సాక్షి, హైదరాబాద్: నగరంలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. ముషీరాబాద్ డివిజన్‌లో ఓ యువతి తన ఇంట్లో ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
బౌద్ధనగర్ పరిధిలోని బాపూజీ నగర్ పవిత్ర(17) అనే యువతి తన కుటుంబ సభ్యులతో నివాసం ఉంటోంది. సోమవారం మధ్యాహ్నా సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యవకుడు ఇంట్లోకి దూరి కత్తితో పొడిచి చంపేసి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఘటనా స్థలానికి భారీగా జనం చేరుకుంటుండగా.. పోలీసులు వాళ్లను చెదరగొట్టారు. పలు కోణాల్లో కేసును దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే..
మేనబావ పనే..!
పవిత్రను కిరాతకంగా హత్య చేసింది ఆమె మేన బావే ఉమాశంకరేనని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లికి నిరాకరించడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కన్నీళ్లు పెడుతున్నారు. టైల్స్ పనిచేసే ఉమా శంకర్ తాగుబోతు కావడంతో పెళ్లికి ఒప్పుకోలేదని.. దీంతో కక్ష పెంచుకొని ఉన్మాదిగా ఈ ఘోరానికి పాల్పడ్డారని తల్లిదండ్రులు అంటున్నారు.
ఘటన స్థలంలో ఉమాశంకర్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటగదిలో ఉన్న చాకును నేరానికి ఉపయోగించినట్లు ధృవీకరించుకున్నారు. బంధువుల ఫిర్యాదు నేపథ్యంలో పరారీలో ఉన్న నిందితుడి కోసం వారాసిగూడ పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.


