బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
అందుకే పారిశ్రామిక భూములను ప్రైవేటుకు ధారాదత్తం చేస్తున్నారు
గజం రూ.లక్షన్నర ఉంటే, ప్రభుత్వం కేవలం రూ.4 వేలకే ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తోంది.
హిల్ట్ పాలసీ పేరుతో కాంగ్రెస్ రూ.5 లక్షల కోట్ల భారీ భూకుంభకోణం
పాలసీని వెనక్కి తీసుకునేదాకా పోరాడతామని వెల్లడి
‘హిల్ట్‌పి’పై బీఆర్‌ఎస్ పోరుబాట
కుత్బుల్లాపూర్: కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో రూ.5 లక్షల కోట్ల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ పారిశ్రామికవాడల్లోని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను దోచుకునేందుకు ‘హిల్ట్ పి’ తెచ్చిందంటూ బీఆర్‌ఎస్ పోరుబాట చేపట్టింది. ఇందులోభాగంగా కేటీఆర్ గురువారం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల, షాపూర్‌నగర్‌లో పర్యటించారు. పారిశ్రామికవాడలోని హమాలీల అడ్డా వద్ద కార్మికులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రాథోడ్‌తో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు ప్రభుత్వాలు పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని మండిపడ్డారు. ‘పరిశ్రమలు వద్దంటూ అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు కట్టుకోవాలని పారిశ్రామిక భూములను ఇస్తున్నారు.
ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేట్ వ్యక్తుల భూములు కావు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు. పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇచ్చారు. మార్కెట్‌లో గజం ధర రూ.లక్షన్నర పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం రూ.4 వేలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోంది.
హైదరాబాద్‌లో పేదల ఇళ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి శ్మశానవాటికలకు కూడా స్థలం లేదు.. కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోంది’ అని చెప్పారు. ఈ 9,300 ఎకరాలను వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇళ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలని హితవు పలికారు.
కాంగ్రెస్ కుంభకోణాన్ని వివరించేందుకే...
కాంగ్రెస్ కుంభకోణం వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. హిల్ట్ పాలసీ స్కాంపై త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, ఈ పాలసీని వెనక్కి తీసుకొనేదాకా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తెస్తామన్నారు.
ఇంతటి భారీ దోపిడీని చూసి తట్టుకోలేక ఓ తెలంగాణ బిడ్డ తమకు సమాచారం ఇచ్చారని, దీనిపై తాము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీకైంది అంటూ ప్రభుత్వం బాధపడుతోందని పేర్కొన్నారు. ఒకవైపు రూ.170 కోట్లకు ఎకరం చొప్పున భూములు విక్రయించామంటూ రోజు వార్తలు రాయించుకుంటున్న సర్కార్, మరోవైపు కేవలం రూ.కోటికి ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమిని ఎలా అమ్ముతుందని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని దుయ్యబట్టారు. అనంతరం జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలను సందర్శించి కార్మిక సమస్యలపై కార్మికులతో, పారిశ్రామిక వేత్తలతో చర్చించారు.


