1,800 ఎకరాలను నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చిన ప్రభుత్వం
క్రయ విక్రయాలు నిలిపివేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు లేఖ
ఆయా భూముల వివరాలు ఐజీఆర్‌ఎస్ పోర్టల్‌లో పొందుపరిచిన వైనం
అన్నీ సవ్యంగా ఉంటే నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామన్న మంత్రి పొంగులేటి
గచ్చిబౌలి (హైదరాబాద్): రాష్ట్రంలో అత్యంత విలువైన భూములకు కేంద్రంగా ఉన్న శేరిలింగంపల్లి మండలంలోని గోపన్‌పల్లి రెవెన్యూ గ్రామానికి చెందిన 1,800 ఎకరాలను ప్రభుత్వం నిషేధిత జాబితా (22ఏ)లో చేర్చింది. 18 సర్వే నంబర్లను ఈ జాబితాలో పొందుపరచడమే గాకుండా.. వీటి క్రయ విక్రయాలను నిలిపివేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాల యాలకు లేఖ రాసింది. ప్రభుత్వ భూముల జాబితాను ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేయడంతో, రెవెన్యూ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాబితాల రూపకల్పనకు శ్రీకారం చుట్టింది.
ఈ క్రమంలోనే గోపల్‌పల్లిలో రెండు దశాబ్దాల క్రితం నుంచి వెలిసిన కాలనీలు, బహుళ అంతస్తు భవనాలు, గేటెడ్ కమ్యూని టీలను కూడా ఈ నిషేధిత జాబితాలో చేరుస్తూ రంగారెడ్డి జిల్లా యంత్రాంగం.. భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌కు ఇటీవల లేఖ రాసింది. దీంతో సీసీఎల్‌ఏ ఆ భూములను 22ఏలో చేరుస్తూ లావాదేవీలను నిలిపివేయాలని ఎస్‌ఆర్‌ఓ లను ఆదేశించింది. ఈ భూముల మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల వరకు ఉంటుంది.
కాగా గోపన్‌పల్లి గ్రామం మొత్తం రెవెన్యూ విస్తీర్ణం 2,453.38 ఎకరాలు. అందులో ఏకంగా 75 శాతం భూములు నిషేధిత జాబితాలో చేర్చడం, ఐజీఆర్‌ఎస్ పోర్టల్‌లో పొందుపరచడం కలకలం రేపుతోంది. తాజా పరిణామాలు ఇక్కడ బ్యాంకు రుణాలు, అప్పులు చేసి సొంతింటి కల నెరవేర్చుకున్నవారిని షాక్‌కు గురిచేశాయి. ఐజీఆర్‌ఎస్ డేటా ప్రకారం ఈ జాబితా రూపొందించినట్లు జిల్లా యంత్రాంగం చెబుతున్నప్పటికీ, ఈ భూముల్లో వెలిసిన ఆస్తుల రిజిస్ట్రేషన్ సమయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
హైరైజ్‌లు, ప్రభుత్వం కేటాయించిన భూములు!
నిషేధిత సర్వే నంబర్లలోని వందలాది ఎకరాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీలు, ఐటీ కంపెనీలు, ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఓ రియల్టీ సంస్థ స్థానిక రైతుల నుంచి భూములు కొనుగోలు చేసి హైరైజ్ టవర్లను నిర్మిస్తోంది. ఇవేగాకుండా డైమండ్ హైట్స్ లేఅవుట్‌కు హెచ్‌ఎండీఏ అనుమతి కూడా ఇచ్చింది. ఆకాశహర్మ్యాలు, గెటేడ్ కమ్యూనిటీలకు లెక్కేలేదు. ఆశ్చర్యకరమైన విషయమేమింటే ప్రభుత్వం కేటాయించిన భూములను కూడా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం.
ఉద్యోగ సంఘా లకు కేటాయించిన భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ, జర్నలి స్టులు, టీఐఎఫ్‌ఆర్, విప్రో, పోలీసులు, టీసీఎస్ క్యాంపస్‌కు సర్కారే కేటాయించిన భూములను కూడా 22ఏ నుంచి తొలిగించకపోగా..తాజాగా ఆ జాబితాలోనూ చూపడం గందరగోళానికి దారితీస్తోంది. కేవలం ఇవేగాకుండా గోపన్‌పల్లి గ్రామం, గోపన్‌పల్లి తాండ, ఎన్‌టీఆర్ నగర్, తాజ్‌నగర్, సోఫా కాలనీలు కూడా నిషేధిత జాబితాలోకి వచ్చాయి.
ఈ సర్వే నంబర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేత
గోపన్‌పల్లిలోని 5, 7, 14, 20, 21, 32, 33, 34, 35, 36, 37, 49, 66, 74, 124, 178, 311, 316 సర్వే నంబర్లలోని భూములు నిషేధిత జాబితాలో చేరాయి. సర్వే నంబర్ 36లో 34, సర్వే నంబర్ 37లో 23, సర్వే నం.74లో 5, సర్వే నం.124లో 32, సర్వే నంబర్ 316లో 17 సబ్ డివిజన్లు ఉన్నా యి. రెవెన్యూ రికార్డులలో వీటిని ప్రభుత్వ స్థలంగా పేర్కొ న్నారు.
ప్రభుత్వ స్థలంతో పాటు దేవాదాయ శాఖ, లావాణి పట్టాలు కూడా ఉన్నాయి. రెండు రోజుల క్రితమే శేరిలింగంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి నిషేధిత సర్వే నంబర్ల జాబితా చేరింది. దీంతో ఈ సర్వే నంబర్లలో రిజిస్ట్రేన్లను నిలిపివేసినట్లు సబ్ రిజిస్ట్రార్ అన్వేషితరెడ్డి తెలిపారు.
మార్కెట్ విలువ రూ.27 వేల కోట్ల పైమాటే
గోపన్‌పల్లి ఐటీ కారిడార్‌లో భాగంగా ఉన్న గోపన్‌పల్లిలో ఇప్పటికే టీసీఎస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఆ కంపెనీ క్యాంపస్‌ను విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్‌ను ఆనుకొని ఉండటంతో అక్కడ భూముల విలువ అమాంతం పెరిగిపోయింది.
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం ధర ఏకంగా రూ.200 కోట్లు, కోకాపేట్ నియో పొలిస్‌లో ఎకరం ధర రూ.151.75 కోట్లకు టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో అమ్ముడుపోయింది. సగటున ఎకరం ఖరీదు రూ.150 కోట్లు అనుకున్నా 1,800 ఎకరాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.27 వేల కోట్ల పైమాటే అని అంటున్నారు.
ఇచ్చిన అనుమతుల మాటేమిటి?
లేఅవుట్లకు అనుమతులు ఇచ్చే సమయంలోనే హెచ్‌ఎండీఏ, స్థానిక మున్సిపాలిటీలు టైటిల్ డీడ్‌లు క్షుణ్ణంగా పరిశీలి స్తాయి. హైరైజ్ భవనాల అనుమతులకైతే హెచ్‌ఎండీఏతో పాటు అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, డీజీసీఏ వంటి పలు విభాగాల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం (ఎన్‌ఓసీ) లేనిదే పర్మిషన్లు జారీ కావు. అలాంటిది ఏళ్ల క్రితమే అన్ని రకాల అనుమతులతో నివాస, వాణిజ్య భవనాలు నిర్మితం కాగా.. తాజాగా ఆయా భూములను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత పరిశీలిస్తాం
ప్రభుత్వ భూముల జాబితాను రెవెన్యూ, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సమన్వయంతో రూపొందించాయి. 22ఏ భూముల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత ఈ భూములకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. స్వీకరించి, పరిశీలన అనంతరం అన్నీ సవ్యంగా ఉన్న వాటి ని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తాం. నిషేధిత భూము లన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ చేపట్టాం. – పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి
ఏళ్ల తరబడి ‘నిషేధం’ కింద ఉన్నవాటినే చేర్చాం
నిషేధిత భూముల జాబితాను ఐజీఆర్‌ఎస్ డేటా ప్రకా రమే నమోదు చేశాం. ఏళ్ల తరబడి నిషేధిత జాబితాలో ఉన్న భూములనే ఇందులో చేర్చాం. కొత్తగా ఎలాంటి భూములు చేర్చలేదు. అయితే ప్రభుత్వం నుంచి భూము లు పొందిన సంస్థలు, సొసైటీలు ఏమైనా ఉంటే అలాంటి వాటిని మా దృష్టికి తీసుకొస్తే..ఆ జాబితా నుంచి తొలగించేందుకు సిద్ధంగా ఉన్నాం. కోర్టు ఉత్తర్వులున్న వాటిని కూడా తొలగిస్తాం. – నారాయణరెడ్డి, కలెక్టర్, రంగారెడ్డి జిల్లా


