భారతదేశంలో చలికాలం కేవలం వాతావరణ మార్పులకే పరిమితం కాకుండా దేశ రిటైల్, ఉత్పాదక రంగాల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కొనసాగే ఈ సీజన్ సుమారు 13.5 బిలియన్ డాలర్ల(సుమారు 1.1 లక్షల కోట్లు) విలువైన వింటర్ వేర్ మార్కెట్‌తో పాటు పలు కీలక రంగాలకు లాభాల పంట పండిస్తోంది. ఈ కాలంలో వినియోగదారుల అవసరాలు మారిపోవడం వల్ల అనేక రకాల వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.
చలికాలంలో వృద్ధి చెందే ప్రధాన వ్యాపారాలు
భారతదేశంలో వింటర్ వేర్ మార్కెట్ విలువ 2025 నాటికి సుమారు 13.5 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. స్వెటర్లు, జాకెట్లు, థర్మల్ వేర్, శాలువాలు, గ్లౌవ్స్, మఫ్లర్లకు ఈ కాలంలో చాలా డిమాండ్ ఉంటుంది. లుధియానా, తిరుపూర్ వంటి ప్రాంతాల నుంచి హోల్‌సేల్‌గా కొనుగోలు చేసి రిటైల్ షాపులు లేదా రోడ్డు పక్కన తాత్కాలిక స్టాళ్ల ద్వారా వీటిని విక్రయిస్తున్నారు.
ఆహార, పానీయాల రంగం
చల్లని వాతావరణంలో ప్రజలు వెచ్చని, పోషక విలువలున్న ఆహారాన్ని కోరుకుంటారు. టీ, కాఫీ ముఖ్యంగా సూప్ విక్రయాల విభాగంలో ఈ సమయంలో డిమాండ్ పెరుగుతోంది. రోగనిరోధక శక్తిని పెంచే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్, బెల్లంతో చేసిన నువ్వుల లడ్డూల అమ్మకాలు పెరుగుతాయి.
గృహోపకరణాలు
ఉష్ణోగ్రతలు తగ్గడంతో గృహ వినియోగ వస్తువుల అమ్మకాలు పెరుగుతాయి. నీటిని వేడి చేసే గీజర్లు, గదిని వెచ్చగా ఉంచే రూమ్ హీటర్ల అమ్మకాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో జోరుగా సాగుతాయి.
చలికాలపు వ్యాపారాలు దేశ ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ప్రభావం చూపుతాయి. పండుగలు (సంక్రాంతి, క్రిస్మస్), వివాహాల సీజన్ కూడా ఈ కాలంలోనే రావడంతో రిటైల్ రంగం భారీ ఆదాయాన్ని గడిస్తుంది. మార్కెట్ విశ్లేషణల ప్రకారం.. వింటర్ వేర్ మార్కెట్ ఏటా 6.10% వృద్ధి రేటుతో పెరుగుతోంది.
తాత్కాలిక విక్రయదారులు, ఉన్ని దుస్తుల తయారీదారులు, పర్యాటక రంగంలో గైడ్‌లకు ఈ మూడు-నాలుగు నెలలు ఉపాధి లభిస్తుంది. కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి మంచు కురిసే ప్రాంతాలతో పాటు ఆహ్లాదకరంగా ఉండే రాజస్థాన్, కేరళ వంటి రాష్ట్రాలకు పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. దీనివల్ల హోటల్, రవాణా రంగాలు లాభపడతాయి. అయితే, ఈ వ్యాపారాలు కేవలం కొన్ని నెలలకే పరిమితం కావడం వల్ల మిగిలిపోయిన సరుకు (Inventory) వ్యాపారులకు భారంగా మారుతుంది. దీన్ని అధిగమించడానికి సీజన్ ముగింపులో భారీ డిస్కౌంట్లు ఇస్తుంటారు.
ఇదీ చదవండి: దీర్ఘకాల సంపద రహస్యం ఏమిటంటే..


