ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్ రాజేష్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్ సీఐ డి.ప్రశాంత్ కుమార్, ఎస్సై రాజేష్ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.


