తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వేర్వేరు వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపాయి. రేవంత్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన భారతీయ జనతా పార్టీ.. పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం మౌనం పాటించి తన రాజకీయ అవకాశవాదాన్ని ప్రదర్శించింది. రేవంత్ పార్టీ సమావేశంలో కాంగ్రెస్‌లో ఉన్న స్వేచ్చ గురించి మాట్లాడుతూ హిందూమతంలో ఉన్న దేవుళ్ల గురించి ప్రస్తావించారు.దీనిని మతపరమైన సమస్యగా బీజేపీ చిత్రీకరించే యత్నం చేసింది.మరో వైపు పవన్ కళ్యాణ్ కోనసీమలో జరిగిన ఒక సభలో తెలంగాణవారి దిష్టి తగిలిందని వివాదాస్పద కామెంట్ చేశారు.
ఈ అంశంపై బీఆర్‌ఎస్ తొలుత స్పందించగా, కాంగ్రెస్ నేతలు కాస్త ఆలస్యంగా రియాక్ట్ అయ్యారు. బీఆర్‌ఎస్ దీనిని అడ్వాంటేజ్ గా మార్చుకునే అవకాశం ఉందన్న అంచనాకు వచ్చాక మంత్రులు రియాక్ట్ అయి ఉండవచ్చు. బీజేపీ అయితే అసలు నోరే విప్పలేదు.రేవంత్ వ్యాఖ్యలను చూద్దాం.'హిందువులలో ఎంతమంది దేవతలు ఉన్నారు!మూడు కోట్ల మంది ఉన్నారా!మరి అందరు దేవుళ్లు ఎందుకు ఉన్నారు?పెళ్లి చేసుకోనోడికి హనుమంతుడున్నారు.రెండు పెండిండ్లు చేసుకునేటోళ్లకు ఇంకో దేవుడున్నాడు.
మందు తాగేటోళ్లకు మరో దేవుడున్నాడు.ఎల్లమ్మ,పోచమ్మ దేవతలు ఉన్నారు. కల్లు పోయాలి, కోడి కోయాలి అనేటోళ్లకు దేవుడున్నాడు.పప్పన్నం తినేటోడికి కూడా దేవుడున్నాడు.అన్ని రకాల దేవుళ్లు ఉన్నారు.కాంగ్రెస్ లో కూడా అన్ని రకాల మనుషులు ఉన్నారు. దేవుడిపైనేఏకాభిప్రాయం లేదు.ఒకాయన వెంకటేశ్వరస్వామిని మొక్కుతాడు. మరొకాయన ఆంజనేయస్వామికి మొక్కుతాడు.నేను అయ్యప్పమాల వేస్తానని ఒకరు అంటే మరోకాయన శివమాల వేస్తానంటాడు.దేవుళ్ల మీదనే ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను" అని రేవంత్ వ్యాఖ్యానించారు.
దీనిపై బీజేపీ గట్టిగా స్పందించడమేకాకుండా నిరసనలకు కూడా పిలుపు ఇచ్చింది. హిందువులను తిండిబోతులుగా, తాగుబోతులుగా చిత్రీకరించే యత్నం అని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా బీఆర్‌ఎస్ కూడా దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ బదులు బీజేపీని పెంచడం కోసం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారేమో అని ఆ పార్టీ నేతలు అంటున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా సీఎం రేవంత్ బరి తెగించి మాట్లాడారని ధ్వజమెత్తారు. తెలంగాణలో హిందువులంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు దీనిపై స్పందిస్తూ రేవంత్ హిందూ దేవుళ్లను అవమానించారని, హనుమంతుడుపెళ్లి చేసుకోలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు.
బీజేపీ నేతలు ఇలాంటి టైమ్ కోసం ఎదురు చూస్తున్నట్లు మాట్లాడారు. పనిలో పని జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు ఎంఐఎం మద్దతు ఇవ్వడాన్ని గుర్తు చేసి కాంగ్రెస్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ మాత్రానికే బీజేపీ తెలంగాణలో పెరిగిపోతుందని చెప్పలేం.కాని ఒక్కొక్క అడుగు ముందుకు వేయడానికి ఇలాంటి సందర్భాలను రాజకీయ పార్టీలు వాడుకుంటాయి.నిజంగానే బీజేపీకి మత రాజకీయం చేసే ఉద్దేశం లేకపోతే, హిందూమతాన్ని అంతగా ఉద్దరించే నేతలు అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నదానికి సమాధానం ఇవ్వవలసి ఉంటుంది. ఉదాహరణకు ఏపీలో తిరుమల స్వామివారి ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు ఆధారాలు లేకుండా దారుణమైన ఆరోపణ చేశారు.తద్వారా స్వామివారి ప్రసాదానికి తీవ్ర అపచారం చేశారని కోట్లాది మంది హిందువులు బాధపడ్డారు.
అయినా ఇంతవరకు బీజేపీ నేతలు ఏ రాష్ట్రంలోకాని, కేంద్రంలో కాని ఎవరూ నోరు విప్పి అదేమిటి?అలా తప్పుడు ఆరోపణలు చేయవచ్చా అని ప్రశ్నించలేదు. పైగా తెలంగాణ బీజేపీ నేత మాధవి నిజంగానే లడ్డూలో జంతు కొవ్వు కలిసిందన్నట్లుగా ఏపీకి వెళ్లి హడావుడి చేశారు. విశాఖలో ఒక బీజేపీ నేత గోడౌన్ లో 1.80 లక్షల కిలోల ఆవు మాంసం పట్టుబడితే మాత్రం ఏదో మొక్కుబడి ప్రకటన చేసి ఊరుకున్నారు తప్ప,గట్టిగా నిరసన చెప్పలేకపోయారు. తెలంగాణలో రేవంత్ చేసిన వ్యాఖ్య సరైనదా?కాదా?అన్నది వేరే చర్చ.కాని బీజేపీ ఎలా అవకాశవాదంతో పనిచేస్తున్నదన్నదానికి ఇది ఉదాహరణ.రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించాలని,దేశవ్యాప్తంగా రాజకీయంగా వినియోగించే విధంగా ఢిల్లీ నుంచి తెలంగాణ బీజేపీ నేతలకు ఆదేశాలు వచ్చాయని సమాచారం. కేంద్ర పార్టీ నేతలు జాతీయ మీడియాకు కూడా దీనిపై ఉప్పందించి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రచారం జరిగేలా చర్యలు చేపట్టారట.దానికి అనుగుణంగా బీజేపీ నిరసనలు కూడా నిర్వహించి ఉద్రిక్తతలు సృష్టించే యత్నం చేసింది.
రేవంత్ వ్యాఖ్యల విషయానికి వస్తే ఆయన కాంగ్రెస్ లో భిన్నాభిప్రాయాలకు, మూడుకోట్ల మంది హిందూ దేవుళ్లు ఉండడానికి పోల్చడం ఏమిటో అర్ధం కాదు. ఎవరి నమ్మకం ప్రకారం వారు పూజలు చేసుకుంటారు. గుడులకు వెళతారు.చాలామంది హిందువులు ఏ దేవుడినైనా భక్తితోనే ప్రార్ధిస్తారు. ఏ దేవుడు పెళ్లి చేసుకున్నాడు! ఎవరు చేసుకోలేదు! వంటి అంశాలను ప్రస్తావించవలసిన అవసరం ఏమి ఉంది.మతపరమైన అంశాల విషయాలు సున్నితంగా ఉంటాయి. ఆ సంగతి రేవంత్ కు తెలియనిది కాదు.బీఆర్‌ఎస్ అనుమానిస్తున్నట్లు తెలంగాణలో ఎజెండాను మార్చి బీఆర్‌ఎస్ ను దెబ్బతీస్తే కాంగ్రెస్ కు ప్రయోజనం కలుగుతుందని ఏమైనా అనుకున్నారా?లేక అనాలోచితంగానే మాట్లాడారా అన్నది అప్పుడే చెప్పలేం.తన వ్యాఖ్యలపై బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తున్నదని ఆయన బదులు ఇచ్చినప్పటికీ, వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది కదా!ఉత్తరాదిన కూడా తనను బీజేపీ పాపులర్ చేస్తోందని రేవంత్ అన్నారు కాని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను బదనాం చేయడానికి బీజేపీ వాడుకుంటుందన్న సంగతి విస్మరించరాదు.
ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు నిజంగా రెండు రాష్ట్రాల మధ్య విబేధాలు పెంచేవే అని చెప్పాలి. రాజోలు నియోజకవర్గంలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ కోనసీమ కొబ్బరి చెట్లతో పచ్చగా ఉంటుందని అంటూ ,అది కూడా రాష్ట్ర విభజనకు కారణం అయిందేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ వారి దిష్టి కోనసీమకు తగిలిందన్నట్లుగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ వి మతిలేని వ్యాఖ్యలని అన్నారు.హైదరాబాద్ లో నివసిస్తూ పవన్ ఇలా మాట్లాడతారా? హైదరాబాద్ కే దిష్టి పెట్టినట్లు మాట్లాడారని విమర్శించారు. ఎందువల్లోకాని కాంగ్రెస్ నేతలు తొలుత దీనిపై ఏమీ మాట్లాడలేదు. రెండు రోజుల తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ పవన్ వైఖరిని తప్పు పట్టారు.పవన్ తెలంగాణలోని ఆస్తులన్నిటిని అమ్ముకుని విజయవాడ వెళ్లవచ్చని సలహా ఇచ్చారు.ఆ తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ కామెంట్లు చేశారు.
పవన్ కళ్యాణ్ తెలంగాణను అవమానించారని, వెంటనే క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆయన సినిమాలు తెలంగాణలో ఆడబోవని హెచ్చరించారు.ఆ శాఖ మంత్రిగా స్పందిస్తున్నానని అన్నారు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడారని, చంద్రబాబు నాయుడు, బీజేపీ నేతలు దీనిపై స్పందించాలని మరో మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.చంద్రబాబు,బీజేపీ లు దీనిపై నోరు మెదపలేదు.సిపిఐ నేత నారాయణ ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి పవన్ ను తొలగించాలని సూచించారు.అది కూడా జరగని పనే.బీజేపీకి, చంద్రబాబుకు పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినందువల్ల వచ్చే నష్టం ఏమీ ఉండదు. పైగా పవనే అప్రతిష్ట పాలు అవుతారు.
అది వారికి ప్రయోజనమే కదా!అందుకే బీజేపీ మీడియాకు చెందినఒక పత్రిక పవన్ పై తెలంగాణ నేతల విమర్శలకు కాస్త బాగానే ప్రాధాన్యత ఇచ్చింది. పవన్ వి తలతిక్క మాటలు అని ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.ఇందులో కొంత వాస్తవం ఉందన్న అభిప్రాయం కలుగుతుంది.రాజకీయంగా ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవారు ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం అంత తెలివైన పని కాదు. కోనసీమకు పవన్ కళ్యాణ్ దిష్టే తగిలి కొబ్బరి చెట్లు మాడిపోయాయని భువనగిరి కాంగ్రెస్ ఎంపీల చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పవన్ కళ్యాణ్ వీరి విమర్శలను పట్టించుకున్నట్లు లేరు.కాకపోతే జనసేన పేరుతో ఒక ప్రకటన చేస్తూ పవన్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపారు. పవన్ వ్యాఖ్యల వీడియోలు లేకపోతే జనసేన అలాంటి ప్రకటన చేసినా నమ్మేవారేమో!ఆ పరిస్థితి లేదు.
పవన్ గతంలో తెలంగాణలో వారికి అనుకూలమైన వ్యాఖ్యలు చేయడం, ఏపీకి వెళ్లి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడడం కొత్త విషయం ఏమీ కాదు.అయితే తాజా వ్యాఖ్యలు నిజంగానే తెలంగాణప్రజల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని చెప్పకతప్పదు.లక్షల మంది ఆంధ్రులు హైదరాబాద్ లో, తెలంగాణలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తుంటారు. వారికి అసౌకర్యం కలిగేలా పవన్ వంటివారు మాట్లాడడం సరైనది కాదు. ఆయన ఇంకా సినిమాలలో నటిస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యల వల్ల సినిమావారికి కూడా నష్టం కలగవచ్చు. పవన్ క్షమాపణ చెప్పకపోతే కోమటిరెడ్డి హెచ్చరించినట్లు ఆయన సినిమాలను ఆడనివ్వకుండా చేయగలుగుతారా? అది సాధ్యమేనా?కాకపోతే తెలంగాణలో సెంటిమెంట్ పరంగా అవసరమైనప్పుడు ఆయా పార్టీలు రాజకీయంగా వాడుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడా దీనిపై మాట్లాడలేదు. ఆయన చంద్రబాబు సూచనల మేరకే వ్యవహరిస్తారని చాలామంది నమ్ముతారు.రేవంత్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా మతం,ప్రాంతం వంటి అంశాలలో వివాదాలకు తావివ్వకుండా ఉంటే మంచిది.

-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


