రూ.87,818 కోట్లతో భూసేకరణ, పునరావాస కల్పనకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్
డ్యామ్ ఎత్తు 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంపు పనులు వేగవంతం
129.72 నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరగనున్న నిల్వ సామర్థ్యం
యూకేపీ–3 కింద అదనంగా 173 టీఎంసీలు వాడుకుని 5.90 లక్షల హెక్టార్లకు నీళ్లు.. ఇప్పటికే 1.13 లక్షల హెక్టార్లలో జలాలను పారించిన కర్ణాటక
సుప్రీంలో సవాల్ చేస్తూ ఎస్సెల్సీలు దాఖలు చేసిన మహారాష్ట్ర, తెలంగాణ
ఏపీ హక్కులను హరిస్తున్నా పట్టించుకోని చంద్రబాబు సర్కార్
కృష్ణాలో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నికర జలాల్లో ఎగువ నుంచి రావాల్సిన ప్రవాహం 442 టీఎంసీలు
ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆ ప్రవాహం రాదంటున్న సాగునీటిరంగ నిపుణులు
కృష్ణా జలాలపై ఆధారపడ్డ ఆయకట్టు ఎడారేనంటూ మన రైతుల ఆందోళన
ఆల్మట్టి ఎత్తు పెంపుపై 2014 అక్టోబర్‌లో డీపీఆర్‌కు కర్ణాటక టెండర్ నోటిఫికేషన్
నాడు అభ్యంతరం చెప్పకుండా డీపీఆర్ తయారీకి పచ్చజెండా ఊపిన చంద్రబాబు
ఆ డీపీఆర్ ఆధారంగానే ఇప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంపు పనులు చేపట్టిన కర్ణాటక
1996 వరకూ ఆల్మట్టి ఓ ఆనకట్టే.. నిల్వ సామర్థ్యం 17.82 టీఎంసీలే
దేవెగౌడను ప్రధానిగా చేశానంటూ ఇప్పటికీ జబ్బలు చరుచుకుంటున్న చంద్రబాబు
నాడు ప్రధాని హోదాలో ప్రపంచ బ్యాంకుతో రుణం మంజూరు చేయించి ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 519.6 మీటర్లకు పెంపు పనులు చేపట్టిన దేవెగౌడ
అడ్డుకోకుండా నాడు బాబు మౌనం.. నేటికీ వెంటాడుతున్న ఆ పాపాలు
సాక్షి, అమరావతి: ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 నుంచి ఏకంగా 524.256 మీటర్లకు పెంచడంపై కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తోంది. డ్యామ్ ఎత్తు పెంపు పనులపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి 2014 అక్టోబర్ 25నే టెండర్ పిలవగా నాడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ అభ్యంతరం చెప్పలేదు. అప్పట్లో రూపొందించిన డీపీఆర్ ప్రకారం.. తాజాగా ఆల్మట్టి డ్యామ్ ఎత్తును కర్ణాటక సర్కార్ పెంచుతుండగా, ఇప్పుడైనా చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీల నుంచి ఏకంగా 279.72 టీఎంసీలకు పెరుగుతుంది. ప్రస్తుతం ఎగువ నుంచి శ్రీశైలానికి వరద ప్రవాహం జూలై ఆఖరుకు వస్తోంది.
అదే ఆల్మట్టి ఎత్తు పెంచితే ఆగస్టు రెండో వారానికిగానీ.. శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం చేరదని.. దాంతో నీటి లభ్యత భారీగా తగ్గి రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టు ఎడారిగా మారుతుందని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుతో బ్యాక్ వాటర్ ప్రభావం వల్ల సాంగ్లీ, కొల్హాపూర్ జిల్లాలు ముంపునకు గురవుతాయని మహారాష్ట్ర సర్కార్.. తమ ప్రాజెక్టుల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. కానీ.. చంద్రబాబు సర్కార్ మాత్రం కనీసం నోరు మెదపకపోవడంపై సాగునీటిరంగ నిపుణులు, రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వడివడిగా భూ సేకరణ, పునరావాసం
ఆల్మట్టి డ్యామ్ ఎత్తును పెంచితే 20 గ్రామాలతోపాటు భాగల్‌కోట్ మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పించాలి. ముంపునకు గురయ్యే భూమితోపాటు.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి మొత్తం 1,33,967 ఎకరాలను సేకరించేందుకు కర్ణాటక సర్కార్ సిద్ధమైంది. భూసేకరణ, నిర్వాసితులకు పునరావాసం కల్పనకు రూ.87,818 కోట్లను మంజూరు చేసింది. మాగాణి భూమికి ఎకరానికి రూ.40 లక్షలు.. మెట్ట భూమికి ఎకరానికి రూ.30 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని పేర్కొంటూ భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఇక భాగల్‌కోట్ మున్సిపాల్టీలో 11 వార్డుల ప్రజలకు పునరావాసం కల్పన పనులను వేగవంతం చేస్తూనే 20 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఓవైపు డ్యామ్ ఎత్తు పెంచే పనులను వేగంగా చేపడుతూ మరోవైపు అప్పర్ కృష్ణా ప్రాజెక్టు మూడో దశ(యూకేపీ–3) కింద 5.94 లక్షల హెక్టార్లకుగానూ.. ఇప్పటికే 1,13,500 హెక్టార్లను అభివృద్ధి చేసి గతేడాది ఆ ఆయకట్టుకు సాగునీటిని కూడా అందించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి కర్ణాటక సర్కార్ దూకుడుగా వ్యవహరిస్తూ.. ఏపీ హక్కులను హరిస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
కేడబ్ల్యూడీటీ – 2 తుది నివేదిక అమలుకు ఒత్తిడి..
కృష్ణా జలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లకు పంపిణీ చేస్తూ కేడబ్ల్యూడీటీ–2 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్) కేంద్రానికి 2010 డిసెంబర్ 30న ఇచ్చిన తొలి నివేదిక.. 2013 నవంబర్ 29న ఇచ్చిన తుది నివేదికను సవాల్ చేస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఎస్సెల్పీ(స్పెషల్ లీవ్ పిటిషన్) దాఖలు చేసింది. దాంతో ఇప్పటిదాకా కేడబ్లూ్ల్యడీటీ–2 తుది నివేదికను అమలు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. అయితే తక్షణమే కేడబ్ల్యూడీటీ–2 తుది నివేదికను అమలు చేయాలని కేంద్రంపై ఓవైపు ఒత్తిడి చేస్తూనే.. మరోవైపు ఆ తుది నివేదికలో కేటాయించిన నీటిని వినియోగించుకోవడానికి కర్ణాటక సర్కార్ చర్యలు చేపట్టింది. కృష్ణా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన 2,130 టీఎంసీలను కొనసాగిస్తూనే.. 65 శాతం, సరాసరి ప్రవాహాల ఆధారంగా 448 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–2 అదనంగా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో కర్ణాటకకు 173 టీఎంసీలను కేటాయించింది. అందులో యూకేపీ–3 కింద 130 టీఎంసీలను వినియోగించుకోవడానికి అనుమతి ఇచ్చిన కేడబ్ల్యూడీటీ–2.. ఆ మేరకు ఆల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 
సాగునీటి మాట దేవుడెరుగు.. తాగునీటికీ ఇబ్బందులే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను కేడబ్ల్యూడీటీ–1 కేటాయించింది. ఇందులో 369 టీఎంసీల లభ్యత ఉమ్మడి రాష్ట్రంలోని కృష్ణా బేసిన్‌లో ఉంటుందని.. ఎగువ నుంచి 442 టీఎంసీల ప్రవాహం వస్తుందని పేర్కొంది. ఇక కృష్ణా నదిలో 65 శాతం, సరాసరి లభ్యత కింద కేడబ్ల్యూడీటీ–2 కర్ణాటకకు 173 టీఎంసీలు, మహారాష్ట్రకు 81 టీఎంసీలను కేటాయించింది. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపులు, కేడబ్ల్యూడీటీ–2 కేటాయింపులు కలిపితే మహారాష్ట్ర వాటా 585 నుంచి 666, కర్ణాటక వాటా 734 నుంచి 907 టీఎంసీలకు పెరుగుతుంది. అంటే.. మహారాష్ట్ర, కర్ణాటక 1,573 టీఎంసీలను వాడుకున్న తర్వాతే దిగువకు నీటిని విడుదల చేస్తాయి. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ఆ మేరకు నీటిని అదనంగా కర్ణాటక నిల్వ చేసుకుని, వినియోగించుకోనుంది.
దాంతో శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం రావడంలో తీవ్ర జాప్యం చోటు చేసుకోనుంది. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన అదనపు జలాలు 194 టీఎంసీల మాట దేవుడెరుగు.. కేడబ్ల్యూడీటీ–1 కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీల లభ్యత కూడా ఉండదని సాగునీటిరంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎగువ నుంచి రావాల్సిన 442 టీఎంసీల ప్రవాహంలో భారీ ఎత్తున కోత పడుతుందని.. ఇది రాష్ట్రంలో కృష్ణా జలాలపై ఆధారపడ్డ ప్రాజెక్టుల ఆయకట్టును ఎడారిగా మార్చుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాగునీరు కాదు కదా.. కనీసం గుక్కెడు తాగునీటికీ ఇబ్బందులు తప్పవని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నాడు ఆనకట్టను రిజర్వాయర్‌గా.. నేడు రిజర్వాయర్‌ను మెగా రిజర్వాయర్‌గా!
ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు 1995 వరకూ 506.87 మీటర్లు.. నీటి నిల్వ సామర్థ్యం 17.82 టీఎంసీలు మాత్రమే. ఆ ఆనకట్ట ద్వారా యూకేపీ తొలి దశ కింద 4.25 లక్షల హెక్టార్లకు కర్ణాటక సర్కార్ 1996 వరకూ నీళ్లందించింది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996లో యునైటెడ్ ఫ్రంట్‌ను ఏర్పాటుచేసి.. నాటి కర్ణాటక సీఎం దేవెగౌడను ప్రధానిగా చేశానని గొప్పగా చెబుతుంటారు. ఆ సమయంలో ప్రధాని హోదాలో ఉన్న దేవెగౌడ ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని మంజూరు చేయించి.. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 506.87 మీటర్ల నుంచి 519.6 మీటర్లకు పెంచుతూ, నీటి నిల్వ సామర్థ్యాన్ని 17.82 నుంచి 129.72 మీటర్లకు పెంచే పనులను చేపట్టారు.
కృష్ణా జలాలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హక్కులను కర్ణాటక సర్కార్ కాలరాస్తూ ఆల్మట్టి ఆనకట్టను రిజర్వాయర్‌గా మార్చేసినా చంద్రబాబు అప్పుడు నోరుమెదపలేదు. దాంతో యూకేపీ–2 కింద అదనంగా 54 టీఎంసీలను వినియోగించుకుంటూ 1.97 లక్షల హెక్టార్లకు 2002 నాటికే కర్ణాటక నీళ్లందించింది. దీని వల్ల ఎగువ నుంచి జూన్ నాటికి శ్రీశైలానికి చేరాల్సిన కృష్ణా వరద.. ఇప్పుడు జూలై ఆఖరుకుగానీ చేరడం లేదు. ఇక ఇప్పుడు ఆల్మట్టి రిజర్వాయర్‌ను మెగా రిజర్వాయర్‌గా మార్చేస్తూ.. ఏపీ హక్కులను కాలరాస్తున్నా సరే చంద్రబాబు ప్రభుత్వం మౌనవ్రతాన్ని వీడకపోవడం గమనార్హం.


