బీజింగ్: వెనెజువెలాపై అమెరికా దాడులను చైనా తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు చైనా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘అమెరికా దుస్సాహసానికి తెగబడింది. సార్వభౌమ దేశమైన వెనెజువెలాపై సైనికశక్తిని దుర్వినియోగం చేయడం నేరం. ఇది అంతర్జాతీయ చట్టాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది.
అలాగే, అమెరికా పాల్పడే ఇలాంటి చర్యలు లాటిన్ అమెరికా, కరేబియన్ ప్రాంతాల్లో శాంతిభద్రతలకు గొడ్డలిపెట్టుగా తయారవుతున్నాయి. మేం ఈ దాడులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతర్జాతీయ న్యాయ నిబంధనలను అమెరికా తూచా తప్పకుండా పాటించాల్సిందే. ఐరాస నిబంధనలు, చట్టాలు, చార్టర్‌కు విలువ ఇచ్చి తదనుగుణంగా నడుచుకోవాల్సిందే. తమతో విబేధించే దేశాల సార్వభౌమత్వం, భద్రతను ముప్పువాటిల్లేలా ప్రవర్తించే పెడపోకడలకు అమెరికా స్వస్తిపలకాలి’’ అని చైనా ఘాటు వ్యాఖ్యలు చేసింది. మరోవైపు.. వెనెజువెలాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలను ప్రపంచదేశాలు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించాయి. సార్వభౌమదేశంపై ఏకపక్షంగా దాడులు చేసే అధికారం అమెరికాకు ఎవరిచ్చారని నిలదీశాయి. దాడులపై ఐక్యరాజ్యసమితి సైతం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
ఇదిలా ఉండగా.. మదురో శకానికి తెర పడటం ఖాయమైన నేపథ్యంలో అమెరికా ఆశీస్సులున్న మచాడోయే అధ్యక్ష పీఠం ఎక్కడం ఖాయమని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే విపక్ష నేత మచాడోకు అమెరికా మొదటినుంచీ దన్నుగా నిలుస్తూ వస్తోంది. తన నోబెల్ బహుమానాన్ని ట్రంప్‌కు అంకితమిస్తున్నట్టు ఆమె చేసిన ప్రకటనపై ఆశ్చర్యం వ్యక్తమైంది. అంతా భావిస్తున్నట్టుగా అమెరికా ఆశీస్సులతో మచాడో గద్దెనెక్కినా అగ్రరాజ్యం పడగ నీడన దేశవాసుల ప్రజాస్వామిక ఆకాంక్షలను నెరవేర్చడం, దేశ పరిస్థితులను గాడిన పెట్టడం ఆమెకు కత్తిమీద సామే కానుంది.


