ఏళ్ల తరబడి ఎదురు చూడక తప్పదా?
వెనెజువెలాలో పడకేసిన చమురు పరిశ్రమ
మౌలిక వ్యవస్థల పునరుద్ధరణ తప్పనిసరి
కనీసం పదేళ్లు పట్టొచ్చంటున్న నిపుణులు
వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అనూహ్య దాడితో బంధించి పట్టితీసుకొచ్చాక ఆ దేశంలోని చమురు నిల్వలపై అమెరికా దిగ్గజ కంపెనీలన్నింటికీ అజమాయిషీ లభించేలా అన్ని చర్యలూ తీసుకుంటామని అమెరికాఅధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ ఇది ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చని చమురు రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. వెనెజువెలా చమురు పరిశ్రమ కొన్నేళ్లుగా దాదాపుగా పడకేసింది.
మదురో హయాంలో చమురు వెలికితీత వ్యవస్థల్లో చాలావరకు పదేళ్లకు పైగా నిరుపయోగంగా ఉండిపోయాయి. దాంతో అవేవీ ఇప్పటికిప్పుడు చమురు వెలికితీత పనుల్లోకి దిగే పరిస్థితుల్లో లేవు. వాటిని తిరిగి ఓ రూపానికి తెచ్చి సిద్ధం చేసేందుకు చాలా సంవత్సరాల సమయం పడుతుందని అంచనా. ఈ పరిస్థితికి ఒకరకంగా అమెరికాయే కారణం కావడం విశేషం.
ఈ దేశంపై అమెరికా విధించిన తీవ్ర ఆంక్షల వల్లే చాలా దేశాలకు వెనెజువెలా చమురును విక్రయించలేకపోయింది. చైనా, భారత్ తదితర కొద్ది దేశాలు మాత్రమే వెనిజువెలా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నాయి. అమెరికా ఆంక్షలకు జడిసి చాలా దేశాలు వెనెజువెలా చమురును కొనేందుకు సాహసించలేదు. కొనేందుకు ఎవరూ రాక, గిరాకీ లేక చమురు వెలికితీతను వెనిజువెలా భారీగా తగ్గించుకోవాల్సి వచ్చింది.
అలా ప్రస్తుతం కేవలం రోజుకు 11 లక్షల బ్యారెళ్ల చమురు వెలికితీస్తోంది. అదే ఆంక్షల ఊసు లేని రోజుల్లో అంటే 1999 ఏడాదిదాకా రోజుకు ఏకంగా 40 లక్షల బ్యారెళ్ల దాకా ముడిచమురును వెలికితీసేది. వెనెజువెలా చమురు క్షేత్రాలకు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే కనీసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి, పదేళ్ల శ్రమ అవసరం అవుతాయని అమెరికాలోని ‘రైస్ యూనివర్సిటీ’లో లాటిన్ అమెరికా ప్రాంత ఇంధన విభాగ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో మొనాల్డీ అంచనావేశారు.
కంపెనీలు ముందుకొచ్చేనా?
వెనిజువెలాలో ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో చమురు నిల్వలు ఉన్నాయి. కనీసం 303 బిలియన్ బ్యారెళ్ల మేరకు చమురు ఉందని ఒక అంచనా. యావత్ ప్రపంచ చమురు నిల్వల్లో ఇది ఏకంగా 17 శాతానికి సమానం. ఇంతటి అపార చమురు నిల్వలపై అజమాయిషీ, పూర్తిస్థాయి గుత్తాధిపత్యం సాధించేలా అన్ని చర్యలూ తీసుకునేందుకు ట్రంప్ సన్నద్ధమవుతున్నారు. అయితే నాయకత్వ సంక్షోభం తలెత్తితే మాత్రం ట్రంప్ ఎంత నచ్చజెప్పినా అమెరికా చమురు దిగ్గజాలు అక్కడ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ఏ మేరకు ముందుకొస్తాయన్నది అనుమానమే.
రాజకీయ అనిశ్చితి కొనసాగే పరిస్థితుల్లో బిలియన్ల కొద్దీ డాలర్లను వెచ్చించి రిస్కు తీసుకునేందుకు అవి వెనకాడవచ్చు. ప్రస్తుతానికైతే ఈ విషయంలో అత్యంత సందిగ్ధ పరిస్థితే నెలకొని ఉంది. దీనికి ట్రంప్ ఎలాంటి పరిష్కారం చూపుతారన్నది ఆసక్తికరం. ఒకవేళ అమెరికా కంపెనీలు రంగంలోకి దిగి చమురు క్షేత్రాల పునరుద్ధరణపై భారీ మొత్తాలే వెచ్చించినా అవన్నీ సిద్ధమయ్యేందుకు చాలాకా లమే పడుతుందని ఇంధనధరల సరళిపై అధ్యయ నం చేసే గ్యాస్‌బడ్డీ సంస్థలో ప్రధాన పెట్రోలియం విభాగ నిపుణుడు ప్యాట్రిక్ డీ హాన్ వ్యాఖ్యానించారు.
‘‘చమురు వెలికితీత వ్యవస్థల పునరుద్ధణ ఒక అంశమైతే, రాజకీయ సుస్థిరత అత్యంత కీలకమైన మరో అంశం. తమ పెట్టుడులకు భరోసా కల్పించే సుస్థిరమైన ప్రభుత్వం ఉందని విశ్వసిస్తేనే బడా కంపెనీలు వెనిజువెలాలో అడుగుపెడతాయి. ఆ నమ్మకం లేనంతకాలం పెట్టుబడుల వరద పారడం చాలా కష్టం’’ అని మొనాల్డీ విశ్లేషించారు. బహుశా ఈ పరిస్థితులను ఊహించే మదురోను నిర్బంధించే క్రమంలో అమెరికా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది.
శనివారం నాటి క్షిపణి, బాంబు దాడుల్లో వెనిజువెలా కీలక చమురు క్షేత్రాల్లో కనీసం ఒక్కటి కూడా దెబ్బ తినకుండా జాగ్రత్త పడింది. వెనెజులా నుంచి ముడిచమురు వెలికితీతను అనూహ్యవేగంగా మొదలెడితే చమురురంగంలో గల్ఫ్ దేశాలను తోసిరాజని అమెరికాయే కింగ్‌మేకర్‌గా మారడం ఖాయంగా కన్పిస్తోంది. భారీ పరిమాణంలో చమురు అందుబాటులోకి వస్తుంది గనుక ఇప్పటికే నేలచూపులు చూస్తున్న చమురు ధరలు కనీసం మరికొన్నేళ్లపాటు చౌకగానే అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
నాణ్యమైన చమురు
వెనెజువెలాలో దొరికేది హెవీ క్రూడ్‌గా పేర్కొ నే అత్యంత నాణ్యమైన చమురు. దాని నుంచి డీజిల్‌తో పాటు భారీ పరికరాల కోసం వాడే అస్ఫాల్ట్ తదితర ఇంధనాలు తయా రవుతాయి. అందుకే అక్కడి చమురుపై భారీ ఇంధన కంపెనీలన్నింటికీ మొదటినుంచీ ఆసక్తి. ఒకప్పట్లా మళ్లీ భారీ పరిమాణంలో అంతర్జాతీయ మార్కెట్లోకి వచ్చిందంటే ప్రధానంగా నష్టపోయేది రష్యానే. అమెరికా, యూరప్ దేశాలు ఆంక్షలు విధించినా రష్యా తట్టుకుని నిలుస్తోందంటే చమురు విక్రయాల పుణ్యమే.
చట్టపరమైన చిక్కులు
వెనిజువెలా చమురును అమెరికా చేజిక్కించుకోవడం అంత సులువేమీ కాదని న్యాయ నిపుణులు వాదిస్తున్నారు. ‘‘ట్రంప్ చర్యను వెనిజువెలా కచ్చితంగా అంతర్జాతీయ న్యాయ వ్యవస్థల ముందు సవాలు చేయవచ్చు. చమురు ఉత్పత్తి పెరుగుదలతో ప్రధానంగా నష్టపోయే రష్యానో, లేదంటే ఏ ఇతర దేశమో కూడా మదురో నిర్బంధాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే ఆస్కారం లేకపోలేదు.


