పూర్తిస్థాయి డీజీపీ ఎవరో? | Telangana Full Time DGP Selection Enters Crucial Stage As UPSC Panel Meets Today, More Details Inside | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయి డీజీపీ ఎవరో?

Mar 11 2026 6:03 AM | Updated on Mar 11 2026 9:34 AM

UPSC begins process to appoint full-time Telangana DGP

నేడు ఢిల్లీలో ఎంపిక కమిటీ కీలక సమావేశం 

భేటీకి హాజరుకానున్న సీఎస్‌ రామకృష్ణారావు 

జాబితాలో సీనియర్‌ ఐపీఎస్‌లు సీవీ ఆనంద్, ప్రభాకర్‌ వినాయక్‌ ఆఫ్టే, శివధర్‌రెడ్డి, శిఖా గోయల్, సౌమ్యామిశ్రాల పేర్లు! 

మరో నెలలో రిటైర్‌ కానుండటంతో ఇన్‌చార్జి డీజీపీ శివధర్‌రెడ్డికి చాన్స్‌పై అనుమానాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి పూర్తి స్థాయి డీజీపీ ఎంపిక ప్రక్రియ కీలక దశకు చేరింది. ఆరు వారాల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆదేశించిన నేపథ్యంలో బుధవారం ఢిల్లీ షాజహాన్‌ రోడ్డులోని ధోల్పూర్‌ హౌస్‌లో ఉదయం 10.15 గంటలకు ఎంపిక కమిటీ కీలక సమావేశం జరగనుంది. కమిటీలో సభ్యుడిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పూర్తిస్థాయి డీజీపీ ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ అధికారులతో కూడిన ఐపీఎస్‌ అధికారుల పేర్లు యూపీఎస్సీకి ఇప్పటికే చేరాయి.

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. కనీసం 6 నెలల పదవీకాలం ఉన్న నలుగురు అధికారుల జాబితా పంపాల్సి ఉండగా. అందులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులు 1992 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్, 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, శిఖా గోయల్, సౌమ్య మిశ్రాల పేర్లు ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రస్తుతం ఇన్‌చార్జి డీజీపీగా ఉన్న శివధర్‌ రెడ్డి పేరు కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే ఆయన వచ్చే ఏప్రిల్‌ 30న పదవీ విరమణ చేయనున్నారు. పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉండటంతో, ఆయనకు పూర్తిస్థాయి డీజీపీగా అవకాశం దక్కడం కష్టమే అన్న వాదనలు పోలీసు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.  

ఉత్కంఠగా మారిన ఎంపిక 
ప్రస్తుతం డీజీ ర్యాంకులో ఉన్న వారిలో హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, 1992 బ్యాచ్‌కు చెందిన సీవీ ఆనంద్‌ అందరికంటే సీనియర్‌. ఆ తర్వాత 1994 బ్యాచ్‌లో ప్రస్తుతం ఇన్‌చార్జి డీజీపీగా కొనసాగుతున్న బి.శివధర్‌రెడ్డి, కేంద్ర సర్వీస్‌లో ఇంటెలిజెన్స్‌ బ్యూరో స్పెషల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న వినాయక్‌ ప్రభాకర్‌ ఆప్టే, టీజీ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌గా పనిచేస్తున్న శిఖా గోయల్, జైళ్లశాఖ డీజీగా పనిచేస్తున్న సౌమ్యా మిశ్రా ఉన్నారు. వీరిలోంచి యూపీపీఎస్సీ ముగ్గురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను ఎంపిక చేసి, ఆ జాబితాను రాష్ట్రానికి పంపుతుంది. రాష్ట్రానికి వచ్చిన జాబితాలోని ముగ్గురి నుంచి ఒకరిని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి డీజీపీగా నియమిస్తుంది. అయితే డీజీపీ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.  

అందరికంటే సీనియర్‌ సీవీ ఆనంద్‌ 
సీనియర్‌గా ఉన్నప్పటికీ కేంద్ర సర్వీస్‌లో సుదీర్ఘంగా కొనసాగుతున్న వినాయక్‌ ప్రభాక్‌ ఆప్టేపై ప్రభుత్వం ఆసక్తి చూపకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇక అత్యంత సీనియర్‌ ఐపీఎస్‌ అయిన సీవీ ఆనంద్‌ వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతుందా..? లేదంటే మహిళా డీజీపీని నియమించాలనుకుంటే శిఖాగోయల్, సౌమ్యా మిశ్రాలలో ఒకరికి అవకాశం ఇస్తుందా అన్నది త్వరలోనే తేలనుంది.

డీజీపీగా జితేందర్‌ పదవీ విరమణ చేసిన సమయంలోనే ఆ పదవి కోసం శిఖా గోయల్‌ పూర్తి ప్రయత్నాలు చేసినా.. అప్పట్లో ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఉమ్మడి ఏపీలోనూ, ప్రస్తుత తెలంగాణలోనూ మహిళా అధికారి ఎవరూ డీజీపీ కాలేదని, తనకు ఆ అవకాశం ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు చెబుతున్నారు. పూర్తిస్థాయి డీజీపీగా నియమితులయ్యే వారు కనీసం రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనుండడంతో ఈ పదవికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. 

Advertisement
 
Advertisement
Advertisement