ఘాట్ రోడ్డులో రక్షణ గోడ కూలిపోయిన దృశ్యం
తాడిపత్రి టౌన్: నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆలూరు కోన రంగనాథ స్వామి క్షేత్రానికి వెళ్లే ఘాట్ రహదారి ప్రమాదకరంగా మారింది. ఘాట్ రోడ్డుకు ఉన్న రక్షణ గోడ కొన్ని చోట్ల దెబ్బతినగా.. మరి కొన్ని చోట పూర్తిగా నేలవాలింది. యాత్రికులు, భక్తులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. వాహనాల్లో ఘాట్ రోడ్డులో ప్రయాణించేందుకు జంకుతున్నారు.
తాడిపత్రి పట్టణం నుంచి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆలూరు కోన క్షేత్రం.. ప్రకృతి రమణీయతతో శోభాయమానంగా వెలుగొందుతోంది. క్షేత్రంలో స్వామి వారు శ్రీదేవి, భూదేవి సమేత శేషతల్పంపై భక్తులకు దర్శనం ఇస్తారు. ఏటా వైశాఖ మాసంలో స్వామికి బ్రహోత్సవాలు నిర్వహిస్తారు. అంతేకాకుండా ప్రతి శని, ఆదివారాల్లో ఆలూరు కోనకు పెద్ద ఎత్తున పర్యాటకులు విచ్చేసి జలపాతంలో సేదతీరుతారు.
ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ ఆలయానికి వెళ్లే రోడ్డు మాత్రం అధ్వానంగా మారింది. రోడ్డుపై మోకాలు లోతు గోతులు పడటంతో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. అలాగే ఘాట్ రోడ్డులో కొండకు ఒక వైపు రక్షణ గోడ కూలిపోయింది. మరోవైపు రక్షణ గోడ ఏర్పాటు చేయకపోవడంతో భక్తులు, పర్యాటకులు భయపడుతూ ఆలయానికి చేరుకుంటున్నారు. ఏవైనా పెద్ద ప్రమాదాలు జరగక ముందే అధికారులు మేల్కొని చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
రోడ్డు గుంతలమయం..
తాడిపత్రి నియోజకవర్గంలో ఆలూరు కోన రంగనాయకుల స్వామి దర్శనానికి రోజూ పెద్ద ఎత్తున భక్తులు వెళ్తారు. కోనకు వెళ్లే ఘాట్ రోడ్డు ప్రమాదకరంగా మారింది. రక్షణ గోడ కూలిపోగా.. కొండకు మరో వైపు రక్షణగోడ లేకుండానే రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. రోడ్డు కూడా గుంతలమయంగా మారింది. కొన్ని చోట్ల పూర్తిగా దెబ్బతింది. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డుకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. – యోగేశ్వర రెడ్డి, పర్యాటకుడు, తాడిపత్రి


