చలికాలం మూడ్‌ భద్రం | Explanation of the Seasonal Affective Disorder | Sakshi
Sakshi News home page

చలికాలం మూడ్‌ భద్రం

Nov 20 2025 12:30 AM | Updated on Nov 20 2025 12:30 AM

Explanation of the Seasonal Affective Disorder

వింటర్‌ బ్లూస్‌

చలికాలం పని చేయబుద్ధి కాదు. హుషారుగా అనిపించదు. అదో వెలితిగా అనిపించే భావన. నిరాశ. ఆకలి లేకపోవడం. ఎండ, వెలుతురు లేక చిరాకు. ఇదంతా ఏదో మామూలు విషయం కాదని ‘సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌’ (శాడ్‌) అనే ఒక విధమైన డిప్రెషన్  అని  మనస్తత్వ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలం వస్తే మూడ్‌ను చెక్‌ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోడవం  చాలా అవసరం అంటున్నారు. అసలు ఈ ‘శాడ్‌’ ఏమిటి?

ఉదయాన్నే సూర్యుడి ముఖం చూసి పనిలో పడితే అదోతృప్తి. సూర్యకిరణాలు ఒంటిని తాకితే లోలోపల ఉత్తేజం. కాసింత ఎండ పొడ తగిలితే మనసంతా ఉత్సాహం. కాని చలికాలంలో వణికించే చలి ఆ అవకాశాన్ని అరుదుగా ఇస్తుంది. పొద్దున లేవగానే మంచు స్వాగతం పలుకుతుంది. రోజంతా పలుచటి వెలుతురు తప్ప సూర్యుడు అందించే ఉత్తేజం మనకు చేరదు. దాంతో ఒళ్లంతా బద్దకంగా, మనసంతా గజిబిజిగా అనిపిస్తుంది.

 ఇలాంటి స్థితిని ‘వింటర్‌ బ్లూస్‌’ అంటుంటారు. ఇంత వరకూ మామూలే. కాని కొందరికి ఈ సమయం చాలా నిరాశ, నిర్లిప్తతలు ఆవరిస్తాయి. ఏదో కోల్పోయినట్టు, అంతా ముగిసిపోయినట్టు అనిపిస్తుంది. కొందరికి ఆకలి మందగిస్తుంది. తెలియని డిప్రెషన్ కి కొందరు లోనవుతారు. దీన్నే ‘సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌’ (శాడ్‌) అంటున్నారు వైద్యులు. ఇలాంటి పరిస్థితిని గమనించుకుంటూ ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఎండకు– మెదడుకు...
చలికాలం  తొందరగా నిద్ర లేవాలనిపించదు. చలిలో లేచి ఏదైనా చేయాలనిపించదు. ఎనిమిది గంటలు దాటితే తప్ప సూర్యుడు తేటగా కనిపించడు. కాసింత వేడి ఒంటికి తగిలాక కొంచెం ఉత్సాహం వచ్చి పనులు మొదలుపెడతారు చాలామంది. ఇదంతా ఎందుకు? వాతావరణానికీ, మన మనసుకు మధ్య ఉండే సంబంధమే ఇందుకు కారణం అంటున్నారు మానసిక శాస్త్ర నిపుణులు. ‘సూర్యుడి వెలుగు కారణంగా మెదడులో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. అవి మనలో ఉత్సాహాన్ని నింపుతాయి. చలికాలంలో ఆ చర్యలు జరగకపోవడం వల్ల నిస్సారంగా, బద్దకంగా అనిపిస్తుంది’ అని వివరిస్తున్నారు.

చలికాలమే మేలు అనుకుంటారా?
ఎండాకాలం తట్టుకోలేనంత వేడి ఉంటుంది. చలికాలం వస్తే బాగుండని ఆ వేడి తట్టుకోలేక కొందరు అనుకుంటారు. కానీ కొందరికి మాత్రం చలికాలం నచ్చదు. రోజంతా ఉత్సాహం లేని పనులు చేస్తూ, గంటల కొద్దీ ఒకేచోట గడుపుతూ ఉంటారు. ఈ సమయంలో ఒంట్లో సెరటోనిన్, మెలటోనిన్‌ రసాయనాలు విడుదల కాకపోవడమే ఇందుకు కారణమంటున్నారు వైద్యులు. సూర్యరశ్మి తక్కువగా ఉండటం కూడా దీనికి తోడై డిప్రెషన్ లోకి నెట్టేస్తుందని అంటున్నారు. అందుకే చలికాలం అనగానే కొందరిలో ఆనందం మాయమైపోతుంది. సంతోషం దూరమవుతుంది. ఏ పనీ చేసేందుకు ఆసక్తి రాక మిన్నకుండిపోతుంటారు.

దీన్ని గుర్తించేదెలా?
‘సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌’ అందరిలో ఉంటుందని చెప్పలేం. ఒకవేళ ఉన్నా, దాన్ని గుర్తించడం కష్టం. అత్యల్ప ఉష్ణోగ్రతలు కలిగిన దేశాల్లో చాలామంది దీని బారిన పడుతున్నారు. ఇటువంటి వారు తొందరగా డిప్రెషన్ లోకి వెళ్లిపోతున్నారు. తమకున్నది ‘సీజనల్‌ ఎఫెక్టివ్‌ డిజార్డర్‌’ అన్న విషయం కూడా వారికి తెలియడం లేదు. కొందరు ఈ డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు అధికంగా తినడం, దురలవాట్లకు లోనవడం వంటివి చేస్తున్నారు. దీంతో ఆ ప్రభావం అంతా వారి ఆరోగ్యం మీద పడి తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు.

శాడ్‌ లక్షణాలు...
→ రోజువారి పనుల్లో ఆసక్తి కోల్పోవడం 
→ నిరాశ ∙ఏకాగ్రత కోల్పోవడం
→ ఒంటరితనం, ఏకాంతం ఇష్టపడటం
→ నిద్రలేమి, అలసట (లేదా) అధిక నిద్ర, అధిక తిండి 
→ నలుగురిలో కలవకపోవడం

ఏమిటి పరిష్కారం?
→ చలికాలంలో రోజూ పొద్దున్నే లేచి వ్యాయామం, యోగా చేయడం ఉత్తమమైన మార్గం. దీని వల్ల శరీరానికి ఉల్లాసంగా అనిపించడంతోపాటు మానసికంగా ఏదో ఒక పని చేయాలన్న సంసిద్ధత ఏర్పడుతుంది.
→ ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయకుండా రకరకాల పనులపై దృష్టి నిలపడం మరో పరిష్కారం. 
→ డిప్రెషన్  భావన వచ్చినప్పుడు ఆత్మీయులతో మాట్లాడటం, సంగీతం వినడం, డ్యాన్స్ చేయడం వంటివి మనసును తేలికపరుస్తాయని అంటున్నారు.  
→ చలికాలాన్ని ప్రకృతి సహజమైన విషయంగా భావించి, మనసు దృఢ పరుచుకుంటే మానసికంగా బలవంతులు అవుతారని వైద్యులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement