ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు | Andhra Pradesh High Court questions police on filing cases against Ambati Rambabu | Sakshi
Sakshi News home page

ఒకే ఘటనపై ఎన్ని కేసులు పెడతారు

Feb 10 2026 4:48 AM | Updated on Feb 10 2026 4:48 AM

Andhra Pradesh High Court questions police on filing cases against Ambati Rambabu

అంబటి మీద కేసుల నమోదుపై పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

మిగిలిన ఫిర్యాదులను ఎందుకు వాంగ్మూలాలుగా పరిగణించడం లేదో చెప్పండి 

రాంబాబుపై కేసుల విషయంలో సెక్షన్‌ 35(3) ప్రకారం నడుచుకోవాలని ఆదేశం 

తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వులు లేవని సీబీఐ–సిట్‌ చార్జిషిట్‌ దాఖలు చేసినా.. అధికార పార్టీ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే క్రమంలో చేసిన వ్యాఖ్యలకు గాను తనపై రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో నమోదైన 33 కేసులను కొట్టేయాలని కోరుతూ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు సోమవారం అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు. లంచ్‌ మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విచారణ జరిపారు.

ఒకే అంశంపై ఎన్ని ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేస్తారని న్యాయమూర్తి ప్రశి్నంచారు. మొదటి ఫిర్యాదును ప్రధాన కేసుగా తీసుకుని మిగిలిన అన్ని ఫిర్యాదులను సీఆర్‌పీసీ సెక్షన్‌ 162 కింద వాంగ్మూలాలుగా ఎందుకు పరిగణించకూడదన్నారు. దీనిపై పోలీసులకు తగిన సూచనలు చేస్తామని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ మెండ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ విషయంపై తదుపరి విచారణ నాటికి స్పష్టత తీసుకోవాలని పీపీకి న్యాయమూర్తి స్పష్టం చేశారు. అంబటిపై రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 33 కేసుల్లో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు.

బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) కింద నోటీసులు జారీ చేసి ఆయన వివరణ తీసుకోవాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేశారు. అంబటి తరఫున సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 35 కేసులు ఒకే అంశానికి సంబంధించినవని, దీనిపై బహుళ ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి వీల్లేదని తెలిసినా పోలీసులు కేసులు నమోదు చేస్తూనే ఉన్నారని కోర్టుకు తెలిపారు. 

చట్ట ప్రకారం నడుచుకోండి 
గత ఏడాది జూన్‌లో వెన్నుపోటు దినం పేరుతో బైక్‌ ర్యాలీ నిర్వహించినందుకు అంబటి రాంబాబుపై నమోదైన కేసుల్లో బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 35(3) ప్రకారం నడుచుకోవాలని గుంటూరు, పట్టాభిపురం పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆయనకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలంది. అంబటిపై నమోదైన కేసులు ఏడేళ్ల కన్నా తక్కువ శిక్ష పడేవేనని, ఫిర్యాదుదారులకు నోటీసులివ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేస్తూ న్యాయమూర్తి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement