సాయంత్రం. వర్క్‌ఫ్రమ్– హోమ్ జూమ్ మీటింగ్ ముగిసింది. అమ్మ సోఫాలో కూర్చొని ఫోన్ స్క్రోల్ చేస్తుంది. నాన్న యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ బిజీ. ఆరేళ్ల ఆరాధ్య వాళ్ల ముందు కూర్చుని ఉంది. ఆ రోజు స్కూల్లో ఏం జరిగిందో చెప్తోంది. పేరెంట్స్ తమ బిజీలో తామున్నారు. ఆ బిడ్డ కళ్లలో చిన్న నిరాశ. పేరెంట్స్ అది గమనించలేదు.
కానీ ఆరాధ్య మెదడు గమనిస్తోంది. ప్రతిరోజూ, ప్రతి నిమిషం పేరెంట్స్ ‘హాజరు’ కన్నా ‘గైర్హాజరు’ను గుర్తించి రికార్డు చేస్తుంది. ఇది చిన్న విషయం కాదు. ఇది ఈ తరానికి సంబంధించిన నిశ్శబ్ద భావోద్వేగ సంక్షోభం. పేరెంట్స్ పక్కనే ఉంటున్నారు, కానీ ఎమోషనల్‌గా కాదు. పిల్లలతో తాము సరిపడినంత సమయం గడుపుతున్నామని 70శాతం పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ పేరెంట్స్ ఎప్పుడూ ఫోన్‌తో బిజీగా ఉంటున్నారని 67శాతం పిల్లలు ఫీలవుతున్నారని హార్వర్డ్ యూనివర్సిటీకి అధ్యయనం చెబుతోంది.
భోజనాల సమయంలో పేరెంట్స్ ఫోన్ చూస్తూ ఉండటం పిల్లలకు మరింత దూరం చేస్తుందని మరో అధ్యయనంలో స్పష్టమైంది. భారతదేశంలో జరిగిన పలు అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. దీంతో పిల్లలు సమస్యలు సృష్టిస్తూ పేరెంట్స్ దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే పిల్లలది తప్పు ప్రవర్తన కాదు, పేరెంట్స్ అటెన్షన్ కోసం ఆరాటం మాత్రమే.
మెదడు ఎలా స్పందిస్తుంది?
⇒ అనుబంధం పెరగడానికి ప్రతిస్పందన, ఇచ్చిపుచ్చుకోవడం, పునరావృతం ముఖ్యం. ఫోన్ వల్ల ఈ మూడూ బ్రేక్ అవుతాయి.
⇒ పిల్లలు తమ భావాలను నియంత్రించడానికి మొదటగా తల్లిదండ్రుల ముఖాన్ని, స్పందనను గమనిస్తారు. పేరెంట్స్ చూసి స్పందించకపోతే, వారి మెదడులో ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పెరుగుతుంది.
⇒ పిల్లలు పరిశీలన ద్వారా నేర్చుకుంటారు. పేరెంట్స్ ఫోన్‌లో ఉంటే వారు నేరుగా చూడటం, కమ్యూనికేషన్, సహానుభూతి చూడలేరు. దీంతో వారిలో క్రమంగా సామాజిక ఇబ్బంది పెరుగుతుంది.
⇒ పేరెంట్–పిల్లల మధ్య ఇంటరాక్షన్ తగ్గితే పిల్లల్లో ప్రవర్తనా సమస్యలు మూడురెట్లు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది. తినడం, ఆడటం, మాట్లాడటం– అన్నీ దెబ్బతింటాయి.
⇒ పేరెంట్స్‌తో పదేపదే డిస్కనెక్షన్ అనుభవించిన పిల్లలు తక్కువగా షేర్ చేస్తారు, తక్కువగా నమ్ముతారు, తక్కువగా అటాచ్ అవుతారు.
∙ఏం చెయ్యాలి?
నోటిఫికేషన్లు, డెడ్ లైన్లు, వాట్సప్ మెసేజ్‌లు రోజూ ఉండేవే. అవి రోజూ వస్తూనే ఉంటాయి. కానీ ఒకసారి పిల్లలతో అనుబంధం విరిగిపోతే, తిరిగి రావడానికి సంవత్సరాలు పడతాయి. అందుకే పిల్లలతో బంధానికి ప్రాధాన్యం ఇవ్వాలి. మీరు ఎంత సమయం గడిపారనేది కాదు, ఎంత ప్రెజెన్స్‌తో ఉన్నారనేది ముఖ్యం.
1. ప్రతి రోజూ కేవలం 20 నిమిషాలు ఫోన్‌కు దూరంగా ఉండేలా నిబంధన పెట్టుకోవాలి. ఆ 20 నిమిషాలు పిల్లలకు క్లాసులు పీకకుండా, సరిదిద్దకుండా వాళ్లు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల అనుబంధాలకు కారణమయ్యే ఆక్సిటోసిన్ విడుదలవుతుంది.
2. డైనింగ్ టేబుల్, బెడ్ రూమ్, పిల్లలు చదువుకునే చోట ఫోన్ ఉపయోగించకూడదు. పిల్లలు మీరు చెప్పేది తక్కువ వింటారు, మీరు చేసేది ఎక్కువ అనుసరిస్తారు.
3. పిల్లలతో బంధం బలపడాలంటే గంటలు గంటలు గడపాల్సిన అవసరంలేదు. ఒక చిరునవ్వు, ఒక స్పర్శ, ఒక చూపు చాలు. ఇలాంటి సూక్ష్మమైన అంశాలు పిల్లల్లో భావోద్వేగ భద్రత కలిగిస్తాయని స్టాన్‌ఫోర్డ్ సైకాలజిస్ట్ ఎమా సెపాలా చెప్తున్నారు.
4. మీరు ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు పిల్లల గొంతు వినిపిస్తే, వెంటనే వారి వైపు చూడాలి. వారి మాటలను వింటున్నట్టు సిగ్నల్ ఇవ్వాలి. ఈ ఒక్క చిన్న మార్పు పిల్లల్లో అనుబంధానికి భారీ భరోసానిస్తుంది.
5. ఆదివారం కనీసం ఒక గంట పూర్తిగా పిల్లలతో గడపండి. ఆటలు ఆడండి, పాటలు పాడండి, కథలు వినండి, కుటుంబమంతా కలిసి గడపండి. ఈ గంట పిల్లల మనసులో ‘ఫ్యామిలీ ఫస్ట్’ అనే ఫ్రేమ్ వర్క్‌ను బలపరుస్తుంది.
6. ఫోన్ నోటిఫికేషన్లు, వాట్సప్ గ్రూపులు ఆఫ్ చేయండి. సోషల్ మీడియా లాగిన్‌కు సమయాన్ని నిర్ణయించుకోండి. మీ నియంత్రణే మీ పిల్లలకు నమూనా అవుతుంది.
7. ‘‘నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చూస్తుంటే నీకు ఎలా అనిపిస్తుంది?’’ అని అడగండి. వారి సమాధానాన్ని శ్రద్ధగా విని, ఆ మేరకు మీ ఫోన్ అలవాట్లలో మార్పులు చేసుకోండి.
8. ‘‘నాకు నువ్వు, నీ మాటలు ముఖ్యం’’ అని పిల్లలకు రోజుకు ఒక్కసారైనా చెప్పండి. అది పిల్లల్లో నమ్మకం, ఆత్మవిశ్వాసం, భద్రతాభావాన్ని పెంచుతుంది.
- సైకాలజిస్ట్ విశేష్ ఫౌండర్, జీనియస్ మేట్రిక్స్ హబ్


