వరుసగా అతితక్కువ ఉష్ణోగ్రతలతో రికార్డుకెక్కిన డిసెంబర్
ఈ నెలలో 23 రోజులపాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు
తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న శీతల గాలులే కారణం
సాక్షి, హైదరాబాద్: ఈసారి శీతాకాలంలో డిసెంబర్ నెల అతితక్కువ ఉష్ణోగ్రతలతో రికార్డు సృష్టించింది. చలికాలంలో సాధారణంగా 4–5 రోజులపాటు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే మరో రెండ్రోజులు సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ ఈసారి వరుసగా అతితక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2–7 డిగ్రీల మేర తక్కువగా నమోదవడం... దీనికితోడు రాష్ట్రానికి తూర్పు, ఈశాన్య దిక్కుల నుంచి తక్కువ ఎత్తులో వీస్తున్న బలమైన గాలుల ప్రభావంతో చలి విపరీతంగా ఉంది.
ఈ నెలలో ఇప్పటివరకు 25 రోజుల్లో ఏకంగా 23 రోజులపాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. గత పదేళ్లలో ఇన్ని ఎక్కువ రోజులపాటు ఉష్ణోగ్రతలు పతనం కావడం ఇదే తొలిసారని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రానున్న ఐదు రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–4 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, జనగామ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉంటాయని తెలిపింది. జనవరిలోనూ చలి తీవ్రత అధికంగా ఉంటుందని అంచనా వేసింది.
తిర్యాణిలో 6.9 డిగ్రీలు
రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణిలో 6.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదేరోజున తిర్యాణిలో 17 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవడం గమనార్హం. అలాగే ఆదిలాబాద్‌లో ఉష్ణోగ్రత 8.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.


