ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా? | ATMs May Soon Give Rs 10 Notes as Govt Tests Small Denomination Dispensers | Sakshi
Sakshi News home page

ATMలలో రూ.10 నోట్లు రానున్నాయా?

Mar 11 2026 4:50 AM | Updated on Mar 11 2026 5:14 AM

ATMs May Soon Give Rs 10 Notes as Govt Tests Small Denomination Dispensers

డిజిటల్ పేమెంట్ వ్యవస్థ ప్రజల జీవితాన్ని చాలా సులభతరం చేసింది. అయితే అదే సమయంలో చిన్న నోట్ల కొరత ఉన్నట్లుగా అనిపించే పరిస్థితి కూడా ఏర్పడుతోంది. కొన్నిసార్లు రూ.100 లేదా రూ.500 నోటుతో చిన్నపాటి కొనుగోళ్లు చేయాలనుకుంటే, దుకాణదారులు చిల్లర లేదని చెప్పే సందర్భాలు ఎదురవుతున్నాయి. ఎక్కువ మంది ఆన్‌లైన్ చెల్లింపులు చేయడం వల్ల చిన్న నోట్ల వినియోగం తగ్గింది.

ఈ నేపథ్యంలో దేశంలో చిన్న నోట్ల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం పార్లమెంటులో మాట్లాడుతూ ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి దేశంలో ఇప్పటికే రూ.10, రూ.20, రూ.50 నోట్లు సమృద్ధిగా చలామణిలో ఉన్నాయని తెలిపారు.

సాధారణంగా ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే సమయంలో ఎక్కువగా రూ.500 నోట్లు, కొన్నిసార్లు రూ.100 లేదా రూ.200 నోట్లు మాత్రమే వస్తున్నాయి. దీంతో చిన్న ఖర్చుల సమయంలో చిల్లర సమస్య ఎదురవుతోంది.

ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొత్త చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ఉన్న సాంప్రదాయ ఏటీఎంలు చిన్న నోట్లను పంపిణీ చేయడానికి ప్రత్యేకంగా రూపకల్పన చేయలేదని మంత్రి వివరించారు. అయితే ఈ సమస్యకు పరిష్కారంగా పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా “స్మాల్ డినామినేషన్ డిస్పెన్సర్లు” అనే యంత్రాలను పరీక్షిస్తున్నారు. ఈ యంత్రాల ద్వారా ప్రజలు రూ.10, రూ.20, రూ.50 నోట్లను నేరుగా ఏటీఎంల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. దీంతో నగదు తీసుకునేటప్పుడు చిల్లర సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.

చిన్న నోట్ల చలామణి ఎంత?
ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫిబ్రవరి 26 వరకు దేశంలో పెద్ద మొత్తంలో చిన్న నోట్లు చలామణిలో ఉన్నాయి. రూ.10 నోట్లు సుమారు రూ.439.4 కోట్లు, రూ.20 నోట్లు సుమారు రూ. 193.7 కోట్లు, రూ.50 నోట్లు సుమారు రూ.130.3 కోట్లు విలువైనవి ఉన్నాయి. ఇక గత ఆర్థిక సంవత్సరంలో రూ.10 నోట్లు రూ.180 కోట్లు, రూ.20 నోట్లు రూ.150 కోట్లు, రూ.50 నోట్లు రూ.300 కోట్లు విలువైనవి చలామణిలో ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement