ఇంట్లో తమ్ముడి దొంగతనం.. అన్న పెళ్లితో బయటపడింది | Sibling Gold Theft Comes to Light with Elder Brother Wedding in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంట్లో తమ్ముడి దొంగతనం.. అన్న పెళ్లితో బయటపడింది

Feb 19 2026 6:23 PM | Updated on Feb 19 2026 6:29 PM

Sibling Gold Theft Comes to Light with Elder Brother Wedding in hyderabad

సాక్షి,హైదరాబాద్: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన సొంత కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనం చేశారని కట్టుకథ అల్లిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల వివరాల మేరకు..  నిందితుడు భాస్కర్ ప్రమోద్ ముల (32 ఏళ్లు) బీటెక్‌ పూర్తి చేశాడు. చిక్కడపల్లిలో నివసిస్తున్నాడు.  అయితే, భాస్కర్ ప్రమోద్ 2014లో బీటెక్‌ పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. కానీ మధ్యలోనే చదువులు మానేసి తిరిగి వచ్చాడు. బెంగళూరులో ఉన్న సమయంలో విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడి, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్ల ద్వారా అప్పులు చేశాడు. ఈ అప్పులు తీర్చడానికి 2024 నుండి తన నానమ్మ, కుటుంబ సభ్యుల బంగారాన్ని దొంగిలించి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రూ. 4,60,000 నగదు పొందాడు.

ఇటీవల నిందితుడి అన్నయ్య పెళ్లి ఖాయం కావడంతో, కుటుంబ సభ్యులు నానమ్మ బంగారాన్ని పెళ్లి కోసం తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో భయాందోళనకు గురైన భాస్కర్, తన దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఒక పథకం వేశాడు.

ఈ  ఫిబ్రవరి 9న తన పెంట్ హౌస్‌లో దొంగతనం జరిగినట్లుగా సీన్ క్రియేట్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులు బంగారం, వెండి ఎత్తుకెళ్లారని పోలీసులకు తప్పుడు ఫిర్యాదు ఇచ్చాడు. భాస్కర్‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తూ చేపట్టారు.

ఈ దర్యాప్తులో  ఫిర్యాదుదారుడే అసలు నిందితుడని తేల్చారు. విచారణలో నిందితుడు కొన్ని వెండి వస్తువులను మూసీ నాలాలో పడేసినట్లు అంగీకరించాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న సొత్తులో రెండు బంగారు ఉంగరాలు (సుమారు 3 తులాలు), ఒక వెండి ప్లేటు, రెండు వెండి గిన్నెలు, అలాగే హెచ్‌డీఎఫ్‌సీ,ఎస్‌బీఐ ముత్తూట్ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన 80 గ్రాముల బంగారం మార్టిగేజ్ స్లిప్పులు ఉన్నాయి. మొత్తం విలువ సుమారు రూ. 12 లక్షలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

తన సొంత కుటుంబాన్ని, పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన నిందితుడు చివరికి తనే ఇరుక్కున్నాడు. నేరం ఎంత తెలివిగా ప్లాన్ చేసినా, నిజం బయటపడకుండా దాచడం అసాధ్యం అనేది ఈ కేసు నిరూపించింది.
 
ఈ కేసును ఛేదించడంలో సికింద్రాబాద్ జోన్‌  డీసీపీ ఐపీఎస్‌ రక్షితా కృష్ణమూర్తి , అడిషనల్ డీసీపీ జె. నర్సయ్య మార్గదర్శకత్వంలో చిక్కడపల్లి ఏసీపీ ఎల్. రమేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ ఎం. మల్లేశం, ఎస్ఐ మొహమ్మద్ కరీమ్ క్రైమ్ స్టాఫ్ చాకచక్యంగా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement