కనువిందైన కళ– ఆ కళకు తగ్గ కాంతి మిళితమై, చలికాలపు రాత్రుల్లో కళ్లు చెదిరే మాయాజాలాన్ని చూడాలంటే నెదర్లండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కి పోవాల్సిందే! ‘ఆమ్‌స్టర్‌డామ్ ఫెస్టివల్’– ఇది ప్రతి సంవత్సరం శీతాకాలంలో నిర్వహించే ఒక అంతర్జాతీయ కాంతి కళా ప్రదర్శన. ఈ ఉత్సవం ప్రధాన లక్ష్యం కాంతితో చీకటిని తరిమి, ఆనందాన్ని నింపడమే! ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన థీమ్‌తో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులు డిజైన్ చేసిన ప్రత్యేకమైన లైట్ ఆర్ట్‌వర్క్‌లను ఇక్కడ ప్రదర్శిస్తారు.
ఈ ఉత్సవం సాధారణంగా నవంబర్ నెల చివర నుంచి జనవరి నెల మధ్య వరకు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆ వెలుగులు ఈ ఏడాది నవంబర్ 27న ప్రారంభమై జనవరి 18న ముగుస్తాయి. ఆమ్‌స్టర్‌డామ్ కాలువలు, నదీతీరాలు, పట్టణ ప్రాంతాలు కాంతి కళాకృతులతో మెరుస్తున్నాయి. ఈ కళాఖండాలు కేవలం అలంకరణలు మాత్రమే కాకుండా, ప్రతి సంవత్సరం ఎంచుకున్న థీమ్‌కు సంబంధించిన కథలను, ఆలోచనలను తెలియజేస్తాయి.
నిజానికి ఈ 2025–26 థీమ్ ‘లెగసీ’– అంటే మన భవిష్యత్ తరాలకు మనం ఏమి వదిలి వెళ్తున్నాం? అనే ప్రశ్న చుట్టూనే కాంతులు ప్రతిబింబిస్తాయి. మొత్తానికి ఈ ఫెస్టివల్‌ను మూడు పద్ధతుల్లో తిలకించొచ్చు. మొదటిది పడవ ప్రయాణం, రెండవది నడకమార్గం, మూడవది సైకిల్ యాత్ర.
పడవ ప్రయాణం
ఈ లైట్ ఆర్ట్‌వర్క్‌లను వీక్షించడానికి సౌకర్యవంతమైన మార్గం పడవ ప్రయాణం. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ ‘వాటర్ కలర్స్’ మార్గంలో పయనించేటప్పుడు, కాంతి ప్రతిబింబాలు నీటిపై పడి అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. అనేక క్రూజ్ కంపెనీలు కళాఖండాల గురించి వివరించే ఆడియో గైడ్‌లను అందిస్తాయి.
నడకమార్గం
ఫెస్టివల్‌లో ఆర్ట్‌వర్క్‌లను దగ్గరగా, నిదానంగా చూడాలనుకునే వారికి నడక మార్గమే మంచిది. దీనిని ‘ఇల్యూమినాడే’ అని కూడా పిలుస్తారు. ఈ మార్గం నగరం నడిబొడ్డు గుండా వెళుతుంది. అద్భుతంగా ఉంటుంది.
సైకిల్ యాత్ర
సైకిల్‌పై నగరంలో లైట్ ఆర్ట్‌వర్క్‌లను చూస్తూ వెళ్ళడం మరొక ఆసక్తికరమైన అనుభవం. ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ కళాకాంతులను చూసి కళ్లు జిగేల్ మనక మానవు!


