ఆప్కాస్‌ ఉద్యోగాలకు మంగళం!? | 50 percent of posts released by Samagra Shiksha to be privatized: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఆప్కాస్‌ ఉద్యోగాలకు మంగళం!?

Feb 10 2026 4:33 AM | Updated on Feb 10 2026 4:35 AM

50 percent of posts released by Samagra Shiksha to be privatized: Andhra Pradesh

ఇటీవల సమగ్ర శిక్ష విడుదల చేసిన పోస్టుల్లో 50% ప్రైవేటుపరం? 

ఈ పోస్టులకు ఇప్పటికే జిల్లాల్లో వేలాది మంది దరఖాస్తు

సంక్షేమ శాఖలో కూడా ఇదే విధానం అమలుకు రంగం సిద్ధం  

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలన్నీ అనుయాయులకు కట్టబెట్టేందుకు స్కెచ్‌ 

10 శాఖల్లో ఉద్యోగులకు 10.5 నెలలకే వేతనాలు చెల్లించాలని ఆదేశం 

ప్రభుత్వ తాజా జీవో నం.12తో మళ్లీ శ్రమ దోపిడీ  

ఇప్పటికే ఐదు నెలలుగా వొకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్లకు వేతనాలివ్వని కాంట్రాక్టు సంస్థ 

గత ప్రభుత్వంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రక్షణకు ‘ఆప్కాస్‌’ ఏర్పాటు 

లక్ష మందికి పైగా చిరుద్యోగులకు ఏజెన్సీల దోపిడీ నుంచి ప్రభుత్వపరంగా రక్షణ 

జీవో 12తో బాబు గత పాలనను గుర్తుతెచ్చుకుని కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల శ్రమ దోపిడీకి మళ్లీ రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌ సర్వీసెస్‌ (ఆప్కాస్‌) కింద సకాలంలో జీతాలు, పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాలు పొందుతున్న ఉద్యోగులు టీడీపీ కూటమి ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2014 నాటి ఏజెన్సీ అవుట్‌ సోర్సింగ్‌ విధానంలోకి వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధమైంది. దీంతో.. ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఒప్పంద ప్రాతిపదికన నియమించే ఉద్యోగాలను ఇకపై టీడీపీ అనుయాయులకు కట్టబెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.  

సమగ్ర శిక్ష రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరీల్లోని 1,095 ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 26న నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ పోస్టులను జనవరి 31 నాటికి భర్తీ ప్రక్రియ పూర్తిచేసి ఆప్కాస్‌ ద్వారా వేతనాలు ఇచ్చేందుకు మార్గదర్శకాలు కూడా జారీచేశారు. దీంతో వేలల్లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఈ పోస్టుల భర్తీని నిలిపివేసింది. వీటిలో ఏఎన్‌ఎం, హెడ్‌కుక్, అసిస్టెంట్‌ కుక్, డే అండ్‌ నైట్‌ వాచ్‌ ఉమెన్, అటెండర్, స్వీపర్, స్కావెంజర్‌ వంటి దాదాపు 500 పోస్టులను ఏజెన్సీ ద్వారా భర్తీచేయాలని నిర్ణయించి అవుట్‌ సోర్సింగ్‌ సంస్థకు అప్పగించేందుకు రంగం సిద్ధంచేశారు. దీంతోపాటు సంక్షేమ శాఖలోని గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు తదితర 10 విభాగాల్లో మరో 2,600 పోస్టులను కూడా ఇదే విధానంలో అప్పగించనున్నారు.

ఆప్కాస్‌తో ఎలాంటి సంబంధంలేకుండా కాంట్రాక్టు సంస్థలే వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టారు. అయితే, ఈ విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అవు­ట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆప్కాస్‌ ద్వారా ఒక్కరోజు మినహాయించి 12 నెలల వేతనాలు చెల్లిస్తుండగా, ఇకపై వారికి 10.5 నెలలు మాత్రమే వేతనాలు ఇవ్వాలని ఆదేశాలు జారీచేశారు. ఇప్పటికే ప్రైవేటు ఏజెన్సీ ద్వారా పాఠశాల విద్యాశాఖలో అవుట్‌ సో­ర్సింగ్‌ విధానంలో వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లను నియమించగా, వీరికి సదరు సంస్థ ఐదు నెలలుగా వేతనాలు చెల్లించకుండా వేధిస్తోంది. ఈ వొకేషనల్‌ ఇన్‌స్ట్రక్టర్లు, కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్లు, అకౌంటెంట్, ఏఎన్‌ఎం, టీచింగ్, హాస్టల్‌ వార్డెన్స్, పార్ట్‌టైమ్‌ టీచింగ్‌ స్టాఫ్‌ పోస్టులకు ప్రతిభ, పని అనుభవాన్ని పట్టించుకోకుండా స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల ప్రకారం తమకు కావాల్సిన వారిని ఎంపిక చేశారు. వీటిలో ఒక్కో పోస్టుకు ఓ రేటు కట్టి వసూలు చేసినట్లు తెలిసింది. 

నాటి టీడీపీ ప్రభుత్వంలో శ్రమ దోపిడీ.. 
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల నియామ­కాలను గత టీడీపీ ప్రభుత్వం నిలిపివేసింది. కొత్త­గా కాంట్రాక్టు విధానం తీసుకొచ్చింది. తన వర్గంలోని అనుయాయులకు లబి్ధచేకూర్చేందుకు మధ్యవర్తులు­గా ‘అవుట్‌ సోర్సింగ్‌’ కంపెనీలను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ విభాగాల్లోని ఖాళీ పోస్టులను మొ­త్తం గంపగుత్తగా తన వర్గం వారికి (మేన్‌పవర్‌ ఏజె­న్సీ­లు) అప్పగించి వారితోనే నియామకాలు చేపట్టింది. వేతనాలు సైతం సదరు కంపెనీయే చెల్లించేది. ఈ కాంట్రాక్టు ఏజెన్సీల ద్వారా ఉద్యోగంలో చేరాలంటే లంచాలు ఇచ్చుకోవాల్సి వచ్చేది. అప్పట్లో ఈ ఉద్యోగులకు ఒప్పందం ప్రకారం వేతనాలు ఇవ్వకపోగా, జీతంలో కోతలు సర్వసాధారణమయ్యాయి. పీఎఫ్, ఈఎస్‌ఐ చెల్లింపులు సైతం ఎగవేశాయి. నియామకా­ల్లో ఒక విధానం అంటూ లేకుండా దారుణంగా ప్రవర్తించాయి. ఎవరైనా ప్రశి్నస్తే నిర్దాక్షిణ్యంగా ఊస్టింగే. దీంతో చిరుద్యోగులకు రక్షణ లేకుండాపోయింది. 

మళ్లీ మధ్యవర్తులతో దోపిడీకి స్కెచ్‌!.. 
మరోవైపు.. ఆప్కాస్‌ను రద్దుచేసేందుకు ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నించడంతో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. కొత్తగా చేపట్టే నియామకాలను మధ్యవర్తులు, మేన్‌పవర్‌ కంపెనీలకు అప్పగించేందుకు ఈనెల 9న ప్రభుత్వం ఉత్తర్వులు (జీఓ–12) జారీచేసింది. తొలివిడతలో 10 రకాల ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉద్యోగాలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగిస్తోంది. 

ఇందు­లో, సమగ్ర శిక్షలోని కేజీబీవీలు.. ఏపీ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ.. గిరిజన సంక్షేమ శాఖ.. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ సొసైటీ (గురుకులాలు).. బీసీ సంక్షేమ శాఖ.. మహాత్మా జ్యోతిబా పూలే ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ.. మైనారిటీ సంక్షేమ శాఖ.. వికలాంగు లు, ట్రాన్స్‌జెండర్, సీనియర్‌ సిటిజన్స్‌ సంక్షేమ శాఖ ..జువెనైల్‌ వెల్ఫేర్, కరెక్షనల్‌ సర్వీసెస్, వీధి పిల్లల సంక్షేమ శాఖ.. ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టి ట్యూషన్స్‌ సొసైటీలున్నాయి. వీటిల్లో ఖాళీగా ఉన్న 3 వేలకు పైగా పోస్టులను ప్రైవేటు అవుట్‌ సో ర్సింగ్‌ ఏ జెన్సీలకు అప్పగించడంతో పాటు ఏడాదిలో 10.5 నెలలకే జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. ప్రభు త్వం 2016 ఆగస్టులో జారీచేసిన జీఓ ఎంఎస్‌ నెం.151 ప్రకారం ఈ నియామకాలు ఉండాలని పేర్కొనడంతో చిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.  

ఆప్కాస్‌ కింద 1.07 లక్షల మందికి రక్షణ..
రాష్ట్రంలో చిరుద్యోగులను దోచు­కుంటున్న అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు, మేన్‌పవర్‌ కంపెనీల నుంచి చిరుద్యోగులకు రక్షణ కల్పించేందుకు గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అవుట్‌ సోర్స్‌డ్‌ సర్విసెస్‌ (ఆప్కాస్‌) సంస్థను 2019 డిసెంబరులో చట్టబద్ధంగా ప్రారంభించింది. అప్పటిదాకా తీవ్ర శ్రమదోపిడీకి గురవుతున్న ఈ ఉద్యోగులను ఆప్కాస్‌ కిందకు తెచ్చి వారికి గరిష్ట ప్రయోజనా­లు కల్పించారు. అలాగే, ప్రైవే­ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీలు, మధ్యవర్తులను పూర్తి­గా తొలగించారు. ఎస్సీ/ఎస్టీ/ బీసీ, మైనారిటీలు, మహిళలకు రిజర్వేషన్‌ కల్పించారు. ఎవరికీ లంచాలిచ్చే ఆస్కారం లేకుండా, ఎలాంటి కోతలు విధించకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించారు. పీఎఫ్, ఈ­ఎస్‌ఐ రక్షణ కల్పించారు. ఇలా ప్రస్తుతం ఆప్కాస్‌ కింద 1.07 లక్షల మంది పనిచేస్తున్నారు. 

ఐదు నెలలుగా జీతాలు ఇవ్వని ఏజెన్సీలు..
సమగ్ర శిక్ష పరిధిలో అమలవుతున్న ఎన్‌ఎస్క్యూఎఫ్‌ కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, ఏపీ మోడల్‌ స్కూల్స్, సంక్షేమ పాఠశాలల్లో విద్యార్థులకు వివిధ ట్రేడ్స్‌లో వొకేషనల్‌ శిక్షణ ప్రారంభించారు. శిక్షణ కోసం తొమ్మిది వొకేషనల్‌ ట్రైనింగ్‌ పార్ట్‌నర్‌ ఏజెన్సీల (ప్రైవేట్‌ ఏజెన్సీలు) ద్వారా 3,350 మంది ఇన్‌స్ట్రక్టర్లను నియమించారు. అయితే, వీరికి ఐదు నెలలుగా జీతాలివ్వకుండా ఏజెన్సీలు వేధిస్తున్నాయి. దీంతో.. ఓ ట్రైనర్‌ ‘తాము చేస్తున్నది వెట్టిచాకిరీనా మరేంటో అర్థం కావడంలేదు. వేతనాల్లేకుండా ఎలా బతకాలి’ అని సోషల్‌ మీడియాలో చేసిన పోస్టు కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘బ్రహ్మచారిగా ఉన్న తనకే ఇలా ఉంటే కుటుంబాలు ఉన్నవారి పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మంచిద’ని ఆయన వాపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement