డెవిన్ మంచు తుపాను ధాటికి అమెరికాలో గగనతల ప్రయాణాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇయర్ ఎండ్ సెలవులు.. కొత్త సంవత్సర వేడుకల నేపథ్యాలతో ప్రయాణాలకు సిద్ధపడినవాళ్లకు అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లు షాకిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 1,800 విమానాలు రద్దు చేశాయి. వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ఫ్లైట్‌అవేర్ గణాంకాల ప్రకారం.. వివిధ ఎయిర్‌లైన్స్‌లకు చెందిన 1,802 విమానాలను శుక్రవారం రద్దు చేశారు. మరో 22,349 విమానాలు ఆలస్యంగా నడిచాయి. జాన్ ఎఫ్ కెనడీ, లాగార్డియా, డెట్రాయిట్ మెటరోపాలిటిన్ లాంటి ప్రధాన విమానాశ్రయాల్లో వేలమంది ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతికూల వాతావరణ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇప్పటికే ఎయిర్‌లైన్స్ కంపెనీలు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పాయి. మరో రెండ్రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని తెలుస్తోంది.

డెవిన్ తీవ్ర మంచు తుపాను(తుపానుకు పెట్టిన పేరు) గ్రేట్ లేక్స్, మిడ్ అట్లాంటిక్, నార్త్ ఈస్ట్ ప్రాంతాలను ప్రభావితం చేసింది. సుమారు 4-8 ఇంచుల మేర మంచు కురిసింది. నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరికల నేపథ్యంలో.. న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. పలు రాష్ట్రాల్లో.. అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని ప్రజలకు సూచిస్తున్నారు.


వింటర్ స్ట్రోమ్ డెవిన్.. ఈ క్రిస్మస్, న్యూఇయర్ సీజన్‌కు లక్షల మందిపై ప్రభావం చూపెడుతోంది. స్వస్థలాలకు చేరుకోలేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేల సంఖ్యలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇటు రోడ్లపై ట్రాఫిక్ నెమ్మదించింది. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించినట్లు తెలుస్తోంది.
మంచు కరిగి ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయితే స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం నుంచి మంచు కురిసే తీవ్రత తగ్గొచ్చని.. ఆ తర్వాత క్రమక్రమంగా పరిస్థితులు మెరుగుపడొచ్చని నేషనల్ వెదర్ సర్వీసెస్ అంటోంది.


