అందరికంటే ముందే సంబరాలో మునిగిపోయిన దక్షిణ పసిఫిక్ దేశాలు
మెల్‌బోర్న్/న్యూఢిల్లీ: కొత్త ఆశలను మోసుకొచ్చిన నూతన సంవత్సరానికి ప్రపంచదేశాలు ఆనందోత్సాహల నడుమ సాదర స్వాగతం పలికాయి. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్‌లో అత్యంత ఆడంబరంగా జరిగే బాల్ డ్రాప్ వేడుక కంటే 18 గంటలు ముందుగానే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలోని కిరిటిమాటి ద్వీపవాసులు నూతన ఏడాది వేడుకలను జరుపుకున్నారు.
స్థానికకాలమానం ప్రకారం కొత్త ఏడాది అన్నిదేశాలకంటే ముందుగా అక్కడే మొదలైంది. ఏటా డిసెంబర్ 31 అర్ధరాత్రి ఆ్రస్టేలియాలోని సిడ్నీ నగర హార్బర్ బ్రిడ్జిపై కన్నులపండువగా జరిగే బాణసంచా షోను చూసేందుకు జనం ఈసారి సైతం తండోపతండాలుగా తరలివచ్చారు. అయితే రెండు వారాల క్రితం బాండీ బీచ్ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈసారి జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఆ్రస్టేలియాపోలీసులు మునుపెన్నడూ లేనంతగా మొహరించారు.
చాలా మంది పోలీస్ అధికారులు తొలిసారిగా ర్యాపిడ్‌ఫైర్ రైఫిళ్లను వెంటేసుకుని తిరిగారు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్ సిటీలో ప్రఖ్యాత స్కై టవర్‌పై పేల్చిన బాణసంచా అక్కడి వారికి కనువిందుచేసింది. ఆ్రస్టేలియా సమీప ఇండోనేసియాలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. నెల క్రితమే వేయి మందికిపైగా ప్రజలను వరదలు కబళించిన బాధ నుంచి జనం తేరుకుని కొత్త ఏడాది వేడుకల్లో మునిగిపోయారు.
అయితే ఇండోనేసియాలోని బాలీలో మాత్రం భారీ వేడుకలను ఈసారి రద్దుచేశారు. జపాన్‌లో జనం కొత్త ఏడాది గంట కొట్టగానే బౌద్ధారామాలను దర్శించుకున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్ వాసులూ తమదైన శైలిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. జర్మనీలోని బెర్లిన్ నగర క్యాథడ్రల్, ప్రఖ్యాత బ్రాండెన్‌బర్గ్ గేటు వద్ద జనం పోగై ఒకరికొకరు నూతన సంవత్సర శుభకాంక్షలు చెప్పుకున్నారు. భారత్‌లో ఊరూవాడా జనం సంబరాల్లో మునిగిపోయారు.


