breaking news
Automated teller machines
-
ఏటీఎంలకు డిజిటల్ గ్రహణం!
దేశంలో డిజిటల్ లావాదేవీల విప్లవం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం)లకు గండి కొడుతోంది. ఒకపక్క బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ అంతకంతకూ ఎగబాకుతూ ఆల్‌టైమ్ గరిష్టాల్లో కొనసాగుతోంది. మరోపక్క ఏటీఎంలు మాత్రం తగ్గుముఖం పడుతున్నాయి. బ్యాంకులు కొత్తగా తెరుస్తున్న ఏటీఎంల కంటే మూసేస్తున్నవే ఎక్కువ కావడం విశేషం! కొత్తిమీర కట్ట నుంచి బైకులో పెట్రోలు దాకా దేనికైనా డిజిటల్ చెల్లింపులే నడుస్తున్నాయిప్పుడు! మన దైనందిన ఆరి్థక లావాదేవీల్లో యూపీఐ పేమెంట్స్ అంతలా పెనవేసుకుపోయాయి మరి. దీంతో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రాలు కూడా తగ్గుతున్నాయి. ఇదిలా ఉంటే, ఒకప్పుడు మెయిన్ రోడ్లపైనే కాకుండా సందుల్లో కూడా ఎడాపెడా ఏటీఎంలను తెరిచిన బ్యాంకులు.. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా వాటికి తాళాలేస్తున్నాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు ఏటీఎం ఉచిత లావాదేవీలపై పరిమితులు విధించడం, ఏటీఎం ఇంటర్–ఆపరబిలిటీ, వేరే బ్యాంకుల కస్టమర్లు ఏటీఎంలను ఉపయోగించుకునేటప్పుడు విధించే ఇంటర్చేంజ్ ఫీజు పెరుగుదల పెద్దగా లేకపోవడంతో బ్యాంకులు ఏటీఎంల నిర్వహణ బిజినెస్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు. కొత్త ఏటీఎంల ఏర్పాటుకు ముఖం చాటేస్తున్నాయి. బ్యాంకింగ్ రంగంలో దేశవ్యాప్తంగా 2023 డిసెంబర్ నాటికి 2,19,882 ఏటీఎంలు ఉండగా, 2024 డిసెంబర్ నాటికి వీటి సంఖ్య 2,14,398కి తగ్గిపోయింది. అంటే దాదాపు ఏడాది వ్యవధిలో 5,484 ఏటీఎంలను ఎత్తేశాయన్నమాట! ముఖ్యంగా ఆఫ్‌సైట్ (బ్యాంకు బ్రాంచ్‌లలో కాకుండా ఇతర లొకేషన్లలో ఉన్నవి) ఏటీఎంల విషయంలో ఈ కోత భారీగా ఉంది. 2022 సెపె్టంబర్లో గరిష్టంగా 97,072 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉండగా.. 2024 డిసెంబర్ నాటికి ఇవి 85,913కి తగ్గిపోవడం గమనార్హం. డిజిటల్ రయ్... బ్యాంకింగ్ వ్యవస్థలో నగదు చెలామణీ ప్రస్తుతం ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.34.7 లక్షల కోట్లకు పైగానే ఉంది. పెద్ద నోట్ల రద్దు (డీమానిటైజేషన్) నుంచి చూస్తే రెట్టింపైంది. మన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 12 శాతం కింద లెక్క. ఇంతలా నగదు వ్యవస్థలో ఉన్నప్పటికీ, ఏటీఎంల సంఖ్య పెరక్కపోగా.. అంతకంతకూ తగ్గుతుండటం విశేషం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో ప్రతి లక్ష మంది జనాభాకు 15 ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి. కాగా, 2024 పూర్తి ఏడాదికి చూస్తే, 17,200 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. 2023తో పోలిస్తే (11,760 కోట్లు) 46 శాతం దూసుకెళ్లాయి. మరోపక్క, ఆర్బీఐ అనుమతితో ఈ నెల 1 నుంచి ఏటీఎం చార్జీలను బ్యాంకులు పెంచేశాయి. దీంతో ఉచిత లావాదేవీల పరిమితి దాటితే, ప్రతి లావాదేవీకి ఇప్పు డున్న రూ.21 చార్జీ రూ.23కు పెరిగింది. నెలకు సొంత బ్యాంకుల ఏటీఎంలలో 5, ఇతర బ్యాంకుల ఏటీఎంల విషయాని కొస్తే మెట్రోల్లో అయితే 3, నాన్ మెట్రోల్లో 5 లావాదేవీలు ఉచితం. క్యాష్ విత్‌డ్రాతో పాటు బ్యాలెన్స్ ఎంక్వయిరీ వంటివన్నీ లావాదేవీగానే పరిగణిస్తున్నారు.ఎనీటైమ్ సమస్యలు...! కొన్ని బ్యాంకులు బ్రాంచ్‌ల వద్ద ఏటీఎంలను బాగానే నిర్వహిస్తున్నప్పటికీ, ఆఫ్‌సైట్ ఏటీఎంల విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడు చూసినా సాంకేతిక సమస్యలు, లేదంటే క్యాష్ లేకపోవడం వంటివి కస్టమర్లకు నిత్యకృత్యంగా మారుతున్నాయి. దీంతో అత్యవసరంగా క్యాష్ విత్‌డ్రా చేసుకోవాలంటే రెండు మూడు ఏటీఎంలకు తిరగాల్సి వస్తోందనేది అధిక శాతం మంది ఖాతాదారుల ఫిర్యాదు. ‘దేశంలో ప్రస్తుత ఏటీఎంల ట్రెండ్‌ను పరిశీలిస్తే, బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ, ముఖ్యంగా డిజిటల్ మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోపక్క, బ్యాంకింగ్ సేవలు తక్కువగా ఉన్న మారుమూల ప్రాంతాలపై బ్యాంకులు దృష్టి పెట్టడం కూడా మొత్తంమీద ఏటీఎంలు తగ్గుముఖం పట్టడానికి కారణం’ అని ఆన్లైన్ పేమెంట్ సరీ్వస్ ప్రొవైడర్ ఏజీఎస్ ట్రాన్సాక్ట్ టెక్నాలజీస్ చైర్మన్ రవి బి. గోయల్ అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల నేపథ్యంలో నెట్వర్క్ స్థిరీకరణ జరిగినట్లు ఆయన పేర్కొన్నారు.34.7 లక్షల కోట్లు: బ్యాంకింగ్ వ్యవస్థలో చెలామణీలో ఉన్న నగదు (జీడీపీలో ఇది 12 శాతం).2,14,398: 2024 డిసెంబర్ నాటికి దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల మొత్తం ఏటీఎంల సంఖ్య (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్ బ్యాంకులు సహా). ఇందులో 1,28,485 ఆన్సైట్, 85,913 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉన్నాయి.36,000: దేశంలో వైట్ లేబుల్ ఏటీఎంల సంఖ్య దాదాపుగా. ప్రస్తుతం ఈపీఎస్, ఇండియా1 పేమెంట్స్, హిటాచి పేమెంట్ సరీ్వసెస్, టాటా కమ్యూనికేషన్స్ పేమెంట్ సొల్యూషన్స్, వక్రంగీ.. ఈ ఐదు ప్రైవేటు కంపెనీలు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లుగా ఉన్నాయి. 17,200 కోట్లు : 2024లో యూపీఐ లావాదేవీల సంఖ్య (రోజువారీగా సగటు విలువ రూ. 74,990 కోట్లు) – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ATM History: మొట్టమొదటి ఏటీఎం ఎక్కడ ఏర్పాటు చేశారంటే..
కొత్త ఏడాదిలో మొదటి రోజునే ఆర్బీఐ ఏటీఎం విత్‌డ్రా కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకొచ్చింది. ఉచిత ట్రాన్జాక్షన్స్ పరిధి గనుక అయిపోతే.. 21రూ. చొప్పున ఛార్జీలు ఖాతాదారుల అకౌంట్ల నుంచి బాదేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ఈ విషయం పక్కనపెడితే.. మొట్టమొదటి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అలియాస్ ఏటీఎం Automated teller machine ఎక్కడ నెలకొల్పారో తెలుసా? ►1987లో హెచ్ఎస్బీసీ ముంబైలో తొలి ఏటీఎంను నెలకొల్పింది. ►ఆ తర్వాత పన్నెండేళ్లకు దేశవ్యాప్తంగా 1,500 ఏటీఎంలు ఏర్పాటయ్యాయి. ►మార్చ్ 31, 2021 నాటికి మన దేశంలో 1,15,605 ఆన్సైట్ ఏటీఎంలు, 97, 970 ఆఫ్‌సైట్ ఏటీఎంలు ఉన్నాయి. ►2021, మార్చ్ నెల చివరినాటికి.. మొత్తం బ్యాంకులన్నీ కలిపి 90 కోట్ల డెబిట్ కార్డులు కస్టమర్లకు జారీ చేశాయి. ► ఏటీఎంను ఎవరు రూపొందించారనే విషయంపై రకరకాల వాదనలు, థియరీలు, వివిధ దేశాల వెర్షన్లు వినిపిస్తుంటాయి. ► పేటెంట్ విషయంలో అమెరికా సహా పలు దేశాలు వాదులాడుకుంటాయి. ►అయితే బ్రిటన్ ఆవిష్కరణకర్త జాన్ షెపెర్డ్ బారోన్ ప్రపంచంలో మొట్టమొదటి ఏటీఎంను రూపొందించిన వ్యక్తిగా కీర్తి గడించారు. ►1965లో నగదును అందించే స్వీయ సేవ పరికరాన్ని ఈయన ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చారు. ►1967లో నార్త్ లండన్‌లోని ‘బార్క్లేస్ బ్యాంక్’ ఎన్ఫీల్డ్ టౌన్ బ్రాంచ్ బయట జూన్ 27న మొట్టమొదటిసారి ఏటీఎంను ఏర్పాటు చేశారు. ►విశేషం ఏంటంటే.. ఆయన పుట్టింది భారత్‌లోనే!. 1925లో మేఘాలయాలో ఓ ఆస్పత్రిలో జన్మించారాయన. ►ప్రతిగా 53 ఏళ్ల తర్వాత ఎస్బీఐ బ్యాంక్ 2021 ఆగష్టులో ఆయన జన్మించిన ఆస్పత్రిలో ఏటీఎంను ఏర్పాటు చేసింది. \ ►అమెరికాలో ఏటీఎం(ఆటోమేటిక్ టెల్లర్ మెషిన్), కెనడాలో ఆటోమేటెడ్ బ్యాంకింగ్ మెషిన్(ABM), బ్రిటిష్ నేలపై క్యాష్ పాయింట్, క్యాష్ మెషిన్, హోల్ ఇన్ ది వాల్ అని కూడా పిలుస్తుంటారు. ►క్యాష్‌లైన్, ఏనీ టైం మనీ, టైమీ మెషిన్, క్యాష్ డిస్పెన్సర్, క్యాష్ కార్నర్, బ్యాంకోమాట్ అని పిలుస్తారు. ►ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్ ఆధీనంలో ఉండని వాటిని వైట్ లేబుల్ ఏటీఎంలు అని పిలుస్తారు. ►2015 నాటికి ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్ల ఏటీఎంలు ఉన్నట్లు ఏటీఎం ఇండస్ట్రీ అసోషియేషన్ వెల్లడించింది. ►అయితే క్యాష్‌లెస్ పేమెంట్లు పెరుగుతుండడంతో ఏటీఎంల నిర్వహణ క్రమంగా తగ్గిపోతోంది. ► ఏటీఎంల కంటే ముందు 1960ల్లో కంప్యూటర్ లోన్ మెషిన్ అనే డివైజ్ జపాన్‌లో ప్రాచుర్యంలో ఉండేది. ►ఏటీఎంలను ఎక్కడపడితే అక్కడ నెలకొల్పడానికి అనుమతులు ఉన్నాయి. ►క్రూయిజ్ షిప్స్, యూఎస్ నేవీ షిప్స్‌లో కూడా ఏటీఎంలను ఏర్పాటు చేశారు. ►ఈమధ్యకాలంలో సోలార్ పవర్డ్ ఏటీఎంలను నెలకొల్పుతున్నారు. ► ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఏటీఎం పాకిస్థాన్ ఖున్‌జెరబ్ పాస్‌లో ఉంది. సుమారు 15వేల అడుగుల ఎత్తులోలున్న ఈ ఏటీఎం.. మైనస్ 40 డిగ్రీల సెల్సియస్‌లోనూ పని చేస్తుంది. ►సాధారణంగా ఏటీఎంలకు సెక్యూరిటీ గార్డులు, టెక్నికల్ సిబ్బందితో పాటు ఇతర సిబ్బందిని సైతం నియమిస్తుంటారు. శుభ్రం చేయడం, ఇతర మెయింటెనెన్స్ ఇందులో భాగంగా ఉండేవి. ఏటీఎంలు నెలకొల్పిన తొలినాళ్లలో ఈ తరహా ఉద్యోగాలు పెరుగుతాయని భావించారంతా. 2010 నాటికి ఆరు లక్షల మందిని ఈ తరహా ఉద్యోగాల్లో నియమించుకున్నారు. కానీ, సెక్యూరిటీ గార్డులకే ఆ పని అప్పగించడం, పైగా ఆన్లైన్ బ్యాంకింగ్ వల్ల ఈ తరహా నియామకాలు గణనీయంగా తగ్గిపోయాయి. -సాక్షి, వెబ్‌స్పెషల్ -
పోస్టల్ ఏటీఎంలు వచ్చాయ్
చెన్నై: దేశంలోనే తొలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఏటీఎం గురువారం నుండి అందుబాటులోకి వచ్చింది. పోస్టల్ శాఖ ఆధునీకరణలో భాగంగా చెన్నైలోని త్యాగరాయనగర్ హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏటీఎం సర్వీస్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం ప్రారంభించారు. పోస్టల్ డిపార్ట్మెంట్ను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరంగా ఆధునీకరించడానికి మధ్యంతర బడ్జెట్లో రూ.4,909 కోట్లు కేటాయించామని ఈ సందర్భంగా చిదంబరం గుర్తు చేశారు. ఐటీ ఆధునీకరణ స్కీమ్ కింద వచ్చే ఏడాది కల్లా 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులను కవర్ చేస్తామని వివరించారు. ఉత్తరాలు, పోస్ట్‌కార్డ్‌ల వినియోగం తగ్గడంతో పోస్ట్ ఆఫీసుల భవిష్యత్తులపై సందేహాలు ముసురుకున్నాయని, కాని కొత్త కొత్త వ్యూహాలను అమలు చేయడంతో వీటి భవిష్యత్తుకేమీ ఢోకా లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఇప్పటికీ పార్సిళ్ల బట్వాడాకు పోస్టల్ డిపార్ట్మెంటే ఉత్తమమైనదని పలువురు భావిస్తున్నారని పేర్కొన్నారు. కాగా పోస్టల్ డిపార్ట్మెంట్ త్వరలో ఢిల్లీ, ముంబైల్లో మరో నాలుగు ఏటీఎంలను ప్రారంభించనున్నది. ఈ ఏడాది 1400, వచ్చే ఏడాది 1800 ఏటీఎంలను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పోస్ట్ ఆఫీసుల్లో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్(సీబీఎస్) అమలు చేయడానికి రూ. 700 కోట్లు కేటాయించామని పేర్కొంది.