ఆర్థిక మార్కెట్లకు 2025 సంవత్సరం ఆశ్చర్యాలకు గురిచేసింది. సంవత్సరంలో ఎక్కువ భాగం ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పటికీ, ఇటీవల రికవరీ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రెండో అర్ధభాగంలో రెండు రకాల ఆస్తులు ప్రత్యేకంగా మెరిశాయి.
బంగారం, వెండి
బంగారం, క్యాలెండర్ ఇయర్ 2024లో 30% రాబడిని అందించింది. ఇది ఈక్విటీలను మించిన లాభం. మరోవైపు పరిశ్రమల వినియోగంతో డిమాండ్ పెంచుకున్న వెండి 25.3% లాభపడింది. దీంతో వీటిలో ఎక్కువ పెట్టుబడి పెట్టుంటే బాగుండేది అనుకునే ఇన్వెస్టర్ల సంఖ్య పెరిగింది. కానీ ఇలాంటి సమయంలోనే ‘రాబడులు ఇప్పటికే పెరిగాక వాటిని వెంబడించడం’ అనే ఉచ్చులో పెట్టుబడిదారులు చిక్కుకుంటారు.
సమూహాన్ని వెంబడించే మానసిక లక్షణం
బంగారంలో రాబడులు పెరిగే సమయంలో పెట్టుబడిదారుల ఆసక్తి కూడా ఒక్కసారిగా పెరుగుతుంది. అయితే ధరలు పడిపోతే అదే ఆసక్తి తగ్గిపోతుంది. ఈ ప్రతిస్పందనాత్మక ప్రవర్తనే, పెట్టుబడుల్లో క్రమశిక్షణ, స్థిరత్వం ఎంత కీలకమో గుర్తు చేస్తుంది. మార్కెట్ టైమింగ్ కన్నా, దీర్ఘకాలిక దృష్టితో, విభిన్న ఆస్తుల్లో పెట్టుబడి పెట్టడం మెరుగైన ఫలితాలు ఇస్తుంది. మార్కెట్ గతంలో ఇచి్చనట్లుగా భవిష్యత్‌లో కూడా లాభాలను అందిస్తుందనే హామీ ఏమీ ఉండదు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఒక సమర్థవంతమైన మార్గంఔట్‌సోర్సడ్ అసెట్ అలొకేషన్. అంటే, మన డబ్బును ఏ ఆస్తిలో ఎంత పెట్టాలి (షేర్లు, బాండ్లు, గోల్డ్, క్యాష్ వంటివి) అనే నిర్ణయాన్ని ఒక ఫండ్ మేనేజర్‌కే అప్పగించడం.
క్లిష్ట పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులు
ఎప్పటికప్పుడు మారుతూ అస్థిరంగా ఉన్న ప్రపంచ మార్కెట్లలో, ఇటీవల బాగా రాబడులు ఇచ్చిందనే కారణంతో ఒకేరకమైన ఆస్తి తరగతిపైనే పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం కావచ్చు. విభిన్న ఆస్తి తరగతులు ఇప్పుడెలా ప్రవర్తిస్తున్నాయో చూద్దాం:
బంగారం–వెండి: సంప్రదాయంగా సురక్షిత పెట్టుబడి ఆస్తులుగా భావించే ఈ లోహాలు, ద్రవ్యోల్బణం పెరిగినప్పుడు లేదా కరెన్సీ బలహీనపడినప్పుడు మెరుగ్గా లాభాలను అందిస్తాయి. పరిశ్రమలతో అనుసంధానమై ఉండడం వల్ల ఎక్కువ ఊగిసలాట ఉన్నా వెండిలో అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఈక్విటీలు: వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండే ఆస్తి తరగతి. కానీ వడ్డీ రేట్లు, కంపెనీల లాభాల అంచనాలు, స్థూల ఆర్థిక మార్పులపై ఎక్కువగా ఆధారపడతాయి. ప్రాంతాలు, రంగాల మధ్య పనితీరులో పెద్దగా తేడాలు ఉంటాయి.
ఫిక్స్‌డ్ ఇన్‌కమ్: స్థిరత్వం ఎక్కువ, అంచనా వేయగల ఆదాయాన్ని అందిస్తాయి. వడ్డీ రేట్లు పెరిగితే బాండ్ ధరలపై ఒత్తిడి వచ్చినా, రిస్క్ నియంత్రణకు, మూలధన పరిరక్షణకు ఇవి కీలకం. ముఖ్యంగా సంరక్షణాత్మక పెట్టుబడిదారులకు, పదవీ విరమణకు దగ్గరలో ఉన్నవారికి ఇవి ఉపయోగం.
రియల్ అసెట్స్ ఇతర ప్రత్యామ్నాయాలు: రియల్ ఎస్టేట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీలు ద్రవ్యోల్బణానికి రక్షణనిచ్చే అవకాశముంది. ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడులు అధిక రాబడులు ఇవ్వగలిగినా, ఎక్కువ రిస్క్, తక్కువ లిక్విడిటీ కలిగి ఉంటాయి.
వైవిధ్యీకరణ ఎందుకు కీలకం?: బుల్ మార్కెట్‌లో ఈక్విటీలు కావొచ్చు, మాంద్య సమయంలో బంగారం కావొచ్చు. అత్యుత్తమ పనితీరు కనబరిచే ఆస్తి వెంట పరుగులుతీయడం, ఇదిపెట్టుబడుల విషయంలో తప్పు టైమింగ్‌కు, అధిక ఊగిసలాటకు దారితీస్తుంది. వైవిధ్యీకరణ అంటే, వివిధ పరిస్థితుల్లో భిన్నంగా ప్రవర్తించే ఆస్తుల మధ్య పెట్టుబడులను పంచడం. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది.
వైవిధ్యీకరణకి ఉదాహరణ: ఎన్‌ఎస్‌ఈ 500 కంపెనీలలో, 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మే 31 వరకు, తక్కువ పనితీరు, నిదానమైన వృద్ధి ఉన్న కంపెనీలు, మంచి పనితీరు, అధిక వృద్ధి కంపెనీల కంటే ఎక్కువ రాబడులు ఇచ్చాయి. కానీ ఈ ధోరణి మళ్లీ మారుతోంది. 2024 జూన్ నుంచి, మార్కెట్ మళ్లీ అధిక పనితీరు, అధిక వృద్ధి కంపెనీలను ప్రోత్సహించడం మొదలుపెట్టింది. అవి గతంలో ఎదుర్కొన్న అండర్‌పర్ఫార్మెన్స్‌లో పావు వంతుకు పైగా రికవరీ సాధించాయి. అందువల ఈక్విటీల పనితీరును బట్టి వైవిధ్యీకరణను పాటించాలి.
ఇదీ చదవండి: క్రూడాయిల్ ధరలు తగ్గినా.. తగ్గని పెట్రోల్, డీజిల్ రేట్లు
ముగింపు: తరచూ ఒడిదుడుకులకు లోనయ్యే పెట్టుబడుల ప్రపంచంలో, ఆలోచనాత్మకమైన వైవిధ్యీకరణతో బలమైన పోర్ట్‌ఫోలియో నిర్మించడం తెలివైన పని మాత్రమే కాదు, అవసరం కూడా. అందుకే పెట్టుబడిదారులు తాత్కాలిక రాబడులకన్నా, సమతుల్యత, క్రమశిక్షణ, దీర్ఘకాలిక వ్యూహంపై దృష్టి పెట్టాలి. ప్రఖ్యాతపారిశ్రామికవేత్త, పెట్టుబడిదారు నావల్ రవికాంత్ చెప్పినట్లుగా.. ‘‘జీవితంలో వచ్చే అన్ని రాబడులూ సంపద, సంబంధాలు, జ్ఞానం కలయిక వల్లే వస్తాయి.’’



