాలించగల’మన్న ట్రంప్ ప్రకటన ఆచరణ సాధ్యమేనా? ఈ చర్యకుగానీ, ఆయన చేసిన ప్రకటనలకు గానీ అర్థం, అమెరికా తమ సామ్రాజ్య వాద ప్రయోజనాల కోసం తన చట్టాలకు గానీ,అంతర్జాతీయ చట్టాలకు గానీ ఎంతమాత్రం కట్టుబడి ఉండబోదని స్పష్టంగా ప్రకటించటమేనా?
మేమే బాస్!
దాడికి కారణం చమురు నిల్వలన్నది విస్తారంగా వినవస్తున్న మాట. కానీ అది ఒక కోణం. ‘మన్రో డాక్ట్రిన్’ ప్రకారం తమ ఇలాకాగా పరిగణించే లాటిన్ అమెరికాలో తమను ధిక్కరించే ప్రభుత్వాలు గానీ, వామపక్ష ప్రభుత్వాలు గానీ ఏర్పడితే కూలదోయటం గత 70 ఏళ్లలో కనీసం 15 సార్లు జరిగింది. వెనిజులా ప్రభుత్వం కూల్చివేతకు హ్యూగో ఛావేజ్ కాలం నుంచి 20 ఏళ్లకు పైగా ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇది నేపథ్యం కాగా, వెనిజులా సహా పలు లాటిన్ అమెరికన్ దేశాలలో కొంత కాలంగా రష్యా, చైనాల ప్రాబల్యం క్రమంగా పెరుగుతుండటం ట్రంప్‌కు అన్నింటికీ మించిన ఆందో ళనగా మారింది.
ప్రస్తుత దాడి సందర్భంగా ఆయన మన్రో డాక్ట్రిన్, ట్రంప్ డాక్ట్రిన్ ప్రస్తావనలు, పశ్చిమార్ధ గోళం వైపు ఇక ఎవరూ కన్నెత్తి చూసే సాహసం చేయలేరన్న హెచ్చరికలు, తమ సైనిక బలం గురించిన మాటలు, ఇవన్నీ అటువంటి ఆందోళన నుంచి వచ్చినవే. చమురు ఆ తర్వాతి సంగతి. అమెరికా ప్రాబల్యం ఇతరత్రా కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతకాలంగా బలహీనపడుతున్నందున, పశ్చిమార్ధ గోళంలో, దానితో పాటు పశ్చిమాసియాలో తమ బలాన్ని ఏ విధంగానైనా నిలుపుకొని తీరాలన్నది ట్రంప్ పట్టుదల. వెనిజులాపై దాడి, అదే పని చేయగలమంటూ ఇరాన్‌కు హెచ్చరికలు, ఇజ్రాయెల్ ద్వారా పాలస్తీనా ఆక్రమణ వంటి చర్యల ద్వారా ఆ లక్ష్యం దీర్ఘకాలంలో ఎంతవరకు నెరవేరగలదన్నది వేచి చూడాల్సిన విషయం.
పోతే, వెనిజులాలో ఉపాధ్యక్షురాలి నాయకత్వాన కొనసాగుతున్న ప్రభుత్వం, సైన్యం కూడా ట్రంప్ దాడిని ఖండిస్తూ, ‘తమ దేశం ఎప్పటికీ అమెరికన్ వలస కాబోద’ని స్పష్టం చేశాయి. అటువంటి స్థితిలో అధి కారం ‘భద్రంగా న్యాయబద్ధంగా’ బదిలీ కావటం ఏ విధంగా ఆచరణ సాధ్యం? బలమైన సోషలిస్టు శక్తులు, ఆ ప్రాంతమంతటా గెరిల్లా గ్రూపులు, అదే మూడ్‌లో ఉన్న వెనిజులా సైన్యం దృష్ట్యా పరిణామాలు ఏ
విధంగా ఉండవచ్చు? కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఆర్థిక, రాజకీయ, సైనిక జోక్యాలు, ఎన్నికైన ప్రభుత్వాలను ‘నియంతృత్వ’మనే ప్రచారాలతో పడగొట్టడాలతో లాటిన్ అమెరికా అంతటా ప్రజాభిప్రాయం చాలావరకు అమెరికాకు వ్యతిరేకంగా ఉంది. అమెరికాపై విమర్శలు యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయి.
ప్రపంచం దృష్టి నుంచి అంతిమంగా తేలే ప్రశ్న: రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఉదారవాద వ్యవస్థలు, అంతర్జాతీయ వ్యవస్థలు, అంతర్జాతీయ నియమ నిబంధనల మేరకు పరస్పర సంబంధాలు, దేశాల స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం వంటివి బలహీనపడుతున్నా ఇంకా నిలిచి ఉంటాయా, లేక అమెరికా సామ్రాజ్యవాదానికి మరింత బలవుతాయా అన్నది. బలి చేయటమేనన్నది నిర్ణయమైతే ట్రంప్ గురి క్రమంగా బహుళ ధ్రువ ప్రపంచం, బ్రిక్స్, ఎస్‌సీఓ, డీ–డాలరైజేషన్ ప్రయత్నాల వైపు మళ్లుతుంది.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


