సాక్షి, హైదరాబాద్: భారత లాయర్స్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా తెలంగాణ హైకోర్టుకు చెందిన సునీల్ గౌడ్ ఎంపికయ్యారు. శనివారం న్యూఢిల్లీ వేదికగా జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఢిల్లీ హైకోర్టుకు చెందిన కుల్దీప్ పరిహార్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నిక కాగా... సునీల్ గౌడ్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వేలు మురుగన్ (తమిళనాడు హై కోర్టు), ఆదిత్య చౌదరి (సుప్రీంకోర్టు) ఉపాధ్యక్షులుగా ఎన్నిక కాగా... కేరళ హైకోర్టుకు చెందిన నవీన్ సంయుక్త కార్యదర్శిగా వ్యవహరించనున్నారు. కర్ణాటక లాయర్ సునీల్ కోశాధికారిగా ఎన్నిక కాగా... అజయ్ (పంజాబ్, హరియాణా హై కోర్టు), రాహుల్ (అలహాబాద్ హై కోర్టు) ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఎన్నికయ్యారు.


