మావోయిస్టులకు మద్దతిస్తారా?.. బండి సంజయ్‌ సంచలన ట్వీట్‌ | Union Minister Bandi Sanjay Sensational Comments | Sakshi
Sakshi News home page

మావోయిస్టులకు మద్దతిస్తారా?.. బండి సంజయ్‌ సంచలన ట్వీట్‌

Oct 19 2025 1:24 PM | Updated on Oct 19 2025 2:17 PM

Union Minister Bandi Sanjay Sensational Comments

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌(bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలను హెచ్చరించారు. దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు.. అంతర్గత భద్రత విషయంలో రాలే లేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ట్విట్టర్‌ వేదికగా..‘రాజకీయ రంగ స్థలంలో ప్రజాస్వామ్యం గురించి వల్లె వేస్తూ.. మావోయిస్టులకు మద్దతిస్తున్న నేతలారా.. ఇదే మా హెచ్చరిక. సాయుధ వర్గాలతో సంబంధాలను తెంచుకోండి. లేనిపక్షంలో మీ గుట్టు బయటపడుతుంది. ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో, అమిత్ షా మార్గదర్శకత్వంలో కేంద్ర సంస్థలు మావోయిస్టు నిర్మూలనకే పరిమితం కావడం లేదు. అవినీతి, మాఫియా, ఉగ్రవాద సంబంధాల నెట్‌వర్క్‌ను సైతం వెలికి తీస్తున్నాయి.

దేశ భద్రతకు ముప్పుగా పరిగణించే వాళ్లు ఎవరైనా సరే తప్పించుకోలేరు. కరుణ లేకుండా కఠిన చర్యలు తీసుకోబోతున్నాయి. ఎంత పెద్ద వారైనా సరే అంతర్గత భద్రత విషయంలో రాజీ లేదు. మావోయిస్టుల వైపు నిలబడే వారెవరైనా సరే పడిపోక తప్పదు అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇదే సమయంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మా కర్రెగుట్టల నుంచి తెలంగాణ వైపు వెళ్లినట్లు ఆయన అనుచరుడు పోలీసులకు తెలిపినట్లు వచ్చిన వార్త కథనాన్ని కూడా ఇవాళ బండి సంజయ్ పోస్టు చేయడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉండగా.. మావోయిస్టులతో తెలంగాణ ప్రాంతానికి చెందిన పలువురు రాజకీయ నాయకులకు సంబంధాలు ఉన్నాయని ఇటీవల సరెండర్‌ అయిన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల తెలిపిన విషయం ఇపుడు సంచలనంగా మారింది. అసలు మావోయిస్టులతో సంబంధాలున్న నాయకులు ఎవరా? అని చర్చ మొదలైంది. ఒకవేళ ఈ పేర్లు బహిర్గతమైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది.

మరోవైపు.. ఇటీవల లొంగిపోయిన మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతి, మావోయిస్ట్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని వెల్లడించారు. మావోయిస్టు గెరిల్లాలు ,కొంతమంది తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య రహస్య కుమ్మక్కు జరిగిందని ఆయన వివరించినట్లు జాతీయ మీడియా తన కథనంలో పేర్కొంది. అలాగే హిడ్మా తెలంగాణ వైపు వచ్చారని ఆయన సన్నిహితులు పోలీసులకు వెల్లడించినట్లు మరో కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement