అమెరికా, ఇరాన్ మధ్య పతాక స్థాయికి ఉద్రిక్తతలు చేరుకున్నాయి. ఇరాన్‌పై సైనికదాడికి అమెరికా సిద్ధమవుతుంది. ఇరాన్‌పై సైనిక చర్యపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో యుద్ధవిమానాలు, నౌక దళాలను యూస్ మోహరించింది. శనివారం లేదా ఆదివారం ఇరాన్‌పై క్షిపణి దాడులు జరిగే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్ తన సలహాదారులతో చర్చిస్తున్నారని వైట్‌హౌజ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమాలు, అంతర్గత అణచివేతపై ట్రంప్ సీరియస్‌గా ఉన్నారని.. దీంతో ఇరాన్‌పై అమెరికా భారీ దాడులకు దిగవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. గత ఏడాది ఇరాన్‌పై ఇజ్రాయెల్ యుద్ధం కన్నా భారీ స్థాయిలో ఈ సైనిక చర్య ఉండవచ్చని తాజా నివేదికలు చెబుతున్నాయి.
కాగా, అమెరికా తన అతిపెద్ద విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్’ను ఈ ప్రాంతానికి తరలించడంపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. అమెరికా నౌకాదళాన్ని సముద్ర గర్భంలో ముంచేయగల క్షిపణులు తమ వద్ద ఉన్నాయని, అగ్రరాజ్య సైన్యం కోలుకోలేనంతగా దెబ్బతినడం ఖాయం అంటూ ఆయన ట్రంప్‌ను హెచ్చరించారు.
కాగా, రెండు రోజుల క్రితం(మంగళవారంట) వివాదాస్పద అణు కార్యక్రమానికి ఇరాన్ చరమగీతం పాడాలన్న ప్రధాన డిమాండ్‌తో గతంలో జరిగిన తొలి దఫా పరోక్ష అణు చర్చలకు కొనసాగింపుగా జెనీవాలో ఇరాన్, అమెరికాల మధ్య మరోదఫా చర్చలు జరిగాయి. జెనీవాలోని ఒమర్ దౌత్యవేత్త అధికారిక నివాసంలో ఒమన్ మధ్యవర్తులతో వేర్వేరుగా అమెరికా, ఇరాన్ ప్రతినిధులు చర్చలు జరిపారు.

ఈసారి రెండో రౌండ్ చర్చలు కేవలం మూడు గంటల్లోనే ముగియడం గమనార్హం. రెండో రౌండ్ భేటీలో ఏఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయో తెలియరాలేదు. పరోక్ష చర్చల్లో అమెరికా తరఫున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, పశ్చిమాసియాలో ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్‌లు పాల్గొన్నారు. ఇరాన్ తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ హాజరయ్యారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ ముడి చమురు రవాణా నౌకల రాకపోకలను స్తంభింపజేస్తూ హార్ముజ్ జలసంధిని ఇరాన్ కొన్ని గంటలపాట మూసేసింది.


