తొలి బోర్డు పరీక్షలకు హాజరు తప్పనిసరి  | Mandatory to appear in first board exam for Class 10 students | Sakshi
Sakshi News home page

తొలి బోర్డు పరీక్షలకు హాజరు తప్పనిసరి 

Feb 17 2026 6:24 AM | Updated on Feb 17 2026 6:24 AM

Mandatory to appear in first board exam for Class 10 students

టెన్త్‌ వార్షిక పరీక్షలపై సీబీఎస్‌ఈ 

కనీసం మూడు సబ్జెక్టులైనా రాయాలి 

లేదంటే రెండో బోర్డు పరీక్షలకు అనర్హులు 

వారు వచ్చే సంవత్సరంలో రాయాల్సిందే 

న్యూఢిల్లీ: పదో తరగతి వార్షిక పరీక్షల విషయంలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) సోమవారం కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది నుంచి వార్షిక పరీక్షలను రెండుసార్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వాటిలో తొలి విడత బోర్డు పరీక్షలను రాయడం విద్యార్థులందరికీ తప్పనిసరి అంటూ సీబీఎస్‌ఈ స్పష్టత ఇచి్చంది. ‘‘విధిగా కనీసం మూడు సబ్జెక్టుల్లో పరీక్షలు రాసి తీరాల్సిందే. అలా రాయని వారిని ‘ఎసెన్షియల్‌ రిపీట్‌’కేటగిరీగా పరిగణిస్తాం. 

వారిని మేలో జరిగే రెండో బోర్డు పరీక్షల్లో రాసేందుకు అనుమతించబోం. వారు తిరిగి వచ్చే విద్యా సంవత్సరంలోనే వార్షిక పరీక్షలు రాయాల్సి ఉంటుంది’’అని ప్రకటించింది. సీబీఎస్‌ఈ పదో తరగతి, 12వ తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం నుంచి మొదలవుతున్న నేపథ్యంలో బోర్డు ఈ మేరకు వెల్లడించింది. 2026 నుంచి ఏటా రెండుసార్లు వార్షిక పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్‌ఈ బోర్డు నిర్ణయించడం తెలిసిందే.

 దానిప్రకారం తొలి విడత పరీక్షలను ఫిబ్రవరిలో నిర్వహించి ఏప్రిల్లో ఫలితాలు వెల్లడిస్తారు. అనంతరం మేలో రెండో విడత పరీక్షలు జరుగుతాయి. ‘‘మార్కులు పెంచుకోదలచిన విద్యార్థులు వాటిని రాయవచ్చు. అయితే ఏవైనా మూడు సబ్జెక్టుల్లో మాత్రమే రెండోసారి పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు’’అని సీబీఎస్‌ఈ పరీక్షల కంట్రోలర్‌ సన్యం భరద్వాజ్‌ వివరించారు. తొలి బోర్డు పరీక్షల్లో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిలైన విద్యార్థులను కంపార్ట్‌మెంట్‌ విభాగంలో మేలో రెండో బోర్డు పరీక్షలకు అనుమతిస్తారని తెలిపారు.  

 

Advertisement
 
Advertisement
Advertisement