తాటి చెట్టంత ఉపాయం | Story Of Gowdanna | Sakshi
Sakshi News home page

తాటి చెట్టంత ఉపాయం

Jan 5 2026 8:17 AM | Updated on Jan 5 2026 8:17 AM

Story Of Gowdanna

 చెట్టుకు ఇనుప చువ్వలతో మెట్లు 

సాధారణంగా తాటి చెట్లు ఎక్కాలంటే ప్రాణాలకు తెగించి మోకు సహాయంతో పైకి పాకాలి. వర్షాకాలంలో చెట్లు జారుతుండటం, వేసవిలో ఈదురుగాలుల వల్ల గీత కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కోతలు పడక కల్లు సరిగా రాక నష్టపోతుంటారు. అయితే వీటన్నింటికీ చెక్‌ పెడుతూ ఓ గీత కార్మికుడు వినూత్నంగా ఆలోచించాడు. తాటి చెట్టుకు మెట్లను ఏర్పాటు చేసి అందరితో భళా అనిపించుకుంటున్న గౌడన్నపై ఈ వారం కథనం.

సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలోని లింగాపూర్‌ గ్రామానికి చెందిన నేరెళ్ల శ్రీనివాస్‌ గౌడ్‌ వృత్తి రీత్యా తాటి చెట్ల నుంచి కల్లు తీస్తాడు. అయితే తాటి చెట్టు పైకి ఎక్కాలంటే అంత ఈజీ కాదు. ఎంతో శ్రమతో కూడుకున్న పని. కొంచెం అటు, ఇటు అయినా ప్రాణాలకే ప్రమాదం. వర్షాలు, ముసురు, ఈదురుగాలులతో గీతకారి్మకులు చెట్టు ఎక్కేందుకు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో ప్రమాదాల బారి నుంచి తనను తాను రక్షించుకోవడమే కాకుండా, శ్రమను తగ్గించుకోవాలని భావించిన శ్రీనివాస్‌ గౌడ్‌ తాటి చెట్టుకు మొదలు నుంచి, పైవరకు ఇనుప చువ్వలతో మెట్లను అమర్చాడు. ఆయన ఆలోచనకు అందరూ ఫిదా అవుతున్నారు.

ఒక్కో చెట్టుకు రూ.5వేలు ఖర్చు 
 శ్రీనివాస్‌గౌడ్‌కు వెల్డింగ్‌ వర్క్‌ రావడంతో తానే ఒక  తాటి చెట్టుకు నిచ్చెనను ఏర్పాటు చేశాడు. ఈ నిచ్చెనకు సుమారుగా రూ.5వేల ఖర్చు వచ్చింది. వర్షాకాలంలో ఈదురు గాలులతో గీత కారి్మకులు చెట్టు పైనుంచి పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాకాలంలో కోతలు పోవడం వల్ల కేవలం రెండు నెలలు మాత్రమే గీయవలసి వస్తుంది. దీంతో గీత కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారు. నిచ్చెన ఏర్పాటు చేయడం వల్ల గీత కారి్మకులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. రాత్రి సమయంలో దొంగలు ఎవరు చెట్టు పైకి ఎక్కి కల్లు దొంగిలించకుండా కుండల కింద, చుట్టూ ఒక ఫ్రేమ్‌ తయారు చేసి దానికి తాళం వేశాడు. ఈ నిచ్చెన వల్ల గీత కార్మికులు తాళ్లు కోతలకు గురికాకుండా సంవత్సరం పొడవున ఉపాధి దొరుకుతుంది. పండు తాళ్ల సమయంలో ఆరు నెలల వరకు కల్లు కూడా తీయవచ్చు.  

 సులభంగా వేగంగా.. 
  నిచ్చెన ఎక్కినంత సులభంగా తాటి చెట్టుపైకి వెళ్తున్నాడు శ్రీనివాస్‌గౌడ్‌. ఆయన తన స్వగ్రామం సిరిసిల్ల జిల్లా చీర్లవంచ ప్రాజెక్టులో ఊరు అంతా రిజర్వాయర్‌ కింద పోవడంతో అత్తగారు ఊరైన దూల్మిట్ట మండల కేంద్రానికి వచ్చాడు. మండల కేంద్రానికి దగ్గరలో ఉన్న లింగాపూర్‌ గ్రామంలో తాటి చెట్లు ఎక్కుతూ ఆరేళ్లుగా ఊరిలోనే ఉంటున్నాడు. వర్షాకాలంలో పండు తాళ్ల కల్లుతో సీజన్‌ ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో వర్షాలతో పాటు ముసురు పడితే తాటి చెట్లు ఎక్కే అవకాశం ఉండదు. దీంతో కోతలు కోయకపోవడంతో చెట్లు ఎండిపోయి కల్లు రాదు. దీంతో గీత కారి్మకులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పండుతాళ్ల కల్లు సమయంలోనే కోతలు సరిగా కోయాలి. లేకుంటే ఈ సమయంలో సరిగా కోయకపోతే కల్లు రాదు. అందుకోసమని శ్రీనివాస్‌ వర్షాకాలంలో తాటి చెట్లు ఎక్కేందుకు గ్రామంలోని 10 చెట్లకు తానే స్వయంగా నిచ్చెనలు ఏర్పాటు చేసుకున్నాడు.

ప్రాణభయం ఉండదు..
తాటి చెట్లకు మెట్లు అమర్చడం ద్వారా సంవత్సరం మొత్తం ఉపాధి దొరుకుతుంది. వర్షాకాలంలో సైతం మెట్ల ద్వారా వెళ్లి కల్లు తీయవచ్చు. ప్రతిరోజు కోతలు కోయవచ్చు. కాగా మెట్లతో చెట్లను వేగంగా ఎక్కి, దిగవచ్చు. దీంతో గీతకారి్మకులకు, వర్షాకాలం, ఎండాకాలంలో వచ్చే ఈదురు గాలుతో ఎలాంటి ప్రాణభయం ఉండదు.   
– నేరెళ్ల శ్రీనివాస్‌గౌడ్, లింగాపూర్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement