రాష్ట్రంలో స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ తమ యూనిట్లను విస్తరించనుంది. శంషాబాద్, గాగిల్లాపూర్లలో రూ.623 కోట్ల పెట్టుబడితో విస్తరిస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) - 2026లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్నైడర్ కంపెనీ సీఈవో దీపక్ శర్మతో సమావేశమయ్యారు.
విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రీయల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, కాంటాక్టర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరుగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్‌కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి.
పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేసిన ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 2047 నాటికి నెట్ జీరో అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడంలో పర్యావరణ పరిరక్షణ కీలకమని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇంధన నిర్వహణ, ఆటోమేషన్, ఈవీ భాగాల తయారీలో స్మార్ట్ ఫ్యాక్టరీల విస్తరణపై మంత్రులు చర్చించారు. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగిందని మంత్రులు తెలిపారు.


