టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి | Human Memory declining due to overuse of Smartphone, technology | Sakshi
Sakshi News home page

టెక్నా'లేజీ'.. అతివినియోగంతో తగ్గుతున్న జ్ఞాపకశక్తి

Dec 14 2025 12:20 PM | Updated on Dec 14 2025 12:20 PM

Human Memory declining due to overuse of Smartphone, technology

టెక్నాలజీ.. కాస్త టెక్నా‘లేజీ’ అవుతోంది.. పాశ్చాత్య నాగరికతకనుగుణంగా సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. వయో భేదంలేదు అసలేలేదు.. అరచేతిలో స్వర్గం.. అనర్థాలు అధికమన్న విషయం తెలిసినా సామాజిక మాధ్యమాల్లోనే కాలం గడిపేవారి సంఖ్య పెరిగిపోతోంది.. అతివినియోగంతో జ్ఞాపకశక్తి తగ్గిపోతోంది.. అన్ని వయసుల వారిలోనూ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి.. ఫలితంగా చిన్నారులేకాదు.. 15 నుంచి 32 ఏళ్ల యువత కూడా డేంజర్‌ జోన్‌లోకి వెళ్లిపోతోంది..  

సాక్షి, పుట్టపర్తి: ప్రపంచీకరణ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. గత మూడు దశాబ్దాలతో పోలిస్తే.. టెక్నాలజీ అభివృద్ధి, తద్వారా ప్రజలకు అందిన మేలు ఊహలకు అందదు. చావు కబురు చెప్పాలంటే టెలిగ్రామ్‌ పంపే రోజుల నుంచి నిమిషాల్లో సమాచారం చేరవేసే సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది. బంధువులను పండుగలు, శుభకార్యాల్లో మాత్రమే కలిసి రోజుల నుంచి నిత్యం టచ్‌లో ఉండేలా టెక్నాలజీ అందిపుచ్చుకున్నారు. మధ్య మధ్యలో మంచీచెడులు తెలుసుకోవాలంటే ఉత్తరాలే దిక్కయ్యేవి. ఆ దశ నుంచి కంప్యూటర్, ఇంటర్నెట్‌ యుగంలోకి వచ్చాం. 

ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో సగటున స్మార్ట్‌ఫోన్‌ ఉంది. ఇంటింటా స్మార్ట్‌ టీవీలు ఉన్నాయి. ఇంటర్నెట్‌ ద్వారా ఇంట్లో నుంచి ప్రపంచాన్ని చూసే అవకాశం లభిస్తోంది. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో దొరుకుతోంది. పండుగలు, శుభకార్యాల కోసం మంచి బ్రాండ్‌ దుస్తులతో సహా ఆన్‌లైన్‌ షాపింగ్‌ ద్వారా కొంటున్నారు. వ్యాపార రంగంలో ఆన్‌లైన్‌ బిజినెట్‌ వాటా సుమారు సగం పైగా ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా పిల్లల వీడియో గేమ్స్‌ యాప్స్‌ రూపంలో మొబైల్స్, టీవీల్లో వస్తున్నాయి. 

టెక్నాలజీ వినియోగించకుండా రోజు గడవని స్థితి నెలకొంది. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా.. గూగుల్‌ మ్యాప్‌లో వెతుక్కుని వెళ్లే స్థితికి వచ్చారు. ఇదంతా పక్కన బెడితే.. మరో కోణంలో టెక్నాలజీని అతిగా వినియోగించి అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. అలాంటి వారిలో 15 – 35 ఏళ్ల మధ్య వయసు వారే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.   

టెక్నాలజీ ప్రభావంతో చదువులో వెనుకబడడం, క్రమశిక్షణ లేకపోవడం, దేనిపైనా దృష్టి సారించలేకపోవడం, ఒకరినొకరు మాట్లాడడం తగ్గిపోవడం, శారీరక శ్రమ తగ్గిపోవడంతో ఊబకాయం సమస్యలు పెరుగుతున్నాయి. నిద్రలేమి వేధిస్తోంది. చిన్న విషయానికి కూడా కోపం తెచ్చుకోవడం వంటి ప్రభావాలు పడుతున్నాయి. ఆఖరుకు చిన్న పిల్లలు కూడా డేంజర్‌ జోన్‌లోకి వెళ్తున్నారని వైద్యనిపుణులు చెప్తున్నారు.  

ఒకే ప్రదేశంలో కూర్చొని కంప్యూటర్‌ చూస్తూ గడిపే వారికి వెన్ను సమస్యలు అధికం అవుతున్నాయి. ఈ నొప్పితో ఇతర విషయాలపై దృష్టి సారించలేకపోతున్నారు. నిత్యం ఉద్యోగ ఒత్తిళ్లతో బిజీలో ఉండటంతో పాటు మధ్య మధ్యలో స్నేహితులతో ముచ్చటించటం.. పలు విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తితో కంప్యూటర్‌తోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు.. ఫలితంగా మూడు పదుల వయసుకే వెన్నెముక బారిన పడుతున్నారు. ఇటీవల పుట్టపర్తిలో 36 ఏళ్ల వ్యక్తి వెన్నెముక నొప్పి బారిన పడడమే నిదర్శనంగా చెప్పవచ్చు. 

⇒ స్మార్ట్‌ఫోన్లతో జ్ఞాపకశక్తి కోల్పోతున్నారు. కనీసం కుటుంబ సభ్యుల ఫోన్‌ నంబర్లు కూడా గుర్తు పెట్టుకోలేని పరిస్థితి. గణాంకాల విషయానికొస్తే క్యాలిక్యులేటర్‌ వాడుతున్నారు. ప్రైమరీ పాఠశాల నుంచి చిన్నారులు స్మార్ట్‌ ఫోన్లకు అలవాటు పడటంతో ఏ విషయం గుర్తుంచుకోలేకపోతున్నారు. ఫోన్‌ లేకుంటే ఏ పనీ చేయలేని స్థితిలోకి వెళ్తున్నారు. ఫలితంగా టీనేజీలోనే జ్ఞాపక శక్తి కోల్పోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. రెండు నెలల క్రితం హిందూపురంలో 16 ఏళ్ల బాలుడు జాపకశక్తి కోల్పోయి.. మానసికంగా దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 

⇒ పండుగ వచ్చినా.. ఫంక్షన్‌ రోజయినా.. ఎలాంటి శుభకార్యం కోసమైనా.. నేరుగా వెళ్లి పిలిచే వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. సమీప బంధువులను తప్ప మిగతా అందరినీ టెక్నాలజీ ఆధారంగా ఆహ్వానిస్తున్నారు. శుభవార్త, చేదువార్తలు కూడా సామాజిక మాధ్యమాల ద్వారానే తెలియజేస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి వరకు ఫోన్‌లతోనే గడిపేస్తున్నారు. మెసేజీలు, ఫోన్‌ కాల్స్, రీల్స్‌కు బానిసలుగా మారారు.

పెరిగిపోతున్న ఒత్తిడి..  
స్మార్ట్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌తోనే టెక్నాలజీని విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఫలితంగా చిన్నపిల్లలు, యువతకు ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని వైద్యులు చెప్తున్నారు. 40 ఏళ్ల లోపు వయసున్న వారికి టెక్నాలజీ అతి వినియోగం కారణంగా మానసిక, శారీరక సమస్యలు అధికమయ్యాయి. యువత ఎక్కువగా సామాజిక మాధ్యమాల్లో సమయం గడుపుతుండడంతో సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ తక్కువగా వాడేవారు పాజిటివ్‌ ధోరణితో ఉండగా.. అతిగా వినియోగించే వారు నెగిటివ్‌ ఆలోచనలో ఉంటారని నిపుణులు చెప్తున్నారు. ట్యాబ్‌లు, కంప్యూటర్లపై ఎక్కువగా ఆధారపడేవారు కంటి సమస్యతో బాధపడుతున్నారు. ఇంకొంత మందికి తలనొప్పి, భుజం, వెన్నునొప్పి సమస్యలు వస్తున్నాయి.  

ఆరోగ్యం ప్రధానం  
నిద్రపోయే గంట ముందే స్మార్ట్‌ఫోన్‌ వాడకం, టీవీ చూడటం మానేయాలి. అతి దగ్గరగా కూర్చొని టీవీ, ఫోన్‌ కూడా చూడరాదు. టెక్నాలజీని అవసరం మేరకే వాడుకోవాలి. లేదంటే సోమరితనం పెరిగిపోతుంది. చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. సామాజిక మాధ్యమాల వాడకం పూర్తిగా తగ్గించాలి. స్మార్ట్‌ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం గమనించడం తల్లిదండ్రుల బాధ్యత. లేదంటే పెడదారిలో వెళ్లే అవకాశం అధికంగా ఉంటుంది.  
– ఫైరోజాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి,   శ్రీసత్యసాయి జిల్లా  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement