ఎంబీబీఎస్‌లో పెరిగిన విద్యార్థినులు
వృత్తిలో చేరాక మానేస్తున్న వైద్యులు
అనుకూలంగా లేని పరిస్థితులే కారణం
భవిష్యత్తులో ఆరోగ్య రంగానికి దెబ్బే!
‘బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్’ నివేదిక
డాక్టరమ్మకే కష్టం వచ్చి పడింది! విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి–ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిన పోరాటం.. ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించటం అన్నది ఎన్నో నిద్ర లేని రాత్రుల కల! ఆ కలను నెరవేర్చుకున్నప్పటికీ, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్‌లకు ఎదురవుతున్నాయి.
మెడలో స్టెతస్కోప్ ధరించి, డాక్టరమ్మ చిరునవ్వుతో కనిపిస్తే చాలు.. జబ్బు సగం నయం అయినట్లే ఉంటుంది. కానీ ఇప్పుడా డాక్టరమ్మకే కష్టం వచ్చి పడింది! విరామం లేని డ్యూటీలు, మానసిక ఒత్తిడి, ఇంటికి–ఆసుపత్రికి మధ్య నలిగిపోయే దైనందిన పోరాటం.. ఆమెను వైద్య వృత్తిని వదిలిపెట్టేలా చేస్తున్నాయి. నిజానికి ఎంబీబీఎస్ పట్టాను సాధించటం అన్నది ఎన్నో నిద్ర లేని రాత్రుల కల! ఆ కలను నెరవేర్చుకున్నప్పటికీ, వృత్తి ధర్మాన్ని నిర్వర్తించలేని పరిస్థితులు లేడీ డాక్టర్‌లకు ఎదురవుతుండటం దురదృష్టకరమే కాదు, దేశ ఆరోగ్య వ్యవస్థకే నష్టం.
ఇండియాలో ఎంబీబీఎస్ చదివే మహిళల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. ప్రాక్టీస్ చేసే సమయానికి మహిళా పట్టభద్రులు; ఉద్యోగంలో చేరి కొంత కాలం పని చేసిన తర్వాత మహిళా డాక్టర్లు వైద్య వృత్తిని వదిలిపెట్టేస్తున్నారట. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బి.సి.జి.)– దస్రా అనే స్వచ్ఛంద సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ‘అడ్వాన్సింగ్ విమెన్ ఇన్ లీడర్‌షిప్ ఇన్ హెల్త్ కేర్’లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అనుకూలంగా లేని పరిస్థితులే అందుకు ప్రధాన కారణమని నివేదిక పేర్కొంది.

తీవ్రమైన ఒత్తిడి
పురుష డాక్టర్ల కంటే మహిళా డాక్టర్లు ఎక్కువ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. నివేదిక ప్రకారం, సుమారు 87 శాతం మంది మహిళా డాక్టర్లు మానసిక అలసటతో విధులను నిర్వర్తిస్తున్నారు.
ఇల్లు–ఆసుపత్రి
ఆసుపత్రిలో వారానికి 60 నుండి 80 గంటల కఠినమైన పని వేళలతో పాటు ఇంట్లో పిల్లల పెంపకం, ఇతర కుటుంబ బాధ్యతలు కూడా మహిళలే చూసుకోవాల్సి వస్తోంది. ఈ రెండు రకాల బాధ్యతలను సమన్వయం చేసుకోలేక లేడీ డాక్టర్‌లు తమకు ఇష్టమైన వైద్య రంగాన్ని వదులుకోవలసి వస్తోంది.
భద్రతా సమస్యలు
మహిళా డాక్టర్లకు పని ప్రదేశంలో భద్రత అనేది పెద్ద సవాలుగా మారింది. ముఖ్యంగా చిన్న నగరాల్లో పనిచేసే వారిలో 70 శాతం కంటే ఎక్కువ మంది తాము సురక్షితంగా లేమని భావిస్తున్నట్లు తెలిపారు.
ప్రోత్సాహ లేమి
పని వేళలు అనుకూలంగా లేకపోవడం, ప్రసూతి సెలవుల తర్వాత తిరిగి చేరడానికి సరైన ప్రోత్సాహం లేకపోవడం వంటివి మహిళా వైద్యులను వెనక్కి లాగుతున్నాయి. అలాగే, వైద్య వృత్తిలో ఉన్నత పదవుల్లో మహిళలు తక్కువగా ఉండటం వల్ల మహిళా వైద్యుల సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారు.
ప్రభావం
మహిళా డాక్టర్లు వృత్తిని వదిలితే భవిష్యత్తులో గైనకాలజీ, పీడియాట్రిక్స్ వంటి విభాగాల్లో డాక్టర్ల కొరత ఏర్పడుతుంది. ఇది దేశ ఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
పరిష్కారం
పని ప్రదేశంలో మహిళా డాక్టర్ల భద్రతను పెంచటం పని వేళల్లో వెసులుబాటును కల్పించటం సమానమైన పనికి సమాన వేతనం పదోన్నతుల్లో సమానత్వం
గణాంకాలు.. ముఖ్యమైన అంశాలు
వృత్తిలో లేనివారు
పురుషుల్లో కేవలం 5–10 శాతం మంది మాత్రమే ఖాళీగా ఉండగా, మహిళా పట్టభద్రుల్లో 30 శాతం మంది వైద్య వృత్తిలో కొనసాగటం లేదు.
స్పెషలైజేషన్‌లో వ్యత్యాసం
సర్జరీ, కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్ విభాగాలలోని మొత్తం నిపుణుల్లో మహిళల వాటా 10 శాతం కంటే తక్కువే.
ప్రవేశాలలో కొరత
దేశ వ్యాప్తంగా ఇంకా 7–8 లక్షల మంది వైద్య నిపుణుల అవసరం ఉన్నప్పటికీ, సుమారు 60–70 వేల మంది మహిళా నిపుణులు వైద్య వృత్తిలోకి ప్రవేశించటం లేదు.
నర్సుల్లో మహిళలే అధికం
దేశంలోని ఆసుపత్రుల్లో ఉన్న నర్సుల్లో సుమారు 70–85 శాతం మహిళలే. కానీ, డాక్టర్లలో సీనియర్ లీడర్‌షిప్ విభాగాల్లో మాత్రం మహిళల సంఖ్య 20 శాతానికే పరిమితమైంది.


