
స్కామ్ కాదు.. మాల్‌ప్రాక్టీస్ అని కొట్టేస్తున్న విశ్వవిద్యాలయం
ఏదో హడావుడి చేస్తూ డైవర్షన్ టెక్నిక్ పాటిస్తున్న అధికారులు
సాక్షి వరుస కథనాలతో కాలేజీలతో వర్సిటీ కాన్ఫరెన్స్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో మార్కుల స్కామ్‌పై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. అసలది స్కామే కాదు.. మాల్‌ప్రాక్టీస్ జరిగి ఉంటుందని డైవర్షన్ చేయడంలో ఆరోగ్య విశ్వవిద్యాలయం అధికారులు తలమునకలవుతున్నారు. విజయవాడలోని సిద్ధార్థ వైద్యకళాశాలలో మాస్ కాపీయింగ్ ఘటనలో అక్రమాలను తొక్కిపెట్టినట్లే ఇప్పుడు కూడా తూతూ మంత్రంగా హడావుడి చేస్తున్నారని వైద్యవర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ఎంబీబీఎస్ వార్షిక పరీక్షల్లో కొందరు విద్యార్థులకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చెన్ (ఎంసీక్యూ) పేపర్‌లో అన్ని సబ్జెక్టుల్లో 20కి 19 మార్కులు వచ్చాయి. ఇలా వచ్చినవారు థియరీలో రాణించలేకపోవడంతో పాటు ఒకటిరెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించింది. ఆరోగ్య విశ్వవిద్యాలయం పరీక్షల విభాగంలోని కొందరు అధికారులు, సిబ్బంది బయటి వ్యక్తులతో చేతులు కలిపి విద్యార్థుల నుంచి సబ్జెక్టుకు రూ.మూడు లక్షల నుంచి రూ.నాలుగు లక్షలు వసూలు చేసి స్కామ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఊపందుకున్నాయి.
ఈ నేపథ్యంలో లోతైన విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోయింది. సుడి ఒక దగ్గర ఉంటే చురక మరోదగ్గర పెట్టినట్టు అసలు స్కామ్‌ను వెలికితీసే ప్రయత్నం చేయకుండా కాలేజీల్లోనే మాల్‌ప్రాక్టీస్ జరిగినట్టు విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు. పరీక్షల్లో జరుగుతున్న వ్యవస్థీకృత అక్రమాల్లో ఎంసీక్యూ విభాగంలో గోల్‌మాల్ కూడా ఒకటని చెబుతున్నారు. విచారణ జరిపిస్తే పెద్ద తలకాయలు బయటకు వస్తాయని అసలు విచారణే లేకుండా జాగ్రత్త పడుతున్నారని పేర్కొంటున్నారు.
సిద్ధార్థ ఘటనలోను తమకు కావాల్సిన విద్యార్థుల కాపీయింగ్‌కు అడ్డంకులు ఏర్పడకుండా తనిఖీల పేరిట విశ్వవిద్యాలయం హడావుడి చేసింది. అప్పట్లో పరీక్షల విభాగంలోని కీలక అధికారి పాత్ర ఉందని ప్రైవేట్ కాలేజీ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. మళ్లీ అలాంటి ఫిర్యాదులు రాకుండా ఉండటం కోసం అప్పట్లో తూతూమంత్రంగా తనిఖీలు చేసి ఎవరిపైనా కఠిన చర్యలు లేకుండా కథను ముగించేశారు.