నేడే మల్లన్న ఆరోవారం
భారీగా తరలిరానున్న భక్తులు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సత్తేటి వారాలలో ఆరవ ఆదివారానికి ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆలయ కార్యాలయంలో సంప్రదించాలని ఈఓ వెంకటేశ్ సూచించారు.
బీజేపీ నేతలకు
షోకాజ్ నోటీసులు
గజ్వేల్‌రూరల్: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరు బీజేపీ నేతలకు షోకాజ్ నోటీసులను జారీ చేస్తున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గజ్వేల్ మండలానికి చెందిన బీజేపీ నాయకులు బండారు మహేష్, ఎల్కంటి సురేష్‌లు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నియమ నిబంధనలను ఉల్లఘించడంతో పాటు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా అభ్యర్థుల ఓటమికి పనిచేశారని షోకాజ్ నోటీసుల్లో పేర్కొన్నారు. పార్టీ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా నోటీసులను పంపించామని, నోటీసులు అందిన మూడ్రోజుల్లోపు జిల్లా కార్యాలయానికి వివరణ ఇవ్వాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
రాజకీయంగా రాణించాలి
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సతీష్
సిద్దిపేటజోన్: రాజకీయంగా పద్మశాలీలు మరింత చైతన్యం కావాలని జిల్లా పద్మశాలీ సంఘం అధ్యక్షుడు డాక్టర్ సతీష్ పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని పొపా భవన్‌లో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పద్మశాలీ ప్రజాప్రతినిధులకు సన్మానం, ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 21మంది విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధులు ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. రాష్ట్ర జనాభాలో 12 శాతం ఉన్న పద్మశాలీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందన్నారు. సంఘటితంగా ముందుకు సాగి రాజకీయ హక్కులు సాధించాలని సూచించారు. ఇటీవల గెలిచిన దుబ్బాక మున్సిపల్ చైర్ పర్సన్ సంగీతతో పాటు కౌన్సిలర్లుగా గెలిచిన వారిని, సర్పంచ్‌లను సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ సంఘం అధ్యక్షుడు రాజేశం, సంఘం ప్రతినిధులు మల్లేశం, శ్రీనివాస్, ఆగయ్య, దయాసాగర్, ప్రభాకర్, రవితేజ, వెంకన్న, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఆత్మీయ సన్మానం
హుస్నాబాద్‌రూరల్: పట్టణ పౌరుడు, ఈ ప్రాంతానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన ఐఏఎస్ శ్యాంప్రసాద్ లాల్‌కు శనివారం రాత్రి వైశ్య భవన్‌లో ఆత్మీయ సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ లాల్ మాట్లాడుతూ పుట్టి పెరిగిన ఊరు, అక్షరాలు దిద్దిన బడిని ఎప్పటికి మర్చిపోనన్నారు. కలెక్టర్ అయినప్పటికీ నేను హుస్నాబాద్ ప్రాంత వాసినేనన్నారు. నాపై అభిమానంతో పట్టణంలోని వివిధ సంఘాలు సన్మానించడం గర్హకారణంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, ఆకుల రజిత, పందిల్ల శంకర్, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
చైతన్యం పెంచేలా
వీడియోలు రూపొందించండి
సీపీ రష్మీ పెరుమాళ్
సిద్దిపేటకమాన్: సైబర్ నేరాలు, మహిళలపై వేధింపుల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలను చైతన్య పర్చేలా వీడియోలు రూపొందించాలని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలను చైతన్చపర్చడానికి అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా చాలా మంది వీడియోలు రూపొందించారన్నారు. అదేవిదంగా ఇతర అంశాలపై కూడా ప్రజలకు అర్థమయ్యేలా ఆసక్తిగల వారు సోషల్ మీడియా వేదికగా చిన్న చిన్న వీడియోలు రూపొందించాలని సూచించారు.


