అరకు, పాడేరు ఏరియాల్లో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతం వైపు నుంచి నేరుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్న శీతల గాలులు
వచ్చే వారం రోజులూ మరింత పెరిగే అవకాశం
సాక్షి, అమరావతి : రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. గతానికి భిన్నంగా చలి తీవ్రత పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత మూడు, నాలుగేళ్లుగా రాష్ట్రంలో శీతాకాలం ఓ మోస్తరుగా ఉండేది. కానీ ఈ సంవత్సరం పరిస్థితి అందుకు భిన్నంగా మారిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో 4 నుంచి 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం కిలగూడలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అరకు, పెదబయలు, పాడేరు, చింతపల్లి, వై.రామవరం, హుకుంపేట మండలాల్లో గత 20 రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొన్నిచోట్ల 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గురువారం నుంచి కోస్తా, రాయలసీమ జిల్లాల్లోనూ చలి తీవ్రత పెరిగింది. 2021 నుంచి 2024 వరకు ఎల్‌నినో ప్రభావం వల్ల సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడంతో చలికాలంలోనూ సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ఏడాది పరిస్థితి మారింది.
లానినా ప్రభావంతోనే..
ఈ మార్పులకు ప్రధానంగా లానినా ప్రభావమే కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ పరిస్థితుల వల్ల ఉత్తర భారతం నుంచి వీచే అతి శీతల గాలులు నేరుగా రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. దీనికితోడు హిమాలయాల్లో ఈ ఏడాది భారీగా కురుస్తున్న మంచు వల్ల అక్కడ ఏర్పడిన శీతల తరంగాలు ఒడిశా మీదుగా మన రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి.
ఈసారి పొడి వాతావరణం ఉండడం వల్ల భూమి త్వరగా చల్లబడి రాత్రివేళల్లో చలి తీవ్రత బాగా పెరుగుతోంది. వాతావరణ అధ్యయనాల ప్రకారం భూతాపం (గ్లోబల్ వార్మింగ్) పెరగడం వల్ల కేవలం ఎండలే కాకుండా శీతాకాలంలో చలి తీవ్రత కూడా పెరుగుతోంది.
వాతావరణంలోని జెట్ స్ట్రీమ్స్ బలహీనపడడం వల్ల ధృవ ప్రాంతాల్లో ఉండాల్సిన చల్లని గాలులు దక్షిణాది వైపు మళ్లుతున్నాయి. అందుకే రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం చలి పెరిగింది. భవిష్యత్తులోనూ ఇలాంటి చలి పరిస్థితులు పునరావృతమయ్యే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.


