ఇరవయ్యేళ్లు ఇబ్బందుల్లేకుండా.. | Telangana Govt decision to develop software for Stamps and Registration | Sakshi
Sakshi News home page

ఇరవయ్యేళ్లు ఇబ్బందుల్లేకుండా..

Mar 11 2026 2:45 AM | Updated on Mar 11 2026 2:45 AM

Telangana Govt decision to develop software for Stamps and Registration

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి సర్కారు నిర్ణయం 

ఏకీకృత పోర్టల్‌ తీసుకువచ్చే యోచనలో మంత్రి పొంగులేటి 

ఎన్‌ఐసీ సహకారంతో సర్వర్ల సమస్యలు తలెత్తకుండా చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయేతర భూములు, ఆస్తుల క్రయవిక్రయ లావాదేవీల కోసం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వినియోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత పదేళ్ల కాలంలో రిజిస్ట్రేషన్ల సంఖ్య (భూములు, ఆస్తుల క్రయ విక్రయ లావాదేవీలు) నాలుగు రెట్లు పెరిగిన నేపథ్యంలో వచ్చే 20 ఏళ్ల కాలానికి తగిన విధంగా సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పోర్టల్‌ను నిర్వహిస్తున్న నేషనల్‌ ఇన్ఫర్మాటిక్స్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సహకారంతోనే మరో 20 ఏళ్ల పాటు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించాలని సర్కారు భావిస్తోంది. ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులు వచ్చే బడ్జెట్‌లో కేటాయించనున్నారు. దాదాపు రూ.10 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తుండగా, ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ చేసిన ప్రతిపాదనకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్టు సమాచారం.  

ఏకీకృత పోర్టల్‌ తరహాలోనే..! 
ప్రస్తుతం రాష్ట్రంలో భూముల వివరాలు, సర్వే, రిజిస్ట్రేషన్ల వివరాలు వేర్వేరు డొమైన్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ మొత్తం డేటా, ఇతర సమాచారాలను సమీకృతం చేస్తూ ఏకీకృత పోర్టల్‌ తీసుకురావాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగా ఏకీకృత పోర్టల్‌ తరహాలోనే స్టాంపుల శాఖ సాఫ్ట్‌వేర్‌ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. రానున్న ఇరవై ఏళ్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయడంతో పాటు, రోజువారీ కార్యకలాపాలను నియంత్రించే సర్వర్లతో సహా ఇతర అంశాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోర్టల్‌కు కొత్త సొబగులు అద్దనున్నారు. 

ఈ బాధ్యతలు తీసుకున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు ఎప్పటికప్పుడు ఇందుకు అవసరమైన సమాచారం తీసుకుంటూ, ఎన్‌ఐసీతో సమన్వయం చేసుకుంటూ 2047 వరకు ఉపయోగపడేలా సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరో ఆరు నెలల్లోపు ఈ ప్రకియ పూర్తవుతుందని, 20 ఏళ్ల పాటు రిజిస్ట్రేషన్ల శాఖ నిర్వహించే క్రయ విక్రయ లావాదేవీలకు ఎలాంటి అవాంతరాలు లేని కొత్త సాఫ్ట్‌వేర్‌ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.    

Advertisement
 
Advertisement
Advertisement