
రూ. 438 కోట్లు ఇస్తామన్న అమెరికా
వాషింగ్టన్: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్టుకు సమాచారం ఇచ్చిన వారికి రూ.438 కోట్లు బహుమానంగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. మదురోను ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్‌గా అభివర్ణించింది. గతంలో రూ.250 కోట్లుగా ఉన్న బహుమతిని మళ్లీ పెంచినట్లు అమెరికా అటార్నీ జనరల్ పామ్ బోండీ ప్రకటించారు. మదురోకి డ్రగ్స్ స్మగ్లర్లతో నేరుగా సంబంధాలున్నాయని ఆమె ఆరోపించారు.
మదురో, అతని సహచరులతో సంబంధం ఉన్న 30 టన్నుల కొకైన్‌ను డ్రగ్ ఎన్‌పోర్స్‌మెంట్ అడ్మిని్రస్టేషన్ (డీఈఏ) స్వా«దీనం చేసుకుందని, అందులో 7 టన్నులు మదురోకి చెందినవని అన్నారు. ఈ ఆరోపణలను వెనిజులా విదేశంగ మంత్రి ఇవాన్ గిల్ ఖండించారు. బహుమతి ప్రకటనను రాజకీయ ప్రచారంగా అభివరి్ణంచారు. తమ దేశ గౌరవం అమ్మకానికి లేదన్నారు. జెఫ్రీ ఎపిస్టీన్ కేసు వ్యవహారంలో విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే బోండీ ఈ చర్య తీసుకున్నారని ఆయన ఆరోపించారు.
మొదటి పదవీకాలం నుంచే..
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మదురోపై చాలాకాలంగా విమర్శలు చేస్తున్నారు. తన తొలి పదవీకాలంలోనే మదురో, పలువురు ఉన్నతాధికారులపై డ్రగ్ ట్రాఫికింగ్, నార్కో టెర్రరిజం, అవినీతి ఆరోపణలు మోపారు. మదురో కొలంబియా రెబెల్ గ్రూప్ ‘ఫార్క్’తో కలిసి కొకైన్‌ను అమెరికాకు పంపేందుకు ప్రయతి్నంచారని ఆరోపించారు. ఆ సమయంలో మదురో అరెస్టుకు రూ.150 కోట్ల బహుమతిని ప్రకటించారు. బైడెన్ పాలనలో ఆ మొత్తాన్ని 250 కోట్లకు పెంచింది. 2024 జూలై 29న వెనిజులా అధ్యక్ష ఎన్నికల్లో నికోలస్ మదురో గెలిచారు. ప్రతిపక్ష అభ్యర్థి ఎడ్మండో గొంజాలెజ్‌పై విజయం సాధించారు.
మూడోసారి అధ్యక్షపీఠాన్ని అధిష్టించారు. బస్సు డ్రైవర్ నుంచి రాజకీయవేత్తగా ఎదిగిన మదురో వివాదాస్పదంగా నిలిచారు. హ్యూగో చావెజ్ మరణం తరువాత 2013లో యునైటెడ్ సోషలిస్టు పార్టీ బాధ్యతలు తీసుకున్నారు. 2024 ఎన్నికల్లో మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలతో అమెరికా వెనిజులాపై ఆంక్షలు విధించింది. మదురోను అధ్యక్షుడిగా తిరస్కరించింది. అమెరికాతోపాటు యురోపియన్ యూనియన్, యూకే కూడా వెనిజులా చర్యలను ఖండించాయి. తమ దేశంలో తవ్వకాలు జరిపేందుకు అమెరికా చమురు దిగ్గజం చెవ్రాన్‌ను అనుమతించడంతో వెనిజులాపై కొన్ని ఆంక్షలను సడలించింది.