2,000కు పైగా ఎత్తివేత
బ్యాంక్ శాఖల్లో పెరుగుదల
ముంబై: డిజిటల్ చెల్లింపుల నేపథ్యంలో ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్లు (ఏటీఎంలు) తగ్గుముఖం పడుతున్నాయి. 2024 మార్చి నాటికి 2,53,417 ఏటీఎంలు దేశవ్యాప్తంగా ఉంటే, 2025 మార్చి చివరికి 2,51,057కు తగ్గినట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది. అంటే గత ఆర్థిక సంవత్సరంలో 2,360 ఏటీఎం మెషిన్లు తగ్గినట్టు తెలుస్తోంది. ఇదే కాలంలో బ్యాంక్ శాఖల సంఖ్య 2.8 శాతం పెరిగి 2025 మార్చి చివరికి 1.64 లక్షలకు చేరినట్టు తెలిపింది.
ప్రైవేటు బ్యాంక్‌ల ఏటీఎంలు 79,884 నుంచి 77,117కు తగ్గాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఏటీఎంలు 1,34,694 నుంచి 1,33,544కు తగ్గాయి. డిజిటల్ చెల్లింపులు పెరగడంతో ఏటీఎంల్లో కస్టమర్ల లావాదేవీలు తగ్గినట్టు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఇక వైట్ లేబుల్ ఏటీఎంలు (స్వతంత్ర సంస్థలు నిర్వహించే) మాత్రం 34,602 నుంచి 36,216కు పెరిగాయి.
ప్రైవేటు, విదేశీ బ్యాంకుల ఏటీఎంలు ప్రధానంగా పట్టణాల్లో ఎక్కువగా ఉంటే, ప్రభుత్వరంగ బ్యాంక్‌ల ఏటీఎంలు మాత్రం పట్టణాలతో పాటు గ్రామీణ పట్టణాల్లోనూ విస్తరించి ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు గత ఆర్థిక సంవత్సరంలో కొత్త శాఖల్లో మూడింట రెండొంతులు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశాయి. కానీ, ప్రైవేటు బ్యాంకులు కొత్త శాఖల్లో మూడింట ఒక వంతు గ్రామీణ ప్రాంతాలకు కేటాయించాయి. బేసిక్ సేవింగ్స్ ఖాతాల సంఖ్య 2.6 శాతం పెరిగి 72.4 కోట్లకు చేరింది. ఖాతాల్లోని బ్యాలన్స్ 9.5 శాతం పెరిగి రూ.3.3 లక్ష లక్షల కోట్లకు చేరుకున్నట్టు ఆర్‌బీఐ నివేదిక వెల్లడించింది.


