స్మార్ట్‌ ఫోన్ రేట్లకు రెక్కలు | Smartphone prices have gone up | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ ఫోన్ రేట్లకు రెక్కలు

Dec 10 2025 4:24 AM | Updated on Dec 10 2025 4:55 AM

Smartphone prices have gone up

మెమరీ, స్టోరేజ్‌ చిప్‌ల కొరతే కారణం 

ఇప్పటికే కొంత పెంచిన కొన్ని కంపెనీలు 

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ : మెమరీ, స్టోరేజ్‌ చిప్‌లకు కొరత నెలకొన్న నేపథ్యంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీలు ధరలను పెంచేయగా మరికొన్ని అదే బాటలో ఉన్నాయి. డివైజ్‌లలో పర్మనెంట్‌ డేటాను నిల్వచేసే సెమీకండక్టర్‌ చిప్‌లను అమర్చే స్టోరేజ్‌ మాడ్యూల్స్‌ ధర నెలవారీగా, సామర్థ్యాన్ని బట్టి 20–60 శాతం మేర పెరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కంపెనీల నుంచి భారీగా డిమాండ్‌ నెలకొనడంతో 1టీబీ (టెరాబైట్‌) మాడ్యూల్స్‌ కొరత తీవ్రంగా ఉంటోందని వివరించారు. 

అదే సమయంలో పాత టెక్నాలజీల నుంచి పరిశ్రమ దశలవారీగా నిష్క్రమిస్తున్న  కొద్దీ 512 జీబీ మాడ్యూల్స్‌ రేట్లు సుమారు 65 శాతం పెరిగాయి. తీవ్ర కొరత కారణంగా 256 జీబీ మాడ్యూల్స్‌ ధరలు కూడా పెరుగుతున్నాయి. స్టోరేజ్‌ మాడ్యూల్స్‌తో పోలిస్తే కాస్త తక్కువే అయినప్పటికీ, తాత్కాలిక, హై–స్పీడ్‌ డేటాను స్మార్ట్‌ఫోన్లు, పర్సనల్‌ కంప్యూటర్స్, ఇతరత్రా డివైజ్‌లలో నిల్వ చేసేందుకు ఉపయోగించే డైనమిక్‌ ర్యాండమ్‌ యాక్సెస్‌ మెమొరీ (డీఆర్‌ఏఎం) మాడ్యూల్స్‌పైనా ప్రభావం పడుతోంది. డీఆర్‌ఏఎం రేట్లు 18–25 శాతం పెరిగాయి. వేఫర్‌ల కొరతకు సంబంధించిన పరిస్థితులు ఇప్పుడప్పుడే మెరుగుపడే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. దీంతో కాంట్రాక్ట్‌ ధరలు వచ్చే ఏడాది కూడా పెరిగే అవకాశమే ఉందని వివరించారు.  

బడ్జెట్‌ సెగ్మెంట్‌పై ప్రభావం.. 
కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం, మెమరీ చిప్‌ల ధరలు ఈ ఏడాది ఇప్పటికే 50 శాతం పెరిగాయి.  2025 నాలుగో త్రైమాసికంలో ఇవి మరో 30 శాతం జంప్‌ చేయొచ్చని, అలాగే 2026 తొలినాళ్లలో ఇంకో 20 శాతం పెరగొచ్చని అంచనాలు నెలకొన్నాయి. ప్రధాన స్రవంతిలో ఉపయోగించే ఉత్పత్తులకు మెమరీ మాడ్యూల్స్‌ సరఫరాను తగ్గించి ఏఐ అప్లికేషన్స్‌కి అధునాతన చిప్‌లను సరఫరా చేయడంపై సప్లయర్లు మరింతగా దృష్టి పెడుతుండటం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొన్నారు. మైక్రాన్‌లాంటి కంపెనీలు ఏఐకి ప్రాధాన్యమిస్తూ కన్జూమర్‌ మెమరీ ప్రోడక్టుల తయారీని నిలిపివేయనున్నట్లు ఇటీవల ప్రకటించాయి.

దీనితో బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్ల సెగ్మెంట్‌పై అత్యధికంగా ప్రభావం పడుతోందని నిపుణులు వివరించారు. అయితే, మధ్య స్థాయి నుంచి హై–ఎండ్‌ డివైజ్‌లపైనా ధరలపరమైన ఒత్తిడి నెలకొంటోందని పేర్కొన్నారు.  వివో, ఒప్పో, రియల్‌మీ, ట్రాన్షన్‌లాంటి స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లు ఇప్పటికే తమ ప్రస్తుత మోడల్స్‌పై రేట్లను రూ. 500 నుంచి రూ. 2,000 వరకు పెంచాయి. ముడి వస్తువుల రేట్లు పెరుగుతుండటంతో, కొత్తగా లాంచ్‌ చేసే వాటి ధర గత రేటు కన్నా మరో 10 శాతం అధికంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. 2026 ప్రథమార్ధంలోనూ ఇదే ధోరణి కొనసాగవచ్చని రిటైలర్లు అంచనా వేస్తున్నారు.

పీసీలకు కూడా సెగ..
డెస్‌్క టాప్‌ పీసీలు, నోట్‌బుక్‌ల విడిభాగాలకు కూడా కొరత నెలకొంది. దీంతో వాటి ధరలు కూడా పెరుగుతున్నాయి. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ ప్రకారం చాలా మోడల్స్‌కి సంబంధించి మెటీరియల్స్‌ వ్యయం 15 శాతం పైగా పెరిగింది. దీంతో కంపెనీల మార్జిన్లపై ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలో డెల్, అసూస్, లెనొవొ, హెచ్‌పీ లాంటి కంపెనీలన్నీ మరింతగా రేట్లను పెంచే ప్రణాళికల్లో ఉన్నట్లు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో ఎదురయ్యే కొరతను అధిగమించేందుకు అసూస్, లెనొవొ తదితర సంస్థలు తమ మెమరీ చిప్‌ల నిల్వలను పెంచుకుంటున్నాయి. అయినప్పటికీ వ్యయాలు మాత్రం తగ్గటం లేదు. దీంతో డెల్‌ లాంటి సంస్థలు తమ ఉత్పత్తుల ధరలు 15–20 శాతం మేర పెరగొచ్చని వెల్లడించాయి. ఇలా ధరల పెరుగుదల వల్ల డిమాండ్‌ నెమ్మదించి, అమ్మకాల వృద్ధిపైనా ప్రభావం పడొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement