ప్రతీ రైతుకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి
స్వరూపరాణి
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ప్రభుత్వ పథకాల ద్వారా లభించే రాయితీలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకుగాను రైతులకు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి శనివారం తెలిపారు. జిల్లా పరిధిలోని రైతులు తమ గ్రామానికి సంబంధించిన వ్యవసాయ విస్తరణ అధికారి ద్వారా రైతు వేదికల్లో, సమీపంలోని మీ సేవా కేంద్రాలను సంప్రదించి ఫార్మర్ ఐడీ నమోదు చేసుకోవాలన్నారు. గ్రామాల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు ఫార్మర్ ఐడీ రిజిస్ట్రేషన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు నమోదు సమయంలో ఆధార్ కార్డు నంబర్, పట్టాదార్ పాస్‌బుక్ వివరాలు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ నంబర్ తదితర పత్రాలు తప్పనిసరిగా అధికారులకు అందించాలన్నారు. ప్రత్యేకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం లబ్ధి పొందేందుకు ఫార్మర్ ఐడీ అవసరమన్నారు. ఫార్మర్ ఐడీ ద్వారా పారదర్శకత పెరుగుతుందని, పంట బీమా, సబ్సిడీలు, రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు త్వరగా అందుతాయని తెలిపారు.


